Previous Page Next Page 
సుహాసిని పేజి 17


    "రిలాక్సవడానికిదా పద్ధతి...." అంది మాలతి.

    "ఏమో, ఎవరి పద్ధతి వారికానందం" అంటూ మాలతిని శాంతపరిచింది హాస.

    అంతా పార్కుకి చేరుకున్నారు. ఆ అందాల బాలల్ని పార్క్ లోని పూలబాలలు సంతోషంగా తలలూపుతూ ఆహ్వానించాయి.

    ఏడుగురాడపిల్లలూ మల్లెపందిరి చేరుకున్నారు.

    అప్పుడు హాసిని అంతా పెళ్ళిచూపుల గురించి అడిగి ఆ తర్వాతే కూర్చున్నారు.

    హాస వాళ్ళకు జరిగింది చెప్పింది.

    "ఎంత పొగరు? లాభం లేదు, ఈ మగాళ్ళకి బుద్ధి చెప్పాలి...." అంది సుగుణ.

    "దీనికి మగాళ్ళని తప్పు పట్టి లాభం లేదు. తప్పు మనది" అంది హాస.

    "వాళ్ళు కట్నమడిగితే తప్పు మనదా?" అంది మాలతి.

    "అవును. వాళ్ళు కట్నమడిగారని నా పెళ్ళి చెడిపోలేదు. అడిగినంత యిచ్చే శక్తి లేదని మా యింట్లో బాధపడ్డారు. వాళ్ళకు డిమాండుంది.... బజార్లో టీవీ షాపుకి వెళ్ళి చూడు బ్లాక్ అండ్ వైట్ మూడువేలు, పోర్టబుల్ అయితే రెండు వేలకు లోపే! అదే కలర్ టి.వి. కావాలంటే పదివేలుండాలి. అందులోనూ ఏ వీడియో కానో కావాలంటే రమారమి ఇరవై వేలుండాలి. చేతిలో రెండు వేలుంచుకుని కలర్ టి.వి ఇరవై వేలు చెబుతున్నారని కంపెనీ మీద అలిగి ఏం లాభం?" అంది హాస.

    "టీవీని మగాడ్ని పోలుస్తున్నావా? టీవీనీ బీవీనీ పోలుస్తూ మగాళ్ళు వేసే జోకులు టీవీల నిండా వస్తున్నాయి. అదే సబబు కూడా! డబ్బిచ్చి కొనుక్కుంటే టీవీ యింటికొస్తుంది. పెళ్ళయ్యాక ఆడది మగాడింటికి వెడుతుంది...." అంది కోమలి.

    అప్పుడు హాస వాళ్ళకు రాజకీయాల గురించి చెప్పింది.

    ఎన్నికల్లో డబ్బిచ్చి ఓట్లు కొనుక్కున్న రాజకీయ- నాయకుడు ఎన్నికయ్యాక ఇల్లొదిలి అసెంబ్లీ హాల్లో అడుగుపెడతాడు. అందువల్ల అతడు ప్రజలందరికీ నాయకుడవుతాడు. అలాగే ఆడది కూడా తలిదండ్రులచాటు బిడ్డగా ఉంటూ పెళ్ళయ్యాక అత్తారింటికెళ్ళి అక్కడ గృహ యజమానురాలవుతుంది. ఆ హోదా-కొనుక్కుందుకు ఎన్నికల్లో రాజకీయ నాయకుడిలా పోటీ పడి డబ్బు ఖర్చుపెట్టక తప్పదు.

    "మనకూ, రాజకీయాలకీ పోలికేమిటి?" అంది కమల.

    "చాలా వుంది. పదవి లేనంతకాలం వాళ్ళు అవినీతిని దుమ్మెత్తిపోస్తారు. పదవిలోకి రాగానే అవినీతికి పాల్పడతారు. ఆడపిల్లలు చేస్తున్నది మాత్రం ఏమిటి? పెళ్ళయ్యేదాకా స్త్రీ స్వాతంత్ర్యం గురించీ, వరకట్న సమస్య గురించీ ఉపన్యాసాలు దంచేస్తారు. స్త్రీ జన్మ ఉత్కృష్టమైనదని వ్యాసాలు రాస్తారు. పెళ్ళయ్యాక ఆడపిల్ల పుడితే ఏడ్చేదీ వీళ్ళే. మగపిల్లాడు పుడితే కట్నాలడిగేదీ వీళ్ళే. ఉదాహరణకు మా యింట్లో వాళ్ళని తీసుకో. మా అమ్మకు కట్నమివ్వడానికి వాళ్ళ నాన్న ఉన్నపొలంలో సగం అమ్మేశాడు. మా అమ్మకు కట్నమివ్వడానికి వాళ్ళ నాన్న చేసిన అప్పు ఇప్పటికీ తీరలేదంటూందమ్మ. నిన్న నన్ను చూడ్డానికొచ్చిన పెళ్ళివారు పది తులాల బంగారం, యాభై వేలు కట్నం అడిగారని మండిపడ్డ బామ్మ మా తమ్ముడికి అయిదు లక్షలు కట్నం తీసుకుంటానని ముద్దులాడింది. తరతరాలుగా మన ఆడవాళ్ళ బుద్ధి మారడం లేదు."

    లలిత నవ్వి, "మగాళ్ళు చేసే తప్పుకిల కూడా మననే తప్పుపట్టడం మగాళ్ళు చేసేపని. మా అమ్మ అస్తమానూ దీనికి వసుంధర కథ బ్రహ్మాస్త్రాన్ని ఉదాహరణగా యిస్తూంటుంది. కొన్నేళ్ళ క్రితం చదివిందిట ఆ కథ. అందులో పెళ్ళయిన రోజునుంచీ భార్య భర్తని ఎన్నో మంచి కోర్కెలు కోరుతుంది. ఒక్కటీ తీర్చడు సరిగదా గసిరికొడతాడు భర్త. కొడుకెదిగాక పెళ్ళికి కట్నం తీసుకుందామంటే మాత్రం వెంటనే ఒప్పుకుంటాడు. హనుమంతుడు కావాలనే బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డట్టు మగాళ్ళు తమకు నచ్చిన విషయాల్లో మాత్రం ఆడాళ్ళ మాటలు విని తప్పు వాళ్ళ మీదకు నెట్టేస్తుంటారట...." అంది.

    "నువ్వు చెప్పింది బాగానే వుంది. అసలు కొడుక్కి కట్నం కావాలని మనమెందుకు కోరాలట?"

    "పాయింటే?" అంది లలిత.

    "ఎన్నయినా చెప్పండి? మన సమస్యల్లో మన బాధ్యత కూడా ఉంది. సమస్యలని లోతుగా ఆలోచించడం మనకు చేతకాదు. ఏదయినా సమస్య వచ్చినప్పుడు అదెందుకొచ్చిందీ, ఎలా వచ్చిందీ అని ఆలోచించడానికి బదులు తాత్కాలికంగా ఆ సమస్య నుంచి తప్పించుకోవాలని చూస్తాం. అందువల్ల కొంతకాలానికి మనమే ఆ సమస్య అవుతాం. మరికొందరికి అంటే వరకట్నం సమస్య నుంచి ఎలాగో అలా తప్పించుకుని బయటపడ్డ కన్నెపిల్ల ఇల్లాలై మగపిల్లాణ్ణి కంటే మరో ఆడపిల్లకు సమస్యగా పరిణమిస్తుంది.... అదే, మనం సమస్య గురించి లోతుగా ఆలోచించామనుకో....అప్పుడు కథే వేరుగా ఉంటుంది. మా యింట్లో చూస్తున్నాను. ఎన్నో యిళ్ళల్లో చూశాను. ఆడది యిల్లాలయ్యాక క్రమంగా మెట్టినింట్లో బాగా బలపడుతుంటే అందర్నీ శాసించగల శక్తి ఆమెకుంటుంది. దాన్నామె ఉపయోగించుకోకపోతే అదామె తప్పు. మా యింట్లో మా బామ్మ తల్చుకుంటే జరగని పనిలేదు."

    "అంతా మాట్లాడుకున్నాం. కానీ మన ప్రతిభేం మాట్లాడ్డం లేదు" అంది కోమలి.

    అప్పుడందరూ ప్రతిభవంక చూశారు. ఆమె మౌనగంభీరంగా వుంది.

    "ఏమయింది ప్రతిభా నీకు?" అంది హాస.

    "మీరు మాట్లాడుకుంటున్న సమస్యకు పరిష్కారం నాకు తెలుసు. మాట్లాడి ప్రయోజనమేమిటి?"

    "ఏమిటే ఆ పరిష్కారం?"

    "ఏమిటో చెప్పను. ఎక్కడుందో చెబుతాను....నాతో వస్తారా?"

    "ఎక్కడుందో చెప్పు...."

    "గోవిందరావు స్ట్రీట్ లో కల్పనా హోటల్ పక్కన పచ్చ మేడలో...."

    "నువ్వక్కడికి వెళ్ళావా?" ఆత్రుతగా అడిగింది హాస.

    "వెళ్ళాను...."

    "ఏం జరిగిందక్కడ?"

    "నేను చెప్పను....ఒకసారక్కడికి వస్తే మగాళ్ళ ఔన్నత్యం తెలుస్తుంది. ఇలాంటి వృధా ప్రసంగాలుండవు...." అంది ప్రతిభ.

    అందరూ ఆశ్చర్యంగా ఆమెవంక చూశారు.

    ఆమె కళ్ళలో ఆరాధనా భావం స్పష్టంగా కనబడుతోంది. అది దేవేంద్ర పట్లేనని వారికి సులభంగా అర్ధమయింది.

    "ఒకసారి ఆ పచ్చమేడకు వెడదామా?" అంది లలిత.

    "ప్రతిభా, ఊరించక ఆ పచ్చమేడలో ఏముందో చెప్పవే?" అంది కోమలి.

    "తినబోతూ కూర రుచి అడగడమెందుకు? కట్నం పేరు చెప్పి పెళ్ళి సంబంధం చెడిపోయిన మన హాస వంటి దురదృష్టవంతురాండ్రకది అదృష్ట మందిరం...." అంది ప్రతిభ.

    "అది అదృష్టమందిరమను ఒప్పుకుంటాను. నన్ను దురదృష్టవంతురాలనను అప్పుడీ ప్రపంచంలో అదృష్టవంతులే ఉండరు"

    "వచ్చిన సంబంధం చెడిపోతే అది దురదృష్టం కాదా?"

    "దురదృష్టమంటే ఏమిటో తెలియదు నాకు. అదృష్టం గురించి తెలుసు నాకు."

    "పోనీ అదేమిటో చెప్పు నాకు...."

    "నేను పచ్చమేడలోకి వెళ్ళకుండా మంచి సంబంధం నా కోసం వెతుక్కుంటూ వచ్చింధనుకో-అదే అదృష్టమనుకో" అంది హాస.

    "అలా జరక్కపోతే?"

    "జరగాలనే నా కోరిక...."

    దీనిమీద కాసేపు తర్జన భర్జనలు జరిగాయి. క్రమంగా ప్రతిభ ముఖం ఎర్రబడుతూండడం గమనించి, "కాలేజీలో సీరియస్ నెస్ నుంచి తప్పించుకునేందుకు ఇక్కడికి వచ్చాం. మన సంభాషణ ప్రతిభకి నచ్చడం లేదు, టాపిక్ మార్చండి" అంది హాస.

    ఏమనుకుందో ప్రతిభ చప్పున, చల్లబడిపోయి, "హాసా! నువ్వు నిజంగా చాలా మంచిదానివి. నీ మనసెంతో మంచిది. అసలు నువ్వెలాంటి వరుడు కావాలనుకుంటున్నావో చెప్పవే" అంది.

    "ఎందుకూ, పచ్చమేడ నుంచి పంపిద్దామనా?"

    "కాదు, నా ఎన్నికను సరిచేసుకుందామని!"

    "అయితే విను. అతడి రూపం ఎలాగున్నా బాధలేదు. ఐశ్వర్యంతో నిమిత్తం లేదు. మనిషి మంచివాడు కావాలి. ఎప్పుడూ నా గురించే ఆలోచించాలి. నా క్షేమాన్నే కాంక్షించాలి. నన్నే నమ్మాలి. ఎంతగా నమ్మాలంటే తనగురించి ఆలోచిస్తూ, తన క్షేమాన్ని కాంక్షిస్తూ, తన అవసరాలు చూసుకునేందుకు నేనున్నాననీ, అన్నిటికీ నామీదనే ఆధారపడాలనీ అనుకునేంతగా నమ్మాలి."

    ప్రతిభతో పాటు మిగతా అయిదుగురూ కూడా కుతూహలపడి, "ఎక్కడయినా అలాంటి మగాడుంటాడంటావా?" అన్నారు.

    "లేకపోతే నా దొక్కటే కోరిక. ప్రతిభ అంది చూడొకసారి. ఏ బ్లడ్ కాన్సరో వచ్చి అర్ధాంతరంగా చావాలని...."

    "నో....నో...నో...."

    హాసకు చెవులదిరిపోగా, "ఎందుకే తల్లీ అంతలా అరిచారు, నేనంటే నాకు కాన్సరొచ్చేస్తుందా?" అంది.

    "మేమెవ్వరం అరవలేదే!" అంది ప్రతిభ ఆశ్చర్యంగా.

    "అసలేమని అరిచాం?" అంది కమల.

    "నో.... నో.... నో....అని" ఇంకా నా చెవుల గింగురు మంటున్నాయి." అంది హాస"

    "అదంతా భ్రమ. మేమలా అరవాలని నీ కోరిక కాబోలు" అంది మాలతి.

    "లేదా, నేను స్పష్టంగా విన్నాను...." అంది హాస.

    ఆమె కళ్ళలో నిజాయితీ కనబడింది స్నేహితురాండ్రకి. అది చూసి ఆమె నటనలో ఆరితేరిందని అనుకున్నారు వాళ్ళు.


                       *    *    *    *

 Previous Page Next Page