"ఏమీ....కని....పిం....చ....టం.... లే....దు....బా....వా...."
అతనా మాటల్ని ఒక్కొక్కటే తడారిపోతున్న గొంతుకతో ఉచ్చరిస్తుంటే వింటున్న వేణు గుండె భగ్గున మండుతున్న గుడిసెలో చిక్కుకున్న బాలిక ఏడ్పులా ధ్వనించింది.
"అంతా ఏదో మసక మసకగా ఉంది బావా__ ఏమిటిది బావా యిది? ఏమౌతుంది నాకు? బాధగా ఉంది__ భరింపలేకుండా ఉన్నాను బావా__ చెప్పండి బావా?" ఏడుస్తూ ఒక్కొక్క పదాన్నే ఎక్కుపెట్టిన బాణంతో బావ గుండెను దూసుకుపోయేట్టు అన్నాడు. కానీ ఆ బావకి అంత వేదన అవుతుందని కానీ అలా అనాలని కానీ అతనికి తెలియదు. తన వేదన వెళ్ళబోసుకున్నాడంతే.
"ఏమీ లేదు రంగా! నీకేమీ కాదు__ నీ బావ హస్తం సోకాక కూడా నీకు జబ్బుగా ఉంటుందా? అంతా బావుంటుందిలే_ ఆవేశపడొద్దు_ ఆలోచించవద్దు__ ఏదీ ముందు కొంచెం మందు వెయ్యనీ."
లేచి ఏదో మందుని తెచ్చి కళ్ళలో రెండు చుక్కల్ని వేశాడు. తర్వాత అతని హృదయం శాంతి పొందేట్టు నిమిరి అన్నాడు. "ఒక్క నిమిషం కళ్ళు మూసుకో__ తర్వాత బాగా చూస్తావు త్వరపడొద్దు."
కాలాన్ని భగవానుడు ముక్కలు ముక్కలుగా చేశాడు బహుశా మానవుల వేదనని ఎక్కువ చేయటానికి కాబోలు!
ఆ ఒక్క నిమిషం వాళ్ళిద్దరి మనస్సు ఆలోచనా రహితంగా బండబారింది. అత్యధికమైన ఆతురతతో కొట్టుమిట్టాడింది. దాచుకోలేని తపనతో రక్తం ఊర్ధ్వముఖంగా ఎంత వేగంగా ప్రవహించిందో అలాగే మనస్సు ప్రసరించిందో చెప్పలేము కానీ ఎర్రగా కాలుతున్న కొలిమిమీద మనిషిని పెట్టి కాల్చుతున్నప్పుడు సాటివాని హృదయం ఎలా ఆవేదనకి లోనయి తలక్రిందులవుతుందో అలా వుంది. వేణు చిత్తవృత్తి ఈ విషయంలో అతను డాక్టరుగా తగడనే చెప్పాలి.
బలిపశువు వధ్య శిలపై నుంచి మెడకు కత్తిని తాకించి పై కెత్తుక ఆ బలిపశువుకి మనస్సనేది ఉందని ఒప్పుకుంటే ఆ మనసు ఎలా ఉంటుందో అలా ఉంది రంగ మనసు ఆ ఒక్క నిమిషం.
నిమిషానికి అరవై సెకండ్లు! అబ్బ ఎంత దీర్ఘంగా వుంది కాలం_ ఒకటి__ రెండు__
ఎప్పుడెప్పుడు బావ పిలుస్తాడా కన్ను తెరిచి ఆయన్ని ఎప్పుడు చూద్దామా అనే ఆతురతతో గుండెలు మరీ వేగంగా కొట్టుకుంటున్నాయి అతనికి.
"రంగా!"
చకోరము తపస్సు ఫలించింది చంద్రిక వర్షించింది.
"బావా!"
స్వాతి చినుకుకి జాతకము నోరు తెరిచింది.
కన్ను తెరిచాడు.
శూన్యం__అంధకారం__నల్లగా మబ్బు మబ్బుగా తెరలుగా యుగ యుగాల్నుండి వర్షిస్తున్న కాటుక వర్షంలా అంధకారం_ ఏమీ కనిపించటంలేదు. బావ స్పర్శ తెలుస్తుంది. పంచేంద్రియాలలో ఒకటి పనిచేయటంవల్ల అదైనా ఒకటి__ ఒకటి__ ఇక అసలు పని చేయదా?
తను చూడలేడా? చూపు రాదా? బ్రతుకంతా ఇక అంధకార బంధురమేనా? ఏం బ్రతుకు?
"బావా!" బిగ్గరగా ఏడ్చేశాడు.
ఏమనటానికి యేమి చెప్పటానికీ నోరు రాక మూగపోయాడు. వేణు ఎవరికో ఎక్కడో యెన్నిరకాలో వైద్యం చేయటంవేరు. డాక్టరుగా ధర్మాన్ని నిర్వర్తించి ఫలితాన్ని దైవానికి వదలటం వేరు కానీ__
ఇప్పుడు స్వయాన మేనమరిది. మనసు దోసుకుని బంధువుకన్నా మిత్రుడిగా ఆత్మీయుడిగా హృదయాంతరాళాల్లో చోటు చేసుకున్న వాడికి! తరువాత ఆలోచించలేక పోయాడు.
"బావా!" పలుకవేం బావా!__ ఇక నిన్ను చూళ్ళేనా? చెప్పు బావా!" అన్నిటికన్నా ఆ చివరిమాటలు అతని మనసులో ములుకుల్లా గుచ్చుకున్నాయి.
గిర్రుమని తిరిగిన కన్నీటిని అక్కడే కుక్కుకుంటూ అన్నాడు "లేదు రంగా! అలా అనటానికి వీల్లేదు. బహుశా ఇంకా కొన్నిరోజులు కట్టు కట్టవలసి ఉంటుంది అంతే__ పద మరేమీ ఆలోచించకు. నిన్ను దక్కించుకోలేకపోతే నా సర్వస్వమూ కోల్పోయినట్లే.... నీకే బాగు చేయలేకపోతే నా విజ్ఞానం_నా అనుభవం_యెందుకు కాల్చనా? నర్శింగ్ హోంలోనే ఉందువుగానీ పద."
ఏమీ జవాబు చెప్పలేదు రంగ.
"మరో పదిరోజులు అంధకారం__ఆ తర్వాత? వెలుగో శాశ్వతమైన చీకటో.... మొదటిదే నిజమయితే అంతకంటే భగవానుడి దయ తనకక్కరలేదు లేక రెండోదే అయితే భగవాన్! నేనెంత దుర్మార్గుడినయినా ఒకవేళ తెలిసో తెలియకనో ఈ జన్మలోనో వెనుకటి జన్మలోనో పాపం అంటూ ఏదైనా చేసివుంటేకూడా ఇంత శిక్ష వద్దు."
గట్టిగా ముఖాన్ని కప్పుకున్నాడు చేతుల్తో.
ఫోన్ చేయడానికి వెళ్ళాడు వేణు.
9
సాయంకాలం నీరెండ వస్తుంది. గాలి వేడిగా వీస్తుంది. వసంతఋతువు వెళ్ళబోతున్నా ఇంకా ఎండ తీవ్రత తగ్గలేదు. వాతావరణం పొడిగా ఉండి మనస్సుకి చిరాకు కల్గిస్తుంది. కాలువగట్టున కూర్చుని మౌతార్గన్ వాయిస్తూ సాధ్యమైనంత వరకూ వాతావరణాన్ని చల్ల బరచాలని చూస్తున్నాడు వేణు.
మృదువుగా కదులుతున్న అతని పెదాల్ని అంతకంటే మధురమైన సంగీతాన్ని సృష్టిస్తోన్న అతని ప్రతిజ్ఞని నిశితంగా గమనిస్తూ కూర్చుంది. ఆమె ఉంగరాలు తిరిగిన జుత్తుతో అతనెంతో మనోహరంగా కనిపిస్తున్నాడు. చక్కగా మంచి ఆర్టిస్టు గీచిన నాసికలా వున్న తన నాసికాగ్రం నుంచి అతన్ని గమనిస్తుంది. ఎంత అద్భుతంగా వున్నాడు.
మౌతార్గన్ పై పాడటం ఆపి జేబులో పెట్టుకుంటూ అన్నాడు.
"ఎప్పుడూ దీనిపై ఇలా పాడుతూ కూర్చోవటం కొంచెం విసుగ్గా, చిరాగ్గా వుంటుంది. హాయిగా తీయగా ఏవైనా కబుర్లు చెప్పండి."
నవ్వింది ఆమె. చేటలో ముత్యాలన్నీ ప్రోగుచేసుకుని చెరిగినట్టయింది. ఏం అందం?
"చికిత్స చేస్తానన్నది మీరు_నేను పొందాల్సినదాన్ని మాత్రమే! మంచి మంచి కబుర్లతో, మధురమయిన సంగీతంతో నా మనస్సుని మరమ్మత్తు చేస్తానన్నది. మీరు యేం చెప్పినా మీరు చెప్పాలి. ఏం చేసినా మీరు చేయాలి. నేను ఒట్టి శ్రోతను కేవలం ప్రేక్షకురాల్ని మాత్రమే! అయినా డాక్టర్ రోగిని ఏం మందివ్వమంటావ్ అనే డాక్టర్లుంటారా?"
ప్రతిమాటకీ చిలిపిగా చిత్రంగా నవ్వుతూ, నవ్విస్తున్న ఆ నూతన యువతిని అర్ధం చేసుకోలేకపోతున్నాడు అతను. ప్రతి పదంలో విశేషార్ధాన్ని తీసి చికిత్స చేసి నవ్వుతున్న ఆమె మనస్తత్వం అర్ధంకావటం లేదతనికి.
ప్రతిరోజూ ప్రతిఘడియ ఆమె చిత్రమైన చిత్తవృత్తి జ్ఞప్తికి వస్తూ మనస్సుని అదో విధమైన బాధతో అనందంతో ముంచివేస్తున్నది.
మొనతేలిన గడ్డాన్ని మోకాళ్ళపైన ఆనించుకుని కళ్ళెత్తి అతనివేపు చూస్తూ నవ్వుతున్న ఆమెను చూసి అనుకున్నాడు__
అందమంటే ఈమే. ఈమెదే అందమంటే.... నవ్వంటే ఆమే.... ఆమెదే నవ్వంటే.... పువ్వు సున్నితమైదంటే అంతకంటే సుకుమారమీమే.... గాలి చల్లనిది అనుకుంటే మనసుని చల్లగచేస్తుందీమె.... వెన్నెల ప్రవహించి మనిషిని పరవశింప జేస్తుందనుకుంటే ఈమె నవ్వు ప్రవహించక పూర్వమే ఉదయిస్తూనే పరవశాన్ని కలిగిస్తుంది.
ప్రవాహంలో విరుచుకుని విరిగి పడుతోన్న ఆలోచనని ఆపుకుంటూ ఆమెపై ఊహని మరల్చి అన్నాడు.
"ఏం చేయాలో చెప్పండి?"
"బహుశా యూనివర్శిటీ వాళ్ళు మీ అందాన్ని, మీ వినయ విధేయతల్ని చూసి డిగ్రీ పొరపాటున యిచ్చి వుండొచ్చు_ వైద్యం ఏం చేయాలో ఎలా చేయాలో పేషెంట్ ని అడిగే డాక్టరుగా మీరొక్కరే నాకు కనిపిస్తున్నారు...."
ఆమె నవ్వుతూ అన్నా అతనికి కోపం వచ్చింది పైన తేనె పూసినా చేదుమాత్ర రుచి దానిదే! విశాలమైన అతని కను కొలుకులు ఎర్రబడ్డాయి. ఒక్క క్షణం రక్తం ముఖం అంతా ప్రసరించింది. నాసిపుటాలు విచ్చుకున్నాయ్. పెదాలు ముడిపడ్డాయ్. అయితే అది ఏ ఒక్క సెక్షనో అంతే!
ఆడవారిలా అతని ముఖం రక్తారుణిమ చెందటం చూసి మరీ చిలిపిగా నవ్వుతూ అంది. ఆమె అలా అనేటప్పుడు చెవులకి వేసుకున్న జుంకీలు యింకా చిలిపిగా వూగాయి.
"ఉన్నమాటంటే ఉలుకెందుకు డాక్టరుగారూ! లేకపోతే మీరే చెప్పండి. ఏంచేయ మంటారని నన్నే అడిగితే నేనేం చెబుతాను? అలా చెప్పగలిగితే నేను మీవద్దకు రావలసిన అవసరం అంటూ ఏర్పడేదా చెప్పండి? దిక్కులేని దానిగా రోగిష్టిదానిగా మీ వద్దకు వచ్చాను. చిక్కిన ఆశ్రయం కొండంత అవుతుందనే కొండంత ఆశవుంది. జబ్బుకూడా తిరుగుముఖం పట్టిందనిపిస్తుంది. అదంతా మీకు నాపై వున్న అభిమానంవల్లనే కదా? పోనీ నేను చెప్పినట్టు చేస్తారా? అయితే ఒక పాటపాడండి."