Previous Page Next Page 
వెలుగుబాట పేజి 16

 

    కుమార్ కి పేంట్ జేబుల్లో పెట్టుకుని అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. దీర్ఘాలోచనలు ఎప్పుడున్నా అతడు అలాగే పచార్లుచేస్తాడు. నడుస్తున్నా వాడు  ఆగిపోయి "ఝాన్సీ  నేనుకూడా ఇదివరకు  నీలాగే  ఈ శ్రామిక జనం మూర్ఖత్వంతో దురలవాట్లకు బలయిపోతున్నారు అనుకొనే వాడిని. కాని, ఎక్కడో చదివాను- "వీళ్ళంతా శవాలు కాదు కల్లులో నానవేసిన శవాలు" అని బ్రతుకు బరువులో జీవచ్ఛవాలుగా మారిపోతున్న శ్రామిక జనం. కనీసం ఈ  మద్యం మైకంలో తమను తాము మరిచిపోవటానికి ప్రయత్నిస్తున్నారు. అంతకుమించి వాళ్ళు పొందగలిగిన సంతోషాలేమున్నాయో చెప్పు ఈ వ్యవస్థలో. నాన్న సంగతేచూడు. ఉన్న కొంచెం పొలాన్ని పండించుకోవటానికి ఇంట్లో అందరూ గొడ్లలాగ శ్రమ పడ్డారు. చివరకు ఆ పొలంకోసమే అప్పులపాలయి, ఆ పోలాన్నే పోగొట్టుకున్నాడు.
    "త్రాగుడు దుర్వ్యసనమే, బలవంతాన నాన్నతో తాగుడు మానిపించగలను. కాని, ఏమవుతుంది? ఉన్మాదదశలోకి పోతాడు. అటు మనసుని, ఇటు శరీరాన్ని హింసించుకుంటాడు. నువ్వూ నేను డాక్టర్లమే, ఇద్దరికీ మళ్ళీ ఆ కాలం వస్తేనో, లేక అలాంటి వాతావరణం సృష్టిస్తేనో తప్ప ఆ రోగి స్థిమితపడడని తెలుసు- కాని నేనున్నా పరిస్థితులో ఎలా సాధ్యపడుతుంది చెప్పు! తాగిన మైకంలో సర్వమూ మరిచి అలా పడివుండటం మేలా? లేకపోతే తాగుడు మానేసి తవ పోలాన్నే  తలుచుకొంటూ, పిచ్చివాడై తనను తను హింసించుకోవటం మేలా? నువ్వేచెప్పు, మనమైనా మానసిక రోగులకు ముందు మత్తు ఇంజక్షన్లే ఇస్తాం కదా? పాపం! మా నాన్న తన వైద్యం తనే చేసుకుంటున్నాడు-" అన్నాడు.
    ఝాన్సీ మాట్లాడలేకపోయింది. ఇద్దరు సంస్కారవంతులు. పైగా డాక్టర్లు- ఒకవ్యక్తి  త్రాగటమే మంచిదా? అనుకునే దశలో ఉన్నాయి పరిస్థితులు.
    "డాక్టర్ నయి వైద్యం చేయలేక చెల్లెలి ప్రాణాలు పోగొట్టుకున్నాను. డాక్టర్ నయి నాన్న మానసికరోగం కుదర్చలేక నా కళ్ళముందు త్రాగనిస్తున్నాను- హరిబుర్. వైద్యం చేయటానికి కేవలం విజ్ఞానం సరిపోదు- డబ్బుకూడా కావాలి. అవును డబ్బు లేకుండా విజ్ఞానాన్ని ప్రయోగంతో చూపలేం. అందుకే, విజ్ఞానాన్ని ప్రయోగంతో చూపలేం. అందుకే, విజ్ఞానులు సహితం ఈ వ్యవస్థ గుప్పిట్లో విలవిలలాడిపోతున్నారేమో!"
    అతని కళ్ళు చురుగ్గా మెరుస్తున్నాయి. సంకెళ్ళను భేదించుకొని బయటపడాలని ఆరాటపడే అజ్ఞాతశక్తి ఏదో  ఆ చూపుల్లో మెరుస్తోంది.
    కుమార్ సంయమనం చూస్తోంటే, ఝాన్సీలో ఏదో కొత్త బలం వచ్చినట్లయింది. తండ్రి పరిస్థితికి అతడు తక్కువ బాధపడటంలేదు- కాని, ఎంతటి దారుణ దుఃఖం ఎదురయినా, చిరునవ్వుతో ముందుకుసాగే స్థితప్రజ్ఞుడతడు. ఏ పరిస్థితుల్లోనయినా కర్తవ్యం విస్మరించని కర్మయోగి.
    ఆనాటినుంచీ ప్రయత్నించి త్రాగి మైకంలో పడిఉన్న గోవిందయ్యను చీదరించుకోకపోవటం నేర్చుకొంది. ఆ దశలో ఉన్న భర్తను పసిపాపనులా లాలించాలనిచూసే శాంతమ్మ సహనం అలవరచుకోవటానికి ప్రయత్నించింది
    ఆ నెల ఝాన్సీ జీతములో ఇంటికి అసలేమి పంపలేదు. శాంతమ్మకు గోవిందయ్యకూ, కుమార్ కీ బట్టలుకొంది. తనూ రెండు చీరలు కొనుక్కుంది. ఆ నెల తనకు కొన్ని ఖర్చులు వచ్చాయని, పైనెల పంపుతానని ఇంటికి ఉత్తరం వ్రాసింది.
    సుందరమ్మ కుమార్ పరికరాలు కొనుక్కో, ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించు."
    "ఇంత డబ్బు.....మీకు మళ్ళీ నేను తీర్చగలనా?"
    "వడ్డీతోసహా తీర్చగలవు. జనం నిన్ను దేవుడిలాగ ఆరాధించడం నేను చూశాను- కొంచెం రోజుల్లోనే మంచి డాక్టరని పేరు తెచ్చుకుంటావు- ఆ చుట్టుపక్కల ఊళ్ళలోనే నీ అంత మంచి డాక్టరుండడు."
    "థాంక్యూ!"
    అతని మనసులో కొత్త ఆశలు చిగురించాయి. సుందరమ్మ బుణం తీర్చుకోగలనని విశ్వాసం కుదిరింది. ఆ రోజే కావలసిన పరికరాలన్నీ కొనుక్కువచ్చాడు.
    రాత్రి పొద్దుపోయేవరకూ కుమార్ ఇంటికి రాకపోతే ఝాన్సీ కంగారుపడసాగింది. కుమార్ ఉత్సాహంతో వచ్చి జరిగింది చెప్పాడు. అతడి ముఖంలో అలసట పొంగిపొర్లే ఉత్సాహం ముందు కనిపించటంలేదు. డబ్బు సంపాదించాలనే ఆరాటంకంటే డాక్టరుగా తన ప్రజ్ఞ నిరూపించుకునే అవకాశమే అతనికెంతో ఆనందం కలిగిస్తుంది.
    ఝాన్సీ మనసులో ఎంత కాదనుకున్నా సుందరమ్మ విషయంలో కొంత అసహనం ఉండేది- కాని ఇప్పుడు జాన్సీ మనసు సహితం సుందరమ్మపట్ల కృతజ్ఞతతో నిండిపోయింది.
    "నేను వెళ్ళి సుందరమ్మగారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటాను" అంది.
    ఝాన్సీ ఇలా అనటం కుమార్ కెంతో ఆనందం కలిగించింది "నేనూ వస్తాను" అన్నాడు.
    ఇద్దరూ అప్పటికప్పుడు సుందరమ్మ ఇంటికి బయలుదేరారు. మూసినా తలుపులు తట్టారు ఆ తలుపులు కొంచెం ఆలస్యంగా తెరుచుకున్నాయి బయటకువచ్చిన సుందరమ్మని చూసి, ఇద్దరికీ నోటమాటరాలేదు. రేగిన తల, నలిగిన చీర, తలలో పూలు, మద్యం మత్తులో ఉన్న కళ్ళు- సుందరమ్మ ఏ స్థితిలో ఉందో అర్థమపోయింది ఇద్దరికీ. ముగ్గురూ ఒకరి నొకరు చూసుకుంటూ ఉండిపోయారు. ముందుగా సుందరమ్మే పెదవి విప్పింది.
    "ఇప్పుడెందుకొచ్చారు? పోండి. రాత్రిపడిందంటే నేను మనిషినికాదు దయ్యాన్ని. పోండి పోండి! ఇంకెప్పుడూ రాత్రివేళ ఇటురాకండి" లోపలికిపోయి దభాలున తలుపులు మూసేసుకుంది.
    ఇప్పుడు తక్కువజాతి వెధవా! అంటున్నావు" అని పోట్లాటకు దిగింది.
    "ఛా నోరుమూసుకో, నా పరువు తీస్తున్నావు. ఏదో గవర్నమెంట్ డాక్టరుగా ఉన్నాడు. పోనీ పిల్లనిద్దామనుకున్నాను. వీడేమో......"
    కుమార్ కల్పించుకుని "అర్ధమయిందిలెండి. నేను గవర్నమెంట్ డాక్టరుగా  ఉన్నంతవరకూ మీకు జాతి మత భేదాలు లేకుండా పోయాయి. ఆ ఉద్యోగం పోగానే తక్కువ జాతివాడినయిపోయాను. ఇందుకు కారణం మీరేనన్న ఆత్మవిమర్శ అయినా, మీ ఎక్కువజాతి మీలో కలిగించలేకపోయింది" అన్నాడు.  

 Previous Page Next Page