తెల్లవారుజామున అతనికి మామూలుగా మెలకువ వొచ్చింది. ఆమె చెయ్యి యింకా అతనిమీదే వున్నది. మృదువుగా విడదీసి లేచికూర్చున్నాడు. ఆమె ముఖంలోకి చూసి ఉలిక్కిపడ్డాడు. ఆ కళ్ళనుండి ఎప్పుడు జారాయోగాని చెంపలమీద చారికలు. ఎందుకలా....? పాపం యీ పిల్ల. జాలితో అతని హృదయం ద్రవించింది. ముందుకు వొంగి ఆమె చెంపల్ని తుడవబోయి, ఎందుకో చలించాడు నిర్మలంగా, అమాయకంగా, పసిగా, తెలీని ఆకర్షణను దాచుకున్నట్లు ఆమె మొఖం, మూతలుపడ్డ కనుదోయి. లేత చెక్కిళ్ళు......పెదిమలతో ఆ చెక్కిళ్ళని స్పృశించాలనిపించింది. కాని.....కళ్ళముందు ఆంజనేయులురూపం కనిపించింది. వెంటనే వెనక్కి జరిగి, లేచి నిలబడి, తలుపులు గడియతీసి బయటకు వెళ్ళిపోయాడు ముఖం కడుక్కునేందుకు.
5
మధ్యాహ్నం సునంద వొచ్చింది. "ఏం ప్రియా! నీ ప్రియుడు కనిపించాడా?" అంటూ.
"లేదండి".
"బాధగా లేదూ నీకు?"
"చాలా బాధగా వుందండీ, పాపం నిలబడే వున్నారు కూచోండి".
"నేను ఒక విషయమడుగుతాను చెబుతావా?"
"అడగండి".
"మీ బావనుగురించి నీ వుద్దేశమేమిటి?"
"మంచివాడే గాని వొట్టి మోటుమనిషండి. అతన్లో ఆడపిల్ల లకు ఆకర్షణ కలిగించే పాయింట్లేమీ లేవండి".
"అంతేనంటావా?" అన్నది సునంద నొచ్చుకుంటూన్నట్లుగా.
"ఏవండీ! నా అభిప్రాయం తప్పంటారా?"
".....నీకు బావకాబట్టి- చిన్నప్పట్నుంచీ చూస్తున్నావు కాబట్టి అలా వుందేమోకానీ, అతనో ఆడపిల్లలకు నచ్చేపాయింట్లు చాలా వున్నాయనే నా అనుమానం".
ప్రియంవద సాలోచనగా అంది. "అవునండోయ్. మీ పాయింటు కరెక్ట్ లాగే వుంది".
"కాని మీ బావలో యింకో వీక్ నెస్ కూడా వుంది".
"ఏమిటండి?".
"ఎదుటివాళ్ళ మనసు బొత్తిగా అర్ధంచేసుకోడు".
"మా కుట్టీ కూడా అంతేనండీ. మొదట్లో సరిగ్గా అర్ధం చేసుకునేవాడు కాదు".
"కుట్టీనా? అతనెవరు?".
"ఆంజనేయులుకు ముద్దుపేరండి".
"నాక్కూడా అలా ముద్దు పేర్లతో పిలిస్తే సరదాగా వుంటుంది. మీ బావకేమైనా ముద్దుపేరుందా?"
"అదేమిటండీ! కొంపతీసి మా బావను మీరు ప్రేమించటం లేదుకదా అండీ?"
సునంద ముఖంలో దిగులు కనిపించింది. "బహుశా అంతేననుకుంటాను. సరిగ్గా తెలీటంలేదు" అంది దీనంగా.
"ఇలాంటి విషయాలు సరిగ్గా తెలియవండి. మసకమసగ్గా- చివరి వరకూ అస్పష్టంగా వుంటాయి. మనం ఏమనుకుంటున్నామో- సరిగ్గా మనకే తెలీదు"
"అంతేనంటావా?"
"అంతేనండీ."
"నాకంటే-కొంచెం వయసులో చిన్నదానివైనా-చాలా విషయాలు తెలుపల్లే వుందే నీకు?"
"బాగా ఎక్స్ పీరియన్స్ వుంది కదండీ."
"ఇంత చిన్నవయసులో అంత ఎక్స్ పీరియన్స్ రావటం గొప్పే" అంది సునంద అభినందనగా.
"చాలా కరెక్ట్ గా చెప్పారు" అన్నట్లు నవ్వి వూరుకుంది ప్రియంవద.
మొదట్లో నీ ప్రేమని ఎట్లా ఎక్స్ ప్రెస్ చేశావు, డైరెక్ట్ గా అడిగావా?" అనడిగింది సునంద.
"ఆడపిల్లలు మనస్సులో యిష్టమున్నా అలా డైరెక్ట్ గా అడిగెయ్య కూడదండీ. సౌంజ్ఞల్లో, కళ్ళలో ముఖకవళికల్లో హావభావాలు చూపించాలి.
"అదెట్లా మరి? నాకు తెలియటల్లేదే."
"కొంచెం ట్రై చెయ్యాలండీ. ట్రై చేస్తే అన్నీ వొస్తాయి."
"పోనీ లవ్ లెటర్ రాస్తే?"
"అది కూడా బాగానే వుంటుందండీ. సాలు లవ్ లెటర్సే కదండి ప్రేమికుల మధ్య ప్రాణం."
"కాని యిక్కడ ఓ చిన్న చిక్కుంది."
"ఏమిటండీ."
"నేను చిన్నప్పట్నుంచీ కాన్వెంట్ లో చదివాను. అందుకని తెలుగు మాట్లాడటం వొచ్చుగాని రాయటం రాదు."
"మీరు యింగ్లీషులొ ప్రేమిస్తున్నారా అండీ."
"అబ్బే. అదేంలేదు. నేను తెలుగులోనే ప్రేమిస్తున్నాను. కానీ ఇంగ్లీషులో ఆలోచిస్తున్నాను."
"పోనీ ఇంగ్లీషులోనే రాయండి."
"ఇక్కడ కూడా యింకో చిక్కుంది."
"అదేమిటండీ?"
"నేను ఇంగ్లీషు ఫ్లూయంట్ గా మాట్టాడగలను గానీ, రాయలేను."
"ఎందుకనండి?"
"ఎందుకనంటే-మా స్కూల్లో అలా అలవాటు చేసేశారు."
"మరేం చేద్దామంటారండీ."
"నాకో ఐడియా వొస్తోంది."
"ఇలాంటప్పుడు ఐడియాలు గబగబ వొస్తూంటాయండీ."
"కాని నువ్వు కోపం తెచ్చుకోకూడదు."
"నాకస్సలు....కోపం రాదండీ."
"నా బదులు లవ్ లెటర్ నువ్వు రాసెయ్యకూడదూ?"
"ఓ! అదెంతపనండీ. మంచినీళ్ళప్రాయం అసలు నా ఫ్రెండ్స్ చాలా మంది నాతో ప్రేమలేఖలు రాయించుకునే వారండి. అది చదివి అంతకుముందు ఏ ఐడియాల్లేనివారు కూడా ప్రేమలో పడిపోయేవారండి."
"నిజంగానా?"
"నిజమండీ."
"అయితే, ప్లీజ్! ఈ సహాయం నువ్వు తప్పకుండా చేసిపెట్టాలి" అంది సునంద. ఆమె చుబుకం పుచ్చుకుని బ్రతిమిలాడుతూ-గబగబ పెన్నూ, కాగితం వెదికి ఆమెవొళ్ళో పెట్టింది.
ఈ ప్రేమలేఖలున్నాయి చూశారా? "మనిషికో చరిత్రలా ఎప్పటికప్పుడు ఓ నూతనత్వం వూరుతూంటుందండీ."
"అవునా?" అంది సునంద ఉవ్విళ్ళూరుతూ.
"అవునండీ."
"మరి రాసెయ్యి."
"అమ్మా! అది అంత తేలిగ్గా కుదరదండీ. మంచి ప్రేమలేఖ రాయాలంటే మూడ్ వుండాలండి. ప్రక్కన మనుషులుండకూడదు. ఏకాంతంగా వుండాలి. వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. చల్లని పిల్ల గాలులు.....ఒక్కోసారి వెన్నెట్లో...."