కమల క్రింద పడిపోయింది.
అనిత చటుక్కున వచ్చి కమల తల తన వళ్ళో పెట్టుకుని ముఖం తుడవసాగింది.
"చూడు! భయంతో ఎలా అయిపోయిందో ! పసిపిల్లల మీదనా ప్రతాపం! చిన్నపిల్లలు సహజంగా చాలా మంచివాళ్లు. వాళ్ళని పాడు చేసేది పెద్దవాళ్ళు. మంచి మాటలతో పసిపిల్లలు మనమాటలు ఏవైనాసరే, వినేలాగ చేసుకోవచ్చు. తిట్టి కొట్టి నిష్కారణంగా వాళ్ళ మనస్సు జబ్బుపడేలా చేస్తున్నాం. మనం మానసికంగా వాళ్ళకి దూరమావుతున్నాం!"
చిరాకుగా రాజారావునుచూస్తూ అంది అనిత. కమల భయపడి క్రిందపడిపోయేవరకూ తను కమల నంతగా భయపెడుతున్నానని రాజారావుకు తెలియలేదు. తీరా కమల భయపెడుతున్నానని రాజారావుకు తెలియలేదు. తీరా కమల పడిపోయాక జాలితో పశ్చాత్తాపంతో అతని మనసు నిండిపోయింది.
రాజారావు ముందుకి వంగి "కమలా?" అని కమల చెయ్యి పట్టుకున్నాడు.
"చదువుకుంటాను. చదువుకుంటాను అన్నయ్యా కోట్టకు" అంది కమల వణికిపోతూ.
"నువ్వు నిజంగా కొడతావనుకుని భయపడిపోయింది. నువ్వెళ్ళు. వీళ్ళిద్దరినీ నేను ఇంటికి తీసుకొస్తాను"
దెబ్బతిన్నట్టు చూశాడు రాజారావు.
"వీళ్ళ క్షేమం కోరే___వీళ్ళు చదువుకొని వృద్దిలోకి రావాలని అంత కఠినంగా ఆజ్ఞాపించాను."
"నాకు తెలుసు"
చిన్న వయసులోనే శక్తికి మించిన బాధ్యతలను మోస్తూ తండ్రి నడిసముద్రంలో వదిలేసిన ఆ కుటుంబాన్ని వొడ్డుకు చేర్చాలని ప్రయాసపడుతున్న ఆ యువకుణ్ణి ఆదరంగా చూస్తూ అంది అనిత.
ఆ చూపులతో కొన్ని క్షణాలు రాజారావు చూపులు చిక్కుకుపోయాయి.
అలిసిపోయిన అతని శరీరానికి, మనసుకూ ఆ చల్లని చూపులలో ఏదో చల్లని ఊరట లభింఛినట్లయింది.
11
తమ అప్పుల సంగతి సమాజానికి తెలియకూడదనీ, అప్పులవారి బారి నుండి ఆస్తిని రక్షించాలనీ రాజారావు పట్టుదల.
ఆ పట్టుదల నెగ్గించుకోవడానికి వీల్లేని విషమ పరిస్థితి వచ్చిపడింది.
లక్ష్మీపతిగారు ఇంటిని సహితం తాకట్టు పెట్టారు. ఆ సంగతి మొన్నటివరకు రాజారావుకు తెలియలేదు.
ఆ రోజే బాకీదారు వచ్చి తనకు పైకం చాలా అవసరమనీ, బాకీ జమ కట్టకపోతే ఇల్లు వేలం వెయ్యవలసి వస్తుందనీ బెదిరించాడు.
రాజారావు మస్తిష్కం పగిలి పోసాగింది. ఎంత ఆలోచించినా డబ్బు దొరికే ఉపాయం కనిపించలేదు.
రాజారావు మంచి చిత్రకారుడు. లాయర్ గా ప్రాక్టీసు చేస్తున్నదే కాక, మంచి బొమ్మలుగీసి అమ్మి డబ్బు సంపాదించటానికి ప్రయత్నిస్తున్నాడు. తన పేరు బయటకు రాకుండా 'రాజా' అనే పేరుతో తన చిత్రాలు రహస్యంగా అమ్మిస్తున్నాడు! ఎంత సంపాదించినా ఏ మూలకి?
పెద్ద కుటుంబం, బాగా బతికినా కుటుంబం! కుటుంబం గడవాలి. అప్పులు తీరాలి.
ఇలాంటి ఆపద ముంచుకొస్తుందనీ ఊహించక పోవటంచేత ఏ కాస్త మిగిలినా ఎప్పటికప్పుడు తీర్చేస్తున్నాడు.
ఎంతో కొంత ముట్టచెపుతూ ఉండటంవలన, యిస్తాడన్న నమ్మకం ఉండటంవల్లా అప్పులవాళ్ళుకూడా వత్తిడి చెయ్యటంలేదు.
ఇప్పు డొక్కసారిగా యాభై వేలు ఎక్కడ దొరుకుతాయి? ఎలా పుట్టించగలదు?
అశాంతితో నిద్రరాక స్టాండ్ దగ్గిరకి నడిచి అప్రయత్నంగా బొమ్మ గీయడం మొదలుపెట్టాడు. తనకు తెలియకుండానే అందులో లీన మయిపోయాడు.
బొమ్మ పూర్తయ్యేసరికి రాత్రి రెండు దాటింది.
చేతిలో కుంచె అక్కడే పడేసి అలసటగా అక్కడే చాపమీద పడుకున్నాడు.
కళ్ళు భగ్గున మండుతున్నాయి కాని నిద్ర రాలేదు.
అడుగుల చప్పుడు వినిపించి ఆశ్చర్యంగా చూశాడు. అనిత వస్తోంది.
చట్టుక్కున కళ్లు మూసుకున్నాడు
అనిత స్టాండ్ దగ్గిరకు వచ్చి బొమ్మను తదేకంగా కొంత సేపు చూసింది. అక్కడినుండి వెళ్ళిపోయింది.
అనిత ఎందుకు వచ్చినట్లా అని రాజారావు మధన పడుతూండగానే చేతిలో దిండూ, దుప్పటి తీసుకుని అనిత మళ్ళీ వచ్చింది.
దిండు జాగ్రత్తగా రాజారావు తలక్రింద పెట్టి దుప్పటికప్పి వెళ్ళిపోయింది.
రాజారావు ఆశ్చర్యానికి మేరలేదు. అనిత తన నింత కనిపెట్టి చూస్తోందా?
తను ఇంతవరకు నిద్రపోలేదనీ, బొమ్మ గీసుకుంటున్నాడనీ అనిత కెలా తెలిసింది?
అనితకు తనమీద ప్రేమ ఉందా?
మరి రాణి.........?
అశాంతితో దొర్లి దుప్పటి తీసిపారేసి లోపలి కొచ్చాడు.
అనిత ప్రశాంతంగా నిద్రపోతోంది. కన్న, కమల అనిత చెరో వైపు పడుకున్నారు. రాణి ఎక్కడ పడుకుందో అర్థం కాలేదు.
ఒక్క క్షణం నిలబడి వచ్చేశాడు.
తూరువు తెల్లవారి లోకమంతా కళకళ లాడింది. కానీ రాజారావు మనసు మాత్రం కలవరపడుతోంది.
అతని చిత్రాలు అమ్మి పెట్టె గోపాల్ కు రాత్రి గీసిన బొమ్మ యిచ్చి "ఎంతవస్తే అంతకు ఇచ్చెయ్యి. "అన్నాడు-
చిత్రాలుచూచి ఆనందించే వాళ్ళే తక్కువ. కొనేవాళ్ళు మరీ తక్కువ.
ఒక్క నీటి బొట్టుతో మహా సముద్రం పూడుతుందా? ఈ చిత్రాని కొచ్చిన డబ్బుతో తన అవసరాలలో నూరో వంతైనా తీరవు.
సాయంత్రం నాలుగు గంటలకు వెలిగిపోతున్న ముఖంతో వచ్చాడు గోపాల్.
"సార్! సార్! మన చిత్రాన్ని యాభై వేలకు కొన్నారు. యాభై వేలు."
ఉలికిపడ్డాడు రాజారావు.
యాభై వేలు! సరిగా ప్రస్తుతం తనకు కావలసిన మొత్తం!