Previous Page Next Page 
అనిత పేజి 15


    సంభ్రమంతో గోపాల్ భుజాలు పట్టుకొని ఊపుతూ 'నిజమా! గోపాల్! నిజమా!" అన్నాడు.
    "అవును సార్! ఇదిగో! చెక్ కూడా కాదు కేష్!"
    గోపాల్ చేతిలో డబ్బు చూశాక కూడా నమ్మలేకపోయాడు రాజారావు.
    "ఎవరు కొన్నారు?"
    "ఎవరో ప్రకాశరావుగారట."
    "ఎక్కడుంటున్నారో. ఏం చేస్తున్నారో అడిగావా!"
    "వారుకూడా లాయరేనండీ! ఈ ఊరు కాదుట! నిన్ననే వచ్చారుట. రేపు వెళ్ళిపోతారుట.!"
    "ఎక్కడుంటారో అడిగావా!"
    "ఆ! హొటల్ నందనలో..."
    "వెళ్దాం పద! వెళ్ళి మన కృతజ్ఞతలు చెప్పుకుందాం,"
    రాజారావు గోపాల్ వెళ్ళేసరికి ప్రకాశరావు ఏవో కాగితాలు చూసుకుంటున్నాడు.
    సాటి లాయర్ గా  రాజారావును సగౌరవంగా లోనికి ఆహ్వానించాడు.
    "మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతగా కళను గౌరవించి పోత్సాహించే వ్యక్తులను ఎక్కడా చూడలేదు"
    గౌరవమూ ఆనందమూ ఉట్టిపడుతూండగా అన్నాడు రాజారావు.
    "ఆగండి! ఆగండి! మీ పొగడ్తలూ నాకు దక్కవు. మీ కృతజ్ఞతలూ నాకు దక్కవు. నేను కేవలం నాక్లయంట్ ఆదేశానుసారం ఆ బొమ్మ కొన్నాను. ఆ మాటకొస్తే, అంత డబ్బు ఆ బొమ్మమీద వృధా చెయ్యవద్దని నచ్చచెప్పాను కూడా! ఏమిటోఆ అమ్మాయి ఏనాడూ పట్టినపట్టు వదిలే రకం కాదు."
    "అమ్మాయా! ఎవరా అమ్మాయి?"
    "మిస్ అనిత! దయాశంకర్ గారి అమ్మాయి."`
    రాజారావు నిలువెల్లా వణికాడు. అతని ముఖం తెల్లగా పాలిపోయింది.
    "దయాశంకర్ గారికి తెలుసా ఈ సంగతి!"
    "ఆ డబ్బు మిస్ అనిత తల్లిగారిది ఈ డబ్బు కేవలం అనిత కుటుంబానికే చందాలని ఆవిడ విల్లురాసింది.
    "మరి ఇప్పుడెలా ఖర్చు పెట్టగలిగారు?"
    "సారీ! నాక్లాయింట్ గురించిన వివరాలు నేను పరాయి వ్యక్తికీ చెప్పలేను. ఇప్పటికే అవసరాన్ని మించి మాట్లాడాను"
    'పరాయివ్యక్తి అన్న పదం విచిత్రంగా రాజారావు మనసు గుచ్చింది. అయినా తనకూ అనితకూ గల సంబంధం ప్రకాశరావుకు తెలియదన్న సంగతి అతనికొక తృప్తినిన్చింది.
    "థేంక్స్! ఒక చిన్న మనవి"
    "ఏమిటీ?"
    "మీ డబ్బు మీ కిచ్చేస్తాను. నా బొమ్మ నా కిచ్చేయండి."
    "సార్ ! సార్ !"
    గోపాల్ ఆతురతతో వారించబోయి రాజారావు "హుఫ్" తో తగ్గిపోయాడు.
    "థేంక్స్"
    "రాజారావు ఇంటికి వచ్చేసరికి అనిత కమలకుజడలువేస్తోంది. గుమ్మంలో నిలబడి తనను తదేకంగా చూస్తోన్న రాజారావును చిరునవ్వుతో చూసి" నిలబడి చూడకండి. కళ్ళు నెప్పులు పుడతాయి." అంది అల్లరిగా.
    "నన్ను అవమానించి తీరాలని నువ్వింతగా ఎందుకుకంకణం కట్టుకున్నావో అర్థం కావటంలేదు"
    ఆ మాటలూ, ఆ మాటలు పలికినప్పుడు అతని కంఠంలోని కటుత్వమూ, ముఖంలోని గాంభీర్యమూ అనిత చిరునవ్వును ఎగిరిపోయేలా చేశాయి.
    "నేను ఎవ్వరినీ అవమానించను. నన్ను అవమానిస్తే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటాను."
    "నిన్నే విధంగా అవమానించాను?"
    "నేను నిన్నెలా అవమానించాను?"
    "ప్రస్తుతం నేను ఇబ్బందుల్లో ఉండి ఉండవచ్చు కాని ముష్టి వాణ్ణికాను. యాభై వేలు నాకు దాసంచేసి ఆ బొమ్మ కొన్నట్లు నటించక్కర్లేదు,"
    "పెళ్ళికాకుండా పిల్ల తల్లినయితే గావచ్చు. నేను బజారు మనిషిని కాను.  చిత్రకళ వంకతో చెక్కిలి అందిస్తున్నట్లుగా నా బొమ్మ గీయనక్కర్లేదు."
    "నేను నీబొమ్మ గీశానా?"
    "లేకపోతే నాకు డబ్బు ఎక్కువుందా! నీపిచ్చిగీతలు కొనేందుకు?"
    "తీసుకురా!"
    "చూడు!"
    కమల జడకి రిబ్బన్ ముడివేసి తన  సూట్ కేస్ లో దాచిన చిత్రపటము తెచ్చి తన చేతిలో పట్టుకుని చూపించింది.
    అచ్చు గుద్దినట్లు అనితలాగే ఉంది ఆ చిత్రపటం. మెడ ఒక పక్కకు వాల్చి చిలిపినవ్వుతో చెక్కిలి అందిస్తున్నట్లుగా  ఉంది.
    కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయిన రాజారావు గభాలున ఆ చిత్రపటాన్ని లాక్కోబోయాడు.
    అలాంటిది ముందే ఊహించినదానిలా అనిత మెరుపులా వెనక్కు తగ్గి చిత్రపటాన్ని పైటచాటున దాచుకుని "ఈ బొమ్మ లాగి పారెయ్యటం తేలిక. నీ మనసులోని నాబోమ్మను తుడిచెయ్యగలవా ? ఇప్పుడు నాముందు నిలిచి ఈ బొమ్మఅడుగు" అని వెక్కిరిస్తున్నట్లు నవ్వి పారిపోయింది.   

 Previous Page Next Page