Previous Page Next Page 
అరుణ పేజి 16


    
    "జాగ్రత్తగా నడవండి" అన్నాడు. కోతలు అయిపోయాయేమో పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి "అపరధాన్యాలు అవి కూడా వేస్తాం" అని పొలం అంతా చూపించాడు "కందులు మినుములు అన్నీ ఇక్కడే పండిస్తాము. మేము ఆహార వస్తువులు ఏం కొనుక్కోనక్కరలేదు. అన్నీ పొలంలోనే పండుతాయి." అయితే మీ కింకేం ఖర్చు లేదన్న మాట. ధాన్యం అమ్ముతారా? ఆ డబ్బంతా నిలవేనన్నమాట బాగుంది మీ పని మాలాంటివాళ్ళకి బియ్యం దగ్గిరనించి కొనుక్కుంటేనే కాని గతిలేదు. చూస్తూంటే స్వంత వ్యవసాయమే బాగుండేట్టుంది ఈ ఉద్యోగాలకంటే" కృష్ణమూర్తి నవ్వుతూ అన్నాడు.    
    "ఆఆ అంత తేలిగ్గా అనేయకండి స్వంత వ్యవసాయం అంటే ఎంత కష్టమో చేసి చూస్తేనే తెలుస్తుంది సరే అతివృష్టి అనావృష్టి నీటి ఎద్దడి.......ఇవన్నీ అలా ఉంచి రాత్రనక, పగలనక పొలంలో ఎంతలా శ్రమిస్తే పంటలు ఇంటికి చేరతాయో మీరూహించలేరు. ఒక్కొక్క సారి కష్టం ఫలించేసమయానికి ఏ వరదోవస్తే ఆ ఏడాదికి అంతే ఒక్కోసారి ఏదో చీడ పట్టిందంటేకందులు, మిరప తోటలు నాశనం అయిపోతాయి. పంట ఇంటికి చేరేవరకు నిద్రాహారాలు లేకుండా శ్రమపడాలి."    
    "అవునులెండి ఏ పనిలో కష్టం ఆ పనికి ఉంటుందనుకోండి. అయినా ఈ రోజుల్లో ఈ ఉద్యోగాల వరస చూస్తే భూమి ఉన్న వాళ్ళు వ్యవసాయం చేసుకుంటేనే బాగనిపిస్తూంది." కృష్ణమూర్తి అన్నాడు.    
    పొలాల గట్లమ్మట నడిచాక కాస్త దూరంలో పెద్దతోట వచ్చింది. ఈ పొలం, దీన్ని ఆనుకుని ఉన్న తోట మావే" అని తమ ఎల్లలు చూపించాడు సుబ్బారావు తోటలో ప్రవేశిస్తూనే పెద్ద పెద్ద మామిడిచెట్లు నీడతో ఎంతో చల్లగా ఉందనిపించింది అరుణకి సుమారు రెండు ఎకరాలతోటలో మామిడిచెట్లు పనస, నిమ్మ నారింజ సపోటా మొదలైన ఫలవృక్షాలు లైనువారీగా వేశారు. వాటి తరవాత కొబ్బరితోట. కొబ్బరితోటలోకి రాగానే అక్కడ పనిచేస్తున్న పాలేర్లని చూసి "ఒరేయ్ నాలుగు నీళ్ళ బొండాలు కొట్టి తెండిరా, మేం పాక దగ్గిర ఉంటాం అన్నాడు సుబ్బారావు.    
    కొబ్బరితోట తరవాత ఒక ఎకరం మేరకాయ గూరలతోట ఉంది. తోటనిండా ఎన్నెన్నిరకాల కూరలు వంగ, బీర, ఆనప, పొట్ల, టొమాటో, దోస కాలిఫ్లవర్ బెండ మొదలు తోటకూర. కొత్తిమీరా దాకా రకరకాల మొక్కలు వరసలవారీగా పాతి, బోదెలుకట్టికాలువలు ఏర్పరచి ఎంతో చక్కగా పెంచుతున్నారు. అవేకాక ఓ పక్క మల్లె, గులాబి, చామంతి మొదలైన పూలతోటకూడా ఉంది ఆ తోట చూస్తూంటే అరుణకి కడుపు నిండిపోయింది. మనసంతా సంతోషంతో గంతులు వేసింది. "అబ్బ ఎంత బాగుందండీమీ తోట మీ తోటలో లేని మొక్కలే లావులా వుంది. ఎంత చక్కగా పెంచుతున్నారండీ!" ఉత్సాహంగా నాలుగుమూలలూ చూస్తూ అంది అరుణ.    
    "ఈకూరలన్నీ మీరేం చేస్తారు? వారానికొకసారి సంతకి తోలుకుపోతారు. మా దగ్గిర కొనుక్కుని కూరల వర్తకులు. ఇంకా కొంతమంది కొని తీసుకెళ్ళి పట్నాలలో అమ్ముతారు. ఎంత లేదన్నా ఈ కూరలవల్ల నెలకి అధమం నూరు రూపాయలు వస్తాయి. అక్కడికి ఎవరడుగుతేవారికి ఊరికే ఇస్తూనే ఉంటాను" అన్నాడు సుబ్బారావు గర్వంగా తోటనుచూస్తూ.    
    "బాగుందండీ ఈ తోట చూస్తే వదిలివెళ్ళాలనిపించడం లేదు మీ తోటలో లేనివి పండించనివి ఏమన్నా ఉన్నాయా అసలు?   
    "ఏదో పంచదార, కాఫీ అలాంటివి తప్ప ఏమి కొనం మేం ఆఖరికి చింతచెట్లు, కుంకుడు చెట్లు కూడా ఉన్నాయి మా తోటలో."    
    "పోనీ ఆ కాఫీ అదీ కూడా పండించేయకూడదండీ?" హాస్యంగా అంది అరుణ.    
    "పండించేవారేమో, ఇక్కడ కాదని ఊరుకుని ఉంటారు" కృష్ణమూర్తికూడా తమాషాగా అన్నాడు.    
    "పదండి అలా దగ్గరికి వెళ్ళికూర్చుందాం. కొబ్బరి నీళ్ళు తాగుదాం" అంటూ నాలుగడుగుల దూరంలో ఒంటి రాయి మీద వేసిన పాక దగ్గరికి తీసుకెళ్ళాడు సుబ్బారావు.    
    ఆఖరికి ఆ పాకమీద కూడా ఏదో తీగలల్లుకున్నాయి. పాకలోపల ఓ మడతమంచం, ఓకర్రకుర్చీ ఉన్నాయి. 'కొత్తరోజుల్లో రాత్రి, పగలు పొలంలోనే ఉండాలి ఎవరో ఒకరు కాపలా అందుకే ఈ మంచం అవీ." విశదపరిచి మంచం వాల్చి కూర్చోమన్నాడు. ఇద్దర్నీ తను కుర్చీ జరుపుకుని కూర్చున్నాడు. కాస్త అలసట తీర్చుకుంటూ కూర్చునే లోపల కొబ్బరిబొండాలు కొట్టి తీసుకొచ్చాడు పాలేరు. తృప్తిగా దాహం తీర్చుకుంది అరుణ.    
    "ఒరేయ్ వీరాయ్ ఏదన్నా గోనుంటే చూసి వంకాయలు, బెండకాయలు, ఆనపకాయలు అన్నీ ఏవుంటే అవి తలోరెండు వీసెలు కోసి తీసుకురారా ఊరికి పట్టుకెళతారు. మంచి పరువానికొచ్చిన పనస పండు ఒకటి చూడు సపోటాలుంటే అవికూడా కోయి. నిమ్మకాయలో ఏభై కోయి. అన్నీ తొందరగా గోనెలో కట్టి పట్రా ఇంటికి మధ్యాహ్నం బస్సుకి వెళ్ళిపోతారు" పురమాయించాడు పాలేరుకి సుబ్బారావు.    
    "అదేమిటి వద్దు వద్దు ఊరికి తీసుకెళ్ళడానికి ఎందుకు? వద్దండీ ఎవరు మోసుకెడతారు? అనవసరప్రయాస?" వారించాడు కృష్ణమూర్తి.    
    "మీరు మోస్తారా? బస్సు మోస్తుంది. రైలు మోస్తుంది. తీసుకెళ్ళండి. ఊరికే తోటలో కాచాయని ఇస్తున్నాను. తీసుకెళ్ళండి అంత కంటే మా పల్లెటూరివాళ్ళం ఏమిస్తాం?"    
    "అవిచాలు మాకు ఓ వారం పదిరోజులు కూర ఖర్చు లేకుండా చేస్తున్నారన్నమాట, సరే ఈయండి ఊరికే వస్తుంటే ఎందుకు వద్దంటాను?" అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ "పదండి అప్పుడే పన్నెండున్నరదాటింది. ఇంటికెళ్ళి భోజనం అవి చేసి బస్సుకువెళ్ళాలి. "కృష్ణమూర్తి తొందరపడుతూలేచాడు.    
    "వీరాయ్ తొందరగా తే" అంటూ సుబ్బారావు ఇంకోసారి హెచ్చరించాడు కోస్తున్న ఆ పాలు కారుతున్న లేత కూరలుచూసి "అన్నయ్యా అమ్మ ఈ కూరలు చూసి సంతోషపడుతుంది వెళ్ళినందుకు లాభంగా వచ్చామంటుంది. ఇంత ఫ్రెష్ కూరలు బజార్లో ఎక్కడ దొరుకుతాయి?" అంది అరుణ.    
    "అయితే ఈ ఊరొస్తే నాకు తోచనప్పుడల్లా మీ తోటకి వచ్చి కూర్చోవచ్చన్నమాట" అంది అరుణ నవ్వుతూ.    
    "నిరభ్యంతరంగా అందుకు పర్మిషన్ కావాలా?" అరుణ వంక తిరిగి నవ్వాడు. ఇంటికి చేరి లక్ష్మమ్మ పెట్టిన కమ్మని భోజనం ఇంకోసారి మెచ్చుకుంటూ తిని, తయారయ్యేసరికి రెండుగంటలయింది.    
    "మీరున్నారుకనక ఈ ఊళ్ళో మాకెలాంటిఇబ్బంది కనపడలేదు. స్వంత ఇంటికంటే ఎక్కువ సదుపాయాలు అమర్చారు. మీకెలా కృతజ్ఞత చెప్పుకోవాలో అని కృష్ణమూర్తి వెళ్ళబోయేముందు లక్ష్మమ్మగారి దగ్గిర శాస్త్రి గారిదగ్గిర సెలవు తీసుకుంటూ సుబ్బారావుతో అన్నాడు.    
    "ఆమాట అనవద్దన్నాను. ఒకపూట భోజనం పెట్టడం కంటే మేం చేస్తున్నది ఏముంది ఆవిడ చేయబోయేపని ముందు?"    
    "మాచెల్లెలు ఇక్కడికి వచ్చాక దానిమంచి చెడ్డచూసే భారం మీమీదే పెడుతున్నాను. దానికి తల్లి, తండ్రిలాంటిమీరు దాని కాస్త కనిపెట్టి ఉండండి." లక్ష్మమ్మ తో మర్యాదగా అన్నాడు కృష్ణమూర్తి.    
    "దానిదేముంది నాయనా మాచేత నయినంతగా అమ్మాయి మంచి చెడ్డా చూస్తాం ఏం బెంగపడవద్దని అమ్మకి, నాన్నగారికి చెప్పుబాబూ" అంది ఆమె.    
    అరుణ కూడా శాస్త్రిగారికి లక్ష్మమ్మగారికి నమస్కారంచేసి సెలవు తీసుకుంది.    
    "మీఅందర్ని చూశాక ఇక్కడనేను ఒక్కర్తినీ ఎలా ఉండగలనా అన్న ఆలోచనే రాకుండా లేదు" అందిరుక్కు చెయ్యి నొక్కి" నేను వచ్చాక నీవు నేను స్నేహితులం అయిపోదాం నేను నీకు చదువు చెబుతాను అంటూ స్నేహపూర్వకంగా చూసింది రుక్కు ఆమె అభిమానానికి తబ్బిబ్బయింది.    
    బండి బయలుదేరించి బస్సు వచ్చేదాకా ఉండి బస్సెక్కించాడు సుబ్బారావు "జమీందారు గారినించి ఉత్తరం రాగానే రాయండి. ఇక్కడ ఆ ఇల్లు అది బాగు చేయిస్తాను, చేరగానే ఉత్తరం రాయండి అని వీడ్కోలు తీసుకున్నాడు.    
    అన్నచెల్లెలు మళ్ళీ మళ్ళీ తమ కృతజ్ఞత చెప్పారు. బస్సు కదిలాక ఊరు దూరమవుతూంటే తృప్తిగా నిట్టూర్చింది అరుణ. ఆమెకి అన్నీ విధాల ఆ ఊరు నచ్చింది. ఆ మాటే అన్నగారితో అంది. "ఊరు అది బాగుంది కదన్నయా? ముందు ఎంతో భయపడ్డాను ఎలా ఉండటం, ఏమిటనికాని ఇప్పుడేభయం అనిపించడం లేదు అప్పుడే ఈ ఊరంటే ఏదో ఆత్మీయత కలుగుతుంది. నీకు నచ్చలేదా?"    
    "ఊ" అన్నాడు కృష్ణమూర్తి నిజానికి వచ్చేముందు ఎన్నో అనుమానాలతో చెల్లెలు చేయబోయేపనికి ఎంతో అయిష్టం చూపుతూ ఎంతో అసంతృప్తిగా వచ్చాడు. కాని ఊరు చూశాకా ముఖ్యంగా సుబ్బరావు ఇంటివాళ్ళున్నారు అన్న ధీమా కలిగాక అతని చెల్లెలు అక్కడ ఉంటె జరిగే అనర్ధం ముప్పు ఏదీ ఉండదు. తాము భయపడవలసినంత అధ్వాన్నంగా ఊరు ఏం లేదనిపించింది ఏ వంట మనిషినో పెట్టుకుని చెల్లెలు ఉండవచ్చు. సాయానికి చుట్టుపక్కల గుడిసెలవాళ్ళుండనే ఉన్నారు. యోగక్షేమాలు విచారించేందుకు సుబ్బారావు ఉండనే ఉన్నాడు. తాముభయపడడం అనవసరం అనిపించింది. అందుకే ఇప్పుడు కాస్త నిశ్చింతగా ఉంది అతనికి. ఆలోచిస్తూంటే ఆ ఊరి ప్రజలు ఎలా ఆతృతగా డాక్టరు కోసం ఎదురు చూస్తున్నారో స్వయంగా చూశాక అరుణ చేస్తానన్నది నేరం క్రింద కాక ఓ మంచిపనిలాగే అతనికీ అనిపించసాగింది.    
                                                                        * * *

 Previous Page Next Page