Previous Page Next Page 
అరణ్యకాండ పేజి 17

    సిమెంటు  రోడ్డు  మీదనుంచి  మాప్ లోని  సూచనల్నిబట్టి  జీప్ ను ఫారెస్టులోకి  మళ్ళించాడు. క్షణంపాటు  జీప్ ను ఆపి, సిగరెట్ కేసులోని  సిగరెట్  వెలిగించి, తన పధకం  ఎక్కడ  నుంచి  ప్రారంభించాలో  ఆలోచిస్తూ  జీప్ ను  మళ్ళీ ముందుకు  పోనిచ్చాడు.

    క్రమంగా  సూర్యుడు  నడినెత్తిపైకి  సాగిపోతూండడంతో  ఎండ తీవ్రతను  పుంజుకుంటోంది.

    తన ప్రయత్నం  సుగమం  కావాలంటే  అరణ్యానికి  ఆనుకుని వున్న  పల్లెలోని  ప్రజల సహకారం  సంపూర్ణంగా  లభించాలి. కాని, ఇప్పటికే  భయభ్రాంతులయిన  గిరిజనులు తన కెంతవరకూ  సహకరిస్తారన్నది  అనుమానమే అటవీశాఖ వైఫల్యంతో  ఫారెస్టు  ఆఫీసర్లపై  నమ్మకం  ఏనాడో  సన్నగిల్లిపోయి  వుంటుంది  మరి!

    దక్షిణాన బారులుగా  వున్న  గుట్టలతో  ఓ క్రమం  లేకుండా  పెరిగిన  అరణ్యంతో నిర్మానుష్యంగా  వుంది అంతటా. గతుకలతో  నిండిన  ఇసుక  బాటలో  జీపు  నడపటం  ఇబ్బందిగానే  ఉంది. మేఘాల్లా పైకిలేస్తున్న  ధూళి జీపును  అనుసరిస్తుంటే  సాధ్యమయినంత  త్వరలో  గమ్యం  చేరాలని  వేగంగా  ముందుకు  సాగిపోతున్నాడు. చెట్లపై నుంచి  కోతులు  వింతగా  అతణ్ని  పరికిస్తూ  కిచకిచమంటూ  కొమ్మలపైకి  దుముకుతున్నాయి.

    బగులవాడ  అన్న బోర్డు   కనిపించగానే  జీప్ ను  స్లో  చేసాడు. తను  చేరాల్సిన  గమ్యానికి జీపును మరల్చాల్సిన  మొట్టమొదటి  కూడలి. కుడివేపుగా  దట్టంగా  పెరిగిన  వెదురుపొదలు.

    సరిగ్గా  ఇక్కడి నుంచే  మేనీటర్  జోన్  ప్రారంభమయ్యేది, పక్కనున్న  ఫాయింట్  ఫైవ్  ఎక్స్ ప్రెస్ రైఫిలును  ఓమారు  చూసుకున్నాడు. జీపును  నెమ్మదిగా  పోనిస్తూ, బాట కిరుపక్కలా ఎదిగిన తుమ్మచెట్లను  ఓ కంట  కనిపెడుతున్నాడు. నేలపై చెట్లను  కలుపుతూ  ముళ్ళకంచెలు.

    పెద్దపులి  సామాన్యంగా  కోరుకునేది  గుబురుగా  పెరిగిన తుప్పల్నే  కాని ముళ్ళపొదల్ని కాదు. తను వేటాడే  జంతువుని  అనుసరించడానికి  చప్పుడు  చేసే  అవకాశమివ్వని  గడ్డి  దుబ్బులున్న  ప్రాంతాన్ని  ఎన్నుకుంటుంది. డెన్స్  వెజిటేషన్ కు దూరంగా  వుండాలనే  సామాన్యంగా  అది ప్రయత్నిస్తుంది.

    ఆలోచిస్తూనే  ఓ ఎత్తయిన  కొండ అంచును  చేరుకున్నాడు. అప్పటికే  సుమారు పదిమైళ్ళ దూరం  ప్రయాణం చేశాడు  చైతన్య. ఇక మిగిలింది  ఐదుమైళ్ళు. అంతా  సవ్యంగా  ఉంటే  అరగంటలో గమ్యాన్ని  చేరొచ్చు.

    కాజువల్ గా దృష్టిని గుట్టపైకి  మళ్ళించాడు. ఏ సిక్స్ సైన్స్ అతడలా  చూసేట్టు  ప్రోత్సహించిందో  మరి, ఒక్కక్షణం  ఆలస్యమయితే  జీపుతోపాటు  అతడూ  నుగ్గు నుగ్గయ్యేవాడు.

    గుట్టపైభాగం  నుంచి  సుమారు  ఓ టన్ను  బరువున్న  బండరాయి చాలావేగంగా  దొర్లుకు వస్తోంది. టెన్షన్ లో జీపును  సడన్ బ్రేక్ వేసి ఆపేడు. ఎగుడు దిగుడున్న  గుట్టపై నుంచి  సరిగ్గా  ఎక్కడికి  వచ్చి బాటపై  పడుతుందో  తెలీని  స్థితి.

    మెరుపు వేగంతో  గేర్ మార్చి  బండ  దూకుణ్ని  మించిన  ఏక్సిల రేషనుతో జీపును  ముందుకు పోనిచ్చాడు. వెంట్రుకవాసిలో  ప్రమాదం  తప్పింది. జీపు  వెనుక  భాగాన్ని  ఇంచుమించు  రాసుకుని వెళ్తూ  తుమ్మచెట్టు  నొకదాన్ని  నేల  కరిపించి  బండరాయి  ఆగిపోయింది. పిట్టల కలకలంతో  అడవి  హోరెత్తిపోయింది.

    అదురుతున్న  గుండెతో  క్రిందికి  దిగిన చైతన్య  గుట్టపైకి  చూశాడు. ఎక్కడా  ఏ అలికిడీ  లేదు. అంత బరువున్న  రాయి  కేవలం గాలివాటుకో, లేక  ఏ జంతువు  తాకిడికో  కదిలి  క్రిందికి  దొర్లదు.

    బిగుసుకున్న  పిడికిళ్ళతో  తుపాకీని  అందుకుని  గాలిలోకి  పేల్చాడు. యుద్ధానికి  తనూ సిద్ధమే  అన్న సంకేతాన్ని  అందిస్తూ.

    తన ఆగమనాన్ని  ఇష్టపడని  శత్రుకూటమి  ఏదో  మార్గమధ్యంలోనె  తనను  అంతం చేయాలని  ప్రయత్నిస్తోందన్నమాట.

    ఆ క్షణమే  నిర్ణయించుకున్నాడు__ప్రతిక్షణం  పొంచివున్న  ప్రమాదం నుంచి తనను  తానుకాపాడుకోవడానికి  ఎంత అప్రమత్తంగా  వుండాలో! అరణ్యంలో  మొదటి  ప్రమాదం నుంచి  తప్పించుకున్నాడు.

    గుడ్ హెవెన్స్! తానిప్పుడు  ఎదుర్కోవాల్సింది  క్రూరమృగాల్ని  మాత్రమేకాదు. వాటిని  మించిన  మనుషుల్నికూడా.

    స్పష్టంగా  కాకపోయినా  అర్ధమయింది  ఓ ఫారెస్టాఫీసరుపై  సామాన్యంగా  ఎవరు కక్ష బూనేదీ.

    నేలపై  దొరికిన  ఓ ఇటుక  ముక్కను  తీసుకుని తనపై దాడిచేసి  అలసటగా ఆగిన  బండరాయిపై రాశాడు. "అరణ్యాలనీ, అందులో  తిరిగే  జంతువుల్నీ  నేను ప్రేమిస్తాను. నాపేరు  చైతన్య. కదలిక నా ఊపిరి. కలుసుకుందాం."

    ప్రాణాంతకమయిన  స్వాగతం  లభించిన  చైతన్య  యధాలాపంగా  జీపులో కూచున్నాడు. జీపు నెమ్మదిగా  ముందుకు  కదిలింది.

    రాష్ట్రంలోని  అటవీ సంపదను  అంతరింపచేయటంలో  ఆరితేరిన పలుకుబడిగల  ఓ ముఠా  చాకచక్యంగా  పనిచేస్తున్న  విషయం  అటవీశాఖలో  ఉన్నతాధికారులందరికీ  తెలుసు. అయితే, నిఘాలో  దొరికి శిక్షింపబడేది  అసలు దోషులుకారు. ఈ ముఠాలు  ఇలా  విశృంఖలంగా  తమ కార్య క్రమాలను  నిర్వర్తించుకుంటూపోవటానికి  కారణంకొందరు అటవీశాఖ ఉద్యోగుల  అండదండలే  అన్నది  నిర్వివాదాంశం.

    ఒకనాడు  పచ్చని  ప్రకృతితో  సుందరవనాలుగా  భాసిల్లిన  అడవులు  అక్రమ వ్యాపారస్తుల  మూలంగా  నశించిపోతున్నాయి. రాష్ట్రంలోని  రెండువందల  లక్షల  హెక్టార్లపైగా  విస్తీర్ణంలోని  అడవులను నరకడం మూలంగా  తీవ్రకరువు, వరదలు, ఇంధనకొరత, పరిసరాల కాలుష్యంతో  పచ్చదనం కొరవడటమేకాకుండా  జంతుసంతతి  క్షీణించి మిగిలిన కొన్ని మృగాలు  ఆహార  కొరతతో  మనుషులపైకి  విజృంభిస్తున్నాయి.

    మరికొన్ని నిముషాలవ్యవధిలో  ఓ పల్లెను చేరుకున్నాడు చైతన్య. రెల్లుగడ్డితో  పరచుకుని  వున్న  గుడిసెలు  మధ్యకు రాగానే  బయటికివచ్చిన  జనమంతా  చిత్రంగా  చూడడం  మొదలుపెట్టారు.

    ముప్పయి  ఏళ్ళ  స్వతంత్రం  ఇంకా  మారుమూల  గ్రామాలకు ప్రయాణం  చేయలేదన్న  సత్యానికి  సాక్ష్యంగా  ఒంటిపై  సరయిన  అచ్చాదనలేక  చాలా  అనాగరికంగా  కనిపించిన  స్త్రీలను, పురుషులను  చూడగానే  అసహ్యించుకోలేదతను.

    వేల కోట్ల  రూపాయలు  వెచ్చించి  ప్రణాళికలద్వారా ప్రభుత్వం సాధించిన ప్రగతి, దాని అభ్యున్నతి  గురించి  చంకలుబాదుకుంటున్న  ప్రజాస్వామ్య దుర్గతి చాలా స్పష్టంగా  కనిపించే నికృష్ట  నిలయాలని.

    ఢిల్లీ దర్భారులో  ముఖమల్  కార్పెట్ల పై నడుస్తూ  స్వాతంత్ర్య సమరంలో  సంపాదించిన  స్వేచ్చగురించి  మైకులు  బద్దలు  చేసే  మహానాయకులారా! వాపో, బలుపో తెలుసుకోవాలంటే  ఇక్కడకు  రండి.

    పార్లమెంటు  పాలరాతి  భవనాల్లో  గాంధి, నెహ్రూ  నిలువెత్తు తైలవర్ణ  చిత్రాలకు  బదులు  డొక్కలు  ఎండి బక్కచిక్కిన  ఈ ఆస్థిపంజరాల  బొమ్మల్ని  చూస్తూ  జీర్ణించుకుపోతున్న   మన సంస్కృతికి రోజుకో  మారయినా  నివాళు లర్పించండి.

    మరణించిన  ఓ మహానాయకుడి  విగ్రహాన్ని  నాలుగురోడ్ల కూడలిలో ఆవిష్కరించి, అతడు చేయని  గొప్ప పనులకు  నివాళులర్పిస్తూ పూలదండలువేసి  బాకాలు  ఊదడానికి  బదులు  బ్రతుకుతూ  చస్తున్న ఈ నికృష్టజీవుల్ని  చౌరస్తాల్లో  సజీవంగా  సమాధిచేసి  ఆ గోరీల పైనిలబడి ఇదీ మన పురోగమనమని  రోజుకోమారయినా  చెంపలు  వాయించుకోండి.

    జీపు  దిగి నెమ్మదిగా  ముందుకు  నడుస్తున్న  చైతన్య ఎముకల పోగుల్లావున్న  పసికందుల్ని, చింపిరి జుట్టుతో  నిలబడ్డ  స్త్రీలను  చూస్తూ ఓ చోట  ఆగాడు.

 Previous Page Next Page