Previous Page Next Page 
ముగ్ధ పేజి 15

 

       అప్పుడే మేమొక నిర్ణయం తీసుకున్నాం. ఎలాగైనా హోంమంత్రిని పదవినుంచి దించెయ్యాలని చీఫ్ మినిస్టర్ని కలిసాం. గవర్నర్ ని కలిసాం ప్రైంమినిస్టర్ కి రిపోర్ట్ చేసాం. ఏం లాభంలేదు - డబ్బు - గుండాగిరి ఈ రెండూ వున్న ప్రతివాడూ ఇవాళ రాజకీయ నాయకుడవుతున్నాడు.
    
    ఆ రాజకీయ నాయకులు విద్యార్ధుల్ని కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తున్నారు. నిరుద్యోగుల్ని బలిపశువుల్ని చేస్తున్నారు.
    
    ఈ కూహనా రాజకీయమ్మీద మేం తిరుగుబాటు చేస్తున్నాం. మాకు నక్సలైట్ల సపోర్టు లేదు. మేం రాడికల్స్౦ కాదు. హింసావాదం మా సూత్రం కాదు విద్యావ్యవస్థని సర్వస్వతంత్రంగా మార్చమనే మా పోరాటం.
    
    పదవిలో వున్న ఏ రాజకీయ నాయకుడూ ఇవాళ ప్రజల గురించి ఆలోచించడం లేదు. ఎలక్షన్ల ముందు ఏవో కల్లబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు గుంజుకుని గెలిచిన ప్రతివాడూ అయిదేళ్ళపాటు ప్రజల్ని మరచిపోతాడు. ఎమ్.ఎల్.ఏ కాకముందు, ఎర్రని ఏగాణి కూడా లేనివాడు అయ్యాక లక్షలక్షలు సంపాదిస్తున్నాడు. మినిస్టర్ అయ్యాక కోట్లు సంపాదిస్తున్నాడు. చీఫ్ మినిస్టర్ అయ్యాక కోటానుకోట్లు సంపాదిస్తున్నాడు.
    
    ఎలా సంపాదిస్తున్నాడో ఎవడికీ అక్కర్లేదు. ఎవరూ పట్టించుకోరు. మామూలు మనిషి పది రూపాయలు దొంగతనం చేస్తే పట్టుకొని జైల్లో పెడతారే, మరి ఈ పొలిటీషియన్లు జోలికి ఎవరూ ఎందుకు వెళ్ళడం లేదు?
    
    ఎక్కడుంది లొసుగు?
        
    అందుకే అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా ప్రజల్ని, అమాయకుల్ని పీడించే రాజకీయ నాయకులకు బుద్ది చెప్పడానికి మేం ఉద్యమించాం.
    
    ఒక నెల రోజుల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి.
    
    ఈ ఎలక్షన్లలో అక్రమంగా గెలవడానికి ప్రయత్నించే రాజకీయ నాయకుల మీద మేం కన్నేసి వుంచాం. ప్రజాబలం లేకుండా డబ్బు ద్వారా, సారాద్వారా, రిగ్గింగ్ ద్వారా గెలవాలనుకుంటున్న వాళ్ళ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తాం. అందులో భాగంగానే హోంమంత్రి నిన్నటి సభను ధ్వంసం చేసాం." చెప్పాడు అరవింద్.
    
    నీలిమ కొద్ది క్షణాలు విచిత్రమైన ఆనందోద్వేగానికి గురయింది సరిగ్గా తను ఎన్నుకోవలసి ఉన్న వ్యక్తి - అంత త్వరగా తారసపడతాడనుకోలేదు. లక్ష్యం గొప్పదైనా దాన్ని సాధించేందుకు ఎన్నుకొనే మార్గం ఆవేశం, ఉద్రేకంతో కూడుకున్నది కాకూడదనేదే తన లక్ష్యం, ఇతను సరీగ్గా తనకు తగిన జోడీ....గొప్ప యాదృచ్చికం...
    
    "లక్ష్యం లేకుండా ధ్వంసం చెయ్యడంలో అర్ధంలేదు" నీలిమ అంది.
    
    అతనికేసే పరిశీలనగా చూస్తూ.
    
    "ధ్వంసం చెయ్యడం మా లక్ష్యంకాదు. కానీ కుహవా రాజకీయ వాదుల నుంచి సమాజాన్ని రక్షించడం ఈనాటి యువత కనీస బాధ్యత. మేం సమాజానికి చేసే మంచి, కొంచమైనా చెడుని తొలిగించడమే."
    
    "మీ ఆశయం గొప్పదే. కానీ ఇవాల్టి రాజకీయం రావణకాష్టం లాంటిది. అది మిమ్మల్ని వెంటాడి వెంటాడి చంపుతుంది. అందుకు మీరు సిద్దంగా వున్నారా?"
    
    "మేం సిద్దంగావున్నాం అందుకు అన్ని విధాలుగా సన్నద్దులమౌతున్నాం కూడా. మమ్మల్ని చూసి మరో పదిమంది మా ఉద్యమానికి సపోర్టు ఇస్తారన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే ఇవాల్టి యువత ఎంత నిరాశతోవుందో మీకు తెలుసు.
    
    అష్టకష్టాలుపడి చదివిన వాళ్ళు ఇవాళ రోడ్లమీద తిరుగుతున్నారు. ప్రతిభ ఉన్నవారు పస్తులుంటున్నారు. డబ్బున్నవాడే ప్రతిభావంతుడిగా చెలామణి అవుతున్నాడు.
    
    ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది ఇంజనీర్లు, ఎంతమంది సైంటిస్టులు, ఎంతమంది విద్యావేత్తలు విదేశాలకు వలస వెళ్లిపోతున్నారో చూడండి.
    
    ఈ దేశంలో వాళ్ళకు విలువలేదు కాబట్టి.
    
    జపాన్, కొరియాలాంటి దేశాలు అహర్నిశలూ పారిశ్రామిక ప్రగతిని సాధిస్తుంటే మనం ఐ.ఎమ్.ఎఫ్. అప్పుకోసం తిరుగుతుంటాం. ఒకకొత్త యంత్రాన్ని కనిపెట్టడం కోసం జపాన్ లోని వ్యక్తి పరిశోధనలు చేస్తుంటే, ఇండియాలోని వ్యక్తి మరొకపిల్లాడ్ని కనడానికి ప్రయత్నం చేస్తుంటాడని ఒక అమెరికన్ మన ఇండియా గురించి ఆ మధ్య వ్యాఖ్యానించాడు. ఇందులో నిజంలేదా చెప్పండి.
    
    దీనికి కారణం ఎవరు?
    
    పవర్ లోవున్నా రాజకీయ నాయకులే కదా...? వారి స్వార్ధమేకదా...!
    
    పొలిటీషియన్లే మా టార్గెట్ ఆవేశంగా చెప్పాడు అరవింద్.
    
    ఆ సమయంలో ఒక్కసారి తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు నీలిమకు.
    
    తన తండ్రి దారుణహత్యకు కారణం రాజకీయం దుర్మార్గమైన రాజకీయానికి తన తండ్రి బలయిపోయాడు.
    
    తను కక్ష తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది.
    
    అరవింద్ ను నఖశిఖ పర్యంతం పరిశీలిస్తోంది. అరవింద్ మాటల ద్వారా, చేతలద్వారా అతను వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యదానికి ప్రయత్నిస్తోంది నీలిమ.
    
    అప్పటికి పోలీస్ ఇన్ స్పెక్టర చెప్పిన గడువు పూర్తికావడానికి ఇంకో పదినిముషాలుంది.
    
    తర్వాతేం చెయ్యాలో ఆలోచిస్తున్నాడు అరవింద్.
    
                                                    *    *    *    *    *
    
    "మధర్ థెరిస్సా లాగా హెల్ప్ చేయడానికెళ్ళింది. ఇరుకునపడింది ఇప్పుడెలాగే" కంగారుపడుతూ అంది సురభి.
    
    "ఏం కంగారుపడద్దని చెప్పిందికదే చూస్తే ఇదేదో డ్రామాలా వుంది. వస్తుంది కదా" ముగ్ధ అంది.
    
    "ఆ కుర్రాడు బాగుంటాడా?" అలక ఆసక్తిగా అడిగింది.
    
    "ఎర్రగా, బుర్రగా బాగుంటాడు కానీ బ్లైండ్ మాన్" చెప్పింది ముగ్ధ.
    
    "గుడ్డివాడా" వికారంగా మొహంపెట్టి అంది అలక.
    
    "ఏదయినా ప్రమాదం జరిగితే?" అనుమానం వచ్చింది సురభికి.
    
    "ప్రమాదమూ లేదు పాదూలేదు గాని వెయిట్ అండ్ సీ ఏవైనా జోకులు చెప్పు. ఈ టెన్షన్ తగ్గుతుంది" అలక అంది సురభితో.
    
    "చిన్నపిల్లలా జోకులేమితే జోకులు. ఆ బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పవే ప్రాక్టీస్ చేస్తాను నేనుకూడా" అంది సురభి.
    
    "బాడీ లాంగ్వేజ్ గురించా అయితే చెప్పు" అలక అంది.
    
    "ఎగ్జాంపూల్స్ చెప్పనా థీరీ చెప్పనా" అడిగింది ముగ్ధ.
    
    "రెండూ చెప్పవే. ఫ్యూచర్ లో ఈ మగాళ్ళతో బాధలు పడకుండా వుండాలంటే దీని అవసరం బాగానే వుండేటట్టు వుంది" అంది అలక.
    
    "ఓ.కే అయితే వినండి. మనిషి దేహంచుట్టూ ఓ కాంతి వుంటుంది తెల్సుకదూ మన పాతదేవుళ్ళ పటాలు చూసినా, పౌరాణిక సిన్మాలు చూసినా, చుట్టూ కాంతి తిరుగుతున్నట్టు వుంటుంటే... పురాణాల్లో చెప్పిందే శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు. అలాగే మనిషి చుట్టూ కూడా ఆ మనిషికి చెందిన పర్సనల్ స్పేస్ కొంత వుంటుంది. అలాగే జంతువులకు కూడా.

 Previous Page Next Page