Previous Page Next Page 
లీడర్ పేజి 16

    డాక్టర్ మురారీలాల్, అతని సెక్రటరీ గంజూర్ గార్లు రోజూ కమలా నగర్ వెళ్తూ, దార్లో రాగ్గులతో వేసుకున్న వీరి డేరాలనీ, పైన ఎగురుతున్న కాంగ్రెసు జెండానీ గమనించసాగారు.    
    ఒకరోజు ఆగి, నాయకుడెవరో కనుక్కుని, "ఎక్కడి నుంచి వచ్చారు? ఏమిటి సంగతి?" అనడిగారు.    
    "అయ్యా! మేము ఆంధ్రానుండి కాలినడకన ఐదునెలల క్రితం బయలుదేరి ఎంతో కష్టపడి, మహాసభలకి వచ్చాం. మాకెక్కడా బస దొరకలేదు" అని శ్రీహరిరావు చెప్పారు.   
    ఆయన అంతా విని, వీరి పట్టుదలకీ, సాహసానికీ ఆశ్చర్యపోయి, వెంటనే వీరికి బలరాం నగర్ లో క్వార్టర్ ఇప్పించారు. మిగతా బృందం లోని వారందర్నీ కమలానగర్ లో వాలంటీర్లుగా నియమించారు.    
    గుంటూరునుండో స్నేహితుడు ఓ టిన్ నిండా ఆవకయ పంపించాడు. రాజూ, కోటయ్యా వాళ్ళు భోజనాల సమయంలో వచ్చి, ఓ మట్టి పిడతనిండా ఆవకాయ తీసుకుపోతుండేవారు!    
    మొదటగా నెహ్రూ గారొచ్చారు. ఆయన్ని గుర్రంమీద కూర్చోబెట్టి, నామంపెట్టి ఊరేగిస్తూ బ్యాండ్ మేళంతో తీసుకెళ్ళారు.    
    తరువాత మహాత్మాగాంధీ, కస్తూరీబా, మీరాబెన్, మోతీలాల్ మొదలగు మహామహులు వచ్చారు. వారిని చూసిన ప్రతి ఒక్కరి జన్మా ధన్యమైపోయింది. ఎక్కడ చూసినా జయజయధ్వనులే! ఇంట్లో ఏదో వేడుక జరుగుతున్నంత ఉత్సాహం! అలా దేశం మొత్తాన్ని ఒక త్రాటిపై నడిపిన ఘనత ఆ నాయకులదే కదా!    
    కాంగ్రెసు మహాసభలు మూడు రోజులపాటు జరిగాయి. సెక్రటరీలు కర్వూద్రీ, శ్రీనివాస్ లని బ్రతిమాలి రమణయ్య డ్యూటీ స్టేజ్ దగ్గరగా వేయించుకుంది. వారందర్నీ దగ్గరగా చూసి, ఉపన్యాసాలు వినీ తరించాలని, తన కింతటి భాగ్యం కలగచేసిన భర్తకి మనస్సులోన ఎన్నోసార్లు కృతజ్ఞతలు తెలియజేసుకుంది.    
    దుర్గాబాయ్ దేశ్ ముఖ్ వచ్చింది. ఆవిడ శ్రీహరిరావుని 'తమ్ముడూ' అనీ, రమణమ్మని 'మరదలా' అనీ సంబోధిస్తుంది. రెండు కుటుంబాలకీ కాకినాడలో మంచి స్నేహం!    
    సభలకి ఆంధ్రానుండి చాలా మందొచ్చారు. సుబ్రహ్మణ్యం, కోటయ్యలని తప్పించి, మిగతావారిని సభలు ముగియగానే ఆంధ్రాకి పంపించేశారు.    
    టైపు పనులవీ కాంగ్రెసాఫీసులో చేస్తూ, లక్నోలో సభలయ్యాక నాలుగు నెలలుండిపోయారు శ్రీహరిరావు కుటుంబం.    
    ఈలోగా మహాత్ముడి సెక్రటరీ మహాదేవ దేశాయ్ గారి దగ్గరకెళ్ళి మహాత్ముడిని చూడాలని ఎపాయింట్ మెంట్ తీసుకున్నారు. అప్పుడు గాంధీజీ బిర్లామందిరంలో బసచేశారు.    
    వెళ్ళిన ఎపాయింట్ మెంట్ లెటర్ చూడగానే లోపలికి రమ్మని కబురొచ్చింది. పాదరక్షలు వదిలి లోపల గదిలో కడుగుపెడ్తుంటే కాళ్ళు వణికాయి. ఆనందంతో అందరి వొళ్ళూ పులకించిపోయింది. లోపల ఎదురుగా అంత దగ్గరగా సాక్షాత్తూ మహాత్మాగాంధీ అన్న తలంపే పరవశం కలగజేసింది.    
    లోపల పరుపుమీద మడికాళ్ళేసుకుని కూర్చుని, పైన చొక్కా కూడా లేకుండా, అతి సాధారణంగా కనిపిస్తున్న అసాధారణ అద్వితీయవ్యక్తి! మొత్తం ప్రపంచంచేత 'మహాత్ముడి'గా కొనియాడబడ్తున్న వ్యక్తి అపర దైవస్వరూపుడు.    
    చిరునవ్వుతో రమ్మని తలూపాడు. ప్రక్కనే కస్తూరిబా, కాస్త దూరంలో మీరాబెన్ కూర్చుని కనిపించారు.    
    శ్రీహరిరావుగారు వెళ్తూనే వంగి అయన పాదాలంటి నమస్కారం చేశారు. మిగిలినవాళ్ళు కూడా ఆయన్ని అనుసరించి అదే పని చేశారు.    
    పావని మహాత్ముడి పాదాలమీద పడవెయ్యాలని రమణమ్మ ప్రయత్నించింది. అది ఒప్పుకోలేదు!    
    అప్పుడు మహాత్ముడు నవ్వుతూ ఈ విధంగా పలికారు. "ఊర్కో వమ్మా! పసిపిల్లలు దైవంతో సమానం. వాళ్ళ నమస్కారాలందుకునే అర్హత మానవులకి లేదు" అని.    
    ఆ పలుకులు అమృతప్రాయాలు!
    ఆ చూపులు కరుణాసముద్రాలు!
    అందుకే ఆయన జాతిపిత!    
                                          *    *    *    *    
    లక్నోనుండి కాశీ, ప్రయాగా, గయా మొదలగు యాత్రలు చేసుకుని శ్రీహరిరావు సతీసమేతంగా ఆరునెలల అనంతరం రాజమండ్రి చేరారు. అక్కడినుండి నెమ్మదిగా రమణమ్మ తన పుట్టిల్లు రామచంద్రాపురం చేరింది. కూతుర్నీ, మనవరాల్నీ చూసుకున్న సీతమ్మా, రామ్మూర్తి గార్ల ఆనందానికి అంతేలేదు.    
    1936 చివర్లో శ్రీహరిరావు 'కరాచీ' వెళ్ళారు. అక్కడ "జౌండ్" రాజా ఆహ్వానంమీద ఆయనతో కలిసి "ఈజిప్టు" వెళ్ళారు. అక్కడ కైరోలో "హ్యూమన్ ఇవల్యూషన్" మీద పబ్లిక్ లెక్చర్లిస్తూ ఎనిమిది నెలలున్నారు.    
    1937 జూలైలో రెండో పిల్ల....శ్రీదేవి పుట్టింది.    
    1939లో ఉరవకొండలో హరిజన హాస్టల్ నిర్మించాలనే ఉద్దేశంతో కుటుంబంతో సహా మకాం ఉరవకొండకి మార్చాడు శ్రీహరిరావు.    
    అక్కడ వారి పక్కింట్లో నారాయణాచారి అనే గృహస్తు వుండేవాడు. అతని మరదలు శారద అనే తల్లీదండ్రీలేని పిల్ల కూడా వారింట్లోనే వుండేది. నారాయణాచారి తల్లి మహాగయ్యాళి మేనకోడల్ని రాచిరంపాన పెడ్తుండేది. నారాయణాచారికి శారద ఈడుదే ఒక కూతురుండేది. శారద ఇంటెడు పనిచేస్తూ, మేనత్త చేతిలో రోజూ తిట్లు, దెబ్బలు తినడం రమణమ్మ గమనిస్తూ వుండేది. ఎప్పుడైనా రమణమ్మని చూసినప్పుడు "పనయిందా అత్తా!" అంటూ కిలకిలా నవ్వుతూ పలకరించేదా పిల్ల. ఆమెని చూసినప్పుడల్లా రమణమ్మకి "పుత్తడిబొమ్మ పూర్ణమ్మ కధ" గుర్తుకు వచ్చేది.    
    ఓనాడు రమణమ్మ పని పూర్తిజేసుకుని, గుమ్మంలో నిలబడి భర్త కోసం ఎదురుచూస్తుండగా, పక్కింట్లోంచి శారద ఏడుపూ, మేనత్త అరుపులూ వినిపించసాగాయి. మధ్య మధ్యలో శారద గట్టిగా, "నేను అంబారాయుడి బావి"లో పడి చచ్చిపోతాను అనడం కూడా వినిపించింది. ఏమయిందో పిచ్చిపిల్లకి! చచ్చిపోతానంటుందేమిటీ! అని ఆదుర్దా పడసాగిందామె.

 Previous Page Next Page