Previous Page Next Page 
అథర్వ వేద సంహిత పేజి 15

 

3.    మా ఆశలు ఫలించును గాక. ద్యావాపృథ్వులారా! మాకు బలకరమగు అన్నము ప్రసాదించండి. ఏకమనస్కులగు మీరు ధనము, దక్షత కలిగించండి.
   
    ఇంద్రా! నీ అనుగ్రహమున ఇతడు క్షేత్రములను జయించును గాక. శత్రువులను పరాజితులను చేయును గాక.
   
4.    ఇతడు తృషార్తుడు. ఇంద్రుని వలన జీవితమును, వరుణుని వలన బలమును, మరుత్తుల ప్రేరణ కలిగి మాలో కలసినాడు. ద్యావాపృథ్వులారా! ఇతనిని మీ వడిలో పెట్టుకొని అన్నార్తుని, దాహార్తుని కానీయకండి.
   
5.    బలవతులగు ద్యావాపృథ్వులారా! ఈ తృషితునకు మీరు బలకర అన్నము కలిగించండి. జల సంపన్న ద్యావాపృథ్వులారా! ఇతనికి జలము ప్రసాదించండి. ద్యావాపృథ్వులారా! మీరు ఇతనికి కోరిన అన్నము, బలము ప్రసాదించినారు. విశ్వేదేవతలు, మరుద్గణములు, జలదేవతలు కూడ ఇతని యందు బలమును స్థాపించినారు.   
   
6.    తృషార్తా! నేను నీ సరస హృదయమును సుఖప్రద జలముచే సరిత్రుప్తుని చేయుచున్నాను. అప్పుడు త్రుషా రోగ రహితుడవగుదువు. నీవు తేజొ సంపన్నుడవై ఆనందించుము. ఒకే ఆసమున ఉండి, ఒకే వస్త్రము ధరించిన రోగి, మరియు నిరోగీ! ఈ 'మంధ' యందు అశ్వినులు వైద్యము ఉన్నది. దీనిని త్రాగండి.
   
7.    పూర్వము ఇంద్రుడు వృత్రాదులను వధించి తృషితుడైనాడు. అప్పుడు అతడు ఈ పుష్టికర 'మంథ' ను సృష్టించినాడు. అది బలకరము. ముసలి తనమును తొలగించునది.
   
    వ్యాధిగ్రస్తా! నీవు అట్టి మంథమునే సేవించినావు. అందువలన తేజో సంపన్నుడవగుము. శత శరత్తులు జీవించుము. నీవు సేవించిన మంథగుణము నీ దేహమును విడువకుండును గాక. అది నీకు బలము కలిగించును గాక. ఆది వైద్యులే నీ కొరకు ఈ ఓషధి కల్పించినారు.
   
                                        నాలుగవ సూక్తము - 30
   
వినియోగము :-

   
    స్త్రీవశీకరణము. చెట్టు బెరడు, శరఖండము, తగరము, అంబనము, కూటము మున్నగు     ద్రవ్యములను నూరి నేతిలో కలిపి స్త్రీ యొక్క యోనికి పూయవలెను.
   
1.    నేల మీది గడ్డిని గాలి కదిలించును. ఊపును. యువతీ! అట్లే నీ మనసును కదిలించుచున్నాను. ఊపుచున్నాను. ఇక నీవు నన్ను ప్రేమించుము. నన్ను విడువకుము. అన్యత్ర వెళ్ళకుము.
   
2.    అశ్వినులారా! నేను ప్రేమించు దానిని నావద్దకు చేర్చండి. ఆమెను నాకు కూర్చండి. మీ ఉభయుల భాగ్యములు నా యందు చేరును గాక. మీ మనసులు, వ్రతములు నాలో ప్రవేశించును గాక.
   
3.    ఏ సందేశమును చక్కని రెక్కల పక్షులు వహించునో, దేనిని ఆరోగ్యవంతుడగు ప్రేమికుడు వెలిబుచ్చదలచునో అట్టి నా సందేశము దేహములోనికి బాణము వలె నా ప్రియురాలి మనసున దూరును గాక.
   
4.    మనసేదో మాట అదే. మాట ఏదో మనసు అదే. అట్టి అనాఘ్రాతలు, అందకత్తెలగు కన్యల నిర్మల మనసులను, ఓషధీ! నా వైపు మరలింపుము.
   
5.    అశ్వము సకిలించుచు ఆడగుర్రమును చేరును. అట్లే ఆమె పతికామియై నన్ను చేరినది. నేను భార్యకామినై, భాగ్య సహితముగా ఆమెను చేరినాను.
   
వ్యాఖ్య -    'ప్రేమ'. ఆ పదమే కుసుమ కోమలము. మధురము. మనోహరము. ప్రాణము! చాలునా ఈ పదములు! ఇవి ప్రేమకు సరిరాగలవా? ప్రేమ మనసిజము. అక్షరమున బంది కాగలదా?
   
    ప్రేమ జగదాధారము. ప్రేమ జీవనాధారము. ప్రేమ ప్రాణాధారము. ప్రేమ లేనిది జగము లేదు. జీవము లేదు. ప్రాణము లేదు. ఏదీలేదు!
   
    ప్రేమ పరువముది మాత్రము కాదు. కాని పరువపు ప్రేమ లోనే మురిపెము. యువతీ యువకుల ఆరాటము. ఆవేదన. వేదన. వలపు తలపు. ఇవి ఎంత రమ్యములు! పరువమును వెనుకకు తెప్పించునవి!!
   
    యువతీ యువకుల ప్రేమ తపస్సులో కారణము ఎరుగము. ఆమె కఠినురాలు. ఉలకదు. పలుకదు. అందదు. అందకుండదు. అతడు తాళ జాలడు! ఆమెకు చేర జాలడు!! ఈ నిరీక్షణమే కావ్యము.
   
    "కశ్చిత్కాంతా విరహగురుణా" అని కాళిదాసు మేఘసందేశము ఒక విరహార్తుని వేదన!
   
    ఋగ్వేదమందలి ఊర్వశీ విక్రముల ప్రేమగాథ వెన్నెలలోని కాళిదాసు అమృత లేఖనిలో "విక్రమోర్వశీయము" గా అమరమైనది.
   
    లైలా మజ్నూ, షీరీఁఫర్హాద్ ల ప్రేమ గాథలకు జరా మరణములు లేవు.
   
    అనాది నుంచి కావ్యమునకు ఆధారము ప్రేమయే గదా! ఆ రాణి ఇన్ని యుగాలుగా కఠినురాలేకదా!
   
    "రాళ్ళుసైతము కన్నీరు రాల్చెగాని
    నీవు కరుగవు నా రాత నేమనందు?
    విరహమందున ఎన్నెన్ని వెతలు కలిగె!
    నిన్ను బాసియు జీవించ నేర్చు కొంటి" అన్నాను.
    జాలిమ్! జరా ఆ దేఖ్ మేరీ లాష్ కొ
    ఆంఖేఁఖులీహైఁ తేరె ఇంతె జార్ మె 'జఫర్'   
    వెతల దాన! రా చూడు నాశనాన్ని
    కనులు తెరిచి ఉన్నవి నీ కొరకు వేచి.
    ఈ సూక్తమున "వినియోగము తప్ప" మిగిలినది తీయని వలపు జల్లు!
   
    ప్రేమయే భక్తి అగును. మాతృభక్తి, దేశభక్తి, దైవభక్తి తరణోపాయములగును.
   
    "ఏయమగన్ పతికామా జనికా మోహమాగమమ్
   
    అశ్వః కని క్రదద్ యథా భగేనాహమ్ పహగమమ్"
ఈ సూక్తపు 6వ ఋక్కు.
   
                                    ఐదవ సూక్తము - 31
   
వినియోగము :-
   
      1) క్రిమిరోగ శాంతికి నేయి కలసిన నల్ల శనగలను ఆహుతి ఇవ్వవలెను. గోవాలముచే చుట్టిన     'శరఖండము'ను భేదించి అగ్నిలో కాల్చి ఉంచవలెను. గొందిలోని దుమ్ము కుడిచేతిలో తీసికొని ఎడమ     చేతిలో వేసికొని దక్షిణ ముఖుడై ఈ సూక్తమును జపించుచు రోగి మీద వేయవలెను. రోగి దీనిని జపించుచు     చేతితో ధూళి కణములను రుద్దవలెను.
   
1.    ఇంద్రుని వద్ద ఒక మహా శిల ఉన్నది. అది సమస్త క్రిములను నాశము చేయునది. నేను ఆ శిలలచే దేహమందలి క్రిములను శనగలను వలె పిండి చేయుదును.
   
2.    దేహమునందున్న కంటికి కనిపించు, కనిపించని క్రిములను నిర్మూలించుచున్నాను. వల వలె లోన వ్యాపించిన క్రిములను నాశము చేయుచున్నాను. రక్త మాంసములను చెరచు 'అల్గండు' 'శల్గ' మరియు ఇతర క్రిములను ధ్వంసము చేయుచున్నాను.
   
వ్యాఖ్య -    సూక్ష్మజీవులు వ్యాధి కారకములని ఆనాడే గ్రహించినట్లున్నారు - ఇది ఈ నాటి మాట కాదు. వానిని వర్గీకరించి పేర్లు సహితము పెట్టినారు.
   
3.    అల్గండు క్రిములను మహా సాధనమున నశింపచేయుచున్నాను. అవి తప్యములైనను, అతప్యములైనను నిర్జీవములైనవి. క్రిముల రకములలో మాడిన, మాడని వాటినన్నింటిని మంత్రముచే నిశ్సేషము చేయుచున్నాను.
   
4.    క్రిములు జీర్ణ కోశమున క్రమముగా చేరునవి కలవు. తలలో, పక్కలందు ఉండును. అధో ముఖముగ సంచరించునవి. ఎట్లైన ధారి చేసుకొని దూరునవి ఉన్నవి. కొన్ని నాశనము చేయలేనివి. నేను వాటినన్నింటిని మంత్ర బలమున నశింపచేయుచున్నాను.
   
5.    పర్వతములందు, అరణ్యములందు, పశువులందున్న క్రిములను - గాయములు, అన్నపానముల ద్వారా లోన చేరిన - క్రిముల ఉత్పత్తినే నేను ధ్వంసము చేయుచున్నాను.
   
                                      ఆరవ అనువాకము
                                    మొదటి సూక్తము - 32

   
వినియోగము :-   

   
    గోవుల క్రిమిచికిత్స యందు, మూడు సంధ్యలందు, పుండు మీద దర్భలను తాకించవలెను.
    గత సూక్తము నందు వలె నేయి కలిపిన నల్ల శనగలను హోమము చేయవలెను.
   
1.    గోవుల శరీరములందున్న క్రిములను ఉదయించు సూర్యుడు తన వ్యాపక కిరణములచే ధ్వంసము చేయును గాక.
   
2.    అనేక రకముల క్రిములను చతురక్షులు, సారంగులు, అర్జునములను నాశనము చేయుచున్నాను. క్రిముల పొట్టలను, క్రిముల చేరి చెరచిన అవయవములను ఛేదించుచున్నాను.
   
వ్యాఖ్య -    ఇది శస్త్రచికిత్స. మంచి అవయవమును రక్షించుటకు చేడు అవయవమును తొలగించుట. ఇది నేటి ఆధునిక చికిత్స యందున్నది.
   
    "అంగ వ్రాతములో జిగిత్సకుడు దుష్టాంగంబు ఖండించిశే
    షాంగ శ్రేణికి రక్షసేయు క్రియ" అని శ్రీమద్భాగవతము ప్రహ్లాద చరిత్రమున చెప్పబడినది.
   
3.    క్రిములారా! మిమ్ము అత్రి, కణ్వ, జమదగ్నులు వధించినట్లు వధించుచున్నాను. అగస్త్యుని మంత్ర శక్తిచే మీరు మరల పుట్టకుండ చేయుచున్నాను.
   
4.    మా మంత్రౌషధములచే క్రిముల రాజు, మంత్రి హతులైనారు. క్రిముల తల్లి, తోబుట్టువుల సహితముగా సమస్త క్రిమి కుటుంబము హతమైనది.
   
    (మాతా, భ్రాతా అన్నాడు. 'పితా' అనలేదు. క్రిములకు తండ్రి ఉండడు. వాటి ఉత్పత్తికి సంగమము అక్కరలేదు.)
   
5.    క్రిముల స్థానము ధ్వంసమైనది. ఇరుగు పొరుగు స్థానములు ధ్వంసమైనవి. క్రిముల బీజము ధ్వంసమైనది. సూక్ష్మాతి సూక్ష్మ క్రిములు ధ్వంసమైనవి.

 Previous Page Next Page