ఎంతో సుదీర్ఘమైన వుత్తరం వ్రాసి వుంటాడనుకున్న విజయ్ కి ముందు నిరాశ కలిగినా ఆ నాలుగు ముక్కలే ఆనందాన్ని కలిగించాయ్.
'పెళ్ళియింకా రెండు రోజులుంది కానీ యీ రోజు రాత్రికే బయలు దేరితే కానీ సకాలానికి చేరుకోవటం కష్టం' అనుకున్నాడు.
'సార' అని పిలిచాడు సి.సి.
ఒక్కసారిగా బాహ్య స్మృతిలోకి వచ్చి 'కమిన్' అన్నాడు విజయ్.
తర్వాత రొటీన్ కార్యక్రమాలన్నీ అ జరిగిపోయాయి.
ఎమర్జన్సీ క్రింద సెలవు పెట్టేసి వెళ్ళిపోయాడు విజయ్.
విజయ్ ట్రయిన్ ఎక్కే వేళకు సూర్యుడు డ్యూటీ నుంచి సెలవు తీసుకుంటున్నాడు. మబ్బులు షికారుకి వచ్చిన ఆడపిల్లలా చెల్లా చెదురుగా ఆడుకుంటున్నాయ్.
ఫస్టుక్లాసు కంపార్టుమేంట్ కావటంతో దాదాపు విర్జనంగా ఉంది కంపార్టుమెంట్. ఆ చివర ఎవరో భార్యాభర్తలు పడుకుని నిద్రపట్టించుకోవటానికి మాట్లాడుకుంటున్నారు.
రీడర్స్ డైజెస్ట్ తీసి చదవసాగాడు విజయ్.
గడియారంతో పాటు ట్రెయిన్ కూడా వేగంగా పరిగెడుతూ ఉండడంతో స్టేషన్ ఒక్కొక్కటే వెనుకబడిపోతున్నాయ్. చదవటంలో నిమగ్నుడయిన విజయ్ కి ఎంతదూరం ప్రయాణించింది తెలియటం లేదు.
హొరుమని గాలి విచటంతో ఉలిక్కిపడ్డట్టయినాడు విజయ్.
కంపార్టుమెంటు డోర్ తెరవబోతే బుస్సుమని నాగుపాములా జల్లుతో కొట్టింది గాలి. ఒకడుగు వెనక్కివేశాడు.
ఉదృతమైన గాలి వాన.
ఆకాశమంతా మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయ్.
ముఖం ఫై పడిన జల్లులు తుడుచుకుని బెర్త్ పై కూర్చుంటూ వుస్సురుమని నిట్టూర్చాడు. ఆహ్వానం లేని చుట్టల్లా పెళ్ళిళ్ళకోస్తాయ్ వానలు అనుకున్నాడు విజయ్ భారమైన మనస్సుతో.
అతని మనస్సులాగే గాలివానలో భారంగా వెళుతోంది ట్రెయిన్.
రేణిగుంటలో ట్రెయిన్ ఆగినపుడు కొద్దిగా తలుపు తెరచి చూశాడు మళ్ళీ ప్లాట్ ఫామ్ పైన ప్లాప్ పిక్చర్ కి రెండో వారంలో రెండో ఆటకి వచ్చినట్లుగా వున్నారు జనం.
పెళ్ళిళ్ళన్నీ ఎప్పుడూ వేసవి కాలంలోనే ఉంటాయ్. సామాన్యంగా. వాటికీ జతగా వర్షాలు తప్పవు. 'నానవేసిన బియ్యం తింటే పెళ్ళిరోజు వానవస్తుందిరా' అనేది అమ్మమ్మ చిన్నప్పుడు.
ఒకదానికొకటి సంబంధం లేని ఆలోచనలతో తల వేడెక్కిపోయింది. ఎవరయినా కనిపిస్తే కాఫీ యో టీయో త్రాగుదామని చూశాడు విజయ్. దాదాపు నాలుగు గంటలయిందేమో ప్యాసింజర్ల గతి పట్టించుకునేవాడేలేడు.
బరువుగా శరీరాన్ని యిడ్చు కుంటూ వెళ్ళే వ్యక్తిలా బయల్దేరింది ట్రెయిన్.
ఆగుతూ సాగుతూ ఎదురైనా రైళ్ళకి దారి ఇస్తూ తీసుకుంటూ ఎలాగయితేనేం ఆరింటిలోగా మద్రాసు చేరుకుంటుందన్న ట్రెయిన్ ఉదయం పదకొండు గంటలు దాటేవరకు చేరలేదు.
సెంట్రల్ లో దిగేసరికి యింకా జోరుగా కురుస్తోంది వర్షం.
ఆ వర్షంలోనే గబగబా దిగి వెళ్ళిపోతున్నారు ప్రయాణికులు.
తనలాగా పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళు కోర్టులకి వెళ్ళేవాళ్ళు, సినిమాల్లో చేరాలనుకుని వచ్చేవాళ్ళు, స్మగుల్ద్ వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్ధులు, ఉద్యోగస్తులు రకరకాల జనం ఆదరబాదరగా ఆతురతతో వెళ్ళిపోతున్నారు.
గత్యంతరం లేక ట్రెయిన్ దిగి పోర్టర్ చేతికి లగేజ్ అందించి టికెట్ యిచ్చి ఎంక్వయిరీ వద్దకి వెళ్ళి కుంభకోణం వెళ్లే ట్రెయిన్ టైమింగ్స్ అడిగాడు.
మొదట చికాకుగా జవాబు యిచ్చినా సహజమైన విజయ్ కలెక్టరీ టివికి జంకి కాబోలు మళ్ళీ చక్కగా జవాబు చెప్పాడు క్లార్క్. ఈ వర్షం వలన షెడ్యుల్డ్ టైమ్ కి ఏ ట్రెయిన్ లేదు. అదయినా ఈ వర్షం తగ్గితేనే!
నిస్పృహతో నిరాశతో బయటికి వచ్చి టాక్సీలో కూర్చున్నాడు విజయ్.
లాడ్జిలో దిగి డ్రెస్ చేంజ్ చేసుకుని స్నానం చేసి భోజనం చేసేసరికి దాదాపు రెండయింది.
ఇలా యిక్కడ లాడ్జిలో కూర్చుని నిట్టుర్చుతూ నిరాశతో కొట్టు మిట్టాడుతూ వుండేదాని కంటే ఏదయినా ప్రయత్నం చేద్దామని గదికి తాళం వేసి వచ్చాడు బయటికి.
మేనేజర్ వద్దకి వెళ్ళి హల్లో కూర్చుని అడిగాడు.
"కుంభకోణం వెళ్ళటానికి ఏదయినా బస్ వుందా?"
"వుండొచ్చు సార్! కానీ వర్షం మూలంగా వెళతాయో వెళ్ళవో తెలీదు."
"పోనీ ఏదయినా కారో, టాక్సియో......."
అతని అత్రుతకి అమయకత్వానికి నవుతోన్నట్టుగా "ఈ వర్షంలో కిరాయికి వచ్చేవాడేవడు సార్" అన్నాడు.
"పాడు వర్షం" తిట్టుకోబోయాడు విజయ్.
అతను ఇంకేదో అనబోతూ వుండగా "అబ్బబ్బ! అలా అనోద్దండి సార్! తమిళనాడు రెండేళ్ళుగా యిలాటి వర్షాలకి మొహం వాచిపోయింది. మంచినీటి ఎద్దిడితో చచ్చిపోతున్నారు. కురవనివండి సార్! బాగా కురిస్తే పల్లె పట్నం రెండూ సంతోషిస్తాయి" అన్నాడు అతను ఆనందంగా.
తన చిరాకుకి, అతని ఆనందానికి లంగరందదనుకుని "నేను రూములో వుంటాను" మీరు ఫోన్ చేసి ట్రెయిన్ విషయమో, బస్ విషయమో కనుక్కుని చెపుతారా?" అన్నాడు విజయ్.
"అలాగే సార్" అన్నాడతను వినయంగా.
రూముకు వచ్చి బెడ్ పై వాలుతూ 'ఇక యిరవై నాలుగుగంటలు మాత్రమే అది దాటిపోతే తను ఇక వెళ్ళటం అనవసరం అనుకున్నాడు.
అతని మనస్సు మనస్సులో లేదు. ప్రాణానికి ప్రాణమైన జగన్నాధం పెళ్ళి ప్రకృతి చూస్తే యిలా వుంది. మనసుకే రెక్కలు వుంటే ఎప్పుడెప్పుడు వెళ్ళి వాల్దామా అని వుంది కానీ ప్రకృతి మానవుడి కంటే శక్తివంతమైంది.
ఆలోచనలతో మనసు మొద్దుబారిపోయింది.