Previous Page Next Page 
అరణ్యకాండ పేజి 16

    విశాఖపట్నం  నుంచి  పాడేరు  చేరాలంటే కేవలం  మూడుగంటల ప్రయాణం.

    అటవీశాఖకు  చెందిన జీపులో  బ్రీప్ కేస్ ను వుంచి  వెనక్కి  తిరిగిన  చైతన్య తల్లి  పాదాలను  చేతితో  స్పృశించాడు.

    ఆమె కళ్ళు  నుంచి  జారిన  రెండు  అశ్రుబిందువులు  అతని చేతిపై  పడేసరికి  ఉద్వేగాన్ని  అదుపులోకి  తెచ్చుకుంటూ  తల్లి కళ్ళు  తుడిచాడు.

    "ఒక్కక్షణం, నాన్నా!" అంటూ  హడావుడిగా  లోపలికివెళ్లి  పూజా మందిరంలోని  కుంకుమని  తీసుకొచ్చి  కొడుకు  నుదుట  దిద్దుతూ, దుఃఖాన్ని  పంటిబిగువున ఆపుకుంటూ  తల తిప్పుకుంది.

    వాగులా, కొండలపైనుంచి  దుమికే  సెలయేరులా  గలగలమనే  నమ్రత  ఎవరో  శపించినట్టూ  మూగదానిలా  నిలబడి బిక్కమొగం వేసుకు చూస్తూంటే "పిచ్చిపిల్లా! నవ్విస్తూ  సాగనంపుతావనుకుంటే  మూతి ముడుచుక్కూచున్నావేంటి?" అన్నాడు మృదువుగా  నవ్వుతూ.

    ఆమాత్రం  పరామర్శకే  అంతవరకూ  నిగ్రహించుకున్న నమ్రత ఇక సాధ్యం కాని దానిలా  వెక్కిపడుతూ  అన్నయ్యను కావలించేసుకుంది.

    ఆప్యాయంగా  తల నిమిరాడు. ఆర్ద్రత  ఉప్పెనలా  మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే.

    "అన్నయ్యా!" కళ్ళు  తుడుచుకున్న  నమ్రత  చేతిలో  అంత వరకూ  దాచుకున్న కొండపల్లి బొమ్మను  జీప్ భోనెట్ పై  వున్న  మెటాలిక్  ఏరోకి  అమర్చింది. తెచ్చి  పెట్టుకున్న  హుషారుతో_"నా బర్త్ డేకి ఎలాగయినా  వస్తానని మాటిచ్చావుగా. నన్ను  మర్చిపోకుండా  ఈ బొమ్మని  నీ కళ్ళముందే  ఉంచుతున్నాను" చిలిపిగా అంది.

    చిన్నతనంలో  చెల్లికోసం  అనకాపల్లి  బొజ్జన్న  జాతరలో కొన్న బొమ్మది.

    అలవాటైన  మందహాసంతో  స్టీరింగ్  ముందు  కూచున్నాడు.

    "ఇలా రా" అన్నట్టుగా  తలూపాడు. దూరంగా నిలబడి దిగులుగా  నిలబడివున్న  ప్రీతితో.

    ఆమె దగ్గరకు  వచ్చింది. కాని, తలపై కెత్తలేదు.

    "ఎందుకు  వీళ్ళంతా  ఇంత బెంబేలు  పడిపోతున్నారు" అనుకున్నాడు. "నేను త్వరగా  వస్తాను. ఈలోగా నువ్వు పులి గోళ్ళు  పెంచుకుని రడీగా  ఉండు. నామీద  కోపం  వచ్చినప్పుడల్లా  మీదపడి రక్కెయ్యడానికి" నవ్వించాలనుకున్నాడు.

    పెదవులు  బలవంతంగా  విచ్చుకున్నా, ఆమె నేత్రాలంచలాలతో నీరు నిలిచి ఉంది.

    జీప్ కదిలింది.

    సెంటిమెంట్స్  నుంచి  తేరుకుని  విధి నిర్వహణకి  కావలసిన ఉత్తేజాన్ని  నింపుకుని  ముందుకి సాగిపోతున్న చైతన్యకు తెలీదు_అతడిని  కబళించాలని  ఎదురుచూస్తూన్న  ఓ మృత్యునీడ  ఓ సందు మొగలో  నిలబడి  చాలా సేపటి నుంచి అతణ్ని  గమనిస్తోందనీ, వేసుకున్న  పథకాన్ని  అమలు పరిచే ప్రయత్నంలో  ఓ ఆకారం  ముందుకు కందలిందనీను.


                                         8


    మరో రెండు గంటల  ప్రయాణం  తర్వాత  జీపు  మూడుగుల రేంజ్ ఆఫీసుకు చేరుకుంది.

    చైతన్య రాక గురించి  ముందే  తెలిసిన  అటవీశాఖ  సిబ్బంది అతడు జీప్ దిగగానే  అటెన్షన్ లో  నిలబడి  స్వాగతమిస్తున్నట్టుగా శాల్యూట్ చేశారు.

    ఆఫీసులో  అడుగుపెట్టిన  చైతన్య  రేంజరు  నడిగి తను ప్రయాణంచేసే  ప్రాంతానికి  సంబంధించన మాప్ ను తీసుకున్నాడు. పరిశీలనగా  మాప్ లోకి  చూస్తూ ఎర్ర  పెన్సిల్ తో  అండర్ లైన్  చేసి మేనీటర్ జోన్ ను సాలోచనగా  పరికించి  గడచిన  సంవత్సరకాలంలో  కార్పొరేషన్ విభాగం  ఏయే మొక్కల్ని  నాటింది. వాటి వివరాల ఫైల్సు తీసుకురమ్మన్నాడు.

    ఇలాంటి వివరాలను  అడిగే  తీరిక  ఓ ప్రత్యేక  పనిపై  వచ్చిన  చైతన్యకు  వుంటుందని  ఊహించక  పోవడంతో  అసంపూర్తిగా  వున్న ఫైల్సును చూపడానికి  చాలాసేపు  తటపటాయించేడు రేంజర్.

    అనుకున్నది అక్షరాలా  అనుకున్న  వెంటనే  అమలుపరిచే  అలవాటు  గలవాడు చైతన్య.

    ఫైల్సు  అందుకుని  ఓ పదినిమిషాలపాటు  ఏకాగ్రతగా  చూసి "సో" నిట్టూర్చాడో  క్షణం. "కార్పొరేషన్  విభాగం  నాటినది కేవలం  యూకలిప్టస్, వెదురు మొక్కల్నే  అన్నమాట" అన్నాడు.

    వెంటనే   జవాబు  చెప్పలేకపోయాడు  రేంజర్.

    ఎక్స్ ప్లాయిటేషన్  విభాగం  ఎక్కువగా  నరికి  అమ్మకానికి  పెట్టింది  టేకు, బండారు, నల్లమద్ది, కొడిసెలాంటి  విలువయిన  వృక్షాలయితే, వాటి స్థానంలో  పెద్దగా సంరక్షణ  విషయంలో  జాగ్రత్త అవసరం లేని  వెదురు, యూకలిప్టస్ లను  నాటుతున్నారు. సామాజిక అడవుల పథకం  క్రింద  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  ఎన్నో పథకాలను  చేపట్టి  అడవుల పరిరక్షణకై  ఎంతో ఖర్చు చేస్తుంటే, మామూలుగా ఖర్చుల్ని  చూపిస్తూ తమకు తోచిన  చెట్లను  నాటి అటవీశాఖకే  వెన్నుపోటు పొడుస్తున్నారు అటవీశాఖ ఉద్యోగులు.

    చాలా స్వల్పంవ్యవధిలో  అక్కడి  వాతావరణాన్ని  గమనించగలిగాడు  చైతన్య.

    "పాడేరు ఫారెస్టులో_ముఖ్యంగా  మేనీటర్ మూలంగా  ఎఫెక్టవుతున్న  గ్రామాల  పేర్లు చెప్పగలరా?" హఠాత్తుగా  టాపిక్ ను మరో పక్కకి  మళ్ళించాడు  చైతన్య.

    "కుంతెర్ల, వంజరు, కుందనపల్లి" బెరుకుగా  జవాబిచ్చాడు రేంజర్.

    "మిష్టర్ సుధాకర్!" చైతన్య  కంఠంతీవ్రంగా  ధ్వనించింది. "టెరిటోరియల్ విభాగం  ఇంతవరకూ  గడచిన  మూడు నెలల్లో  ఎంత మంది  అక్రమంగా  అటవీ సంపదని  తరలించేవార్ని  పట్టుకుందో  వెంటనే  చెప్పగలరా?" పొంతనలేని ప్రశ్నలతో కన్ ఫ్యూజ్  చేస్తున్నాడు  చైతన్య.    

    అమాయకంగా  కనిపించే  ఈ యువకుడు  ఏ సమాధానాన్ని  ఆశించి  ఇలాంటి ప్రశ్నలు  వేస్తున్నడో అతనికి అర్ధం  కావడంలేదు. "నేను కార్పొరేషన్ విభాగానికి  చెందిన  రేంజి ఆఫీసర్ని."

    "కాని, ఓ నెల క్రిందవరకూ  మీరు టెరిటోరియల్  విభాగంలోనే  ఉండేవారు  కదూ. ఆర్ నాట్ యూ."

    వాడిగా  రేంజర్  గుండెలోకి  దూసుకుపోయిందా  ప్రశ్న.

    చైతన్య  గురించి  చాలా తక్కువగా  అంచనా  వేయడంలో పెద్ద పొరపాటు  చేశాడు  రేంజర్ సుధాకర్.

    ఆ తర్వాత  ఇక తప్పదన్నట్లు  ఆ సంవత్సరంలో  తాము పట్టుకున్న  మూడు కేసుల వివరాలుగల  ఫైలు  అందించగానే, ఫైలును కేవలం  రెండు నిముషాల్లో  తిరగేసిన  చైతన్య  హఠాత్తుగా_"మీరి రేంజిలో ఎన్నాళ్ళనుంచి  ఉంటున్నారు?" అన్నాడు.

    "ఆరేళ్ళు...." రేంజరు గొంతు  తడారిపోయింది.
   
    "అంటే చాలాకాలంగా ఉంటున్నారన్నమాట!" తల పంకించి చైతన్య  హఠాత్తుగా పైకి లేచి, ఆఫీసు నలుమూలలా  ఓమారు పరికించి డిపోలో  అడుగు పెట్టాడు. ప్రజలకి, అటు ప్రభుత్వానికీ  ఆర్జించగల అటవీశాఖలో  ఎక్కువకాలం  వేళ్ళూని  వుండిన  ఉద్యోగులే  నిజమయిన శత్రువులు. ఇది చైతన్య బలంగా నమ్మే  విషయాల్లో ఒకటి.

    జీప్ ఎక్కుతూ "మిష్టర్ సుధాకర్! మీరు మరొకరికి  హేండ్ వర్ చేయాల్సిన  అవసరం  కలగొచ్చు. సాధ్యమయినంత  త్వరలో  ఫైల్స్  అప్ టు డేట్ గా ప్రిపేర్  చేయండి" జవాబు వినకుండానే  జీప్ ను ముందుకు  పోనిచ్చాడు.

    మరుక్షణం  సుధాకర్  ఎవరికో  ఫోన్ చేశాడు.

    అలా ఫోన్ చేస్తాడని ,చేయాలనే చైతన్య ఉద్దేశం కూడా. మేనీటర్ తోపాటు  అక్కడకు వచ్చిన  ఫారెస్టు  ఆఫీసరుకి  నిజమయిన శత్రువు  లెవరన్నదీ  సాధ్యమయినంత  తక్కువ  వ్యవధిలో  తెలుసుకోవాలన్నదే  చైతన్య సంకల్పం.

 Previous Page Next Page