"నేను ఫోన్ చేసినప్పుడల్లా వీడు భయపడుతున్నాడు. వీడి భయం పోగొట్టాలంటే మనింట్లో ఓ ఫోనుండాలి" అంది హాస.
"ఫోనుంటే మాత్రం భయమెలా పోతుంది?" అన్నాడు గిరిధర్.
"ఏముంది? నంబర్ డయల్ చేసి, రిసీవర్ తీసుకుని ఎన్ని మాట్లాడినా బాధ లేదు! అవతల మనిషి మాట్లాడుతున్నాడోలేదో తెలియకపోయినా ఫరవాలేదు. రిసీవరు లేకుండా మాట్లాడుతూంటే నీకు భయం....అంతేగా!" అంది హాస.
"అయినా మగపిల్లాడివి నీకింత భయం వుండకూడదురా...." అంది పార్వతమ్మ.
"ఇప్పుడింత భయపడుతున్నాడా? పాతికేళ్ళురానీ....అప్పుడు పెళ్ళిచూపుల కెళ్ళి చట్ట విరుద్దమని తెలిసి కూడా ధైర్యంగా లక్షరూపాయలు కట్నం కావాలంటాడు వీడే!"
హాస నవ్వుతుంటే, మా గిరికి లక్షేమిటి? అయిదు లక్షలిస్తానంటే తప్ప పిల్లను చూసుకుందుక్కూడా గుమ్మంతొక్కడు" అంది పార్వతమ్మ.
* * * *
"నమస్కారమండీ!" అన్నాడు గౌతమ్.
సుందర్రావతణ్ణి చూసి గుర్తుపట్టి, "ఏమిటీ యిలా వచ్చావ్....? ఆ కోదండపాణి గారు నిన్ను రాయబారానికి పంపేడా?" అన్నాడు.
"లేదుసార్! నేను మళ్ళీ వాళ్ళింటికి వెళ్ళలేదు. ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చాను" అన్నాడు గౌతమ్.
సుందర్రావు రహస్యాలేం దాచలేదు.
ప్రకాశరావుకి లక్షరూపాయలిస్తామని చాలామంది వచ్చారు. ఇక్కడ పిల్ల బాగుంది కదా అని యాభై వేలే కట్నమడిగారు. కోదండపాణి వాళ్ళతో నిష్కర్షగా "పిల్లకు అయిదు తులాల బంగారం పెడతాను. పదిహేను వేలు కట్నమిస్తాను. ఇంతే నా శక్తి! నా శక్తికి మించిన పరుగులు తీయలేను. అబద్దపు వాగ్దానాలు చేయలేను" అని చెప్పాడు. సుందర్రావీ సంబంధం వదులుకున్నాడు.
"అలాగంటారేంటి సార్! మీక్కావలసిన కట్నం ఆయనివ్వగలరు సార్" అన్నాడు గౌతమ్ వెంటనే.
"ఆ మాట నువ్వు కాదు, ఆయననాలి!"
"ఆ మాట ఆయనంటే పెళ్ళి జరుగుతుందా సార్...!" అన్నాడు గౌతమ్.
"బాగుందయ్యా, అంత కరాఖండిగా ఆయన చెప్పేశాక ఇంకా ఈ పెళ్ళి జరుగుతుందా?" అన్నాడు సుందర్రావు.
అప్పుడెలా వచ్చాడో అక్కడ ప్రకాశరావు ప్రత్యక్షమయ్యాడు.
"ఎందుకు జరగదూ? అంత అందమైన పిల్లను పది తులాల బంగారంతో, యాభైవేల కట్నంతో పెళ్ళిచేసుకుంటే ఫ్రెండ్సు సర్కిల్లో నా ప్రెస్టేజి పెరుగుతుంది" అన్నాడు ప్రకాశరావు.
గౌతమ్ అతడ్ని చూసి హాస అతడ్ని బాగా ఆకర్షించిందని గుర్తించాడు. చదువున్న ఆ కుర్రాడు డబ్బుకోసం తన కోర్కెల్ని కూడా చంపుకోవాలనుకుంటున్నాడంటే అదెంత బాధ పడాల్సిన విషయం.
"నీ ప్రిస్టేజితోపాటు నా ప్రిస్టేజి కూడా పెరగాలంటే ముందా కోదండపాణిగారు నాకు క్షమార్పణ చెప్పుకోవాలి?"
"డబ్బిస్తే అదే క్షమార్పణ...."
ఈ మాటలనడం కోసమే అక్కడ ప్రత్యక్షమైన మరో వ్యక్తి ప్రకాశరావు తల్లి.
సుందర్రావు వెంటనే "తల్లీ కొడుకుల కిష్టమైతే నాకూ అభ్యంతరం లేదు. అయితే కట్నం డబ్బు రెండు వారాల్లో యిచ్చేయాలి. అప్పుడే తాంబూలాలు, ముహూర్తమునూ" అన్నాడు.
"మీ అడ్రసు నాకివ్వండి. రెండు వారాల్లోగా నేను మిమ్మల్ని కలుస్తాను...." అన్నాడు గౌతమ్.
"మేమింకా యిక్కడ రెండ్రోజులుంటాం...." అన్నాడు ప్రకాశరావు.
"అంత డబ్బు తేవడానికి రెండ్రోజులు చాలదు. మీకు నేను ఏకంగా డబ్బుతోనే కనిపిస్తాను" అన్నాడు గౌతమ్.
* * * *
ఇంట్లో, ఆఫీసులో, నడి బజార్లో.... ....ఎక్కడైనా సరే గౌతమ్ కొక్కటే ఆలోచన!
రెండు వారాల్లో యాభై వేలు పోగుచేసి సుందర్రావు కివ్వాలి. హాస పెళ్ళి ప్రకాశరావుతో జరిగిపోవాలి.
"ఎలా....ఎలా....ఎలా....?"
యాభై వేల రూపాయలు కావాలంటే తను నెలకు వెయ్యిరూపాయలు చొప్పున నిలవ చేసినా నాలుగేళ్ళ మీద ఒక మాసం పడుతుంది. సుందర్రావన్నాళ్ళాగడు.
ఎక్కడయినా అప్పు చేస్తే అది తీర్చడం తన వల్ల కాదు. అప్పు మీద వడ్డీ పాపం పెరిగినట్లు పెరిగిపోతూంటుంది. అదీ కాక తనకు యాభైవేల రూపాయలెవరిస్తారు?
ఇక మిగిలినది....అవినీతి? ఆఫీసులో తను తల్చుకుంటే ఏడాదిలో యాభై కాకపోయినా పాతిక వేలైనా సంపాదించగలడు?
కానీ ఒక మంచి పని చేయడానికి చెడ్డపనికి పూనుకోకూడదు. చెడ్డ పనికి పురిగొల్పేదేదీ మంచి పని కానేరదు. ఎట్టి పరిస్థితుల్లోనూ హాస పెళ్ళి చెడ్డపని అనిపించుకోకూడదు.
అయితే ఏం చేయాలి?
తల బద్దలు కొట్టుకున్నా ఏమీ స్పురించక పోయేసరికి గౌతమ్ ఆలోచనలు కొత్తదారికి మళ్ళాయి.
ఎవరీ హాస? ఆమె తనకేమవుతుంది? ఆమె కోసం తను యాభై వేల రూపాయలెందుకు పోగుచేయాలి?
మనిషి మనిషిని ఎందుకు ప్రేమిస్తాడు? స్వార్ధానికి సంబంధించిన సంతోషాన్నాశించే కదా.
హాస అందంగా ఉంది. చూడగానే లవ్ యట్ ఫస్ట్ సైట్! ఆమె తనది కావాలనిపించింది.
కానీ ఆమె తనది కావడంలేదు! మరి ఆమె గురించి ఆలోచించడమెందుకు?
ఇలా ఆలోచిస్తూంటే అతడికి అద్దంలో సీత గుర్తుకొచ్చింది. ప్రతిబింబాన్ని చూసి తృప్తిపడమని పరిహసించడం స్పురించింది.
అప్పుడు సీత ప్రతిబింబం ఇప్పుడు హాస నీడ.
హాసను సీతతో పోల్చగానే అతడికింకో విషయం గుర్తుకొచ్చింది.
సీత అతడికి తన శరీరాన్నర్పించడానికో ట్రాన్సిస్టరునో, పది రూపాయలనో అడిగింది. ఆఖరికి జాలిపడి ఊరికినయినాసరేనని ఒప్పుకుంది. కానీ తనామెను పెళ్ళి చేసుకుంటానన్నాడు. ఆమె ఒప్పుకో లేదు....అందుక్కారణం....
అతడామెను ప్రేమించలేదు. సమాజంలో ఆమెకున్న స్థానం చూసి జాలిపడి ఆ స్థానాన్ని పెంచాలనుకున్నాడు. కానీ సీతకున్న అహంకారం సామాన్యమైనది కాదు. ఆమె అతడి స్థానాన్ని నిరసించి అతడి మీదనే జాలిపడి కసితీర్చుకుంది.
ఆడది మగాడి నుంచి ప్రేమను కోరుతుంది.
ప్రేమంటే ఏమిటి?
అప్పుడు గౌతమ్ కి తల్లి గుర్తుకొచ్చింది.
చిన్నప్పుడు తల్లి అతడికి పాలిచ్చింది. మలమూత్రాల నెత్తిసేవించింది. అన్న పానాదులతో పోషించింది. స్నానాలంకృతాలతో సంతోషింపజేసింది.
అందువల్ల ఆమెకు ప్రయోజనం లేదు. స్వార్ధమంటూ ఉంటే ఒక్కటే! గౌతమ్ ఆమె రక్తం పంచుకు పుట్టిన బిడ్డ.
అదీ ప్రేమ అంటే!
హాసను తనూ అలా ప్రేమిస్తూంటే.... ఆమె కోసం యాభై వేలెందుకు పోగు చేయాలీ అన్న ఆలోచన రాకూడదు. కానీ హాసను తానలా ఎందుకు ప్రేమించాలి?
రక్తం పంచుకు పుట్టడం వల్ల, అంతకు ముందు నవమాసాలు మోసి వుండడం వల్ల బిడ్డను తల్లి ప్రేమిస్తుంది.
కానీ హాసకూ తనకూ మధ్య అటువంటి దేమీ జరగలేదు. అసలెటువంటి సంఘటనా జరగలేదు.
హాసను తను ప్రేమించాలా?
అంతరాత్మ గౌతమ్ ను వెక్కిరించింది, "యాభై వేల రూపాయల కోసం నీ ప్రేమ సందిగ్ధంలో పడింది. నువ్వు మహాత్ముడివి కాగలవా?"
అప్పుడు గౌతమ్ కో విషయం స్పురించింది.
తను నిస్వార్ధంగా ఎవరినో ఒకరిని ప్రేమించాలనుకున్నాడు. తన ప్రేమ నిస్వార్ధమైనదని నిరూపించాలనుకున్నాడు.... అందుకు తలంచిన హాస!
అయితే యిప్పుడు తను హాసను ప్రేమిస్తున్నాడా, లేక తన ప్రేమలోని నిస్వార్ధాన్ని నిరూపించాలనుకుంటున్నాడా?
"వెర్రివాడా! హాసను నువ్వు ప్రేమిస్తున్నావోలేదో నీ మనసునడుగు చెబుతుంది" అంది గౌతమ్ అంతరాత్మ.
అప్పుడు గౌతమ్ కి చెవిలో "లబ్ డబ్....లబ్ డబ్...." అన్న శబ్దం వినిపించసాగింది.
అది హాస గుండె చప్పుడని అతడి కర్దమయింది.
17
రాణి గంభీరా కాలేజీనుంచి బయటపడ్డాక ఆడపిల్లలు ఏడుగురు. కలిసి నడుస్తుంటే ఓ కొంటె కుర్రాడు "సత్తె పే సత్తా" అంటూ పాట ప్రారంభించాడు.
మాలతి క్కోపం వచ్చి, "బ్రూట్...." అని స్నేహితురాండ్రుకు మాత్రమే వినిపించేంటంత నెమ్మదిగా విసుక్కుంది.
"పోనీలేవే, ఇప్పుడే కాలేజీ నుంచి బయటపడి రిలాక్స్ కోరుకున్నవాడు-వాణ్ణి తిట్టకు" అంది హాస.