Previous Page Next Page 
అరుణ పేజి 15


    
    "ముందువసతి అదీ చూసుకోవాలిగదండి? ఉండడానికి, ఆస్పత్రికి దానికి చోటు చూసుకోవాలి" కృష్ణమూర్తి అన్నాడు అరుణ బదులు తెచ్చిముందు కల్పించుకుని.
    "అవునయ్యోయ్ సుబ్బారావూ మరి డాక్టరుగారు ఎక్కడుంటారంట?" ఆలోచనలో పడ్డట్టు సుబ్బారావువంక చూశాడు.
    "అదేనండీ నేనూ ఆలోచించాను మన జమీందారుగారి భవంతి ఊరికే పాడుబడి ఉంటూంది అందులో ఓ భాగం కాస్త బాగు చేయించుకుంటే ఈమె ఉండడానికి ఆస్పత్రికి కూడా సరిపోతుంది.  
    "అదెట్టా అయ్యా పాడుపడినట్టుంది ఆ ఇల్లు దాన్లో ఎలాగుంటారు?"    
    "ఇల్లేంపాడవలేదు. గట్టిగానే ఉంది ఎటొచ్చీ కాస్తసిమెంటు చేయించిసున్నాలు అవీ వేయిస్తేబాగానే ఉంటుందండి అంతకంటే మరింకేం ఉన్నాయి ఈ వూళ్ళో ఇళ్ళు?" అన్నాడు సుబ్బారావు.    
    "బాగానే ఉంటుందంటావా? అయితే వుండు మన మేస్త్రీని పంపిస్తాను ఓసారి."    
    "ముందువాళ్ళ పర్మిషన్ తీసుకోవద్దా?" కృష్ణమూర్తి సందేహిస్తూ అడిగాడు.    
    "పర్మిషన్ దేనికండీ ఇయ్యకేం చేస్తారు ఎవరు చూడొచ్చారు. ఆ ఇంటి సంగతి నే చెప్తాగమరేమి ఫరవాలేదు మీ రొచ్చే లోపల అన్ని ఏర్పాట్లు చేసేస్తాగా" ఆ ఇల్లు తనదేనన్నంత ధీమాగా అన్నీ నిమిషాల మీద జరిపించేటట్టు మాట్లాడేస్తున్నాడు. చేతలెలా ఉన్నా మాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అనుకుంది అరుణ మాట్లాడుతున్నంతసేపూ రెడ్డి కళ్ళు అరుణమీదే ఉన్నాయి. అది చూసి అరుణ మొహం చిట్లించుకుంది.        
    "అయినా మనం ఒకసారి వాళ్ళకి తెలియపర్చడం మర్యాద కరణంగారి దగ్గిర అడ్రసు తీసుకుని రాస్తాం ఒకసారి ఆయన రాస్తానన్నారట" కృష్ణమూర్తి అన్నాడు.    
    "ఆడిమొహం ఆడు రాసేదేమిటి రాయలనుకుంటే మీరే రాసేయండి" అన్నాడు కరణానికి ఆధిక్యం ఈయడం ఏమిటన్నట్టు   
    "ఆ భవంతి ఒకసారి చూసొస్తావాళ్ళు అనుమతిఇస్తే వసతి గొడవ ఉండదు. ఇంక మా చెల్లెలు చేయబోయేపనికి మీ అందరి సహకారం లభిస్తుందని నా ఆశ మా నాన్నగారికి ఇలా ఒంటరిగా మా చెల్లెలిని పంపడం ఇష్టం లేదుకాని మరీ పట్టుపట్టడంవల్ల సగం అయిష్టంగానే ఊరుకున్నారు. ఆమె కేమీ ఇబ్బందిలేకుండా చూసే పూచీమీలాంటి పెద్దలందరిమీద పెడుతున్నాను. ఆమెనుస్వంత తోబుట్టువులాగా ఆదరించి, అభిమానించాలని నా కోరిక." కృష్ణమూర్తికి వచ్చినపని నెరవేర్చుకుని తొందరగా వెళ్ళాలంటే ఆమాత్రం ఎదుటివాడిని పొగడక తప్పదనితెలుసు.    
    "అయ్యో మీరు సెప్పాల ఆ సంగతి? డాక్టరమ్మగారి మీద ఈగ వాలకుండా సూస్తాం. మేముండగా మీకేం దిగులొద్దు. ఆవిడొచ్చి ఈ ఊళ్ళో ఉంటానంటమే మాకు సంతోషంకదా? ఆమెగారిసదుపాయాలు మరిమేము సూడమా మీరేందిగులు పెట్టుకోకండి అరుణాదేవిగారూ మీరిక్కడికి వచ్చేయడమేమిగతాదంతా మేం చూసుకుంటాంగా" మీసాల చాటునించి నవ్వుతూ భరోసా ఇచ్చాడు.    
    "అయితే మరి మేము వస్తాం హౌస్ సర్జన్ అయ్యాక ఇంకో నెలలోపలే అన్ని ఏర్పాట్లు చేసుకుని వస్తుంది. కాస్త కనిపెట్టి చూడండి. చేతులు జోడించి అన్నాడు కృష్ణమూర్తి.    
    "ఉండండి, ఉండండి కాస్త కాఫీలు తీసుకుని వెడుదురుగాని" అంటూ మర్యాద చేయబోయాడు రెడ్డి.    
    "వద్దువద్దు ఇప్పుడే అన్నీపూర్తిచేసుకున్నాం" అంటూ అరుణ వారించి లేచినిలుచుని నమస్కారం చేసింది. మళ్ళీ కషాయం లాంటి కాఫీ ఎక్కడ తాగాలోనని భయపడుతూ, ఈసారి ప్రెసిడెంటు లేచినించుని గుమ్మందాకావచ్చి సాగనంపాడు.    
    అక్కడినించి కరణంగారి ఇంటికి వెళ్ళి జమీందారుగారి అడ్రసు తీసుకునితరవాత మునసబుగారిని దర్శించుకుని, అందరిసహాయ సహకారాలు చెల్లెలి, తరపునకోరాడు కృష్ణమూర్తి. వీధిలోవెడుతూ సుబ్బారావు ముఖ్యుల ఇళ్ళు ఎవరెవరివో చెప్పాడు" జమీందారుఇంటికి నడిచేవెడదామా? ఊరికి ఓ పక్క ఉంది రెండు మూడు ఫర్లాంగులు ఉంటుంది నడవగలరా?" అడిగాడు సుబ్బారావు.   
    ఆ బండిమీద కంటే నడవడమేనయమనిపించింది అరుణకి. నడిస్తే ఊరంతానాలుగు వీధులూసరిగ్గా చూడవచ్చు. "ఫరవాలేదు నడిచేవెడదాం" అంది అరుణ. వీధుల్లో వాళ్ళంతా అరుణని చోద్యం చూసినట్లువింతగా చూస్తున్నారు చెవులు కొరుక్కుంటున్నారు. సంగతి తెలిసినవారు పక్కవాళ్ళ చెవుల్లో ఊదుతున్నారు తెలియని వారు ఈ పట్నం ఆవిడ ఎవరన్నట్టు చూస్తున్నారు.    
    ఊరికికాస్త దూరంగా పెద్ద తోటమధ్య జమీందారుగారి భవంతి ఉంది. చుట్టూ సుమారు ఎకరం ఖాళీ స్థలం ఉండిఉంటుంది. ఒకప్పుడు ఏమన్నా ఉద్యానవనం ఉండేదేమోగాని, ప్రస్తుతం ఆవిడలాగా పెరిగిన పెద్ద పెద్దచెట్లు ఇష్టం వచ్చినట్లు మొలిచిన చెత్తమొక్కలు, వాటిమధ్య చావలేకబ్రతకలేక ఉన్నట్లుకొన్ని గులాబి మల్లెగోరింట మొక్కలు ఉన్నాయి. ప్రహరీ చుట్టూ సపోటా, మామిడి మొదలైన చెట్లు కూడా ఉన్నాయి. ఆ కాయలు ఆ పళ్ళు ఊరి పిల్లలు ఎవరి కందినవివాళ్ళు కోసుకుపోతారు. గేటు పెద్దదిగా ఎంతోనగిషీ పనితో చెక్కిందే. ఇప్పుడు తప్పుపట్టిరాలిపోవడానికి సిద్దంగా వుంది. లోపల ఖాళీ జాగాలో రెండు మూడుపాకలు వేసుకుని ఎవరో ఉన్నారు. ముందు నించి జమీందారు గారి ఇంట పనిచేసిన కూలీలు పనివాళ్ళు పోయినా వాళ్ళ సంతతి అక్కడే ఉండి ఇళ్ళు కట్టేసుకున్నారు.    
    సుబ్బారావు ఆ గుడిసెల దగ్గరికి వెళ్ళి "వెంకన్నా" అని పిలిచాడు ఆ భవంతి వరండాలనిండా ఏవేవో సంసారాలు బహుశా ముష్టివాళ్ళవి కాబోలు కుండలు చింకిచాపలు, గుడ్డలు వగైరాలతోనిండి ఉన్నాయి.        
    గుడిసెలోంచి ఓ అరవై ఏళ్ళ వృద్దుడొకడు వచ్చి కాస్త వింతగావచ్చిన వాళ్ళని చూశాడు. "ఏంటి పంతులుబాబూ" అనడిగాడు సుబ్బారావుని.    
    "ఒకసారి ఆ తలుపు తీయి కృష్ణమూర్తిబాబు, అమ్మ చూస్తారులోపల అన్నాడు.    
    "ఎవరు బాబూ ఈరు? జమీందారుగారి తాలూకు బంధువులా అనుమానంగా చూస్తూ వినయంగా అడిగాడు వెంకన్న.    
    "కాదులే ఈ అమ్మగారు డాక్టరుగారు. ఈ ఇంట్లో ఉందామని చూస్తున్నారు. తలుపులు తీయి ఒకసారి చూసి వెడతారు."    
    "జమీందారిణమ్మగారికి తెలుసునా బాబూ. ఆ రొప్పుకున్నారా?" వెంకన్న తన ఉద్యోగం నిర్వహణ కేం లోపం రాకుండా వాకబు చేశాడు.    
    "అమ్మగారికి రాస్తాంలే ముందుచూసి వీరికి నచ్చితే ఆనకరాసి కనుక్కుంటాం" అన్నాడు సుబ్బారావు.    
    ఓసారిబుర్ర గోక్కొని ఆలోచించాడు వెంకన్న మళ్ళీఒకసారి అరుణ వాళ్ళ వైపుచూసి లోపలికి వెళ్ళి అర్ధగజం పొడుగున్న తాళం చెవి ఒకటితాడుతో కట్టింది తీసుకొచ్చాడు. "సూడండి బాబూ సూస్తే ఏం పోతది" కాని ఉండాలంటే మాత్రం అమ్మగారి పర్మిట్ ఉండాలి, బాబూ లేకపోతే నాకు మాటొత్తాది అన్నాడు.    
    ఆ మాత్రం మాకు తెలియదా? రాస్తాం ఆమెకి:"    
    కిర్రుమని తలుపులు తెరుచుకున్నాయి లోపలంతా చీకటివెంకన్న వెళ్ళికొన్ని కిటికీలు తెరిచాక కాస్త వెలుతురు లోపల ప్రవేశించింది. ముందు పెద్ద హాలు, ఆ హాలు వెనకపెద్ద మండువా లోగిలి. మండువాకి మూడువైపులా గదులు, ఎత్తుగా సీలింగ్. ఆనాటి జమీందారీ వైభవానికి చిహ్నంగా నిలిచిన చెదలు తింటున్న నగిషీల తలుపులు, పెద్ద పెద్ద గుమ్మాలు, కిటికీలు, చూరునించి వేలాడే గాజుదీపం బుడ్లు అన్నీ ఉన్నాయి. ఓ పక్కన ఆరు గదులు, ఇంకో పక్క ఆరు గదులు ఉన్నాయి.    
    ముందున్న హాలుకి తిన్నగా మళ్ళీ అలాంటి పెద్ద హాలు, ఆ వెనక వంట గదులు, సామాను గదులు ఉన్నాయి, చాలా వరకు, గోడలు కన్నాలు పడిపోయాయి. సున్నం మొహంచూసి ఎన్నేళ్ళయిందో బూజులు, దుమ్ముఇంత ఎత్తున పేరుకుని ఉన్నాయి. నాలుగైదు కాళ్ళు విరిగిన మేజాలు, చిరిగిపోయిన తివాచీలు విరిగిన కుర్చీలు ఏవేవో సామానులు కొన్ని గదుల్లో ఉన్నాయి.    
    "చాలా పెద్దదే ఇల్లు గోడలు సీలింగ్ గట్టిగానే ఉన్నట్టున్నాయి. "గోడలు తడిమి చూస్తూ అన్నాడు కృష్ణమూర్తి."ఇల్లు గట్టిగానే ఉంది కాస్త బాగుచేయిస్తే నిక్షేపంలా ఉంటుంది" అన్నాడు సుబ్బారావు."ఓ పక్క అయితే నాకు ఎక్కితొక్కా, ఈ మధ్య హాలుకన్సల్టింగ్ రూము క్రిందవెనక గదులు ఉండడానికి అన్నింటికి శుభ్రంగా సరిపోతుంది. బాగుచేయించుకుని, మనుష్యులుంటే ఇల్లు మామూలుగా ఉంటుందనుకుంటాను. కాని ఊరికి కాస్త దూరంగా ఉంది.    
    అదీమంచిదే రోలదుమ్ము ధూళికికాస్త దూరంగా ప్రశాంతంగా ఉంటుంది. భయంకూడా ఏమీ ఉండదు. కృష్ణమూర్తిచుట్టు ప్రక్కలవీళ్ళ గుడిసెలున్నాయిగా?" అరుణకి అంతా నచ్చింది. ముందు బాగుచేయించి తోట వేయించుకోవచ్చు. ఓ పక్క పెద్దనుయ్యి ఉంది. నీటికి ఇబ్బందిలేదు. ఇంటినిబాగుచేయించి సామానుతెచ్చి అలంకరిస్తే ముందు తోట వేస్తే కళకళలాడుతుంది. ప్రశాంతంగా ఉంటుంది. అరుణ ఆలోచనలుచాలా దూరమే వెళ్ళిపోతున్నాయి.    
    "అయితే రేపే జమీందారిణి రాయండి. కరణంగారు కూడా రాస్తానన్నారు. వారి దగ్గిరనుంచి జవాబు వచ్చినట్లు నాకు రాస్తే మనుష్యులను పెట్టి ఇల్లంతా బాగుచేయిస్తాను. మీ రొచ్చేవేళకి" అన్నాడు సుబ్బారావు. "నిజంగా మీరే గనక ఈ ఊళ్ళో లేకపోతేమేం ఏం చెయ్యలేకపోయేవారం అన్నీ మీరు చూస్తున్నారు గనుక సరిపోయింది." అరుణకి సుబ్బారావు చేసేసహాయానికి కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియడంలేదు. "నిజమే అన్నీ మీరు చూస్తారన్న భరోసా దొరకడం అరుణఅదృష్టం. ఒక్కర్తీ ఎలా ఉంటుందా అని నాన్నా మేము బెంగపడుతున్నాం. కాని ఇప్పుడు మీ అందరి మధ్యఉంటే భయపడవలసిందేంలేదనిపిస్తూంది. "మనఃపూర్వకంగానే అన్నాడు కృష్ణమూర్తి. భవంతికి ఎదురుగా గోదావరి పాయకాలువలా పారుతూంది కాలువకి అవతల పొలాలు తోటలు, గేటుదాటి రాగానే సుబ్బారావు అవతలి పక్కకి చూపిస్తూ" అవే మా పొలాలు. మా తోట అదీ అటుపక్క ఉంది చూస్తారా? రండి కాసినికొబ్బరి నీళ్ళుతాగి వెడుదురుగాని ఎండలో ఇంతసేపు తిరిగాం" అన్నాడు. తోట అనగానే అరుణ ఉదయం నించి తిరిగిన అలసట మరిచి" పదండి పదండి చూద్దాం" అంటూ ఉత్సాహపడింది కృష్ణమూర్తి వాచీ చూసుకుంటూ" అప్పుడే పన్నెండుదాటింది ఇంటికెళ్ళి భోజనం చేసిబస్సు కెళ్ళాలి టైముంటుందా?" అన్నాడు "ఎంతసేపూ ఓ అరగంటలో వెళ్ళిపోదాం" అని దారితీశాడు సుబ్బారావు. కాలవదాటడానికి బల్లకట్టు ఉంది. బల్లకట్టుదాటగానే సన్ననిపొలాల గట్లమ్మట నడవవలసి ఉంది.

 Previous Page Next Page