Previous Page Next Page 
రాధ-కుంతి పేజి 17


    అతడి రక్తం వడివడిగా ప్రవహించసాగింది. ఎవరూ లేని సమయంలో యింకా ఆమె ఒక్కతే వున్నది. వెళ్ళి మాట్లాడదామనుకున్నాడు. కానీ ఏం మాట్లాడతాడు?.... తల విదిలించి అతడు మళ్ళీ తన పనివేపు దృష్టి సారించాడు.
    రివైండ్ ఎందుకు పని చెయ్యటం లేదని వైర్లు పరీక్షగా చూశాడు. రెండువైర్లు తెగిపోయి వున్నాయి. వాటిని ముత్తుకోకుండా కుర్చీలోంచి లేచాడు. ఇంజనీరుతో చెప్పటం కోసం డోర్ నాబ్ మీద చెయ్యివేశాడు.
    అప్పుడు తగిలింది షాక్.
    ఒక క్షణం పాటూ అతడి కళ్ళు బైర్లు కమ్మినట్టయింది. ఒక వ్యక్తి అతడ్ని ఆసరాగా పట్టుకోవటం, చిన్న కర్చీఫ్ కృష్ణ మెడకింద వేసిన చెయ్యితో ముక్కు దగ్గిర పెట్టడం జరిగిపోయినయ్. రాధ పక్కగదిలోంచి వచ్చింది. ఇద్దరూ చెరోవైపు పట్టుకొని, నిద్రలో నడుస్తున్నట్టూ నడుస్తున్న కృష్ణని వెనుకవైపు నుంచి బయటికి తీసుకొచ్చారు.
    అప్పుడు దాదాపు ఏడు కావస్తూంది.
                   *    *    *
    "నేనెక్కడున్నాను?" కళ్ళు విప్పి అడిగాడు కృష్ణ.
    "అ ఆ నర్సింగ్ హోమ్ లో" వాష్ బేసిన్ దగ్గిర నర్సు వెనక్కి తిరగకుండా జవాబు చెప్పింది.
    "ఏమైంది నాకు....?"
    "డాక్టర్ గారొచ్చి చెప్తారు." అని ఆ వాష్ బేసిన్ దగ్గిర పనిపూర్తిచేసి వెనుదిరిగింది. ఆమె మెడ దగ్గిర రెండు బటన్స్ వూడివున్నాయి. అతడది చూస్తున్నాడని గమనించి, ఆమె చప్పున అటు తిరిగి సర్దుకోకుండా ఇటే వుండి తీరిగ్గా సర్దుకొంటూ, "కొంచెం సేపు పడుకో. డాక్టర్ గారు వస్తారు. పాలు తాగుతావా?" అనడిగింది.  
    ఈ ఏకవచన సంబోధనకి విస్తుబోయేడు. అసలు తనకేమయిందో అతడికి అర్ధంకాలేదు. "నేను ఇంటికిపోతాను...." చప్పున లేవబోతే, నర్స్ అతడి తలమీద చేయివేసి, "పడుకో బాబూ, నా తండ్రివి కదూ...." అంది.
    కృష్ణ తల తిరిగిపోయింది. నిశ్చయంగా ఈవిడకన్నా మతి పోయి వుండాలి. లేకపోతే తనకన్నా పోయి వుండాలి.
    "నా వయసెంతనుకుంటున్నారు మీరు" అనడిగాడు.
    ఆమె జాలిగా అతడివైపు చూసి, "వయసుతో ఏం పని బాబూ. నా ఆఖరి అబ్బాయి లాంటివాడివి, మరీ ఎగ్జెయిట్ అవకు. అసలే నరాలు దెబ్బతిని వున్నాయి...." అంది.
    "నరాలు దెబ్బతిని వున్నాయా...." అయోమయంగా అన్నాడు.
    "అందుకేగా బాబూ, ఇంత చనువు తీసుకొని మాట్లాడుతున్నాను" అంటూ దగ్గరకొచ్చి "పాలు తాగించనా" అంది.
    "నీ.... మీకు పెళ్ళయిందా?"
    "లేదే" అంది.
    పక్క గదిలో టి.యస్.... నవ్వీ నవ్వీ ఎర్రబడ్డ మొహాన్ని మామూలుగా మార్చుకోవటానికి ప్రయత్నిస్తూ, రాధతో.... "నేను లోపలికి వెళతాను. లేకపోతే మా రత్నం నీ మొగుడ్ని ఇంకా ఆట పట్టిస్తుంది" అన్నాడు. రాధ తలూపింది.
    "గుడ్ మార్నింగ్ డాక్టర్!" అంది నర్సు లోపలికి వస్తూన్న డాక్టర్ ని చూసి. టి.యస్. తలూపి, "హౌ ఆర్యూ మై బోయ్" అన్నాడు కృష్ణతో.
    "ముందిది చెప్పండి. అసలేమయింది నాకు!" అసహనంగా అడిగాడు.
    "చెప్తాను బాబూ తొందరపడకు".
    "నాకు తొందరగానే వుంది. చెప్పండి-" రెట్టించాడు.
    డాక్టర్ నర్స్ వైపు తిరిగి తలూపేడు. నర్స్ బయటికి వెళ్ళి పోయింది. "తనున్నా ఫర్లేదనుకో. కానీ ఆడవాళ్ళ నోట్లో నువ్వుగింజ నానదని నా ఉద్దేశ్యం. ఇప్పుడు యీ విషయం తనకి తెలిసి బయటికి పాకిందంటే రేపు సమాజంలో నీ గౌరవం ఏం కాను? అయినా ఆవిడకి తెలుసునని నా అనుమానం."
    తలదిండు మీద కృష్ణ చేతివేళ్ళు బిగుసుకున్నాయి. "అసలేమయింది నాకు.... అది చెప్తారా?" అని దాదాపు అరిచాడు.  
    "పెనిస్తో బ్లాస్టోసిన్...." అన్నాడు తాపీగా టి.యస్.
    "అంటే...."
    "డాక్టర్నై వుండీ యీ విషయం చెప్పటానికి నాకు నోరు రావటం లేదు. అయినా చెప్పక తప్పటంలేదు. బలమైన షాక్ అవయవాల గుండా ఎర్త్ అవటంవల్ల నీ నరాలు కొన్ని చచ్చుబడి పోయాయి బాబూ! ఇకనుంచీ అమ్మాయిలందరూ నీ చెల్లెళ్ళు, కొంచెం పెద్దవాళ్ళందరూ నీ అమ్మలు" అని బయటికి వెళ్ళిపోయాడు.
    నర్సు లోపలికొచ్చి "బాబూ, కొంచెం బ్రెడ్ తింటావా నాయనా" అంది కన్నతల్లిలా. కృష్ణ మాట్లాడలేదు. అప్పటికే అతను తలదిండులో మొహం దాచుకున్నాడు. ఆలోచిస్తున్నాడో.... ఏడుస్తున్నాడో తెలీదు.
    బయట రాధ టి.యస్.ని అడిగింది. "ఏమిటీ దీనివల్ల లాభం? ఒకటి రెండు రోజుల్లో నిజం తెలిసిపోతుందిగా...."
    టి.యస్. తల అడ్డంగా వూపుతూ, "తెలీదు. మానసికంగా నా మాటలు అతడిమీద తాత్కాలికంగానైనా ప్రభావితం చూపిస్తాయి. ఆమాత్రం టైమ్ చాలు మనకి- అతడికి మార్చటానికి-"
    రాధ కన్విన్స్ అవనట్టు అతడివేపు చూసింది.
    "నాటకంలో ఇక నీదే రంగప్రవేశం. వెళ్ళు లోపలికి. నీ పోర్షన్ తెలుసుగా- తనకి షాక్ కొట్టడం వల్ల కేవలం మానవతా వాదంతో నువ్వు ఇక్కడికి తెచ్చావు. ఇప్పుడిక అతడి విషయం అతడు తెల్సుకోగలడు కాబట్టి నువ్వు వెళ్లిపోతున్నావు. అది నువ్వు అతడికి చెపుతూండగా నీ కడుపులో తిప్పింది. వేవిళ్ళు. అయినా నీలో మార్పు లేదు. 'వెళ్ళొస్తాను కృష్ణగారూ, తొందర్లో మీ ఆరోగ్యం బాగుపడాలి అని నేను కోరుకొంటున్నాను, అన్నావు. మొహంలో ఏ ఫీలింగూ లేదు- కానీ కళ్ళల్లో చిప్పిల్లే నీళ్ళని అతడు చూసేటట్లు దాచుకున్నావు. మొహం తిప్పుకొని లేచి గుమ్మం దాటబోతూంటే వెనుకనుంచి "రాధా, నన్ను క్షమించు...." అంటాడు కృష్ణ. అని తీరాలి. నూటికి తొంభైతొమ్మిది వంతులు అని తీరాలి. దాంతో కథ సుఖాంతం. వెళ్ళు రాధమ్మ తల్లీ. నీ పాత్రని జాగ్రత్తగా పోషించు."
    రాధ తలూపింది.
    అదే సమయానికి కృష్ణ ఆస్పత్రి బెడ్ మీద పడుకొని వున్నాడు.
    అతడికి ఏమీ అర్ధంకావటంలేదు.
    తను ఇక దేనికీ పనికిరాడా....
    అసలా ఆలోచనే ఎంతో భయంకరంగా వుంది అతనికి.
    ఏమవుతుంది ఇప్పుడు?....
    తన పాత ఆడ స్నేహితులందరూ ఏమవుతారు?
    ఆ హుషారు - ఆ జీవితం ఇక వుండవా?
    అతడిని ఒక్కసారిగా నిరాశ ఆవరించింది. అతడికి 'నా' అంటూ ఎవరూ లేరు. ఐతే, వయసూ, డబ్బూ ఆ లోటుని ఇంతకాలమూ కప్పి పుచ్చినయ్. ఇప్పుడీ విషయం బైటపడితే-?
    స్నేహం విలువ అప్పుడు తెలుస్తూంది అతడికి. ఐతే ఇది పురుషుడికీ పురుషుడికీ మధ్య వుండే స్నేహం కాదు. పురుషుడికి స్త్రీ నుంచి లభించే ఆత్మీయతా, ఓర్పూ, లాలనతో కూడిన ఆప్యాయకరమైన స్నేహం. అదే....
    - ప్రేమ.
    స్నేహం కన్నా పెద్దదైనది-
    సెక్స్ కన్నా ఉధృతమైనదీ-
    అది కావాలి తనకిప్పుడు.
    తన లోటుపాట్లని సహించి- తన చెడుని ఓర్మితో భరించి- తనని తానుగా స్వీకరించగలిగే ఓ అమ్మాయి-
    అతడికి రాధ వ్రాసిన గేయం జ్ఞాపకం వచ్చింది. ప్రేమంటే....
    "మనసు దోసిలిపట్టి మనుగడే హారతీ.....
    ఈపాటి దానికి భాష్యాలు దేనికీ-"

    తను తేలిగ్గా తీసుకున్న గేయం.
    ఎంత ముగ్ధంగా - చిన్నచిన్న పదాల్లో ఎంత పెద్ద భావాన్ని ఇమిడ్చి చెప్పిందీ.
    అతను చప్పున చెక్కిలి తడుపుకొన్నాడు. ఒక నీటి చుక్క కంటినుంచి క్రిందికి జారుతూంది.
    అంతలో గుమ్మం దగ్గిర అలికిడి అయింది. తల తిప్పి చూసి నిశ్చేష్టుడైపోయాడు.
    గుమ్మం దగ్గిర రాధ.....
    అతడు మోచేతిమీద లేవబోయి, మళ్ళీ నీరసంతో వెనక్కి వాలి, ఆమెనే చూడసాగేడు. ఆమెకూడా ఒక క్షణం గుమ్మం దగ్గిర్నుంచి కదల్లేదు. ఇద్దరి చూపులు క్షణంపాటూ కలుసుకున్నాయి. ఆ గదిలో గాఢమైన నిశ్శబ్దం తాండవించింది.
    ఆమె నెమ్మదిగా పెదవులు కదిల్చి ఏదో చెప్పబోయింది.
    చెప్పబోతూంటే కడుపులో తిప్పింది.
                                            *    *    *
    "ఏం తల్లీ- లోపల ఏం జరిగింది" ఆతృతగా అడిగేడు బయటకొచ్చిన రాధని టి.యస్.
    రాధ మాట్లాడలేదు.
    "క్షమించూ అని వేడుకున్నాడా? నిన్నేలుకుంటానూ అని వప్పుకొన్నాడా?"
    ఆమె దానికి జవాబు ఇవ్వలేదు.
    ఇంతలో లోపల్నుంచి నర్సు పరుగెత్తుకొచ్చింది.
    "ఏమైంది?" అడిగాడు.
    కృష్ణ వెళ్లిపోయాడు" అంది రొప్పుతూ.
    "వెళ్లిపోయాడా?"
    "మరి అంత ఓపిక ఎలా వచ్చిందో తెలీదు. ఒక్కసారిగా పక్కమీద నుంచి లేచి వెళ్లిపోయాడు. ఏం చెప్తున్నా వినిపించుకోలేదు."
    టి.యస్. అయోమయంగా రాధవైపు చూశాడు.
    రాధ నెమ్మదిగా అంది- "నేను అంతా చెప్పేశాను. ఈ నాటకం - అతడికి అబద్దపు షాక్ కొట్టటం- అన్నీ చెప్పేశాను. నేనీ నాటకం ఆడలేను. నన్ను క్షమించండి." 

 Previous Page Next Page