ఆమె అలా చెయ్యదని తనను తాను నమ్మించుకొని మళ్ళీ మామూలు దినచర్యలో మునిగిపోయాడు. కానీ పనిలో ఏకాగ్రత తక్కువైంది. రెండు మూడు రోజుల్లోనే అది ఋజువైంది.
రేడియో స్టేషన్ లో భ్రమరాంబగారు ఒక ప్రొడ్యూసర్. ఆమె అంటే అందరికీ హడలు. ఆమె క్రమశిక్షణకు మారుపేరని ప్రతీతి. దాదాపు పదిహేను సంవత్సరాలనుండి ఆమె పనిచేస్తూంది. శ్రోతల్లో కూడా ఆమె పాల్గొన్న నాటకాలంటే అభిమానం వుంది. 'కావ్యశాకుంతలం' అనే గేయనాటకాన్ని ఆమె రూపొందించింది. అది ప్రసారమవగానే ఆంధ్రదేశపు నలుమూలలనుంచి అభినందనల పరంపర మొదలయింది. దాదాపు ఏ నాటకానికీ రానంత మంచిపేరు దానికి వచ్చింది. ఇది జరిగిన మూడు నెలలకి ఆమె ఆగస్టు పదిహేను మిలటరీ కవాతుల్ని (రిహార్సిల్స్) కవర్ చేయవల్సి వచ్చింది. రేడియో స్టేషన్ తరపున కృష్ణ వెళ్ళాడు.
ఆగస్టు పదహారో తారీఖు మధ్యాహ్నం మూడింటికి రెండోసారి 'కావ్యశాకుంతలం' పునఃప్రసారం చేయబడుతుందని శనివారం రేడియోలో అనౌన్స్ చేయబడింది. ఆదివారం ప్రొద్దున న్యూస్ అవగానే శ్రోతలకి మళ్లీ రెండోసారి ఆ విషయం గుర్తు చేయబడింది. అసలే మంచి నాటకం అవటంచేత, గేయనాటిక కావటంవల్లా, అందులోనూ భ్రమరాంబగారి ఆధ్వర్యంలో రూపొందించబడిందని తెలియడంవల్లా, చాలామంది శ్రోతలు దాని గురించి వేచి చూడసాగారు.
భ్రమరాంబగారు ఆ నాటకాన్ని తన జీవితంలో ఒక గొప్ప కళాఖండంగా భావించారు. నిజంగా అది అంత గొప్ప నాటకమే కూడా. ఆ రోజు ఆమె తనింటికి నలుగురైదుగురు స్నేహితుల్ని ఆహ్వానించింది. వాళ్ళందరూ పెద్ద పెద్ద పదవులలో వున్నవాళ్ళు. అసలు రేడియో వినటానికి కూడా తీరిక లేనివాళ్ళు. కనీసం ఈ విధంగానైనా తన వర్క్ వాళ్ళకి చూపిద్దామని ఆమె ఉద్దేశ్యం. వాళ్ళూ ఆమె అభిప్రాయాన్ని ఆమోదించారు.
సరిగ్గా మూడయింది.
అందరూ ఆసీనులై సేవిస్తున్నారు. సరిగ్గా మూడు గంటలా ఐదు సెకన్లకి- "ఆకాశవాణి-" కృష్ణ కంఠం మెటాలిక్ వాయిస్ ఖంగున వినిపించింది. 'హైదరాబాద్ - విజయవాడ- కడప- నిజామాబాద్ కేంద్రాల్నుంచి ఒకేసారి ప్రసారం- కావ్యనాటకం -రచన - నిర్వహణ - శ్రీమతి - భ్రమరాంబ...." కళ్యాణిలో వీణానాదపు ఆలాపన మొదలైంది.
నిజమయిన రచయితకీ, కళాకారుడికీ తన రచన రేడియోలో వినటం, స్టేజీమీద చూడటం చాలా గొప్ప అనుభూతి. అది అనుభవిస్తేగాని తెలీదు. ఒకసారి కాదు- ఎన్నిసార్లయినా ఆ అనుభూతి కొత్తగానే వుంటుంది. పరిసరాలు మర్చిపోయి భ్రమరాంబ నాటకం వినటంలో లీనమైపోయింది. దుష్యంతుడు శకుంతలని వర్ణిస్తున్నాడు-
"అది తనువా సుధకై అమరుల పనికై
ఆ సుమశరుడెత్తిన ధనువా" అని.
"ఆహా" అన్నారెవరో. అంతా ముగ్ధులై వింటున్నారు.
శకుంతల అంటున్నది- "భ్రమర మది నా చెవి జేరి రొదజేయుచున్నది- మది నెవరో అపరిచితుని చూపు".... కోమలమైన శకుంతల గొంతున నొక్కిపెట్టి "లెఫ్ట్.... రైట్.... భాయ్ సే..... ధామ్" అని భయంకరమైన గొంతు మధ్యలో" మిలటరీ కవాతు ప్రారంభించింది. ఆ తరువాత దుష్యంతుడు. "చెలీ, సౌఖ్యమేగా?" అన్నాడు. మిలట్రీవాడు "ఆగే.... ఛల్.... తేజ్ సే" అన్నాడు. ఆ తరువాత సంభాషణ ఇలా జరిగింది. "ప్రభూ ఆసీనులు కండు. మా గృహమున ఉచితాసనము లేవు.... లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్ దైన్.... ముడ్....ఏక్.... ఏక్....దో.... మీ చెలికి నోటమాట రాకున్నట్టుంది - లేక పలికిన నవరత్నములు రాలునని భయమా?- సావ్ ధాన్.... విష్.... రామ్.... ఖదమ్ తాల్...." ఆ తర్వాత డోలు శబ్దం వినిపించసాగింది. దానిమీద జాతీయగీతం మొదలయింది.
అందరూ తల తిప్పి భ్రమరాంబ వైపు చూశారు. అప్పటికి ఆమె మొహం రోషంతో ఎర్రగా కందిపోయింది. చప్పున కుర్చీలోంచి లేచి నిలబడింది.
1970 నాటికే- దేశంలో మొత్తం ఒక కోటీ అరవై లక్షల రేడియోలున్నాయని అంచనా. అందులో దాదాపు ఎనిమిది లక్షల రేడియోలు ఆంధ్రదేశంలో వున్నాయి. ఈ సమయానికి యాభై శాతం ట్యూన్ చేయబడి వుంటాయనుకొంటే నాలుగులక్షలు. రేడియోకి సగటున నలుగురు శ్రోతలు వింటున్నారూ అనుకొంటే దాదాపు 32 లక్షల మంది శ్రోతలు శకుంతలా దుష్యంతుల మిలట్రీ కవాతు ప్రదర్శనల్ని విన్నారు. డ్యూటీ రూమ్ లో కూర్చొని నవల చదువుకుంటున్న ఆఫీసర్ ఈ ప్రపంచంలోకి వచ్చి, చప్పున ఆఫ్ చేసి శ్రోతలు పొందుతున్న ఆనందానికి అంతరాయం కలిగించకపోతే యింకా వినేవారే.
మరుసటిరోజు భ్రమరాంబగారు కృష్ణని ఎంత తలవాచేటట్టు చీవాట్లు పెట్టిందంటే, మెమో ఇవ్వవలసిన పార్థసారధే వచ్చి ఆమెను చల్లబరచవలసి వచ్చింది. అసలే బి.పి. పేషెంట్ ఏమో- ఆ ఆవేశంలో అరుస్తూ అరుస్తూ అలాగే కుర్చీలో విరుచుకు పడిపోయింది. తన ప్రోగ్రామ్ ని ఎంత ప్రాణప్రదంగా ఆమె చూసుకుంటుందో అందరికీ తెలుసు. అటువంటిది ఆమె టేప్ మీద కృష్ణ మిలటరీ కవాతు రిహార్సల్స్ రికార్డ్ చేశాడు. అది ఒక తప్పు. ఏదైనా టేపు రెండోసారి ప్రసారం చేయాలీ అంటే దాన్ని పూర్తిగా విని. ఓ.కే. చేసుకోవాలి. అలా చేయకపోవడం రెండో తప్పు.
భ్రమరాంబగారికి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. అంత సీరియస్ ఆవిడ. కృష్ణ చేతులు నలుముకుంటూ నిలబడి అందరూ తమ తమ సీట్లలోకి చేరుకున్నాక నెమ్మదిగా అక్కడి నుంచి కదిలేడు. కదిలి వెళ్ళబోతూ తలతిప్పి చూసి ఉలిక్కిపడ్డాడు.
ఆఫీసు కెప్పుడొచ్చిందో తెలియదుకానీ, ఒక బల్లదగ్గిర రాధ నిలబడి వుంది. జరిగినదంతా చూస్తున్నట్టుంది. ఆమెను అంత అకస్మాత్తుగా అక్కడ వూహించలేదతడు. అయితే అందుక్కాదు అతడు ఉలిక్కిపడింది ఆమె మెళ్ళో మంగళసూత్రం పైట మీదుగా స్పష్టంగా కనిపిస్తూంది అందుకు.
అతడు ఆమె దగ్గిరకు నడవబోయి ఆగేడు.
ఏమని వెళ్తాడు?
.... కానీ మళ్లీ అంతలోనే- వెళ్ళాలన్న కోర్కె బలంగా కలిగింది. అతడు తన ఆతృత పట్టలేకపోతున్నాడు. ఆమె తర్వాత ఏమైంది? వారంరోజులుగా ఎక్కడుంది? అన్న ప్రశ్నలు అతడిని వేధిస్తున్నాయి. అసలు అతడు వూహించినది వేరు. ఆమె తనని ఒంటరిగా కలుసుకుంటుందనీ ఏడుస్తుందనీ వేధిస్తుందనీ అనుకున్నాడు. దానికి ఎలా మొండిగా సమాధానం చెప్పాలో కూడా రిహార్సల్స్ వేసుకున్నాడు. ఇతే ఆమె మెరుపులా కనబడి, క్షణంలో వెయ్యవవంతులో మాయమవటం అతడికి షాక్ కొట్టినట్టు వుంది. అదీగాక తను చీవాట్లు తింటూ వుండగా ఆమెచూడటం.....
ఎంక్వయిరీ చేస్తే ఆమె ఆ రోజే ఆఫీసులో చేరినట్టు తెలిసింది.
ఆ సాయంత్రం తనని కలుసుకుంటుందేమోనని భయపడి గంట పర్మిషన్ పెట్టి వెళ్ళిపోయాడు. కానీ, అలా ఎన్ని రోజులు పెడ్తాడు? అలాగే మొదట్లో తన చుట్టూ ఇద్దరు ముగ్గురు వుండేలా చూసుకునేవాడు ఎప్పుడూ.
కానీ తొందరలోనే అతడికో విషయం అర్ధం అయింది.
రాధ తనని వంటరిగా కలుసుకోవటానికి ఏ మాత్రం ప్రయత్నం చెయ్యటం లేదు. అసలు తనవైపు చూడటానికి కూడా ప్రయత్నం చెయ్యటం లేదు.
* * *
కాలగర్భంలో మరో రెండు నెలలు గడిచినయ్.
రాధలో ఏ మార్పూ లేదు. మామూలుగా ఆఫీసుకి వస్తూంది. సాయంత్రం వెళ్లిపోతుంది. కృష్ణని పలుకరించదు.
కనీసం తలెత్తి కూడా చూడదు. ఐతే అతనంటే తిరస్కారం, ద్వేషం - అటువంటిదేమీ లేదు. ఒక అపరచితుడితో ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తోంది.
అదే అతడిని బాధ పెడుతోంది.
ఆమె తిట్టినా- కనీసం ద్వేషంతో తొలగిపోయినా బావుండేది. ఈ నిర్లిప్తతని భరించ'లేకపోతున్నాడు. పోనీ అంతా మర్చిపోదామా అనుకొంటే ఆమె మంగళసూత్రం కొట్టిచ్చినట్టు కనబడుతోంది. పెళ్ళి తాలూకు పార్టీకూడా ఇచ్చింది. భర్త సంగతే తెలియటం లేదు.
ఆమె మామూలుగా వుంటున్నకొద్దీ అతడికి 'ఆమె' జ్ఞాపకం వస్తూంది. ఆ రోజు రాత్రి తనలో ఐక్యమైపోయిన ఆమె, ఆమేనా ఈమె! ఈమెలో ఆమె వుందా? పాత చనువుని పురస్కరించుకొని అది తెలుసుకొందామని నెమ్మదిగా- చనువుగా పలుకరించబోయేడు. ఆమె నవ్వుతూనే జవాబు ఇవ్వకుండా అక్కడ్నుంచి తప్పుకొంది.
అయితే ఆమె లోపల ఎంత మధన పడుతూందో ఒక్క జయకే తెలుసు. జరిగినదంతా విని ఆమె ఆశ్చర్యపోయింది. దిగ్భ్రాంతితో అసలు నోట మాట రాలేదు. ఆవేశంతో పెదాలు అదురుతూ వుంటే- "కాలర్ పట్టుకొని నలుగురిలో నిలదీద్దామా" అంది. రాధ విషాదంగా నవ్వి "నాకేమీ తెలీదంటాడు. మనం ఏం చెయ్యగలం" అని తోసిపుచ్చింది.
"మనం ఏం చెయ్యలేమని వూరికే వుంటే ఇలాంటి అఘాయిత్యాలు కృష్ణలాంటి వాళ్లు ఇంకా ఎన్నైనా చేస్తారు. మనమే బుద్ధిచెప్పాలి."
"ఏమని? మన దగ్గిర ఋజువులు ఏం వున్నాయి. ఆ రిజిస్ట్రారు- ఆ నౌఖరు - అంతా అతనికి సంబంధించిన వాళ్ళే. అసలు నాదే తప్పు. అతడు మాయమాటలు చెప్పగానే బుట్టలో పడిపోవటం- "నవ్వింది మళ్ళీ.
"సరే- నువ్వు మోసపోయావు. అతని బుట్టలో పడ్డావు. కానీ వారం రోజుల్లోనూ అతనికి తెలియలేదా ప్రేమంటే ఏమిటో.... తనింతవరకూ చూసిన కాగితం పూలకీ నీకు వున్న తేడానే తెలియలేదా?" పైకి అన్నది జయ. మనసులో తరంగాల్లాటి ఆలోచన్లు....
వారంరోజులు భార్యాభర్తలుగా గడిపిన అతడిలో ప్రేమ అంకురించలేదంటే.... మరి ప్రేమ ఎలా పుట్టుకొస్తుంది? రాధ కన్నా ప్రేమించటానికి అర్హమైన వ్యక్తి ఎవరుంటారు? అప్పటివరకూ ఆమె చుతోతో తిరిగిన వ్యక్తి కేవలం ఆ మోజు తీరగానే వదిలేశాడంటే....
అంతా సెక్స్ తోనే మిళితమై వుందా?
అంతలో రాధ మాట మారుస్తూ "ఏమంటున్నారు సారధి గారు" అన్నది.
జయ సారధి దగ్గరికి వెళ్ళటం ఆమెకు తెలుసు. జయ ఎప్పుడూ రాధకి ఒక ప్రశ్నార్ధకమే.