Previous Page Next Page 
అరణ్యకాండ పేజి 15

    "బెట్టు మానేయ్, ఉడ్ బి  వదినగారూ! మా అన్నయ్యమాత్రం నీ గురించి విరహవేదన  అనుభవించలేదనుకున్నావా? కనీసం ఆ గెడ్డం  చూస్తేనా  ఎంత బెంగ  పడిపోయాడో  గుర్తిస్తే...."

    నోరు ముయ్యమన్నట్టు  సౌంజ్ఞచేసిన  ప్రీతిని  చూస్తూ  నోరు టక్కున  మూసింది  నమ్రత.

    "గెడ్డం  పెంచేది  విరహంతోకాదు. బహుశా  బద్ధకం  ఎక్కువయి వుంటుంది" తల వంచుకుని  పుస్తకాలను  చూస్తూ  అంది ప్రీతి.

    "గెడ్డం  మేధావి  తనానికి  చిహ్నం" వుడికిస్తున్నట్టుగా  అన్నాడు చైతన్య.

    కిసుక్కున  నవ్వింది  నమ్రత.

    మూతి మూడు  వంకర్లు  తిప్పింది  ప్రీతి.

    "నిజం. నమ్మా!" చెల్లెల్ల్ని  చూస్తూ  అనగానే_"నేన్నమ్మను  అంది  ప్రీతి  తనను  ఉద్దేశించి  అన్నాడనుకుని.

    "అమ్మా  వదినమ్మా! నమ్మూ అంటే  నిన్ను  నమ్మమని కాదు. అన్నయ్య నన్ను ముద్దుగా  పిలిచే  పేరది" టక్కున  జవాబిచ్చింది  నమ్రత.

    మృదుగంభీరంగా  ప్రీతిని చూస్తూ__"గెడ్డానికి  చాలా  చరిత్ర వుంది. ప్రీతీ! ఓల్డ్ టేస్ట్ మెంటునుబట్టి  అబ్సాలమ్  గెడ్డం  బరువు ముఫ్ఫై ఔన్సు లుండేదని  తెలుస్తోంది. సర్ వాల్డర్ ర్యాల్, సర్ ఫ్రాన్సిస్ డ్రాక్, రచయిత షేక్సిపియర్ తోపాటు  కారల్ మార్క్స్, లెనిన్, బుల్ గానిన్ మొదలయిన  వారు గెడ్డం పెంచారు. అంతెందుకు? బెర్నార్డ్ షా సైతం" గెడ్డం  గురించి  ప్రాపంచిక  సత్యాలను  ఏకరువు  పెడుతుంటే  'ఆపండి. మహానుభావా'అన్నట్లు  చేతులు  జోడించింది  ప్రీతికోపంతో.

    "అయినా  నేనేం నార్వే దేశస్తుడయిన  హేస్స్ లాంగ్  సేత్ లా పదిహేడున్నర  అడుగుల గెడ్డం పెంచి ప్రపంచరికార్డు సృష్టించలేదే. ఏదో అడవిలో  పడుండేవాణ్ణి  కావాల్సినపుడల్లా  గెడ్డ తీసుకునే  టైమ్ దొరకదని  ఇలా  గాలికి వదిలేస్తున్నాను" మరింత ఉడికించాడు.

    పడీ పడీ నవ్వింది నమ్రత. "గెడ్డాలమీద గెడ్డాలు  పెంచిన  సన్యాసులమీద ఉపన్యాసం ఆపేయ్ రా, అన్నాయ్? పాపం ప్రీతి ముఖం చూడలేకపోతున్నా" అంటూ ప్రీతి పక్కనచేరి రహస్యంగా చెవిలో  అంది__"చూడు ప్రీతీ! నాకు సెన్సార్ హ్యూమర్ కాదు. టైమ్ సెన్స్ కూడా ఉందని  నిరూపించుకోవడానికి అర్జెంటుగా బయటికి వెళుతున్నాను. నీ మేఘసందేశం  గురించి  చెప్పేసరికి  అన్నయ్య  ఆఘమేఘాలపై  నీ గదిలోకి  వచ్చాడు. సన్నిధిచేరిన  నీ పెన్నిధిని  అక్కునచేర్చుకుంటావో, కోపంతో  గెడ్డం పీకేస్తావో  నీ ఇష్టం."

    "ఛీ పో!" సిగ్గుతో  తలవంచుకుంది  ప్రీతి.

    నమ్రత  గదిలోంచి  వెళ్ళిన  కొన్ని  క్షణాలవరకూ  మౌనంగా  ఉండిపోయింది. మాటలు దొరకనట్టు.

    నెమ్మదిగా  తలపైకెత్తి  వెళ్ళిన  ప్రీతి  అల్లరిగా  విచ్చుకున్న చైతన్య పెదవుల్ని  చూడగానే  పరవశంగా  కనురెప్పలు  వాల్చేసింది.

    సామాన్యంగా పెదవి  విప్పని  మితభాషి  చైతన్య  నిర్మలంగా నవ్వుతూ, కేవలం అతనికి మాత్రమే  సాధ్యమయ్యే  మందహాసంతో  పిచ్చిదాన్ని  చేస్తుంటాడనుకుంది.

    బయట  చీకటిని  చీల్చుతూ  మంద్రంగా  వీస్తున్నగాలి  నైట్ స్వీన్స్ పరిమళాలను  మోసుకొస్తుంటే వివశత్వంతో కొన్ని క్షణాలు అలాగే  నిలబడిపోయాడు.

    మనసులోని మాటని  వెంటనే  వ్యక్తం  చేయడం  చేతకాని  వాడయినా, అప్పుడప్పుడు  ప్రీతి సన్నిధిలో  వెదక్కుండానే  మనసులోని  ఆలోచనలకు  భాష్వం  చెప్పేయగలుగుతుంటాడు. బహుశా  ప్రేమకున్న  మహత్తరమయిన  శక్తి  అదేనేమో! మూగవాణ్ని  చేస్తుంది. ముకుళిత హృదయానికి  మాటల్నీ  నేర్పుతుంది.

    "ప్రీతీ!" యుగాల  నిశ్శబ్దం  తర్వాత  విశ్వాంతరాళాన్ని  ప్రతిధ్వనింపచేసిన  తొలి  ప్రణవనాదంలా  వినిపించిందామెకు.

    "గుర్తున్నానా!" అంది. ఉత్తరాలెన్ని  రాసినా  జవాబివ్వని అతనిపై  చిరుకోపంతో.

    "మరిచిపోతేగా, గుర్తుండడానికి!" టేబుల్ ను ఆనుకుని  నిలబడ్డాడు.

    "గుర్తుంటే  ఉత్తరాలకు  జవాబివ్వటం  మరిచిపోయారెందుకు?"

    "జవాబివ్వకపోతే_ఎందుకివ్వలేదోనని  ప్రతిక్షణమూ నన్ను గుర్తు చేసుకుంటావని."

    అతని మాటలకు  ఆమె గుండె  లయ తప్పినట్టయింది. "నాన్నగారితో  మాటాడతానన్నారుగా!" అప్పుడెప్పుడో చైతన్య అన్నమాటల్ని  గుర్తు చేసుకుంది.

    "ఈ ఏడాదితో  నీ చదువు  పూర్తవుతుందిగా. ఆ  తర్వాత...."

    "మే ఐ కమిన్!" బయట నుంచే  అంది నమ్రత.

    మరుక్షణం గదిలోకి  దూసుకువచ్చి, "సారీ ఫర్ ది ఇంటర్రప్షన్" ఇద్దర్నీ  ఓమారు  చూసి  చిలిపిగా  నవ్వుతూ, "అమ్మ ఇద్దర్నీ జంటగా  భోజనానికి  రమ్మంది" అంటూ  స్వాగతం  చెబుతున్నట్టు  చేతులు  చాచింది కొద్దిగా తల వంచి.

    "అమ్మో! డాడీ  నా కోసం వెయిట్ చేస్తుంటారు" అంది ప్రీతి. ఓ పెద్ద బార్ అండ్ రెస్టారెంటుకి  అధిపతి అయిన  రంగనాధరావుగారి ఏకైక పుత్రిక  ప్రీతి.

    "ఆహా!" బుగ్గలు  నొక్కుకుని, అదే మా అన్నయ్యతో కబుర్లు చెప్పుకోమంటే  మాత్రం  యుగాల తరబడీ  రడీ అయిపోయావేమే  సర్వం మరిచి. నధింగ్ డూయింగ్....వచ్చి తీరాలి. లేకపోతే  ఆనక ఆడపడుచుగా  నిన్ను  రాచిరంపాన  పెట్టాల్సి  ఉంటుంది" బెదిరిస్తున్నట్లుగా  అంది నమ్రత.


                                                                                   7


    "అమ్మా!"

    తల్లి కళ్ళల్లో  నీరుచూసి  కొద్దిగా  చలించాడు చైతన్య.

    "చూడమ్మా! సాధ్యమయినంత  త్వరలో  తిరిగొస్తాను. ఆ తర్వాత  నీ ఇష్టప్రకారమే  పెళ్ళిచేసుకుంటాను." 

    అనసూయ  గోడపై  ఉన్న భర్త  తైలవర్ణం  చిత్రం  నుంచి  తల మళ్ళించి, రెప్పవేయకుండా  దూరంగా  చూస్తూ  ఉండిపోయింది.

    తల్లి  చెంపలపై  పేరుకున్న  కన్నీటి  చారికల్ని  తుడుస్తూ "ఏంటమ్మా ఇది!" ఓదార్చాడు  ఓ పసిపిల్లని  అనునయిస్తున్నట్టు.

    అప్పటికి  అర్దరాత్రి  దాటింది  దూరంగా  ఒకరి అరా  కార్ల చప్పుడు, సమీపంలో  సముద్రపు  హోరు తప్ప అంతా  నిశ్శబ్దంగా వుంది.

    కొడుకెంత  ధైర్యాన్ని  నూరిపోసినా  ఆమె తేరుకోలేకపోతుంది. శత్రువులు  వేరయినా  భర్తలాగే  కొడుక్కూడా ఒక పోరాటానికి  సిద్ధపడి వెళుతున్నాడు.

    ఇండియన్  ఫారెస్టు  సర్వీసులాంటి  చాలగొప్ప  అర్హతగల కొడుకు  ఇలాంటి సాహసానికి  సిద్ధపడటం  ఆమెకు ఇష్టంగా లేదు.

    "అమ్మా!" దిగులుపడుతున్న  తల్లి  చెంపల్ని  చేతుల్లోకి  తీసుకున్నాడు. "నేను వెళుతున్నది  మృత్యుగహ్వంలోకి  కాదమ్మా! ఎందరో తల్లులు  పుత్రశోకంతో  కుమిలిపోవడానికి, మరెందరో  స్త్రీలు వైధవ్యంతో నిర్భాగ్యులు కావడానికి  కారణమయిన  ఓ క్రూరమృగాన్ని  ఎదుర్కోటానికి."

    "నేనూ తల్లినేరా!" ఉబికి వస్తున్న దుఃఖాన్ని  అదుపుచేసుకోడానికి  చీర చెంగుని నోటికి అడ్డంగా పెట్టుకుంది.

    "కాబట్టే  తల్లి మనసుతో  ఆలోచించమంటున్నాను. నీలాంటి మరెందరో  తల్లుల కడుపుకోతకు  కారణమయిన  పులిని  మట్టుబెట్టే మనో ధైర్యాన్ని, ఆశీర్వాదాన్ని  ఇమ్మని  వేడుకుంటున్నాను."

    ఆమె కళ్ళు  తుడుచుకుంది. క్షణంపాటు  కొడుకు క్షేమంగా తిరిగి వస్తాడన్న  నమ్మకంతోపాటు  జరిగే అనర్ధాలను  ఆపే శక్తి లేనినిమిత్తం  మాత్రులం  అన్న వేదాంతపరమయిన  ఆలోచనకూడా  ఆమె హృదయాంతరాళంలో మెరిసి మాయమయింది.

    జీప్ ను ఆ రాత్రే అతడి ఉత్తర్వు ప్రకారం  వైజాక్ లో అతని ఇంటికి  చేర్చడంతో  మరుసటి  రోజే  ప్రయాణానికి సిద్ధమయ్యాడు  చైతన్య.

 Previous Page Next Page