Previous Page Next Page 
స్వర్గసీమ పేజి 15

 శ్రీదేవి ముఖం కందగడ్డఅయింది.
    ఆవిడ ఎదురుగా అతను పరాయి ఆడదాని పేరు ఎత్తితేసరి బుసలు కొడుతుంది.
    కానీ అతను అలా అంటేనన్నాతన వెంట వస్తుందేమోననే ఆశతో అన్నాడు.
    మండిపడి "ఇద్దరు కలిసి తుంగభద్రలో కలవండి, నాకేం" అంది.
    "ఏమిటి? ఎందుకో? హాయిగా యిసుకలో కూర్చుని గాంధీ ఫలహారం, టైమ్ పాస్ కొనుక్కు తింటూ కూర్చుంటాము. మీ బామ్మనే దూకమను హంద్రీలో- పిడపోయిద్ది."
    "మళ్ళీ చూడు-- బామ్మ సంగతి మీకెందుకు? ఆ టైపిస్ట్ నే దూకమనండి---చస్తుంది."
    కోపంగా అన్నాడు "ఇది మంచిది కాదు శ్రీ.....అలా అనొద్దు, ఆవిడ నీకేం కీడు చేసిందని అలా దురుసుగా అనేస్తావ్?"
    "పాపం యీ ముసలావిడ మీకేం చేసిందని? దయతలచి అప్పుడప్పుడు యిబ్బందుల్లో మిమ్ము మీ సంసారాన్ని మేపినందుకా!"
    "తన గంటు తీసి యిస్తోంది పాపం; అయినా బోడి బామ్మకి ఆమెకి సంబంధం ఏమిటి? హాయిగా ఉద్యోగం చేసుకుంటూ 'జే'మ్మని ఉంటోంది. ఇహ మీ బామ్మ అందర్నీ కాదని ఒంటి పక్షిలా ఒక్కత్తి ఏడుస్తోంది........పక్కింటావిడ పక్కింటావిడలా వుండక హాయిగా బయటికి వెడదామనుకున్న నాకు సైంధవిలా అడ్డు పడుతోంది."
    పళ్ళు కొరికి అంది " ఆమె ఏమి సైంధవి కాదు.......మీ టైపిస్టే ఒత్తి రాక్షసి.....శూర్పణఖ.......నా భర్తని నాకు కాకుండా చేస్తోంది......" ఆమె గొంతుక పూడిపోయింది.
    ఇంకాస్సేపుంటే ఏడ్చేసేట్టుంది.
    అయినా అతను పంతంవీడలేదు.
    "నీవు అనుకుంటున్నట్టు అవిడేమి నీ భర్తని ఎగరేసుకుపోవటంలేదు."
    "నిజమే! నా భర్తని ఎగరేసుక పోవడం లేదు. కానీ భర్తని తన వెంట తిరిగేట్టు చేసుకుంటోంది. ఇంకేం కావాలి? నా భర్తని నాకు కాకుండా చేస్తోంది. ఏది ఎలా అయినా ఫలితం ఒక్కటే" అంది.
    "అబ్బబ్బ! నా భర్త నా భర్త అని యింకొకరి పై ఏడ్చాకపోతే నీ భర్తని జాగ్రత్తగా దాచుకోరాదూ--- అయినా ఆమెపై అనవసరంగా అపోహ పడుతున్నావ్....ఆమెకి నీ భర్తకి ఎలాంటి సంబంధమూ లేదు. అది కేవలం నీ అపోహ , నీ భర్త ఒట్టి అమాయకుడు."
    "అపోహొ! నిజమో! మీరన్నట్టు మీరు ఒట్టి అమాయకులు- అందుకే నాకు కాకుండా పోతున్నారు. అది మాత్రం నిజం! అవునో కాదో ఆవిడే కారణం అనుకుంటున్నాను నేను."
    "భ్రమ! కేవలం భ్రమ!"
     "ఏమయినా యిప్పుడిహ మీరు బయటికి వెళ్ళటానికి లేదు, వెళ్ళాల్సిన అవసరమూలేదు, మీ టైపిస్ట్ వెళ్ళి తుంగభద్రలో కలవని, ఆ తుంగభద్ర వెళ్ళి గంగలో కలవని నా కనవసరం. మీరు మాత్రం యిప్పుడు వెళ్ళటానికి లేదు-- హాయిగా కబుర్లు చెప్పుతూ కూర్చోండి."
    "ఎందుకు?"
    "ఎందుకా? చూస్తూ చూస్తూ పరాయి ఆడదాని వెంట నా భర్తని పంపే ఔదార్యం నాలో లేదు. నా భర్త కేవలం నావాడు. నాకే వుండాలి.....మరో ఆడదాని చూపు కుడా నా భర్త పై ప్రసరించకూడదు."
    మనసులో ఉప్పొంగి పోయి పెదాల్ని దాటి వెలికి రాబోతున్న చిరునవ్వుని దాచుకుంటూ అన్నాడు. "నీ ప్రేమ మంచిదే, అభినందించతగ్గదే. కాదనను, కానీ అమ్మ పెట్టదు, అడుక్కుతిననివ్వదూ అని....నీవు నా వెంట రావు. ఇంకొకరితో తిరగనివ్వవు. నేనెలా చావాలి?"
    "ఎందుకు రాను? నేనూ వస్తాను. అయితే ఓ భార్యని భర్త అజ్ఞాపించినట్టు కాకుండా , ఓ ఫ్రెండ్ ని మరో ఫ్రెండ్ అర్ధించి నట్టుగా పిలిస్తే వస్తాను. ఎందుకు రాను? ఎప్పుడూ శ్రీ యిలారా......సినిమా కేళదాం.....శ్రీ యిలారా , షికారు కేడదాం.....తయారుకా ......ఇలాగేనా పిలిచేది....మంచిగా అనేది తెలిదా? శ్రీ అలా బయటికి వెళ్ళొద్దామా? వస్తావా? నీకేం పనిలేదు కదా? ఏదైనా పని వున్నా త్వరత్వరగా కానీ, నేనూ సహాయం చేద్దునా? అని పిలిస్తే ఎందుకు రాను? రెక్కలు కట్టుకుని ఎగిరి వస్తాను. అలా ఎందుకు పిలుస్తారు మీరు? అసలు మీ మగవాళ్ళే అంత. అందుబాటులో వున్న ఆడదాన్ని ప్రాధేయపడరు. అజ్ఞాపిస్తారు. ఇహ భార్య అయితే లెక్కేలేదు. అదే ఓ పరాయి అడదయితే దాని కనుచూపుచివరలో నిలిచి ఉడిగం చేసి దాని అనుగ్రహం కొరకు ఎదురుచూస్తారు .....చీ! చీ!"
    ఆ సుదీర్ఘపన్యాసాన్నివిని బిక్క చచ్చిపోయి అన్నాడు. "మరి అలా అనలేదుగా నీవు.....బామ్మగారు.......
    అతని మాటకి మధ్యలోనే అడ్దోస్తూ అంది ఆగ్రహంగా "బోడి బామ్మగారు.....ఊరికే అలా అన్నాను, బామ్మ కేమిటి? నేను వత్తులు చేసివటమేమిటి? వెధవ......అందర్నీ కాదని తనకే ఆస్తి వుందని అందర్నీ తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తోంది. అలాటి బోడి రాస్కెల్ వెంట తిరిగి నేను అప్పడాలు వత్తిస్తూ, వత్తులు చేసి యిస్తూ సేవలు చేస్తానని ఎలా అనుకున్నారు?"
    తప్పు చేసినా వాడిలా ముఖం దీనంగా పెట్టేసి అన్నాడు. అవును. "నిజమే, నేనే పొరబడ్డాను. నాదే తప్పు, నాకే కాస్త సహాయం చెయ్యమంటే వినవే. ఇహ బామ్మకి ఏం సహాయం చేస్తావ్? సరే ఇహనయినా కోపం తగ్గిందా? వచ్చేస్తావా?"
    పిచ్చిగా అతనికేసి ప్రేమగా చూసి అంది "ఎందుకు రానండి? మహా బాగా వస్తాను, నా మగడి వెంట నేను రానా? నేను రాకుండా నా మగడి వెంట మరో ఆడది తిరుగుతొంటే చూస్తూ వూరుకుంటానా? అయినా మీ మగాళ్ళకి బొత్తిగా బుఱ్ఱా వుండదండి. ఎవరో ముక్కూమొహం తెలియని ఆడదాని కోసం ఎంతో పడి చస్తూ ఎన్నో పాట్లు పడతారు. దాన్ని ప్రసన్నం చేసుకోవాలని ఎన్నో ప్రెజెంట్ యిస్తూ మంచి చేసుకోవాలని చూస్తారు. మనసు నొచ్చుకుంటుందేమోనని ఎంతో నమ్రతగా సున్నితంగా మాట్లాడతారు. దూర దూరంగా ఎంతో బుద్దిమంతుడిగా మెలుగుతూ మంచి అబ్బాయి అనుకునేట్టుగా మసులుతారు.. కానీ అదే అమ్మాయే కర్మం చాలక భార్య అయితే యిహ దాన్ని చిల్లిగవ్వకు కొరగాకుండా చూస్తారు. ఛా! ఛా! ఛా! ఏం మగవాళ్ళు! బొత్తిగా యింగిత జ్ఞానమే వుండదు."
    విదిలించి వేసినా అతనికి హాయిగానే వుంది.
    'అవును తప్పు మాట ఏం అంటోంది?' అనుకుని "ఏమయినా అను శ్రీదూ.....నీ యిష్టం బాగా తిట్టేయ్. కానీ అందర్నీ కలిపి అలా గొంతు కొయ్యకు."
    గ్రుడ్లురిమి చూస్తోంటే మళ్ళీ ఇహ ఎక్కడ ఉపన్యాసం ప్రారంభిస్తుందోనని భయపడి" అలా చూడకు.....నీ యిష్టం ఏమయినా అనుకో....ఇకనయినా దేవిగారు దయతలిస్తే........"
    చిరునవ్వు నవ్వి అంది "ఓ అదెంత పని! ఒక్క నిమిషం......"
    మరో పదినిమిషాల్లో అతను కోరినట్టుగా కంటే రెట్టింపుగా అందంగా తయారైవచ్చేసింది ఆమె. తాళం వేసి కనిపించిన రిక్షాని కేకేసి వెళ్ళిపోయారు ముగ్గురూ అందులో ఎక్కి!

                                                             8
    పెట్టే బెడ్డింగులతో సహా యింట్లో ప్రవేశిస్తోన్న సరోజని పరిశీలనగా చూస్తూ నిలుచుండిపోయింది శ్రీదేవి. అర్దాంతరంగా యిలా రావటంలో ఉద్దేశం ఏమిటా అని ఆలోచిస్తోంది.

 Previous Page Next Page