Previous Page Next Page 
ముగ్ధ పేజి 14

  

    అందుకే బయటకువెళ్ళే ప్రయత్నం చేయలేదు.
    
    ముగ్ధ, నీలిమ కాటేజ్ లన్నీ దాటి మెయిన్ రోడ్ మీద కొచ్చారు.
    
    రోడ్డంతా కళకళ్ళాడుతోంది.
    
    అటూ ఇటూ చూస్తూ నడుస్తున్న నీలిమ తనకెదురుగా వస్తున్న ఓ యువకుడ్ని చూసింది.
    
    నల్ల కళ్ళద్దాలు, చేతికర్ర, నీలిమ భుజానికి అతని భుజం తగిలింది. ముందుకడుగేస్తూ ఆ కుర్రాడు...
    
    "సారీ అంది గుడ్డివాడ్ని" అన్నాడు.
    
    నీలిమ అతడ్ని ఎగాదిగా చూసి "ఫర్లేదులెండి" అంది.
    
    "మీరు ఇక్కడివారేనా?" ఆకాశంవేపు చూస్తూ అడిగాడతను.
    
    "ఇక్కడివాళ్ళమే మీకేం కావాలి?"
    
    "నేనూ, మా ఫ్రెండ్స్ బెంగుళూరునుంచి వచ్చామండి. నన్నా పార్కులో కూర్చోబెట్టి మా ఫ్రెండ్స్ వెళ్ళారు. ఎంతకీ రాలేదని నేనూ మా కాటేజ్ కి బయలుదేరాను. మా కాటేజ్ నెంబరు డెబ్బయ్ అయిదండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ మా కాటేజ్ వరకూ నన్ను దిగబెడతారా?"
    
    ఆ మాట అంటున్న ఆ యువకుడువేపు చూసింది నీలిమ.
    
    దృఢమైన శరీరం, విశాలమైన నుదురు, చక్కనైన మనిషికి ఈ గుడ్డితనమేమిటో?
    
    జాలేసింది నీలిమకు.
    
    తాము దిగిన కాటేజ్ కి కొంచెం దూరంలోనే వుంది ఆ కాటేజ్.
    
    "రండి! నువ్విక్కడే వుండవే ముగ్దా రెణ్నిమిషాల్లో వచ్చేస్తాను."
    
    ముందు నడుస్తోంది నీలిమ అతని చేతి కర్రను ఓ వేపు పట్టుకొని వెనక నెమ్మదిగా నడుస్తున్నాడు ఆ యువకుడు.
    
    కాటేజ్ మెట్లెక్కాడు ఆ యువకుడు.
    
    "థ్యాంక్సండి బైదిబై న ఆపేరు అరవింద్! మీ పేరు తెల్సుకోవచ్చా?"
    
    "నీలిమ!"
    
    "అందమైన పేరు" అని జేబులోంచి కాటేజ్ కీ తీసి పట్టుకున్నాడు.
    
    "కీ తీయనా..." అంటూ అతని చేతిలోని కీతీసుకుని డోరుకున్న కీని తీసి, తలుపు తెరిచింది. అతనివేపు తిరగబోతున్నంతలో అరవింద్, ఆమెను లోనికి నెట్టాడు.
    
    ఆ విసురుకు నీలిమ వెళ్లి గదిలోనున్న బెడ్ మీద పడింది. వెంటనే అతను తలుపు లోన గడియవేసి, ట్యూబ్ లైట్ వేసి, చేతిలోని కర్రను పక్కకు విసిరేశాడు. నల్ల కళ్ళద్దాలు తీసి పక్కనున్న టేబిల్ మీద పెట్టాడు.
    
    ఒక్కక్షణంలో జరిగిన ఈ సంఘటనకు బెదిరిపోయింది నీలిమ.
    
    ఏం జరుగుతోందో అర్ధంకాలేదు.
    
    "వాట్ మిస్టర్! వాటీజ్ దిస్?" కోపంగా అరుస్తూ నిలబడింది ఆమెవేపు చూసి అరవింద్ చిరునవ్వు నవ్వుతూ-
    
    "మిస్ నీలిమ డోంట్ ఎఫైడ్! నా నుంచి మీకు ఏ రకమైన హాని జరగదు. ఐ  ఎష్యూర్ యూ! ప్లీజ్ కోపరేట్ విత్ మి! మిమ్మల్ని నేనిప్పుడు కిడ్నాప్ చేశాను. ఒక్క అరగంట మీరు నా కస్టడీలో వుండండి. ఆ తర్వాత వదిలేస్తాను" అన్నాడు అరవింద్ స్థిరంగా.

    "మీరు బైండ్ మాన్ కాదా? ఏమిటిది? నన్నెందుకు కిడ్నాప్ చేయడం?"
    
    "కాదు! బైండ్ మాన్ లా నటిస్తే మీలాంటివాళ్ళని ఎట్రాక్ట్ చేయవచ్చు. ఓ కాలేజ్ స్టూడెంట్ ని కిడ్నాప్ చేస్తేనే అరెస్టు చేసిన మా వాళ్ళని పోలీసులు వదిలిపెడతారు. అంతే చెప్పాడు అరవింద్.
    
    "మీ ఫ్రెండ్స్ ని పోలీసులు అరెస్టు చేసారా? ఎందుకు?" ప్రశ్నించింది నీలిమ.
    
    "కధంతా ఆ తర్వాత చెప్తాను. ఓ పావుగంట కామ్ గా కూర్చొండి" అంటూ ఫోన్ వేపు నడిచాడు అరవింద్.
    
    ఏదో నంబర్ డయల్ చేసాడు.
    
    "హలో తిరుమల పోలీస్ స్టేషన్."
    
    "ఎస్! ఇన్ స్పెక్టర్ స్పీకింగ్!"
    
    "మిస్టర్ ఇన స్పెక్టర! న ఆపేరు అరవింద్! నిన్న ఈవెనింగే కలిసాను. గుర్తుండే వుంటుంది మీరు అకారణంగా మా ఫ్రెండ్స్ ని అరెస్టు చేసారన్న విషయం మీకు తెల్సు. మర్యాదగా రిక్వెస్టు చేస్తే మీరు నా వాళ్ళని విడుదల చేయడం కుదరదన్నారు. అందుకే ఓ యూనివర్శితీ స్టూడెంట్ ని నేను కిడ్నాప్ చేసాను. ఒక గంటలోపల మా వాళ్ళని మీరు రిలీజ్ చెయ్యకపోతే, ఏం జరుగుతుందో మీకే వదిలేస్తున్నాను. ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడండి" అంటూ రిసీవర్ని నీలిమకిచ్చాడు అరవింద్.
    
    పోలీస్ ఇన్ స్పెక్టర్ అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్తోంది నీలిమ.
    
    "ఎంత సేపయింది మిమ్మల్ని కిడ్నాప్ చేసి?"
    
    "అరగంటయింది."
    
    "మీరేం చేస్తుంటారు?"
    
    "పద్మావతీ యూనివర్శిటీ ఎమ్.ఏ. ఫైనల్ పరీక్షలు రాసి, మా ఫ్రెండ్స్ తో కొండకొచ్చామండి."
    
    "మీరిప్పుడెక్కడున్నారు?" పక్కనే వున్న అరవింద్ వెంటనే రిసీవర్ లాక్కున్నాడు.
    
    "కిడ్నాప్ న్యూస్ కన్ ఫమ చేసుకున్నారు కదా. కరెక్ట్ గా ఒన్ అవర్ గుర్తుంచుకోండి."
    
    ఠక్కున ఫోన్ పెట్టేసాడు అరవింద్.
    
    "థాంక్యూ మిస్ నీలిమ. పోలీసులకు బహుశా మీ వాళ్ళు రిపోర్టు చేశారేమో! మీకేం ప్రమాదం లేదని మీ ఫ్రెండ్సు తో ఒకసారి చెప్పండి."
    
    తాము దిగిన కాటేజ్ కి ఫోన్ చేసింది నీలిమ.
    
    పావుగంటయినా నీలిమా రాకపోయేసరికి ముగ్ధ మళ్ళీ వెనక్కి వచ్చేసింది.
    
    ఆ సమయంలో   ఫోన్ మోగింది.

    ముగ్ధే ఫోన్ అందుకుంది.
    
    "ఆ నేనే! నీలిమను పోలీసులెవరైనా వస్తే నన్నెవరో కిడ్నాప్ చేసినట్టు నటించండి. ఒ.కే! డోన్ట్  వర్రీ! ఒక గంట తర్వాత నేనొచ్చి జరిగింది చెబుతాను" ఫోన్ పెట్టేసింది నీలిమ.
    
    "నేను ఇందాక బెంగుళూరని అబద్దం చెప్పాను. మాది హైద్రాబాద్ నిన్న తిరుపతిలో రాష్ట్ర హోంమంత్రి బహిరంగ సభను కొంత మంది కుర్రాళ్ళు విధ్వంసం చేసారనే వార్త ఇవాళ పేపర్లో వచ్చింది. ఆ మీటింగ్ లో అల్లరి సృష్టించింది మేమే. అందుకే నన్ను తప్ప మిగతా వాళ్ళందర్నీ అరెస్టు చేయించాడు హోంమంత్రి. నన్నెందుకు అరెస్టు చేయలేదని మీకు అనుమానం వస్తుంది. దానిక్కారణం.... ఆ హోంమంత్రి మా మేనమామ. ఆయన పేరు పశుపతి. ఇవాళ పొలిటీషియన్ అంటే ఒక పెద్ద గుండా కింద లెక్క. మినిస్టర్స్ అంటే గవర్నమెంటు గుండాలన్న మాట. తమ పదవుల్ని రక్షించుకోడానికి వాళ్ళు ఎలాంటి అవతారమైనా ఎత్తుతారు.        
    
    సిగ్గూ, లజ్జా లేకుండా ఎలాంటి పనులైనా చెయ్యడానికి వెనుకాడని వాళ్ళల్లో పశుపతి ఒకడు. కార్పొరేషన్ ఎలక్షన్లలో తన వర్గానికి చెందిన వాళ్ళకి మద్దతు ఇవ్వలేదనే నెపంతో రాత్రికి రాత్రి మా యూనివర్శిటీ హాస్టళ్ళల్లోకి పోలీసులచేత అమ్మాయిల్ని పంపించి, ఆ తర్వాత పోలీసులని పంపి స్టూడెంట్స్ అందర్నీ అరెస్ట్ చేయించాడు.
    
    పోలీస్ స్టేషన్లలో మా వాళ్ళని హోంమంత్రి అండతో పశువుల్ని బాదినట్టు బాదారు పోలీసులు.

 Previous Page Next Page