ఇవాళా రేపూ కూడా లీవుపెట్టింది తను.
కానీ ఇప్పుడు...ఈ సంఘటన తరువాత - ఊపిరి తిరగనంత పని వుండాలి తనకు. ఊరికే కూర్చుంటే ఊహలు ఉరివేస్తాయి తనకి!
ఇంకే విషయాన్ని ఆలోచించేంత తీరిక ఉండకూడదు. ఈ యంత్రాల్లో యంత్రాల్లాగా అయిపోయి, బాధ తెలియని, సెంటిమెంటులేని, స్నేహం, అభిమానం, ఆప్యాయతా అక్కర్లేని ఈ మెషిన్లలాగా మారిపోవాలి తను!
వినడానికి రిసీవరూ, మాట్లాడటానికి మౌత్పీసూ మాత్రం ఉంటాయి టెలిఫోన్ కి.
ఆ మాటలకి మురిసిపోయే మనసు మాత్రం ఉండదు.
తనూ అలాగే మారిపోవాలి?
యాంత్రికంగా వింటూ యాంత్రికంగా మాట్లాడుతూ....చైతన్యమే తప్ప జీవం లేని తన హెడ్ సెట్ లాగా...
"నేను లీవ్ కేన్సిల్ చేసుకుంటున్నాను." అని చెప్పింది.
"వెరీగుడ్! అసలే స్టాఫ్ తక్కువగా వున్నారు. ఎలా చావడమా అని వర్రీ అయిపోతున్నాను." అన్నాడాయన, తెరిపిన పడ్డట్లు చూస్తూ. "ఇప్పుడు పన్నెండవుతోంది. ఫోర్టీన్ అవర్స్ షిఫ్ట్ లో జాయినవ్వండి. కాసేపు డోర్మిటరీలో రెస్ట్ తీసుకోండి. చాలా అలసిపోయినట్లు కనబడుతున్నారు."
"ఉహు! ఇప్పుడే వర్క్ మొదలెడతాను" అంది లతా స్థిరంగా. తర్వాత తన సీటు దగ్గరికెళ్ళి అక్కడ కూర్చున్న అమ్మాయిని, "నువ్వు కొంచెం రిలాక్సవు, నేను అటెండ్ అవుతాను" అంది.
ఆ అమ్మాయి కొంచెం ఆశ్చర్యంగా చూసి "ఎందుకు" అని, అంతలోనే "థాంక్యూ!" అంటూ లేచింది. పాపం తను కూడా నిర్విరామంగా తెల్లవారుఝాము నుంచీ పనిచేసి అలసిపోయింది మరి.
"గుడ్ మార్నింగ్! కంప్లెయింట్స్" అంది మొదటి కాల్ రిసీవ్ చేసుకుంటూ.
"లతా?" చౌకబారు ప్రణయం ఒలికిస్తూ, ఆ రోడ్ సైడ్ రోమియో!
లత పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ముక్కుపుటాలు పెద్దవైపోయాయి.
డిస్ కనెక్ట్ చేసింది.
రెండు క్షణాల్లో మళ్ళీ రింగయింది.
"లతా"
కట్ చేసింది. పెదిమలు రోషంతో వణుకుతున్నాయి.
మళ్ళీ...
అలాగే చేస్తూ కూర్చుండిపోయింది.
ఫోన్ రింగవుతోంది. రింగవుతోంది. రింగవుతోంది. రింగవుతోంది. సిగ్గూ శరం లేకుండా, అడ్డూ అదుపూ లేకుండా...
ట్రింగ్ ట్రింగ్...ట్రింగ్ ట్రింగ్...ట్రింగ్ ట్రింగ్.....ట్రింగ్ ట్రింగ్....ట్రింగ్ ట్రింగ్.
నిస్సహాయంగా కనెక్టు చేసింది లత. "ఏమిటి?" అంది విసురుగా, కొంచెం పరుషంగా. లైన్ లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. - గరగర శబ్దం వినబడుతోంది.
"ఇంతసేపు ఫోన్ రింగవుతున్నా రిసీవ్ చేసుకోవేం? వేర్ వర్ యూ?" అదే గొంతు.
"షటప్" అంటూ డిస్ కనెక్ట్ చేసింది.
రెండు నిమిషాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గరనుంచి పిలుపొచ్చింది.
"ఏమిటి?" అంది లత.
"డీ.ఈ.గారు ఫోన్ చేస్తే షటప్ అన్నారుట?"
"డీ.ఈ. గారా?" అంది తెల్లబోతూ.
"డీ.ఈ. గారు చాలా స్ట్రిక్టు. తనే స్వయంగా అప్పుడప్పుడు అన్ని నెంబర్లకి రింగ్ చేసి, సర్వీసు ఎలా వుందో గమనిస్తూ వుంటారు. ఐదు నిమిషాలపాటు అసలు కాల్ రిసీవ్ చేసుకోలేదట! తర్వాత చాలా రూడ్ గా 'షటప్' అని చెప్పారుట? ఇలాగేనా కస్టమర్స్ తో మాట్లాడేది అని ఆయన నా మీద విరుచుకుపడిపోయారు."
హఠాత్తుగా నిద్రావస్థలోంచి మెలకువ వచ్చినట్లనిపించింది లతకు. జరిగింది అర్ధమైంది. శ్రీమంత్ నీ, అతని తాలూకు జ్ఞాపకాల్నీ వెనక్కి నెట్టేస్తూ, జరిగింది చెప్పడం మొదలెట్టింది. ఎవరో తనని టీజ్ చెయ్యడం, మాటిమాటికీ రింగ్ చెయ్యడం, అతనే అయివుంటాడు అన్న భావంతో తను చాలా సేపు కాల్ రిసీవ్ చేసుకోకపోవడం, గొంతు సరిగ్గా గుర్తు పట్టక విసురుగా మాట్లాడడం - అంతా చెప్పింది. ఆ తర్వాత అసిస్టెంట్ ఇంజనీరు ఫోన్ చేసి డీ.ఈ.కి జరిగింది చెప్పాడు. కాని వివరంగా, సరిగ్గా చెప్పలేకపోయాడు. ఐతే ప్రజాసేవే మా కర్తవ్యం అని నమ్మే ఆ అధికారికి మనసులో లతంటే ఒక విధమైన దురభిప్రాయం ఏర్పడిపోయింది. "పబ్లిక్ తో సంబంధమంటే చాలా ఓపిక వుండాలి. తొణకకూడదు" అని ఆయన వుద్దేశ్యం. ఆ సహనం లతకి లేదన్న ఇంప్రెషన్ ఆయనకి పడిపోయింది.
ప్రయత్నపూర్వకంగా మనసుని వశంలోకి తెచ్చుకుంది లత.
ఇంటికొచ్చేముందు క్లబ్ లోకెళ్ళి ఒక పుస్తకం వెతికి తీసుకుని హ్యాండ్ బాగ్ లో పెట్టుకుంది.
ఇంటికి తిరిగి వచ్చేసైర్కి అత్తయ్యా, పిల్లలూ కనబడలేదు. మావయ్య ఒక్కడే వున్నాడు. "వాళ్ళంతా పేరంటానికి వెళ్ళారే లతా!" అన్నాడు మావయ్య 'ఇక మనకి ఏకాంతమే అన్న భావం పలికిస్తూ.
"అవునా" అంది లత వుత్సాహం ప్రకటిస్తున్నట్లు నటిస్తూ.
"తీరిక ఉన్నప్పుడల్లా పుస్తకాలు తెగ చదివేస్తుంటావ్! ఈ మధ్య ఏమి చదివావేమిటి?" అన్నాడు. రాత్రి తను పెట్టిన పుస్తకాలు చూసిందో లేదో నన్న ఆచూకీ లాగుతూ.
"ఎవరన్నా ఇస్తే తప్ప ఇంటరెస్టింగ్ బుక్సు నాకెక్కడ దొరుకుతాయి!" ఓరగా చూస్తూ అని, "ఇవాళ మంచి పుస్తకమొకటి తెచ్చాను నీకోసం! చదువుతావా?" అంది.
ఆయన మొహంలో మొగతోడేలు తొంగి చూసింది. "ఏం పుస్తకమే" అన్నాడు. లత తన భావాన్ని అర్ధం చేసుకోవడం, కరెక్టు రియాక్షన్ ఇవ్వడం, ఆయనకి సంతోషం కల్గిస్తోంది.
హాండ్ బాగ్ లో నుంచి ఒక బుక్ తీసిందామె.
రాజగోపాలాచారి రాసిన ఇంగ్లీషు రామాయణమది.
దాన్ని మావయ్యకందిస్తూ, "రామాయణం చదువుకోవాల్సిన వయసు నీది. ప్రేమాయణం వల్లెవేసే వయసు దాటిపోయింది. నీ పేరు రామారావుకానీ మామయ్యా, 'రామరామ' అనిపించేటట్లు ప్రవర్తిస్తున్నావు" అంది.
మామయ్య కోపంతో నిలువునా వణకడం మొదలెట్టాడు.
"ఏమిటే...ఏమిటీ ఎగిరెగిరి పడుతున్నావ్?...దిక్కులేనిదానివని దగ్గర తెచ్చి ఉంచుకుంటే.."
"నువ్వేమీ నన్ను వుంచుకోనక్కరలేదు" అంది లత కోపంతో కళ్ళు ఎర్రబడుతుండగా.