సుందరమ్మ ఇంటిముందు కుమార్ బోర్డు మాత్రమే ఉండేది. అతడు సైకిల్ మీద గ్రామంలో ఎక్కడయినా తిరుగుతూ ఉండేవాడు, లేదా ఝాన్సీతోపాటు హాస్పిటల్ లో అయినా ఉండేవాడు. కాని, ప్రతిరోజూ తప్పనిసరిగా సుందరమ్మ ఏర్పాటుచేసిన కుర్చీలో కూచుని, సుందరమ్మ ఇచ్చిన కాఫీ తాగి ఆ తర్వాతనే ఊరిమీదకు వెళ్ళేవాడు.
ఈ నెల తన జీతంలో సగం ఇచ్చింది ఝాన్సీ అతనికి, కాదనలేకపోయాడు. ఇంటి పరిస్థితులలాంటివి. ఆమె ఇచ్చినదంతా ఇంటికి పంపేసి, చెల్లెలికి ఏమేమి మందులు కొనాలో వివరంగా రాశాడు. తల్లికి చదువురాదు కాని, ఎవరితోనయినా చదివించుకొంటుంది. ఒక్కసారి వెళ్ళి చెల్లెలిని చూసిరావాలని అనిపించిందికాని, ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్న గ్రామాన్ని వదిలి వెళ్ళలేకపోయాడు. అంతేకాదు వెళ్ళి రావటానికి మళ్ళీ డబ్బు ఖర్చవుతుంది.
ఆ రోజు సాయంత్రం ఝాన్సీ ఏదో మెడికల్ జర్నల్ తిరగేస్తోంది. కొంచెం పైకి కట్టిన పంచె, గుబురుగా ఉన్న క్రావు, చిన్న మీసాలు, చేతిలో కర్ర, ఆకుచెప్పులు, ఎక్కువగా పల్లెటూరితనమూ, కొద్దిగా నాగరికతా కన్పిస్తున్న ఒక యువకుడు వచ్చి "డాక్టరు కుమార్ బాబు ఇక్కడే ఉంటారా?" అని అడిగాడు. ఝాన్సీ అతడిని వింతగా చూసి "ఉంటారు, కానీ రోగులను ఆస్పత్రిలోనే చూస్తారు రేపురండి" అంది. కొంచెం కోపం వచ్చింది.
"నాకే రోగమూ లేదు, ఆయనతో పనుండి వచ్చాను."
"సరే కూర్చోండి" అని మళ్ళీ జర్నల్ చదువుకో సాగింది. అతడు నిలబడే వున్నాడు. తన "నర్సింగ్ హొంకి తాళం వేసుకుని సైకిల్ కాంపౌండర్ ది, అతడినడిగి ఉపయోగించుకుంటున్నాడు కుమార్.
బాలయ్య అమాంతం కుమార్ ని కౌగిలించుకుని, "ఒరే, అన్నా, చెల్లి చచ్చిపోయింది- అమ్మ ఒక్కలా ఏడుస్తోంది. మా దగ్గరకొచ్చేసింది. నాన్న అసలు మన లోకంలో లేడు. అయితే తాగుడు లేకపోతే పిచ్చి ఊసులు....."
ఆ యువకుడు కుమార్ తమ్ముడని అర్ధమయింది ఝాన్సీకి. తన పోరపాటుకు చాలా బాధపడింది. అతడిని కనీసం కూర్చోపెట్టలేదు. ఎవరో గ్రామస్తుడనుకొంది. సరిగ్గా ఆ సమయంలో సాధారణ గ్రామస్థుడయినా కుమార్ అయితే కూచోమని మర్యాద చేసేవాడని గుర్తుకొచ్చి మరింత లజ్జించింది. ఆ అన్నదమ్ములిద్దరూ ఒకరి నొకరు ఎంతో సేపటికి ఓదార్చుకున్నారు. ఇద్దరికీ కాఫీ ఇచ్చింది ఝాన్సీ ఇద్దరికీ కన్నీటిబోట్లు కాఫీలో కలిసిపోతున్నాయి.
"సంఘ సేవలో మునిగిపోయి సొంత చెల్లెల్ని చంపుకున్నాను. నాదెంత స్వార్థ త్యాగమో చూశావా?"
నవ్వుతూ కుమార్ ఇలా మాట్లాడినప్పుడు అతడి ముఖంలోకిచూస్తే ఝాన్సీకి మనసు చెరువైపోతుంది. ఆ ముఖంలో అంత విషాదమంటుంది.
తమ్ముడితో కలిసి తన ఊరికి కుమార్ బయలుదేరుతున్నప్పుడు "ఒక్కమాట! వచ్చేటప్పుడు మనవాళ్ళందరిని ఇక్కడకు తీసుకొచ్చెయ్యండి" అంది ఝాన్సీ.
"కాని, నీకు ఇబ్బంది కాదూ?"
ఏం లేదు. ఇప్పటికే జరిగినదానికి సిగ్గుతో చితికిపోతున్నాను, నన్నింకా శిక్షించకండి."
"థాంక్యూ."
"ఏం లేదు. ఇప్పటికే జరిగినడానికి సిగ్గుతో చితికిపోతున్నాను, నన్నింకా శిక్షించకండి."
"థాంక్యూ."
ఈ సంభాషణంతా వింటున్న బాలూ "ఈవిడ ఎవరన్నయ్యా?" అన్నాడు.
"ఇక్కడి డాక్టరమ్మ."
ఆ సమాధానం విని నిట్టూర్పు ఆపుకుంది ఝాన్సీ. ఇద్దరి పరిస్థితి ఒక్కలాగే ఉంది.
ప్రతిరోజూ కుమార్ కి కాఫీ ఇచ్చిన తర్వాతనే తను కాఫీ తాగటం సుందరమ్మకి అలవాటు ఆ రోజు కుమార్ రాలేదు. సుందరమ్మ నోటికి కాఫీ ఎక్కలేదు. కుమార్ రాలేదు కానీ, ఆరోజు కుమార్ కోసం వచ్చిన రోగులకు సమాధానం చెప్పలేక సుందరమ్మ విసిగిపోయింది. కుమార్ లేడని వినగానే అందరి ముఖాల్లోనూ ప్రతిఫలించిన నిరాశ చూసి ఆశ్చర్యపోయింది. "ఇంతవాడయ్యాదా ఆ అమాయకుడు!" అనుకొంది. రెండు రోజులూ సుందరమ్మ ఇదే అవస్థను ఎదుర్కోవలసి వచ్చింది మూడో రోజు వడిలిపోయిన ముఖంతో వచ్చిన కుమార్ ని చూసి "ఇన్ని రోజులు ఎక్కడి కెళ్ళావ్! నాతో చెప్పకుండా ఎందుకెళ్ళావ్? అలా ఉన్నావేం?" అంది ఆ అడగటంలో ఆప్యాయత, కోపం, అతడి అస్వస్థతాకు ఆరాటం అన్నీ ఉన్నాయి.
కుమార్ బాధగా నుదురు రాసుకుంటూ తన మామూలు గుండెలుకోసే నవ్వుతో జరిగిందంతా చెప్పాడు. మ్రాన్పడిపోయింది సుందరమ్మ. ఓదార్పుగా ఏదైనా మాట్లాడాలన్నా ఆమెకు గొంతు రాలేదు.
"బాబూ! రోజూ నీకోసం ఎందరో రోగులు వస్తున్నారు, ఇంతమంది వస్తున్నా నీకు రాబడిలేదా?"
"సుందరమ్మగారూ! రోగులు వస్తున్నారు నిజమే కాని, వాళ్ళకు వైద్యం చేయాటానికి నా దగ్గర పరికారాలు లేవుకదా? వాళ్ళ నందరిని గవర్నమెంట్ ఆస్పత్రిలోనే చూస్తుంటాను. గవర్నమెంట్ ఆస్పత్రిలో చూసినప్పుడు డబ్బు తీసుకోకూడదు. అందుకే పేరు సంపాదించుకొంటున్నాను కాని డబ్బు సంపాదించుకోలేకపోతున్నాను."
సందరమ్మ ఆలోచిస్తూ "నీకు పరికారాలు కొనటానికి ఎంతకావలసిన వస్తుందీ?" అంది.
"కనీసం మూడు వేలు"
"ముందు కాఫీ త్రాగు తరువాత సంఘసేవకి బయలుదేరు" అని కాఫీ కప్పు అతనిముందు పెట్టింది సుందరమ్మ.
* * *
కుమార్ తన తల్లిని తండ్రిని తీసుకొచ్చేశాడు. తమ్ముడు బాలయ్య మెట్ర్రిక్ పాసయి కాంపౌండర్ ట్రైనింగ్ కి వెళ్ళాడు. కుమార్ తల్లి శాంతమ్మతో ఝాన్సీకి ఏ సమస్యా తలెత్తలేదు. కాని, తండ్రి గోవిందయ్యతో మాత్రం పడలేకపోతుంది. అతడు వేస్తే పిచ్చి కేకలేస్తాడు' లేకపోతే తాగిన మైకంలో చచ్చినవాడిలా పడివుంటాడు. ఇంట్లో తాగాడు, అదొక సుగుణం. కాని, గ్రామంలో కల్లుదుకాణాలకు కొదవ ఏముందీ? తప్పతాగి పడివుంటే ఎవరో ఒకరు ఇంటికి తీసుకొస్తారు.
శాంతమ్మ నిజంగా శాంతమ్మే! కూతురు పోయిన దుఃఖం అలా గుండెల్లో నింపుకుని, భర్తను పసిపిల్లవాడిలా సాకుతుంది. మరబొమ్మలా ఇంటి పనంతా చేస్తుంది వంట తనే చేసుకొనేది ఝాన్సీ.
నేను సాయం చేస్తానని రాలేదు శాంతమ్మ కాని, ఒకరోజు ఝాన్సీ ఆలస్యంగా లేచింది. అప్పటికే శాంతమ్మ వంట ప్రారంభించిది, ఝాన్సీకి ఆలస్యమవుతుందని. ఆమె లేచి "అరె! మీరు వంటచేస్తున్నారా?" అంది, ఒక విధమయిన ఆదుర్దాతో. ఆ ఆదుర్దాలో అసహనం లేకపోలేదు. కుమార్ అప్పటికే లేచి తల్లితో ఏదో మాట్లాడుతున్నాడు. ఏవో జోక్స్ కట్ చేసి విషాదం గూడుకట్టుకున్న ఆ హృదయంలో చిరునవ్వు చిలకరించాలని ప్రయత్నిస్తున్నాడు. ఝాన్సీ మాటలు విని కొంత గంభీరంగా "అమ్మా! నువ్వు వంట ఎందుకు చేసావ్? నువ్వు వంటచేస్తే ఝాన్సీ తినలేదు" అన్నాడు. ఝన్సీ నాలుక కర్చుకొంది. శాంతమ్మ తలదించుకుని సిగ్గుపడుతున్నట్లు "నువ్వు ఆలస్యంగా లేచావు డాక్టరమ్మా! నీకు ఇబ్బందవుతుందని అంది, ఏదో అపరాధం చేసినట్లు. శాంతమ్మ ఝన్సీని "డాక్టరమ్మా!" అనే పిలుస్తుంది, కుమార్ అలాగే పరిచయం చేసాడు. ఈ వ్యవహారమంతా అయోమయంగా తోచినా, ఒక్క ప్రశ్న వెయ్యదు ఆ పిచ్చితల్లి.
ఝాన్సీ కలవరపడి, తన అసహనాన్ని కప్పుకొంటూ "అది కాదు మా వంట పద్ధతులు వేరు. నేను తినగలనో, లేనో అని...." అంటూ సర్దుకొబోయింది.
"పోని, మీ పద్ధతులు నేర్పించమ్మా నేర్చుకుంటాను. నీకీమాత్రం సాయమైనా చేస్తాను" అంది ఆ అమాయకురాలు.
"సరే! నేర్పిస్తాను" అని తనూ వంతలోకి వచ్చింది ఝాన్సీ. ఆ రోజు ఇద్దరూ కలిసి వంట చేసారు. కుమార్ కళ్ళలో కనబడిన అభిమానం. ఝాన్సీ మనసులో తలెత్తిన కొద్దిపాటి అసహనాన్ని అతి తేలిగ్గా మింగేసింది. శాంతమ్మ వంటలో మంచి నేర్పరి. తేలిగ్గా ఆమె పద్ధతులు నేర్చుకోవటమేకాక, ఆమె కంటె వంట బాగా చెయ్యటం, ఆమె కొంత సాయం చెయ్యటంలోకి మారిపోయింది పరిస్థితి.
గోవిందయ్య తప్పతాగి పడివున్నప్పుడు మాత్రం ఝాన్సీ సంస్కారం విలవిలలాడేది. ఒకసారి ఊరుకోలేక కుమార్ తో" ఏమీ అనుకోకు, మనం చదువుకున్న వాళ్ళమై మనవాళ్ళనే ఇలా దురలవాట్లకు బానిసలు కానివ్వటం మంచిదంటావా?" అంది.