కొద్దిసేపు అలోచించి , సమాధానం చెప్పకుండా , చుట్ట నుసిని యాష్ ట్రేలోకి విదిలించాడు పరమహంస.
కాసేపు వేచి చూసి, పెద్ద పెద్ద అంగలు వేస్తూ బయటకి వచ్చేశాడు తేజస్వి.
బయట ఆదుర్దాగా సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ కూర్చుని ఉన్నాడు సిసిల్. అతని పక్కనే తక్కిన రిప్రజెంటేటివ్స్ మూగి ఉన్నారు.
"ఏమయింది?" అన్నాడు సిసిల్ తేజస్విని చూడగానే.
"ఏమి కాలేదు. ఏమి కాదు, డోంట్ వర్రీ" అన్నాడు తేజస్వి.
అతని వైపు ప్రశంశపూర్వకంగా చూశాడు సిసిల్.
భూకంపం వచ్చినా, చలించని కొండలాంటివాడు తేజస్వి. ఇతని అండదండలు ఉన్నంతవరకూ తమకు ఏ ఆపద రాదు. అది నిజం!
"నేను రౌండ్స్ కి వెళ్ళి వస్తాను! అన్నాడు తేజస్వి. చాలా మాములుగా. ఏమి జరగనట్లుగానే.
ఆ తరువాత అందరూ ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
మనసు చిరాగ్గా ఉంది తేజస్వికి.
స్కూటరు ముందుకు పోనిచ్చి , ఒక మిఠాయి షాపు ముందు ఆపాడు.
తేజస్విని గుర్తుపట్టి పలకరింపుగా నవ్వాడు షాపు అతను. ఎప్పుడూ ఆ షాపులోనే స్వీట్లు , ఖారా కొంటుంటాడు తేజస్వి.
"కారప్పూస, చేగోడీలు, ఇప్పుడే తయారయ్యాయి సార్! రెండూ రెండు కిలోలు ఇమ్మంటారా? అన్నాడు షాపు అతను.
"ఇవ్వు, అదేమిటి? బాంబే బర్ఫీనా? తాజాగా ఉందా? అది కూడా ఒక అరకిలో ఇవ్వు."
షాపు అతను వాటిని తూచి ప్యాక్ చేస్తుంటే అనుకున్నాడు తేజస్వి. బాంబే బర్ఫీ అంటే చిన్నికి చాలా ఇష్టం.
తను ఎప్పుడూ బాంబే బర్ఫీ తెస్తాడని తనని "బాంబే బాబాయ్ " అని పిలుస్తాడు చిన్నీ.
అనాధాశ్రమంలో ఉంటాడు చిన్నీ. ఇంకా అనేకమంది చిన్నారులతో పాటు. దిక్కూ మొక్కు లేని దీనమైన జీవితం గడుపుతూ కడుపునిండా తిండి, కంటినిండా నిద్రా లేకుండా కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ-
చిన్నిని తలుచుకున్నప్పుడల్లా చిన్నీ తల్లి గుర్తు వస్తుంది తేజస్వికి. ఆమెని జన్మలో మరిచిపోలేడు తను!
7
అనాధాశ్రమంలోకి వెళ్ళి వెళ్ళగానే తేజస్వికి కనబడింది ఆ దృశ్యం. అతి దయనీయమైన స్థితిలో ఉన్నాడు చిన్ని అక్కడ.
అయిదేళ్ళ వయస్సున్న ఆ అబ్బాయిని నులకతాడుతో నిర్ధాక్షిణ్యంగా గుంజకు కట్టేశారు ఎవరో.
గిన్జుకుంటూ, చిన్న కుక్కపిల్లలాగా ములుగుతున్నాడు చిన్నీ. అది చూసి చూడగానే గుండె నీరైపోయింది తేజస్వికి. ఒక్క అంగలో చిన్నిని చేరుకుని ఆ తాడు విప్పబోయాడు.
కానీ రాలేదు అది. గట్టిగా బిగుసుకుపోయి పీటముడి పడి ఉంది.
బలంగా దాన్ని లాగాడు తేజస్వి.
నులకతాడు తెగాడు. బంధ విముక్తుడయ్యాడు చిన్నీ. అతని చిన్న చిన్న కాళ్ళు ఒరుసుకుపోయి ఎర్రెర్రగా కనబడుతున్నాయి.
"బాంబే బాబాయ్!" అని ఏడుస్తూ తేజస్వి కాళ్ళని చుట్టేసుకున్నాడు చిన్నీ.
"ఏడవకు చిన్నీ! ఏడవకు నాన్నా" అని అతన్ని సముదాయించడం మొదలెట్టాడు తేజస్వి. " చెప్పు చిన్నీ! ఎవరు నిన్ను కట్టేసింది ఇలాగ?"
చిన్నీ ఏదో చెప్పడానికి నోరుతెరచి , మళ్ళీ అంతలోనే భయంగా ఆగిపోయాడు.
చిన్నీ చూపులని అనుసరించి తను కూడా గుమ్మం వైపు చూశాడు తేజస్వి.
లోపలికి వస్తున్నాడు వరదరాజులు. అతను అనాధశ్రమానికి వార్డెన్.
వరదరాజులకి మెదడు ఉంది కానీ మనసు లేదని తెలుసు తేజస్వికి. దయా దాక్షిణ్యాలు లేని మనిషి వరదరాజులు.
తలుచుకుంటే వరదరాజుల్ని అక్కడికక్కడే, అప్పటికప్పుడే చెడా మడా వాయించేయ్యగలదు తేజస్వి. కంపెని బాస్ కే భయపడని మనిషి తేజస్వి.
కానీ కంపెని పరిస్థితి వేరు. ఇక్కడి పరిస్థితి వేరు.
ఇప్పుడు తను తిట్టినా, కొట్టినా కూడా సహిస్తాడు వరదరాజులు.
తను అటు వెళ్ళగానే ఆ అక్రోశాన్నంతా ఈ పసి పిల్లల మీదికి మళ్ళిస్తాడు . తనకు తెలుసు.
అందుకని విడ్ని తిట్టి లాభం లేదు.
శాశ్వత పరిష్కారం ఏదన్నా ఆలోచించాలి ఈ సమస్యకి.
తేజస్విని చూసి చూడగానే అదోలా మొహం పెట్టాడు వార్డన్ వరదరాజులు.
"ఓహో! మళ్ళీ వచ్చారా!" అన్నాడు చాలా అప్రసన్నంగా.
"ఇక్కడేదో కుక్కపిల్ల కుయ్యోమని ఏడుస్తున్నట్లు వినపిస్తేను చూసి వెళ్దామని వచ్చాను." అన్నాడు తేజస్వి కోపాన్ని దిగమింగుతూ.
"చిన్నీగాడి గురించేనా మీరు చెప్పేది? వాడి ఆగడం రోజురోజుకి మితిమీరిపోతోంది. తిన్నదరగట్లేదు, అందుకే తాడుతో కట్టేశా" అన్నాడు వరదరాజులు.