శ్రీరాం కార్లోనుంచీ దిగగానే కిటికీ దగ్గర నిలబడి ఉన్న ప్రతిమని చూసి, పలకరింపుగా నవ్వి, కారు డోర్ లాక్ చేసి లోపలికి వచ్చాడు.
శ్రీరాం వస్తాడని మధ్యాహ్నమే సుందరమ్మతో చెప్పింది ప్రతిమ. ఆవిడ వెంటనే మొహం ముడుచుకుని, "ఎందుకుటా?" అంది.
"నాన్నగారితో మాట్లాడుతాడుట."
"ఇంకేమిటి మాట్లాడేది?" అని ఈసడింపుగా అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది సుందరమ్మ.
గుమ్మం దగ్గర శ్రీరాం బూట్ల చప్పుడు వినబడింది. వెంటనే ఏం చెయ్యాలో తోచలేదు ప్రతిమకి. తను ఇక్కడే ఉండిపోవాలా? బయటికెళ్ళి అతన్ని ఆహ్వానించాలా? ఏం చెయ్యాలి?
నాన్నగారు ఇంట్లో ఉన్న సవ్వడి ఎక్కడా వినిపించడం లేదు. బయట గదిలో లేరా? అన్నయ్య ఏడీ?
కాసేపు చూసి తలుపు మీద చిన్నగా కొట్టాడు శ్రీరాం.
"ఏమండీ?"
ఎవరూ పలకలేదు.
"సార్!"
చటుక్కున లేచి నిలబడి, బయటి గదిలోకెళ్ళింది ప్రతిమ.
ఆమెని చూడగానే అతను - ఆ రెండ్రోజుల్లో ఆమె మీద ఏర్పడిపోయిన అధికారంతో, కలిగిన చనువుతో కొంటెగా కళ్ళు ఎగరేసి, ఏదో సైగ చేస్తూ అస్పష్టంగా పెదిమలు కదిలించాడు. అది గమనించనట్లు చూపులు మరల్చుకుని, "కూర్చోండి" అంది ప్రతిమ.
"థాంక్యూ" అంటూ కూర్చున్నాడు.
లోపలికెళ్ళి, "అమ్మా! అతనొచ్చాడు. నాన్నగారేరీ?" అంది ఇబ్బందిగా.
"బయటికెళ్ళారు" అంది సుందరమ్మ ముక్తసరిగా.
"అతనొస్తాడని చెప్పలేదా?"
"ఎక్కడే! కాస్త నడుం వాల్చి లేచాక చెబుదామనుకున్నాను. ఈ లోపలే ఆయనెక్కడికో ఊరేగారు! చెప్పాపెట్టకుండా గభాల్న వెళ్ళిపోతారు ఈ మనిషి! ఆయన్నని ;లాభమేమిటి? అందరూ అన్నీ నాతో ముందే చెప్పి చేసి చస్తున్నారా ఏమిటీ? ఎవరి ఏడుపు వాళ్ళదీ, ఎవరి చిత్తం వారిదీనూ!"
ఆ వ్యంగ్యం తనని ఉద్దేశించే అని అర్ధమయింది ప్రతిమకి. ఆ మాటలు శ్రీరాం వింటాడేమో అనుకుంటేనే వళ్ళు చచ్చిపోయినట్లయింది.
"కాఫీ పెడతాను! పాలేవీ?" అంది వెదుకుతూ.
"ఇవాళ పాలు బొత్తిగా మిగల్లేదే! అక్కడ స్వీటు షాపు దాకా వెళ్ళి వో అర్ధరూపాయి పాలు పోయించుకొస్తావూ?"
"షాపుకి నేను వెళ్ళాలా?" అంది ప్రతిమ విసుగ్గా. "అన్నయ్య లేడా?"
"మొహం రుద్దుకుంటున్నట్లున్నాడు - వెళ్లి చెప్పు."
"నువ్వే చెప్పు."
"సరేలే" అని అనాసక్తిగా అంటూ, అమృతాంజనం నడుముకి రాసుకోవడం మొదలెట్టింది ఆవిడ.
కదలకుండా ఆమె దగ్గరే నిలబడింది ప్రతిమ.
"ఏమిటే?"
"అతను కూర్చుని ఉన్నాడు, పలకరించమ్మా!"
"మీ నాన్నగారు రానీ. ఆడదాన్ని నేనేం మాట్లాడతానూ?"
ప్రతిమ విసురుగా వెళ్ళిపోబోయింది.
"నువ్వెళ్ళి అతని దగ్గర కూలబడి మాట్లాడకు. పరువుగా ఉండదు." అంది సుందరమ్మ.
ప్రతిమ వినిపించుకోనట్లు బయటికెళ్ళిపోయి గుమ్మానికి ఆనుకుని నుల్చుంది.
"అలా ఆనుకుని నిల్చుంటే ఎలా ఉన్నారో తెలుసునా?" అన్నాడు శ్రీరాం, గొంతు తగ్గించి.
పక్క చూపులు చూసింది ప్రతిమ మొహమాటంగా.
"బేలూరు టెంపుల్లోని ప్రతిమలాగా ఉన్నారు - మీ పేరు మీకు చాలా బాగా సూటయింది."
అతని మాటలు వినిపించుకోనట్లు,
"నాన్నగారు ఎక్కడికో బయటికి వెళ్ళినట్లున్నారు. వచ్చేస్తారు కూర్చోండి" అంది, మ"అర్ధం చేసుకోండి ప్లీజ్!" అన్నట్లు చూస్తూ.
'ఏం ఫర్వాలేదు' అన్నట్లు తల పంకించి, నవ్వాడు శ్రీరాం అతను నిస్సంకోచంగా ఆమెని పట్టిపట్టి చూస్తున్నాడు. అది ప్రతిమకి తెలుసు. కొద్ది రోజుల క్రితం ఎవరన్నా తనవైపు అలా చూసి ఉంటే కళ్ళెర్రజేసి ఉండేదే!
"మీరు చాలా బాగుంటారు. నిజంగానే చాలా చాలా బాగుంటారు. దేవకన్యలా ఉంటారు." అన్నాడు శ్రీరాం తమకంగా.
"ప్చ్!" అని చప్పరించింది ప్రతిమ, అయిష్టంగా తన అందాన అతను పొగుడుతున్న కొద్దీ ఆమెకి ఇబ్బందిగా ఉంది.
ఇంతలో శంకర్ చిన్న గిన్నెతో పాలు తెచ్చి, వెనక దారి నుంచీ లోపలికెళ్ళడం గమనించింది ప్రతిమ. "ఒక్క నిమిషం!" అంటూ వంటింట్లోకి వెళ్ళింది. స్టౌ అంటించి దాని మీద పాలగిన్నె పెట్టింది.
"నాన్నగారు కూడా రానీ! ఇద్దరికీ ఒకేసారి ఇవ్వొచ్చు కాఫీ!" అంది సుందరమ్మ.
ఒక్కసారి తల్లి మొహంలోకి చూసి, మళ్ళీ తల తిప్పేసుకుంది ప్రతిమ.
బయట చెప్పుల శబ్దం వినబడింది.
"నమస్కారం..." అంటూ సగంలోనే ఆగిపోయింది శ్రీరాం గొంతు. ఆ గొంతులో పట్టలేనంత ఆశ్చర్యం!
ఒక్క క్షణం భారమైన నిశ్శబ్దం!
తర్వాత ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైనట్లు, "నువ్వా! దగుల్భాజీ వెధవా! బయటికి నడు! నడవరా బయటికి!" అని వినబడింది కేశవరావు కేక.
ప్రతిమ చటుక్కున లేచి, పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళింది. ఆమె కాలు తట్టుకుని పాలగిన్నె దొర్లిపోయింది.
అక్కడ కనబడ్డ దృశ్యం చూసి, కొయ్యబారిపోయింది ప్రతిమ.
శ్రీరాం మెడమీద చెయ్యేసి, బయటికు నెడుతున్నాడు కేశవరావు.