"ఒక చిన్న సంఘటన- ఆ రాత్రి జరిగింది. ఆయన్ని పూర్తిగా మార్చేసింది" అంది జయ నవ్వటానికి ప్రయత్నిస్తూ, "ఆయన ప్రేమలో పడ్డారు."
రాధ నవ్వలేదు.
ప్రేమ.... ప్రేమ....
జయ అంటూంది- "ఆయన నన్ను పెళ్ళి చేసుకుంటారట" చాలా క్యాజువల్ గా అనటానికి ప్రయత్నం చేసింది గానీ, ఆ కంఠంలో జీర ఆమెకి విచిత్రంగా కనబడింది.
"నీ గురించి అంతా తెలిసీ- చేసుకొంటారు అన్న పక్షంలో...." రాధ నెమ్మదిగా అంది.... "చేసుకోరాదూ"
జయ విస్మయంగా చూసి, "స్పృహలో వుండే మాట్లాడుతున్నావా! ఒకరోజు - అదీ ఒకరాత్రి పరిచయంతో అతణ్ణి చేసుకోమంటావా?"
"అంటే చాలా రోజులు - చాలా రాత్రులు పరిచయంతో గానీ చేసుకోకూడదా" అని, ఆమెని బాధ పెట్టానేమోనని, చప్పున జయ మొహంవైపు చూసింది. అయితే జయ దాన్ని పట్టించుకోకుండా తన సహజ ధోరణిలో "నాకీ ప్రేమలమీద నమ్మకం లేదు" అంది.
చాలారోజుల తర్వాత రాధ మనస్పూర్తిగా నవ్వింది. "భలే చిత్రమైన మనస్తత్వాలు మనవి. ప్రేమకి ముఖ్యం పెళ్ళి అని నేనూ.... అసలు ప్రేమ అనేది లేదని నువ్వూ.... ఒక స్పర్శకారణంగా నిన్ను ప్రేమిస్తూన్న సారధిగారూ.... పెళ్లికిముందే స్పర్శా స్నేహమూ కావాలనుకొనే కృష్ణా.... మొత్తం ప్రపంచం అంతా మన నలుగురిలోనే కనబడ్తోంది నాకు. అయితే చిక్కేమిటంటే ఒక్క స్పర్శకోసం పెళ్ళి పేరిట కృష్ణ నన్ను మోసం చేసేడు. ఒక్క స్పర్శతో పెళ్ళి చేసుకుంటానని సారధిగారు అంటున్నారు. అనుకుంటే నైతిక విలువలకి అంత విలువుంటుంది. లేకపోతే అసలుండదు."
"నా కనుమానం వస్తూ వుంటుంది."
"ఏమని?"
"ప్రేమ ప్రసక్తి లేకుండా కృష్ణుణ్ణి ప్రేమించిన రాధ మంచిదా? పెళ్ళి ప్రసక్తిలేకుండా కర్ణుణ్ని కన్న కుంతి మంచిదా?"
రాధ తలతిప్పి స్నేహితురాలివైపు చూస్తూ "నేను మాటల్తో నిన్నేమీ బాధపెట్టలేదు కదా" అంది.
జయ నవ్వి "వెధవ మనసు. రాటుదేలిపోయింది. అంత తొందరగా బాధపడలేదులే-" అంది.
ఇద్దరూ అనౌన్సర్ రూమ్ చేరుకొన్నారు.
మనిషి మెదడులో నరాల్లా వైర్లు, రహస్యాల్ని దాచుకున్న అరల్లా కంపార్ట్ మెంట్లు, ఒకదానికీ ఒకదానికీ సంబంధం లేకుండా మనసులోలా వేర్వేరు పొరలు... స్టూడియో రికార్డింగ్ రూమ్, మనిషి అనుభవపు పుస్తకంలా వుంది.
జయ మధ్య కుర్చీలో కూర్చొంది. సరిగ్గా టైమ్ అవగానే "ఆకాశవాణి.... కేంద్రం. శ్రోతలు కోరిన పాటలు- మొదట...." అని ఛానెల్ ఓపెన్ చేసి చెప్పింది. లైవ్ ఛానెల్ ఆఫ్ చేసి, రికార్డు ఆన్ చేయగానే నెమ్మదిగా మ్యూజిక్ ప్రారంభమయింది. కొంచెం అవగానే, ఆ వాల్యూమ్ తగ్గించి, లైవ్ ఛానెల్ ఆన్ చేసి, "కుడిఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్" అని మళ్ళీ లైవ్ ఛానెల్ ఆఫ్ చేసి, రికార్డు లెవెల్ సరిచూసుకొని, రాధవైపు తిరిగి, "ఊఁ- చెప్పు కబుర్లు" అంది.
అప్పటివరకూ ఆమె చేస్తున్నదంతా చూస్తున్న రాధ అంది- "ఇన్నాళ్ళనుంచీ చూస్తున్నా, ఇంత తేలికగా మిషన్లని ఆపరేట్ చేయటం నాకు ఎప్పుడూ చిత్రంగానే వుంటుంది సుమా-"
జయ నవ్వింది. "అలవాటైతే నీకూ మామూలుగానే వుంటుంది. నేనైతే చేరిన కొత్తలో "ఆకాశవాణి' అనేది కూడా వ్రాసుకొనేదాన్ని."
మొదటి పాట అవగానే రెండోపాట- సీతారామా కళ్యాణంలోది ప్రారంభమయింది.
రాధ అడిగింది. "ఏమిటి ఈ రోజు అన్నీ ఘంటసాలవే వేస్తున్నావ్" అని. ఆల్ ఇండియా రేడియోలో ఒక రూలు వుంది. ఒక సినిమాలోవి గానీ, ఒక గాయకుడివి గానీ ఒకేరోజు సాధారణంగా ఒకటికన్నా ఎక్కువ వేయకూడదని. ఐతే ఒకే గాయకుడు ప్రస్తుతం రాజ్యమేలుతున్న సమయంలో ఆ రూలుకి ప్రాముఖ్యత ఇవ్వటం కష్టం. అలాగే సి.బి.సి.లో ఒక సినిమా తాలూకు ప్రకటన తర్వాత ఆ సినిమాలో పాట వెయ్యకూడదని కూడా రూలు. దీన్ని పట్టించుకోరు.
"దీంట్లో ఏమైనా అర్ధం వుందా?" అన్న మాటలకి రాధ ఉలిక్కిపడి ఏమిటి?" అంది.
పాట వింటూ జయ - "రాజవీధులు గుండా స్వయంవరానికి వస్తూన్న రాముణ్ణి రాజమందిరం మీదనుంచి చూసిన సీత మొదటిచూపుతోనే మోహించి, సిగ్గుతో లోపలికి పరుగెత్తిందట. ఒకవేళ రావణుడు విల్లు ఎత్తి ఆమెని పెళ్ళాడి వుంటే ఏమయి వుండేదో? మానసిక వ్యభిచారం మన రోజుల్లోనే కాదు. ఆ రోజుల్లో కూడా వుండేదన్నమాట" నవ్వింది.
ఇలాటి వాదనని కలలో కూడా వూహించని రాధ బిత్తర పోయి, అంతలో జయ మనస్తత్వం తెలిసినదవ్వటం వల్ల మాట మార్చటం కోసం, తలతిప్పి అద్దాల్లోంచి పక్కరూమ్ లోకి చూస్తూ, అక్కడ భ్రమరాంబగారు వుండటం చూసి, "ఏమిటీరోజు ఈమె నటుల్ని చంపుతోంది" అంది.
"ఆమె అనుకున్న ఎఫెక్టు వచ్చేవరకూ వదలదు" అని జయ రాధవైపు తిరిగి, "క్రితం కన్నా మన ప్రోగ్రాముల స్టాండర్డ్ పెరగలేదూ" అని అడిగింది.
"అంటే?"
"ఒక అయిదారు సంవత్సరాల క్రితం కన్నా ఇప్పటి నాటకాలూ, మిగతా ప్రోగ్రాంలూ తీసుకుంటే అప్పటికన్నా ఎంతో మెరుగ్గా వున్నాయి. ఆలోచించి చూడు. అప్పుడు ఆ కాలంలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ లుగా అంతా ముసలివాళ్ళు వుండేవారు. ఒక సర్కిల్ వుండేది. ఆ రచయితలు- ఆ నటులూ- ఆ స్నేహితులూ. అంతే. ఇప్పుడలా కాదు. ముఖ్యంగా యువకులు ప్రెక్స్ అయ్యాక చాలా మార్పు వచ్చింది. చాలా మంచి మార్పు."
"అలా ఎందుకనుకోవాలి? దూరదర్శన్ వచ్చాక- దాంతో పోల్చుకొని రేడియో బాగుపడింది అనుకోవచ్చుగా-"
"దూరదర్శనా- అది ఈ జన్మలో బాగుపడుతుందని నేను అనుకోను. అక్కడ ఎవరికీ దానిమీద ఇంటరెస్టు లేదు. సగం మందికి పనికన్నా మిగతా విషయాలమీదే ఆసక్తి ఎక్కువ. మిగతా సగంమందీ పని చేద్దామన్నా వాళ్ళు చెయ్యనివ్వరు. నువ్వు గమనించావో లేదో- పేరున్న వాళ్ళ రచనలు ఏవీ అందులో కనిపించవు. కారణం తెలుసా-? ఒకప్పటి రేడియోలా ఇప్పుడు అది క్లోజ్డ్ సర్క్యూట్. వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళకే ప్రాముఖ్యత యిస్తుంది".
రాధ ఏదో అనబోతూంటే- బల్లకింద ఏదో చిన్న చప్పుడు వినిపించింది. ఆమె తలవంచి చూస్తే రెండు వైర్లు కలిసేచోట చిన్న మంట కనిపించింది. ఆమె పర్యవసానాలు ఆలోచించకుండా వైర్లు పట్టుకొని లాగింది. 220 వోల్టుల కరెంటు షాక్. కొట్టి ఆమె కెవ్వున అరచి పడిపోయింది.
ఆమెకి తిరిగి స్పృహ వచ్చేసరికి- దాదాపు స్టాఫ్ అంతా అక్కడ వున్నారు. ఆమె సిగ్గుతో - చప్పున లేవబోయింది.
"లేవకు, ఎలా వుంది ఇప్పుడు" అసిస్టెంట్ డైరెక్టర్ అడుగుతున్నాడు.
"ఐ యామ్ ఆల్ రైట్ సర్!"
ఎవరో అనుకొంటున్నారు- "ఇంతవరకూ ఎప్పుడూ ఇలా జరగలేదు రేడియో స్టేషన్ లో షాక్ కొట్టటం-"
"....వైర కనెక్షన్ లూజ్ గా వుండి వుంటుంది".
వాళ్ళ ముందు తనో చర్చనీయాంశంగా వుండటం ఇష్టంలేక ఆమె ఓపిక తెచ్చుకొని, లేచి వెళ్ళొస్తానని అసిస్టెంట్ డైరెక్టర్ కి చెప్పి రిక్షాలో ఇంటికొచ్చేసింది.
ఆ సాయంత్రం టి.యస్. ఆమె ఇంటికొచ్చినప్పుడు ఈ విషయం చెప్పింది రాధ.
టి.యస్. నవ్వి, "రెండు వందలా ఇరవై ఓల్టులు కాదు. అంతకన్నా ఎక్కువే అయివుంటుంది" అన్నాడు. "రేడియో స్టేషన్ లోది అంత తక్కువ కరెంట్ అయివుండదు".
ఆమె మాట్లాడలేదు.
తనలో తనే ఆలోచించుకొంటున్నట్టూ "ఇంత షాకేగానీ మొగవాడికి కొట్టిందనుకో.... ఏమవుతుంది?" అన్నాడు.
"ఏమవుతుంది?" అర్ధంకానట్టు రాధ అడిగింది.
"పెనిస్తో ఫెన్సిన్" అన్నాడు. "ఎక్కడో చదివేను. షాక్ శరీరంగుండా ఎర్తయి, సుఖానికి పనికిరాడు అందులో ఒకడు.... పేరు సరిగ్గా జ్ఞాపకం లేదు ఎక్కడో చదివేనో. జబ్బు పేరుకూడా సరిగ్గా గుర్తులేదు. ఐతేనేం? ఎలాగూ డాక్టర్ ని నేనే కాబట్టి జబ్బు పేరు చెప్పేది నేను కదా, రోగి మాత్రం కృష్ణ."
"ఏమిటి?" అర్ధంకాక అడిగింది రాధ.
"ఆ షాక్ కృష్ణకి తగిలిందనుకో. మరి పనికి రాకుండా పోతాడు కుర్రవేషాలకి. జీవితమంటే అమ్మాయిలతో తిరగటం ఒక్కటే కాదనీ, ఇంకా చాలా వుందనీ తెలుస్తుందప్పుడు. రెస్పాన్సుబులిటీ తెలుస్తుంది. తోడు ఒకటి కావాలనిపిస్తుంది. తండ్రి అవ్వాలనే తపన ఎక్కువవుతుంది. ఇప్పుడు నాల్గోనెల కదా నీకు-"
రాధ కెవ్వున అరిచింది.
"అనుకో అమ్మా, ఏం ఫర్లేదు. అతడు చూస్తూ వుండగా వేవిళ్ళు నటించు, చాలు. అతడు పనిచేసేచోట వైరు వేలాదదీయటం, మరీ ప్రాణాపాయం లేకుండా చూడటం నాకు వదిలి పెట్టు. అతడు స్పృహలో కొచ్చేసరికి మా నర్సింగ్ హోమ్ లో వుంటాడు. అ ఆ ఇ ఈ సంఘం అమ్మాయి లిద్దరు నర్స్ వేషాల్లో వుంటారు. నేనెలాగూ డాక్టర్ని. ఏం?.... రిజిస్ట్రార్ ఆఫీసు అతడు సృష్టించగా లేనిది- ఆ మాత్రం నర్సింగ్ హోమ్ మనం తయారు చేయలేమా? ఒకవైపు నీకు నాల్గోనెల, ఇంకోవైపు తనెలాగూ తండ్రి కాలేడు. కాబట్టి నిన్ను చచ్చినట్టు స్వీకరిస్తాడు. ఎలా వుంది ప్లాను? ఏం? నేను చెప్పినట్టు చేస్తావా?"
రాధ తటపటాయించి తలూపింది.
........
సాయంత్రం ఆరయింది.
రేడియో స్టేషన్ దాదాపు నిర్మానుష్యంగా వుంది. స్టూడియోలో పని వున్నవాళ్ళు మాత్రం వున్నారు. 'కావ్య శాకుంతలం' గొడవ జరిగిన తరువాత కృష్ణ జాగ్రత్తగా పనిచేస్తున్నాడు.
అయినా మనిషి డల్ గానే వుంటున్నాడు.
ఆ రోజు తాలూకు డ్రామాలో ఎఫెక్ట్ చూసుకొని మిగతా కేంద్రాలకి పంపాలి. రికార్డ్ రూమ్ లోకి వెళ్ళి తలుపు దగ్గరగా వేసి, రికార్డర్ మీద టేప్, ఎఫెక్ట్స్ టేప్ పెట్టుకున్నాడు.
నాటకం వింటూ, మధ్యలో వీణ ఎఫెక్ట్ కావాల్సి వచ్చి రీవైండ్ స్విచ్ నొక్కాడు. టేప్ వెనక్కి తిరగలేదు. రెండు మూడుసార్లు పరీక్షించి చూశాడు. ప్రయోజనం లేకపోయింది. పక్కకి తిరిగి చూశాడు. అద్దానికి అటువేపు గదిలో రాధ ఏదో వింటూండి. అతడు చూడగానే తలతిప్పి తన పని తను చూసుకోసాగింది.