అందమైన నవ్వు విన్పించేసరికి తలెత్తిచూశాడు కాళేశ్వర ప్రసాద్.
ఎదురుగా విచిత్రంగా, చోద్యంగా చూస్తున్న సుదేష్ణాదేవి.
భార్యను చూడగానే కొడుకుని బెడ్ మీద పడేసి, చీర విప్పేస్తూ__
"చూడు సుదేష్ణా...! వీడు నీ చీరను నా మీద విసిరేశాడు..." అన్నాడు.
"చీరను వాడు విసిరేశాడా - వాడ్ని మరపించడానికి మీరే కట్టుకున్నారా....కట్టుకుంటే కట్టుకున్నారు గానీ భలే వున్నారులెండి-ఈ చీరలో మీరెలా వున్నారో తెల్సా?" నవ్వుతూ అడిగింది.
"ఎలా వున్నానూ?" తనవేపు చూసుకొంటూ అడిగాడు కాళేశ్వర ప్రసాద్.
"చీర కట్టుకున్న దారా సింగ్ ఎలా వుంటాడు....అలా వున్నారు. మొత్తమ్మీద నా కొడుకుని మీ చీర మాజిక్ తో భలే మోసం చేసేశారు లెండి..." కొడుకుని అతని చేతుల్లోంచి అందుకొంటూ అంది సుదేష్ణాదేవి.
ఎదురెదురుగా నిలబడిన తల్లి చీరవేపు, తండ్రి చీరవేపు ఆశ్చర్యంగా తలతిప్పుతూ చూస్తున్నాడు తేజ.
సరిగ్గా అదే సమయంలో-
డోర్ వరకూ వచ్చిన పి.ఎ. "సార్!" అని పిలవడంతో, ఒక్క ఉదుటున పక్క రూమ్ లోకెళ్ళిపోయి, గబగబా చీరను విప్పేసి పడేసి, డ్రెస్సింగ్ మిర్రర్ లో ముఖాన్ని ఒకసారి చూసుకుని, గబగబా పరుగెత్తి బయటికెళ్ళి పోయాడు కాళేశ్వర ప్రసాద్.
ఆ దృశ్యాన్ని చూస్తున్న సుదేష్ణ, పొట్ట చెక్కలయ్యేలా నవ్వింది.
నవ్వుతున్న తల్లి ముఖంవేపు చూసి, తనూ ఎందుకో నవ్వేస్తున్నాడు తేజ.
౦ ౦ ౦
మామిడి చెట్టుకింద పులి-జూదం ఆడుతున్నారు ముగ్గురూ.
"ఒరేయ్ వీర్రాజూ! అయిడియా దొరికిందా?" అని అడిగాడు సేతురాజు, రాళ్ళను గిలకరించి వేస్తూ.
"అయిడియా దొరకలేదు గానీ, సొరంగం దొరికింది!" అన్నాడు వీర్రాజు.
"సొరంగం దొరకడమేమిట్రా?" అడిగాడు పోతురాజు.
"అదే జ్ఞానులికీ, అజ్ఞానులకీ డిఫరెన్స్...చెప్పింది విను. డైనింగ్ హాల్ వెనక-స్టాఫ్ క్వార్టర్స్ కోసం పునాదులు తవ్వుతున్నారా?"
"అవును!"
"రాత్రి ఏడు గంటలు దాటాక, ఆ పునాదుల దగ్గర ఎవరూ వుండరు. అవునా?"
"అవును!"
"ఆ పునాదుల్లోంచి, మనం బయటికి సొరంగం తవ్వుతామన్న మాట!"
"ఆ సొరంగం, ఏ హోమ్ మినిస్టర్ చాంబర్ లోకో వెళ్ళిందనుకో- అప్పుడో?" దీర్ఘం తీస్తూ అన్నాడు పోతురాజు.
"అందుకే నిన్ను అజ్ఞానీ అన్నది! అదృష్టవశాత్తూ హోమ్ మినిస్టర్ చాంబర్ కే మనం సొరంగం తవ్వగలిగామే అనుకో - మన పంట పండినట్టే లెక్క....యావజ్జీవ శిక్ష ఖాయం!"
"అప్పుడు హోం మినిస్టర్ మన అదృష్టవశాత్తూ ఒంటరిగా ఫైల్స్ చూస్తూ వున్నాడనుకో...మర్డర్ కూడా అక్కడే కానియ్యొచ్చు-ఒక పనై పోద్ది!"
"ఎవర్నీ-హోం మినిస్టర్నే?" ఆశ్చర్యంగా కళ్ళేగరేస్తూ అన్నాడు సేతురాజు.
"పర్మనెంట్ గా జైల్లో సెటిలవ్వాలంటే, ఆ మాత్రం డేరింగ్ వుండాలి మరి! అంచేత ముందు మనకు కావల్సింది మంచి, కొత్తదైన గునపం...అంతే!" గట్టిగా అన్నాడు వీర్రాజు.
సరిగ్గా అదే టైమ్ లో డామ్మని ఊడిపడ్డాడు జైలర్ ఆందోళన రావు.
"పనిచేయడానికి ఒళ్ళు వంగదు కానీ, గునపాలూ, పారలూ లాంటి మారణాయుధాల గురించి డిస్ కస్ చేస్తున్నారేంటి?"
"మేం పారాలు గురించి డిస్ కస్ చేయడంలేదు- ఉత్తి సింగిల్ గునపం గురించి మాట్లాడుకుంటున్నాం!"
"ఎందుకూ - అదేమైనా మన నేషనల్ సింబలా?" నలువేపులా ఖైదీల వేపు చూస్తూ అన్నాడు ఆందోళనరావు.
"కాదు గురూ గారూ! మీరు కొంచెం ఓపిగ్గా వింటే, మేం కూడా మా ప్లాన్ చెప్తాం."
"చెప్పండి!" బుర్ర గోక్కుంటూ అన్నాడు జైలరు.
"పది కాలాలపాటు జైల్లో, మీ శిష్యులుగా వుండాలనుకుంటున్నామా- అలా వుండాలంటే, మేం పెద్ద నేరం చెయ్యాలి గదా!"
"అవును, చెయ్యాలి."
"మిమ్మల్ని పర్మిషన్ అడిగి, తప్పించుకుని వెళ్ళిపోవడానికి ఇదేం గవర్నమెంట్ స్కూల్ కాదు గదా..."
"నేను చాలా స్ట్రిక్ట్....నేను పర్మిషన్ ఇవ్వను!"
"అందుకే- జైలుని తవ్వేసి, వెళ్ళిపోదామనుకుంటున్నాం!"
మొదట పరాగ్గా విని, ఆ తర్వాత సీరియస్ గా అర్ధం చేసుకుని__
"ఏంటీ - జైలుని తవ్వేస్తారా?" నోరెళ్ళబెడుతూ అన్నాడు జైలరు.
"మొత్తం ఎందుకు తవ్వుతాం- ఏదో పార్ట్ లో తవ్వుతాం! అలాగే మర్డరు ప్లాన్ కూడా వేసామనుకోండి....వీటన్నిటికీ ముందు గునపం కావాలి గదా? అదీ విషయం!"
అసలు విషయం అప్పటికి అర్ధంకాగానే, ఆగ్రహోదగ్రుడై పోయాడు ఆందోళనరావు.