రూపలో పశ్చాతాపం, భయం, దుఖం ఏదయినా కనపడి తప్పు చేశానని భయంగా ఒప్పుకుని వుంటే ఆయనకి కొంత ఉపశమనంగా వుండేది. రూప అలా మొండిగా ధైర్యంగా అరుచుకోని వాళ్ళని అన్నట్టు నిలబడేసరికి అయన ఆవేశం పట్టలేకపోయారు. ఒక్క ఉదుటున కూతురు దగ్గరికి వెళ్ళి ఆమె జుత్తు పట్టుకుని లాగి తల పైకెత్తి
"చెప్పు నిజం చెప్పు, చంపేస్తా ఇవాళ నిన్ను.....నిజం చెప్పు....వాళ్ళింట్లో అన్న మాటలన్నీ నిజమేనా..."రూప తండ్రి వంక తిరస్కారంగా చూసింది. అది చూసేసరికి మరింత ఉద్రేకం వచ్చిందాయనకి. ఎడం చేత్తో జుత్తు పట్టుకుని, కుడిచేత్తో ఫెడిఫెడి మని చెంపమీద కొట్టసాగారు.
"తప్పయిందను. సే సారీ! తప్పుచేశానని కాళ్ళు పట్టుకో ....ఊ చెప్పు"
పద్మావతి చప్పున లేచి భర్త దగ్గరికి వచ్చి అయన చెయ్యి పట్టుకుని
"ఏమిటండి ఆ కొట్టడం చస్తుందో, బతుకుతుందో తెలియకుండా అలా కొట్టుకుంటారా? వదలండి ముందు దాన్ని...." భర్తని విడిపించడానికి పెనుగులాడింది.
"వదలను దీని అంతు చూస్తానివాళ. చేసిన వెధవపని చాల ఊరు వాడా వెళ్ళి చాటి వస్తుందా. వాళ్ళ దగ్గర కూసిన కూతలు రేపటికి ఎన్ని నోర్లు మారుతాయో తెలుసా? ఇంక మనం ఎలా మొహం ఎత్తుకుంటామే? తప్పు చేసింది ఏదో మన దగ్గిర ఏడిస్తే కన్న పాపానికి ఏదో చేసేవాళ్ళం. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్తుందని కడుపులో ఆ పాపం దాచుకునేవాళ్ళం. ఇప్పుడిలా ఊరు వాడ చాటాక ఇంక మనం ఎలా మొహం ఎత్తుకుంటామే. ఈ చేడినదాన్ని ఎవరు పెళ్ళాడుతాడే.....జన్మంతా దీన్ని గుండెలమీద కుంపటిలా భరించాల్సిందేనా?"
రూప విసురుగా తలతిప్పి "మీ భయం అదా......అక్కరలేదు నా బతుకు నేను బతకగలను. మీకు అంత భారంగా వుంటే ఈ క్షణమే ఇంట్లోంచి పోతాను."
విశ్వనాధం మరోసారి చెంపలు చెళ్ళుమనిపించారు.
"నోర్ముయ్....ముందా నోట్లోంచి మరోమాట వస్తే చంపేస్తాను. పౌరుషానికి లోటు లేదు. ఇంట్లోంచి పోతుందిట. దాని బతుకు అది బతుకుతుందిట. నీ బోడి బి.ఎ. చూసి ఉద్యోగాలు ఒళ్ళో వాలుతాయి. నోరు మూసుకుని పడివుండు చచ్చినట్టు. నోరు మెదిపావా జాగ్రత్త...." అయన కూతుర్ని వదిలి కుర్చీలో కూర్చున్నాడు.
పద్మావతి తల పట్టుకుంది. భగవంతుడా....ఏం దారి? నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇప్పుడేం చెయ్యడం....రూపా ఏం పని చేశావే" పద్మావతి మొహం ఎర్రబడి ఒళ్ళంతా చెమట పట్టింది. రూప రెండు చెంపలు కందిపోయి వాతలు తేలాయి. బలవంతంగా, మొండిగా కన్నీళ్ళు అపుకుంది.
ఆమె గుండెలు ఎగిసిపడుతున్నాయి.
"ఏం చేస్తావు? కన్న పాపానికి దాన్ని తిసికేళ్ళు ఏ డాక్టరు దగ్గరికో."
"వీల్లేదు, నేను ఒప్పుకోను" రూప నిష్కర్షగా అంది.
ఇద్దరూ తెల్లబోయి కూతుర్ని చూశారు.
"ఏది ఒప్పుకోవు" పద్మావతి అర్ధంకాక తెల్లబోతూ అడిగింది.
"నేను డాక్టరు దగ్గరికి రాను. ఎబార్షన్ చేయించుకొను. ఆ సురేష్ కి బుద్ది చెప్పాలంటే నేనీ బిడ్డను కనాలి......రూప తెగేసి అంది. తల్లి తండ్రి ఇద్దరూ కూతురికి పిచ్చిపట్ట లేదు కదా అన్నట్టు చూశారు.
"వాణ్ణి కోర్టు కిడ్పించి వాడి పరువు బట్టబయలు చెయ్యాలి. వాడు జన్మంతా మరిచిపోలేని శాస్తి జరిగేవరకు నేనూరుకోను" కసిగా అంది రూప.
విశ్వనాధంగారు పద్మావతి కూతురు మొండి మాటలు చూసి విస్తుపోయారు వాళ్ళిద్దరి నోటెంట కొద్దిసేపు మాటలు రాలేదు.
"దీనికి నిజంగా పిచ్చిపట్టిందే.....ఏమిటే దాని ఉద్దేశం. పెళ్ళి కాకుండా బిడ్డని కంటుందా? వాణ్ణి కోర్టు కేక్కిస్తుందా? ఏమిటే దీని మాటలు ఇలా తయారైందేమిటి?" విశ్వనాధంగారు కోపంగా వగరుస్తూ అన్నారు.
కూతురి వరస చూసి పిచ్చి రూపకి పట్టిందో ఆయనకే పట్టిందో అర్ధంకాలేదాయనకి. "మీరూరుకోండి. దానికి మతిచెడింది. దాని పిచ్చివాగుడు చూసి మీరూ దాంతో సమంగా చిందులు వేస్తున్నారేమిటి. దానికి ఎంకావాలో, మంచేమిటో తెలిస్తే ఇలా ఎందుకు చేస్తుంది. ఇరవైయేళ్ళు వచ్చినా వయసుకు తగ్గబుద్ది రాకుండా గొప్పగా వేర్రివాగుడు వాగుతుంది. బిడ్డని కంటుందిట. మతివుండే మాటలా అవి అడ్డమైనా చెత్తా చదివి ఏదో తెలివితేటలుగా మాట్లాడుతున్నాననుకుంటోంది. బైటికెడితే దాని మొహాన అందరూ ఉమ్మేస్తారని జ్ఞానం వుంటే ఇలా మాట్లాడుతుందా?" పద్మావతి తీవ్రంగా అంది.
"ఆడది గుట్టుగా ఇంట్లో వున్నంత సేపే మర్యాద. విధినపడితే రోడ్డుమీద ఆ కుక్కకి కూడ తక్కువే. అనింకా సంగతి తెలియకుండా వుంది."
"ఆ ఇలాంటి పిరికిమాటలు చెప్పే ఆడపిల్లల్ని ఇలా తయారుచేశారు ఇన్నాళ్లూ. పుట్టిందగ్గిరనించి ఆడపిల్ల-ఆడపిల్ల అంటూ భయపెట్టి, నీతి , శీలం, గీలం, అంటూ ఆడపిల్ల నెత్తిన మొట్టి మగాడు వాడికేం మహారాజు, ఏం చేసినా చెల్లుతుంది అంటూ అందలం ఎక్కించి ముందునుంచి వాడికి కొమ్ములిచ్చారు ఆడపిల్లని అణగదోక్కారు. అమ్మా! నీవు అడదానివై వుండి అలా మాట్లాడకు దయచేసి ఆడదానికి ఆడదే శత్రువవుతుంది" రూప తిరస్కారంగా అంది.
నేననేదేమిటంటే ప్రకృతే స్రీని మానసికంగా, శారీరకంగా బలహినురాలిని చేసింది. ఎంత సమానతం కబుర్లు చెప్పినా ఆడది ఆడదే. మగాడు మగాడే నీ విషయం చూడు. ఆ సురేష్ ని ఎవరూ ఏమి అనరు. రేపు ఆడపిల్ల జాగ్రత్తగా వుండద్దా అని నీ మోహన్నే వుమ్మేస్తారు. సురేష్ తప్పించుకున్నాడు చేసిన పాపం నించి. కానీ ఆ పాపం ముద్ర నీ మీద నిలిచిపోయింది.
ఆ పాపఫలం నీవు మోస్తున్నావు గాని సురేష్ మోయ్యాడు. నీ భవిష్యత్తు నాశనం అవుతుంది. వాడు మహారాజులా మరోకర్తిని పెళ్ళాడుతాడు. ఈ సంఘంలో పెళ్ళి కాకుండా బిడ్డని కానీ పెంచడం ఇవన్నీ పుస్తకాల్లో మాటలు నిజంలో జరుగుతాయనుకుంటున్నావా?" ఆవేశంగా అంది పద్మావతి.
"ఎందుకు జరగదో చేసి చూపిస్తాను. ఆ పాతకాలం మాటలన్నీ ఇంక చెల్లవని, ఈనాటికి అమ్మాయిలు, అబ్బాయిలకంటే దేన్లో తక్కువకాదని, నీతి శిలాలు ఆడదానికే కాదు మగాళ్ళకి వుండాలని, తప్పుచేసి ఆడదాన్ని దోషిగా నిలబెట్టి తప్పించుకు పోయే మగాళ్ళకి పాఠం నేర్పుతాను. పాపమో, తప్పో, వొప్పో, ఇద్దరం కల్సి చేశాం. నాకు యీ సంఘం, లోకులు భవిష్యత్తు లేకుండా చేస్తే ఆ సురేష్ కి లేకుండా చెయ్యాలి. మీ పరువు నా పరువు అన్నీ పోయినా సరే ఆ సురేష్ ని వదలను వాడికి పాఠం చెప్తాను.
ఈనాడు సురేష్ కి నేర్పిన పాఠం మగాళ్ళందరికి గుణపాఠం అవాలి. దానికోసం నా జీవితం ఏమయి పోయినా నాకు లెక్కలేదు. నాలాంటి మోసపోయిన ఆడపిల్లలందరూ పిరికివాళ్ళలా చేతులు ముడుచుకు కూర్చోకుండా వాళ్ళకి ధైర్యం, ప్రోత్సాహం ఇస్తాను. నేను నడిచిన బాటగుండా ఈనాడు కాకపోయినా రేపయినా ఆడపిల్లలు నడిచేట్లు చూస్తాను. ఈ నీతి సూత్రాలు, న్యాయసుత్రాలు మార్చాలని న్యాయస్థానం లోనే చెప్తాను" రూప ఉద్రేకంగా అంది.
పద్మావతి , విశ్వనాధంగార్లు మొహాలు చూసుకున్నారు. మొన్నటిదాకా చిన్నపిల్లలా సినిమాలు, చీరలు, పుస్తకాలు అంటూ వేధించి ప్రాణాలు తీసిన తన కూతురేనా ఇలా మాట్లాడేది. ఈ రూపలో ఇన్ని భావాలు ఇంత ధైర్యం ఎలా వచ్చాయి. ఈ ఆవేశం, ఈ ఉద్రేకం ఏమిటి? ఇంత ఆలోచన ఇన్ని మాటలు ఇదెప్పుడు నేర్చింది!
పద్మావతి రూప ధోరణి నమ్మశక్యం కాని విషయంలా అనిపిస్తోంది.