పెట్టెని ఓ మూల పెట్టించి బెడ్డింగు దగ్గరలో నున్న మంచం పై పడవేయించి రిక్షా వాడికి డబ్బులిచ్చి పంపేసి కర్చిపుతో ముఖం తుడుచుకుని "హమ్మయ్య" అని నిట్టూర్చి ఓ క్షణం ఆగి తదేకంగా తనవేపే చూస్తోన్న అక్క ముఖంలోకి వింతగా చూసి కులాసాగా అంది "అదేమిటక్కా! ఎవరనుకుంటున్నావ్? నేనే నీ చెల్లెల్ని సరోజని. అయినా గుర్తుపట్టలేనంతగా నేనేం చిక్కిపోలేదు. లావూ కాలేదు. మరి నీవు గుర్తుపట్టలేకపోతే నీ కళ్ళకి ఏదయినాడిఫెక్ట్......"
చెల్లెలి హాస్యాన్ని స్వికరించకుండా అంది "చాల్లే ఏమిటా అపహాస్యాలు వస్తూనే, పెట్టే బెడ్డింగ్ తో సహా దిగుతుంటే ఏమిటా అంతర్యం అని ఆశ్చర్యపోయి చూస్తున్నాను, అంతే. నిన్ను గుర్తుపట్టకా కాదూ-గుర్తు పట్టలేనంతగా నా కళ్ళకి డిఫెక్ట్ వచ్చి కాదూ, నీవు ఏమి మరిపోలేదు, దిగులుపడొద్దు."
"అదా నీ సందేహం" అని తేలిగ్గా నవ్వేస్తూ అంది " అది కాదక్కయ్యా! ఇంటికి వచ్చిన చుట్టాన్ని వాకిట్లోనే నిలవేసి ఎందుకు వచ్చావ్? పెట్టే బెడ్డింగ్ తో సహా దిగావేమిటి విశేషం? ఎన్నాళ్ళు ఉంటావ్? అని అడిగేస్తారా ఎవరయినా? నేనంటే నీ చెల్లెల్ని నీ బుద్ది తెలిసిన దాన్ని కాబట్టి సరే. అదే ఇంకొకరయితే అపార్ధం చేసుకోరా అక్కా? అయినా అంతగా రేషన్ కార్డ్స్, షుగర్ కార్డ్స్ దొరక్కుండా వుంటే, నాన్నగారికి రాసెయ్యరాదు- వస్తూ ఏకంగా ఓ బస్తా గోధుమలు, ఓ రెండు బస్తాల బియ్యం, మరో అర బస్తా పంచదారా తెచ్చేదాన్ని. ఆఫ్ కోర్స్ పాలకి యిబ్బందేననుకో.....ఏం చేస్తాం? అయినా బ్లాకులో ఏర్పాటు చేసుకుని ఎడ్జస్ట్ కావొచ్చుగా."
చిలిపిగా ప్రశ్నిస్తున్న సరోజ మాటల్ని అర్ధం చేసుకోలేక సీరియస్ గా అంది. "ఇక చాలించు. నీ తెలివి తెల్లారినట్టే వుంది. చాలా గొప్ప సహాయం చేయాలనుకుమ్తున్నావ్. థాంక్స్ ఇక్కడ మే మేమి రిక్షా పాత్రలు పట్టుకుని కూర్చోలేదులే, దేవుడి దయవల్ల ఇంకా బాగానే వున్నాం. సరిసరి కాళ్ళు కడుక్కుని టిఫిన్ తిసుకుందువు పద."
శ్రీదేవి కళలు తెలిసినందువల్ల నవ్వుకుని అక్క వెంట వెళ్ళింది సరోజ.
ముఖం కడుక్కుని టవల్ తో తుడుచుకుంటూ వంటింట్లోకి నేరుగా వచ్చి ఓ పిట వాల్చుకుని కూర్చుంటు అంది "టిఫినేం చేశావక్కా?"
బజ్జీల ప్లేట్ ని ముందుకి తోసింది ఏమి జవాబివ్వకుండా.
"ఓహ్! కారం బజ్జీలు! హౌటెస్టి! వాటే హ్యపెండ్!"
లొట్టలు వేసుకుంటూతింటున్న చెల్లెల్ని తృప్తిగా చూడసాగింది శ్రీదేవి.
దాదాపు సగం ప్లేటుని ఖాళి చేసి "అ అక్కయ్యా! ఓ డౌట్ -- బావగారు ఇవి తినరుగా......మరి ఎప్పట్నించి అలవాటు చేశావు?" అంది.
నవ్వేసి "చాల్లే నీ దొంగవేషాలు........అవి కావాలనరాదూ" అని మరో ప్లేట్ ని దగ్గరిగా తోసింది.
ఒకటి అందుకుని రుచి చూసి "ఓహ్! బంగాళాదుంప బజ్జీలు! నిజంగా, అక్కయ్యా, నీ చేతిలో వున్న రుచి నీ మాటల్లో వుంటే ఎంత బావుండేది! భగవానుడు ఒట్టి పిచ్చివాడు, మనసులోని మాధుర్యాన్ని చేతికి సప్లై చేసి, నోటికి దూరం చేశాడు" అంది.
నవ్వేసి "ఛ! ఎంతమాట పడితే అంత మాటా అనేసేయ్యటమేనా! చిన్నా పెద్దా అని కూడా బుద్ది లేదు" అంది కొంచెం కోపంగా.
తర్వాత కాఫీ త్రాగుతూ అడిగింది "బావ ఎప్పుడొస్తారక్కా?"
"ఏమో తెలీదు. రోజు మాములుగా ఆరు కాకముందే వచ్చేస్తారు."
"అయితే బావ వస్తూనే ఏదైనా పిక్చర్ ప్రోగ్రామ్ వేద్దామంటావా?"
నొసలు చిట్లించి అంది.
"ఇప్పుదోస్తున్నావ్ వూరి నుంచి దాదాపు వందమైళ్ళు పగలల్లా ప్రయాణం చేసి యిప్పుడు తిరిగి పిక్చర్కా? నీకేమయినా మతుందా? అయినా నీకు బుద్ది లేకపోతే నాకయినా వుండదా? ఈరోజంతా రెస్ట్ తీసుకో.....రేపో ఎల్లుండో వెడదాం'
'అది కాదక్కా, బెస్ట్ హిందీ పిక్చర్ అదేదో పేరు గుర్తుకు రావటం లేదు. నవరంగ్ లో యీ రోజే అఖరట. వస్తూ వస్తూ బస్సు లోంచి చూశాను. వెళ్ళి పోయిందంటే మళ్ళీ ఛాన్స్ ఎన్నాళ్ళకో"
తాపిగా అంది "ఏం కొంపమునగదులే. వెధవ హిందీ పిక్చర్. ఎన్ని రావు. ఎన్ని పోవు వాళ్ళకేం రోజు మర్చి రోజు ఒకటి రిలీజ్ చేస్తుంటారు. వైడ్ మార్కెటుంది కదా అని. చూడాలంటే ఎన్నో వస్తుంటాయి. అన్ని మంచివే-- దేన్ని కాదంటాం?"
ఇహ లాభం లేదనుకుని "సరే అలాగేలే, నీ యిష్టం" అంది. అయినామనసులో "యీ రోజు పిక్చర్ ప్రోగ్రామ్ కేన్సిల్ చెయ్యటానికి కారణం నేనెంత దూరం నించి వచ్చి అలసిపోయాననాలేకపోతే వాళ్ళిద్దరిమధ్యా నేనెందుకనా" అనుకుంది.
"అలాగే మీ బావ వచ్చేసరికల్లా వంట చేసేస్తాను. తర్వాత అందరం కలసి కబుర్లు చెపుతూ కూర్చోవచ్చు."
తలూపింది సరోజ.
శ్రీదేవి వంటింట్లోకి వెళ్ళింది.
తర్వాత తన పెట్టే తెరచి అలా అలా సర్ది పెట్టి మూత వేయబోతు "వేయిపడగలు" తీసుకుంది.
తీరిగ్గా కుర్చికి చేరగిలబడి పుస్తకంలో మునిగిపోయింది.
ఓ అరగంట గడిచాక హాల్లోకి వచ్చిన శ్రీదేవి సరోజ దీక్షగా చదువుకుంటా వుండడం గమనించి దగ్గరిగా వస్తూ అడిగింది "ఏమిటా దీన్ని నాల్గోసారి చదువుతున్నాను నేను"
"ఎవరు రాశారేమిటి?"
ఆశ్చర్యపోతూ అంది "అదేమిటక్కా! తెలుగు సాహిత్యంపై అధారిటిగా మాట్లాడతానంటావే, వేయిపడగలు వ్రాసిందేవరో తెలిదా? విశ్వనాధసత్యనారాయణగారు."
"తెలినట్టుగా ముఖంపెట్టి" ఆయనేవరు?" అని ప్రశ్నించింది.
నివ్వెరపోయి తేరుకుని జవాబిచ్చింది సరోజ "సరిసరి ఇక ఎమడుగుతావ్ లే. నీవు గొప్పలు చెప్పుకుంటుంటే ఏమో అనుకున్నాను. మన జాతి గొప్పగా చెప్పుకోదగ్గ రచయిత యీనాడు విరోక్కరే."
"సరేలే! ఎవరో ఒకరు! ఏది యిలా, చూద్దాం"
పుస్తకం అందించింది.
చేతికి అందుకుని చూసి "అబ్బో! వెయ్యి పేజీలకి పైనే ఉందే! ఎలా చదివేది? "మహా మాయ' సీరియల్ కంటే ఎక్కువే వుంటుంది. అయినా అన్ని సార్లేలా చదివావు దీన్ని?"
ప్రశ్నిస్తూనే పేజీలు అలలా త్రిప్పసాగింది. అక్కడక్కడా అండర్ లయిన్ చేసినవి చదివితే ఏదో అయోమయంగా వుంది ఆవిడకి. ఏమి అంతుపట్టలేదు.
పుస్తకం మూసేసి చేతికి అందించి అంది "సరోజా! ఏమిటిది? ఈ భాష! ఏదో టెక్స్ బుక్ చదివినట్టుంది తప్ప నవలలా లేదే?"
ఆ మాటకి సరోజ చాలా నొచ్చుకుంటు అంది "ఇది నవల కాదక్కా! జాతికి వెలుగు నిచ్చే గ్రంధం! దీన్ని నీవు చదవక పోవటమే ఓ విధంగా మంచిది. అయినా నీలాటి వారికి యిది అర్ధం కాదులే! ఏ విషయమయినా ఉన్నంతగా వుంటే చూసి ఒర్వలేవు"