అసలు అతని మాటలనేమీ పట్టించుకోకుండానే....
"గో అండ్ సెర్చ్...." స్టాఫ్ కి ఆర్డర్స్ పాస్ చేశాడు ఇన్ స్పెక్టర్ అన్వేష్.
క్రైం బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ గా ఈ మధ్యనే ట్రాన్స్ ఫర్ అయి వచ్చిన వెరీ హానెస్ట్ ఆఫీసర్.... ముక్కుకు సూటిగా పోయే మనిషి.
వయసు ముప్పయ్ లోపు.....లోతైన కళ్ళు....ఆ కళ్ళు ఎదుటి వాళ్ళ మీదకు ఒక్కసారి ప్రసరించాయంటే చాలు ఎన్నో విషయాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తాయి.
పోలీసులు హోటల్ లోని ప్రతి గదినీ వెదుకుతున్నారు.
ఇన్ స్పెక్టర్ అన్వేష్ తలుపుతట్టీ తట్టడంతోనే తలుపు తెరిచిన రాంగో పోలీసులను చూడగానే ఖంగారుపడిపోయాడు.
జాజిబాలకు గుండె అదురుతున్నా ధైర్యాన్ని కోల్పోవడం ఏమాత్రం మంచిది కాదని గ్రహించడం వలనే నిబ్బరంగా వుండడానికి ప్రయత్నం చేస్తోంది.
"మీ ఇద్దరు.....భార్యాభర్తలని రిజిష్టర్ లో రాసి వుంది...."
ఆ ఇద్దరికేసి మార్చి మార్చి చూస్తూ అనుమానంగా అన్నాడు ఇన్ స్పెక్టర్ అన్వేష్.
"అవును సార్.... కొత్తగా పెళ్లయింది" రాంగో హడావుడిగా చెప్పాడు.
"ఐసీ.... ఏ వూరు..."
"న.ల్గొం..డ.." ఈసారి జవాబిచ్చింది జాజిబాల.
"అయితే, మీరు భార్యాభర్తలంటారు..." ఇన్ స్పెక్టర్ మరోసారి రెట్టించాడు.
"మీరెందుకలా అడుగుతున్నారో నా కర్ధం కావడం లేదు. మా పెళ్ళి జరిగి సరిగ్గా ఈ రోజుకు పదిహేను రోజులు. బహుశా మా వయసు మీకు చిన్నదిగా కనిపిస్తుండడం కారణం కావచ్చు. కానీ నా భార్య మేనత్త కూతురు కావడంవలన మా పెద్దవాళ్ళు తొందరపడి పెళ్ళి చేసేశారు..." అంటూ సర్ది చెప్పాడు రాంగో.
"అవును ఇన్స్ పెక్టర్..... తిరుపతి వెళ్లాలని బయలుదేరాం.....తీరా రైల్వే స్టేషన్ కు వెళితే రిజర్వేషన్ ప్రాబ్లమ్....మీకు మరీ అంత అనుమానంగా వుంటే మా ఇంటి అడ్రస్ కు మెసేజ్ ఇవ్వండి..." రాంగో మాటలకు వంత పలికింది జాజిబాల.
ఇన్ స్పెక్టర్ అన్వేష్ ముఖం అప్పటికి ప్రసన్నంగా మారింది....
అతను రాంగోను ప్రక్కకు పిలిచి....
"బహుశా మీకు తెలియక ఈ హోటల్లో దిగారనుకుంటాను. ఈ హోటల్ మీద చాలా కంప్లయింట్స్ వున్నాయి. ఒక కంప్లయింట్ ఆధారంగానే నేనిప్పుడు స్టాఫ్ తో రైడింగ్ కు వచ్చాను. వెంటనే ఈ హోటల్ నుంచి వేరే హోటల్ కు మారండి....లేదంటే అనవసరమైన రిస్కుల్లో ఇరుక్కుంటారు...." అని హితబోధ చేసి వెళ్ళిపోయాడు ఇన్ స్పెక్టర్.
ఎక్కడా ఎవరూ దొరకకపోవడంతో వెళ్ళిపోయారు పోలీసులు.
మేనేజర్ కూడా వెళ్ళిపోయాక....
"థాంక్ గాడ్...." డోర్ లాక్ చేస్తూ అన్నాడు రాంగో.
"ఛ....నీకు ఇలాంటి హోటల్స్ తప్ప మంచివి తెలియవా?" విసుగ్గా అడిగింది జాజిబాల.
తొందర.....తొందరలో మంచి చెడు గురించి ఆలోచించే విచక్షణ ఉండదు. త్వరగా బట్టలు సర్దు. ఈ రూమ్ ఖాళీచేసి మంచి పేరున్న పెద్ద హోటల్ కు వెళదాం. ఈ పోలీసు రైడింగులూ, తాళిబొట్టు గొడవలూ వుండవు..."
రాంగో మాటలకు జాజిబాల పడీపడీ నవ్వడం మొదలుపెట్టింది.
ఆమె అలా పిచ్చిపట్టినట్టు ఎందుకు నవ్వుతుందో అర్ధంకాక రాంగోకు విసుగు ఎత్తింది.
"ప్లీజ్ బాలా....ఇలాంటి పొజిషన్లో కూడా అలా సిల్లీగా నవ్వేయకు...." అన్నాడతను.
జాజిబాల ఒక క్షణం అతనివైపు చురుగ్గా చూసింది.
ఆ చూపులో ఎన్నెన్నో భావాలు...
తల తిప్పుకుని విసురుగా వెళ్ళి బెడ్ మీద వాలిపోయింది.
ఐదు నిమిషాలపాటు ఇద్దరి మధ్య మాటలు లేవు....
రాంగో నెమ్మదిగా నడచివెళ్ళి అనునయంగా జాజిబాల వీపుపై చేయి వేశాడు.
నున్నటి వీపుపై పాలిష్ స్టోన్ లా జారిపోతున్నాయి అతని చేతి వ్రేళ్ళు.
జజైబాల చివుక్కున లేచి కూర్చున్నది.
ఏడవడం వలన ఆమె కళ్ళు ఎర్రతామరల్లా ఉబ్బిపోయి ఉన్నాయి.
"సా...రీ..." అన్నాడు రాంగో.
అతనికి ఆమె పట్ల ప్రేమ, జాలి పెరిగిపోయాయి. ఆడపిల్ల ధైర్యంచేసి వున్నపళంగా తనతోపాటు వచ్చేసింది. తనే అలా విసుక్కుంటే ఆమెను ఓదార్చేవాళ్ళెవరుంటారు?
"సారీ చెబుతున్నాగా....ప్లీజ్...నువ్వలా వుంటే నాకేదోలా ఉంటుంది" అతని గొంతులో ఆర్ద్రత నిండి ఉన్నది.
రాంగో వైపు బేలగా చూసిందామె.
ఏదో మార్పుకూడా ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నది.
బహుశా పరిస్థితుల గురించి అంచనా వేశాక ఆమెలో వచ్చిన మొట్టమొదటి మార్పు అదేమో!
"బాలా....అలా చూడకు....నన్నేం చేయమంటావో చెప్పు....చేయడానికి సిద్దంగా ఉన్నాను..." అమాయకంగా వుంది రాంగో కంఠం.
"కిస్...మి..."
"ఇప్పుడా?"
"ఎస్...గట్టిగా..."
ఇక రాంగో ఆగలేదు...
ఆమె పెదవులతో తన పెదవులు కలిపాడు.
ఒకటి....రెండు...మూడు నిమిషాలపాటు ఆ గదిలో సీలింగ్ ఫాన్ తిరుగుతున్న శబ్దం తప్పనిచ్చి మరేమి వినిపించలేదు.
గాఢ చుంబనం!
అమృతం గ్రోలినంత హాయిగా వున్నది.