Previous Page Next Page 
మంత్రముగ్ధ పేజి 16

    ఎస్.పి రాగానే చార్జింగ్ ఆపించేశారు. మాస్ ఎటాక్ కూడ ఆగిపోయింది.

    ఎవరికి వారు విడిపోయినారు.

    "ఇక్కడ ఏం జరుగుతోందని వారు వచ్చి దాడి చేశారు" అని అడిగారు వి.ఐ.పి!

    "ఈ యోగిని కోర్టు ముద్దాయిగా గుర్తించింది. పదిహేను రోజులు రిమైండ్ లో ఉంచేందుకు పోలీసు వారికి ఆర్డర్స్ యిచ్చింది" అన్నాడు శివరాజ్.

    "మూర్ఖుడా! ఈ మహానుభావుడ్ని ముద్దాయి అంటున్నావా? ఇంతమంది పాద పూజలు అందుకుంటున్న దేవుడు. పాపం పుణ్యం తెలియని మౌని!

    కనులు విప్పుడు. మాట్లాడడు! అనుగ్రహిస్తే వరాలిస్తాడు!

    వారం రోజులకు ఒకసారి కూడ అన్నం తినడు. పాము ఆరు నెలలకొకసారి భోం చేసినట్టు నియమిత ఆహారి! గాలి కూడా పీల్చుకునేందుకు నియమనిష్టలున్న మహారుషి!

    మానవ ప్రపంచంతో సంబంధంలేని వాడు!

    ఎప్పుడో దశాబ్దాల కొకసారి మనుషులకు కన్పించే మాహనీయుడు!

    అతనికి సద్భావనలు లోక కళ్యాణవాంచలు తప్ప స్వార్ధాలేమున్నాయని అతడు ముద్దాయి అయినాడు! ఎవరిజోలికి వచ్చాడని నేరాలు మోపారు?"

    అంటూ ఎదురు ప్రశ్నలు గుప్పించాడు వి.ఐ.పి.

    "అవన్నీ మాకు తెలియదు కోర్టు ఆర్డర్స్ ఫాలో చేయటం మా విధి!"

    "పిచ్చిగా మాట్లాడకు! ప్రజల ఆరాధనలు అందుకుంటున్న దేవ పురుషున్ని ఆర్డర్స్ పేరుతో అదుపు చేయాలని చూస్తావా? ఆ పని చేయగలవా నువ్వు! అంతదమ్ములున్నాయా మీ డిపార్టుమెంటుకి!"

    "మీరు ప్రజల కోసమా? ఎందుకోసం పనిచేస్తున్నారు? ప్రజల ఆరాధనకీ ఆర్డర్స్, సంఘర్షణ జరిగితే ప్రజలే గెలుస్తారు. గుర్తించి మసులుకో!

    ప్రజల కోపానికి గురి అయినప్పుడు చక్రవర్తులే, సర్వం సహాధి కారాలున్నాయనుకున్నవారే మట్టికరచి పోయారు.

    విచక్షణ పాటించకుండా డ్యూటీ చేయమని ఏ రాజ్యాంగం నీకు చెప్పింది.

    జరిగినా దానికి క్షమాపణ చెప్పి ఇక్కడ నించి కదులు!" అన్నాడు కోపంగా!

    "ముద్దాయిని కాపాడాలని ప్రయత్నించటం కూడ నేరమే!" ఉరిమాడు ఎస్.పి.

    "ఏమన్నావ్!? మిస్టర్ ఎస్.పి. మీ జూనియర్ ని నోరు అదుపు చేసుకోమని చెప్పండి! ఈ దేవుణ్ణి తరలించుకు పోవాలంటే మా శవాల మీదుగానే! అంత దమ్ములు ఎవరికున్నాయో ఉంటే వారు ముందుకు రండి!" అంటూ స్వామి పాదాలమీద ప్రాణాచారం పడిపోయాడు వి.ఐ.పి. ఆయన్ని అనుకరించి వందలాదిమంది యోగిచుట్టూ బోర్లా పడిపోయారు. ఏడ్పులు ప్రారంభించారు.

    వారి తెగింపు చూచి ఎస్.పి కరిగిపోయారు. శివరాజ్ పరిస్థితిని  అంచనా వేయకుండా దాడిచేయటం పొరపాటే అనిపించింది.

    "సర్! జరిగింది తొందరపాటే! నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. నేరం చేశాడని విరూపణ కాని ముద్దాయిని అదుపు చేసేందుకు ఇన్ని ప్రాణాలు తీయమని ఏ రాజ్యాంగమూ చెప్పదు. అతనికి బదులుగా నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ప్రజల పవిత్ర ఆరాధనా భావాన్ని కాదనే శక్తి మీకు ఎలాలేదో కోర్టు ఆజ్ఞల్ని ధిక్కరించే అధికారం కూడ మాకులేదు."

    "అందుకేదయినా రాజీ ప్రయత్నం చెప్పండి!" అని అడిగాడు!

    వి.ఐ.పి విజయ గర్వంతో లేచి నిలబడ్డాడు!

    "మీ లోంచి ఒకరు మావెంట రండి! మీ ఏ.ఎస్.పి తప్ప ఎవరయినా సరే! ప్రతి అయిదు నిమిషాలకు మీరు ముద్దాయి అని మూర్ఖంగా నిర్వచించిన ఆ మహా పురుషుడి గురించి సమాచారం అందించే ఏర్పాటు చేస్తాము! ఇదే మన రాజీ."

    ఎస్.పి గారికి తలదించుకు పోయినట్లుగా అయింది.

    "డి.ఐ.జి. గారిని స్వయంగా కలిసి పరిస్థితి అంతా వివరిస్తాను. తప్పని సరి అయితే ఆయనని కోర్టులో హాజరుపరిచే బాధ్యత ప్రజలదే! మీరింక వెళ్ళిరండి!" ప్రజలు అందరూ తొలగి దారియిచ్చారు.

    తన ఉద్యోగులతో కలిసి హడావుడిగా వెళ్ళిపోయారు ఎస్ పి!!
   
                                   *    *    *

    "నన్ను కాస్సేపు ఒంటరిగా ఉండనివ్వు. దయచేసి వెళ్ళిపో!" అన్నాడు శివరాజ్!

    "కొద్ది గంటలలోనే మీలో చాలా మార్పు వచ్చింది. ఉద్యోగరీత్యా మీరు చేయవలసింది చేసేశారు. వ్యక్తి గతంగా జయాపజయాలు మీవి కావు. మీ రెందుకు ఇంతగా దిగులుపడి క్రుంగిపోవాలి!" అని అడిగింది తులసి!

    అతనికి ఏకాంతాన్నివ్వటం మంచిది కాదని తీర్మానించుకుందామె!

    తీసివేసిన లైట్స్ ఆన్ చేసి తిరిగి వచ్చి అతని ప్రక్కనే కూర్చుంది. కరాటే ప్రాక్టిసుతో మొరటు తేలిన అతని చేతుల్ని ఒడిలోకి తీసుకుంది.

    "ఉద్యోగంలో చేరాక నేను మొదటిసారిగా ఓడిపోయాను" అన్నాడు.

    "ఇది వ్యక్తిగత విషయం కాదు. అతని మీద మీకెలాంటి వైరభావము లేదు. మీ రెందుకింత పట్టుదలగా తీసుకున్నారు. మీరు కొంచెం ఎక్కువగా ప్రవర్తించగానే అనిపిస్తోంది!" భర్త కళ్ళలోకి చూచింది.

    అతని కన్నులు ఆర్ద్రంగా ఉన్నాయి.

    "ప్రతి ఒక్కరూ అన్నమాటలే నువ్వూ అంటున్నావా తులసీ!"

    "వాస్తవంగా అనిపిస్తోంది కాబట్టే ఇంతమంది చెప్తున్నారని ఆలోచించ రాదా?"
   

 Previous Page Next Page