ఆ గడుసుతనం చూసేసరికి రూపకి ఒళ్ళు మండింది. నిమ్మకు నిరేత్తినట్టు ఏం చెయ్యమంటావు అనడుగుతుంటే ఆ నిబ్బరానికి ఆశ్చర్యపడింది.
"మీరు న్యాయవాదులు, ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి న్యాయం విచారించి న్యాయం చేకుర్చగలరేమోనన్న ఆశతో వచ్చాను. సురేష్ ని మందలించి బుద్దిచెప్పి పెళ్ళిచేసి నాకు సహాయపడ్తారన్న ఆశతో వచ్చాను" అంది గంభీరంగా.
"చూడమ్మాయీ - నీ పెరేమిటన్నావు రూప......చూడు నీవు మా సురేష్ తో తిరిగే ముందు నాకు చెప్పి నా పర్మిషన్ తీసుకుని వాడిని ప్రేమించి వాడితో తిరిగావా?" లా పాయింటు తీసి గంభీరంగా అడిగారాయన. శారదాంబ కొడుకింత పని ఎలా చేశాడని విస్తుపోతోంది. ఇరవైరెండేళ్ళ సురేష్ ఆవిడకింకా స్కూల్లో చదువుకునే కుర్రాడిలాగే అనిపిస్తుంది. కోడుకింత వాడయ్యాడని ఆవిడ ఆశ్చర్యపోతుంది.
"నిజమేనండి! ప్రేమించే ముందు తల్లి తండ్రుల పర్మిషన్ తీసుకుని ప్రేమించాలని నాకు తెలియక మీ అబ్బాయి ప్రేమని నమ్మానండి, మా ప్రేమ పెళ్ళిదాకా దారి తీస్తుందని నమ్మానండి" తెలివిగా ప్రశ్నించిన అయనమీద వ్యంగ్యంగా విసురు విసిరింది రూప.
అయన మొహం మాడింది ఆ జవాబుతో.
"చూడమ్మాయ్! ఆడపిల్లవు నీవు ముందు జాగ్రత్త లేకుండా కుర్రాళ్ళతో తిరగడం నీ తప్పు. దానికి నన్నెలా బాధ్యుడిని చెయ్యాలనుకుంటున్నావు?"
"మిమ్మల్ని భాధ్యుడిని చెయ్యాలనుకోవడంలేదు బాధ్యతగల తండ్రిగా కొడుక్కి బుద్దిచెప్పి భాధ్యత నేర్పగలరని వచ్చాను" అంది రూప కరకుగా.
రూప తను అనుకున్నంత తెలివి తక్కువది కాదని, మాటకి మాట జవాబివ్వగలదు భయం లేకుండా అని రామనాధంగారికి అర్ధమైంది.
"నీవు - సురేష్ కల్సి తిరిగినట్టు, వాడు నిన్ను పెళ్ళి చేసుకుంటానన్నట్లు, నీ పుట్టబోయే బిడ్డకి వాడే తండ్రి అనడానికి నీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు, ఆధారాలున్నాయా? ఉత్తరాలు గట్రా ఏమన్నావున్నాయా?" లాయరు తెలివితో ముందు చూపుగా వివరం రాబట్టడానికి అడిగారాయన రూపకి ఆ సంగతి అర్ధమైపోయింది. ఒక్కసారిగా గత పదిహేను రోజులలో రూప మసికంగా చాలా ఎదిగిపోయింది.
సురేష్ ఇచ్చిన షాక్ తో ఆమెలో మానసిక పరిణత ఒక్కసారిగా వచ్చింది. సినిమాలు, షికార్లు, ఫేషన్స్, పుస్త్తకాలు ఇవే ప్రపంచంలో కళ్ళు తెరచి చుట్టూ లోకాన్ని చూసి చాలా నేర్చుకుంది. నిన్న సుమతితో మాట్లాడాక అవిడడిగిన లా పాయింట్లు అవి చూసి రామనాధంగారు ఎందుకు ఆవివరం అడుగుతున్నరో చప్పున పోల్చుకుంది.
"ఏం ఇద్దరం కల్సి తిరిగిన రుజువులు, సాక్షాలు కావాలా? పదండి మేం గడిపిన హోటళ్ళలో వారి చేత చెప్పిస్తాను. మమ్మల్ని చూసిన పెద్దమనుషులని పిలిపించమంటారా? చెప్పండి. నా పుట్టబోయే బిడ్డకి తండ్రి మీ అబ్బాయా కాదా అన్న దానికి సాక్ష్యం కావాల్సివస్తే మీరు తిన్నగా దేముడి దగ్గరకెళ్ళి అడిగి రావాల్సి వుంటుంది." రూప హేళనగా అంది.
ఆ వ్యంగ్యానికి, విసురుకి రామనాధంగారి మొహం నల్లబడింది. రూపని మింగేసేట్టు చూశాడు.
"ఇదిగో అమ్మయ్యీ! చేసిన పనికి సిగ్గుపడాల్సింది పోయి ఇలా బరితెగించి మాట్లాడడం బాగోలేదు. పెద్దతరం, చిన్నతరం లేకుండా మాట్లాడుతున్నావు. దీన్నిబట్టే తెలుస్తుందని నీ సంగతి. నీ కిష్టం లేకపోతే ఏ మగాడన్నా ఇంత దూరం వెళ్ళగలడా? ప్రేమలు - పెళ్ళికి ముందు సెక్స్ ఇవన్ని చేసి ఇప్పుడు మా ఇంటిమీదకి పోట్లాటకి వస్తావా? వెళ్ళు వెళ్ళు నీలాంటి అమ్మాయిని పరువు ప్రతిష్ట గల మా యింటి కోడలిగా చేసుకుంటే కొరివితో తలగోక్కున్నట్టే. ఇంతకీ సురేష్ లేడు. నీ మాటలు నిజాలో అబద్దాలో మాకు తెలియదు. మమ్మల్నిలా బ్లాక్ మెయిల్ చేయాలని చుస్తున్నవేమో! అసలు నిన్ను కాదు నీ తల్లిదండ్రులననాలి.
ఆడపిల్లని విచ్చలవిడిగా రోడ్లమీద వదిలి, ఇప్పుడు నెలతప్పావు కనక మా ఇంటిమీదకి తోల్తారా? కట్నం లేకుండా పెళ్ళి చేసుకోవడానికి ఇదో ఎత్తు అని ఎక్కడో చదివాలే" రూప తిరస్కారంగా చూస్తూ హేళనగా, నిరసనగా ఎత్తి పోదిచారాయన. అవమానానికి తగిన శాస్తి చేసినట్లు భార్య వంక చుశాడాయన.
రూపకి అది అర్ధమైంది.
"అయ్యా రామనాధంగారూ! మా వాళ్ళు మీరడిగిన కట్నం డబ్బులు ఇచ్చుకోలేనంత దరిద్రులు కారు. మీ కొడుక్కి కట్నం కావాలంటే ఆ మాట డైరెక్టుగా చెప్పకుండా ఈ డొంకతిరుగుళ్ళెందుకండి. ఈపాటి దానికి వంశాలు గౌరవాలు, ఎందుకు? నేను మంచిపిల్లగా, పరువు ప్రతిష్ట కల కుటుంబంనించి వచ్చినదానిలా చెలామణి కావడానికి మా వాళ్ళంత ఇచ్చుకోవాలో చెప్పండి. మీ అబ్బాయిని కొనుక్కోగల శక్తి మాకు వుందో లేదో చూసుకుంటాం."
అయన కొట్టిన దెబ్బకి ఎదురుదెబ్బ తగిలింది మరోసారి అయన మొహం నల్లబడింది. "ఇదిగో అమ్మాయి ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు. మా గుమ్మంలోంచి కదులు ఇలాంటి బజారు సరుకు అని తెలియక లోపలికి రానిచ్చాను - వెళ్ళు వెళ్ళు."
"అయ్యా! ఇలాంటి బజారు సరుకు అమ్మాయి కడుపునే మీలాంటి గొప్ప వంశం నిలిపే వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడు మీ గొప్ప రక్తం అలా బజారు పాలు చెయ్యకుండా వుండాలనే మీ యింటి కోడల్ని అయి మీ వంశ గౌరవం, మీ వంశోద్దారకుడ్ని కాపాడాలనుకొని వచ్చాను. మాటలు ఇష్టం వచ్చినట్లు జారకండి సార్..."
"నిన్నా....కోడలిగానా...."చిత్కారం చేసి హేళనగా నవ్వాడు.
"ఏం-మీ కొడుకు అర్హతలకి తగనంటారా?" రూప వ్యంగ్యంగా అడిగింది.
"తగవు, పెళ్ళికి ముందు మగాళ్ళతో తిరిగి కడుపులు చేయించుకునే రకాలు మా యింటి కోడళ్ళు ఎన్నటికి కారు..." మొరటుగా అన్నాడాయన.
"మరి మీ అబ్బాయీ పెళ్ళికి ముందు తిరిగి, అమ్మాయిలకి కడుపులు చేసే రకమే కదండీ, ఓ మంచి యింటి అల్లుడేలా అవుతాడండి? ఇంతకంటే గొప్ప వంశ మర్యాద కలవాళ్ళు అల్లుడిగా ఎలా చేసుకుంటారండి?" రూప హేళనగా అంది.
"వాడు మొగాడు...."
"ఓహో! మగాడు కడుపులు చేస్తే తప్పులేదు గాని, ఆడది చేయించుకుంటే తప్పన్నమాట. అలాంటి ఆడది చెడిపోయిన రకం అన్నమాట. అవన్నీ పాతకాలం మాటలు సార్..."
"ఛా...ఛా....నీలాంటి పిల్లతో మాట్లాడడం నాది బుద్దితక్కువ....." అయన కోపంగా లేచి నిల్చుని, వణికిపోతూ.....
"వెళ్ళు ముందు మా ఇంట్లోంచి వెళ్ళు. నీ ఆటలు నా దగ్గర సాగవు. మా వాడ్ని వెర్రివాడిని చేసి వలలో వేసుకుని పెళ్ళాడుదామని ఎత్తు వేశావు. అది సాగకపోయే సరికి, వాడోప్పుకోక పోయేసరికి ఇలా బెదిరించాలని వచ్చావు నీ సంగతి అర్ధమైంది వెళ్ళు వెళ్ళు." అన్నారు ఆవేశంగా.
"ఇదే మీ ఆఖరి మాట......మీరు పెద్దమనుషులు, న్యాయవాదులు, కొడుకు చేసిన తప్పు సరిదిద్ది ఓ ఆడపిల్లకి న్యాయం చేకురుస్తారని ఆశపడి వచ్చాను. కానీ కొడుకుని మించి అలాంటి కొడుకుని వెనకేసుకు వచ్చి, కొడుకు తప్పు కప్పిపుచ్చుకుంటూ ఒక ఆడపిల్లని అసభ్యంగా, పౌరషంగా మాటలతో రెచ్చగొట్టేటంత నీచానికి దిగజారే పెద్ద మనుషులని తెలియక వచ్చాను.