దాదాపు ఎనిమిది గంటల ప్రాంతంలో ఫోన్ చేసి చెప్పాడు మేనేజర్ "రాత్రి పదింటికి ట్రెయిన్ వుంది. అది వెళుతుందో లేదో ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు . వెళ్ళి కూర్చుంటే వెళితే వెళ్ళొచ్చు.
ఆ రైల్వేస్టేషన్ ఎదురుగా వున్న లాడ్జి దగ్గర ఓ టూరిస్టు బస్ కూడా తయారుగా వుంది. పాసింజర్స్ నిండితేనే వెడుతుంది.
ఆ కాస్త ఆశకే అతని మనస్సుకి రెక్కలు వచ్చి, గబగబా సర్దుకుని రూమ్ ఖాళీ చేసి ఆఘమేఘాల మీద ఎగ్మూర్ స్టేషన్ చేరుకున్నాడు. ఎంక్వయిరీ వద్దకి వెళ్ళి అడిగితె కౌంటర్ లో అడగమన్నారు.
:చెప్పలేం సార్! అక్కడి నుంచి దారి బావుందని ఫోన్ వస్తే పదకొండుకో పన్నెండుకో బయలుదేరుతుంది" అన్నాడు.
నిట్టూర్చి "అక్కడికి షెడ్యుల్ గా ఎంతకు చేరుకోవాలి" అని అడిగాడు.
భార్యా అనారోగ్యాన్ని గురించి ప్రశ్న వేస్తె జవాబు చెప్పే సిద్దాంతి ధోరణిలో చూసి తమాషాగా నవ్వి "రైళ్ళు రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలుసు సార్?" అని కాసేపు ఆగి "కానీ కనీసం రేపు ఉదయం పది పన్నెండు గంటలయినా అవుతుంది" అన్నాడు.
హతాశుడయ్యాడు విజయ్.
గాబరాగా ఏమి తోచని మనస్సుతో అటూ యిటూ పచార్లు చేస్తున్న అతన్ని చూసి ఓ వ్యక్తి వచ్చి "సార్! ట్రెయిన్స్ నమ్ముకుని బాగు పడ్డవాడు లేడు. అందులోనూ యీ హెవి రేయిన్స్ లో మీరు వెళ్ళాలంటే బస్సు తప్ప మరో మార్గం లేదు. అక్కడ ఓ బస్సు వుంది. చార్జీ పదిహేనురూపాయలు. తెల్లారాక ఓ గంట అటో యిటో మీరు కుంభకోణం లో వుంటారు" అన్నాడు.
ప్రాణాలు లేచి వచ్చాయి అతనికి.
ఏట్లో మునిగేవాడికి గడ్డిపోచ కూడా ఆధారమయినట్లు మరో ఆలోచన లేకుండా వెళ్ళి కూర్చున్నాడు. బస్సులో పాతిక మంది వున్నారు. అందరి ముఖాల్లో ఆతురత, ఆరాటం.
దాదాపు ఒంటిగంట ప్రాంతంలో బయలుదేరింది బస్. ఒక విధమయిన ఆనందంతో నిట్టూర్చాడు విజయ్. "ఎల్లాగయినా పెళ్ళి ముహూర్తం వేళకి చేరుకోగలడు . ఇక చింతలేదు." అనుకున్నాడు విజయ్.
ఎవరికి దయ వున్నా లేకపోయినా తను తప్పక దయ తలుస్తుంది అన్నట్టు నిద్రా దేవి అతన్ని కరుణించింది. హటాత్తుగా మెళుకువైంది విజయ్ కి. చూస్తే ఆరు కావస్తోంది.
ఎందుకో బస్సు ఆగిపోయి వుంది. ఒక్క క్షణం పాటు అయోమయంగా వుందతనికి.
బయట యింకా వరుణుడు కరుణరసాన్ని కురిసిస్తూనే వున్నాడు.
దారిలో బ్రిడ్జి పడిపోయింది. కాలువ ఉదృతంగా పారుతోంది. ఎటు చూసినా నీళ్ళే బస్సు ముందుకి పోలేదు. అది సంగతి!
జలరాశి పొంగినట్లు పారుతోన్న కాలువని చూసి నిస్పృహతో కృంగిపోయాడు విజయ్.
అతని మనస్సు ఆలోచనా శున్యమయింది. ప్రయాణం ఆగిపోవటం. పెళ్ళికేవెళ్ళలేకపోవటం అన్నీ కలిసి మనస్సులో దేవినట్టుగా వుంది అతనికి.
నలభై మంది అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పలేకపోతున్నాడు కండక్టర్. అతనకి సరిగా తెలియటం లేదు.
బస్సు వెనక్కి తిప్పుకుని మైలు దూరంలో వున్న ఓ ఊరికి వెళ్ళి మరో మార్గాన కుంభకోణం చేరటానికి వీలవుతుందేమోనని ఫోన్ చెయ్యటానికి వెళ్ళితే సమాధానం చెప్పే నాధుడు కూడా లేడు. అంతలో ఒకటి రెండు స్టేట్ బస్ లు కూడా వచ్చాయి. వాటి గతి అంతే అయింది.
ఇహ లాభం లేదనుకుని ఎవరి చార్జి వాళ్ళకి యిచ్చేసి తిరుగు ప్రయాణం పట్టించాడు బస్సుని. పిడుగు పడినా చలించని ధీరుడు విజయ్. కానీ యీ ప్రయాణంలో యీ నిరాశతో అతని నవనాడులు కృంగిపోయాయి.
'తన చేతిలో ఏమి లేదు. ఇహ అంతా దేవుడి మీద వేసి వుండిపోవటం కన్నా మరో గత్యంతరం లేదు అనుకున్నాడు విజయ్. సరిగ్గా ముహూర్తం వేళకి మద్రాసులో అడుగు పెట్టాడు విజయ్. అటూ ఊర్లో లేక యిటు అనుకున్న చోట చేరలేక మధ్యలో నిలిచి పోవడంతో అతని నిరాశకి అంతులేకపోయింది.
"జీవితం చాలా చిత్రమైనది. పరుగెత్తి అందుకుందామని త్వరపడే కొద్ది జీవితంలో మాధుర్యం దురమవుతూనే వుంటుంది. అనుకోకుండా ఆ ప్రయత్నంగా స్వర్గం నుంచి అమృతం కురిపిస్తుందోసారి, దేనికి మనుష్యు నిమిత్త మాత్రులు 'కర్మణ్యేన అధికారస్తే!" అన్నాడు స్పష్టంగా గితాకారుడు.
"ఇహ లాభం లేదు. తిరిగి వెళ్ళిపోయి తర్వాత అంతా విశదంగా జాబు వ్రాయటం వుత్తమం. ఇప్పుడు టెలిగ్రామ్ యిచ్చి వాడి మనస్సుని బాధ పెట్టేందుకన్నా ఊరుకోవటం మేలు. తను పడిన , పడుతున్న చిత్రహింస చాలు" అనుకుని టాక్సీ ఎక్కి లాడ్జి చేరుకున్నాడు విజయ్.
ఆశలబందీ
ఆశల బందీ మధ్యతరగతి మనిషి!
అశోపహతుడు మధ్య తరగతి మానవుడు!
బలహీనతల నిధి మధ్యతరగతి ప్రతినిధి!
బ్రతుకుభ్రమల బేహారి మధ్య తరగతి కలల విహారి!
మానవత్వం జీవించి మరణించిన మానవుడు మానవుడు!
అతని జీవితం ఆశల ఒంటిస్తంభంపై నిర్మించిన గాలి మేడ!
అది అతని మనస్సుకి విశ్రాంతి యిచ్చే మేడ!
ఒక్కసారో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుంది. పాలసి పేర తీసుకునే ఆ నిర్ణయాలు కొందరి జీవితాలని ఎంతగా మార్చేస్తాయో చట్టం చేసే ఆ అదికారులకి తెలిదు. ఒకే వూళ్ళో చాలా సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్న వాళ్ళని బదిలీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం చిదంబరానికి వూరి నుంచి తాలుకా హెడ్ కార్టర్స్ బదిలీ అయింది. అతను ఉద్యోగంలో చేరిన ఇరవై రెండేళ్ళకి మొట్టమొదటిసారిగా బదిలీ వచ్చింది.
నిజానికి చిదంబరానికి స్వంత వురంటూ ఏది లేదు. అతను ఎక్కడ పుట్టేదో అతనికి సరిగ్గా తెలిదు! బుద్ది తెలిసి తెలియని వయస్సులోనే అతను హాస్టల్లో చేరాడు. చేర్చేక అతనికి మాస్టార్లు చెప్పిన మాటలు గుర్తున్నాయిబాగా.
"బాబూ! ప్రభుత్వం మీ కోసం ఎన్నో చేస్తోంది! ఎంతెంతో ఖర్చు చేస్తోంది. ఎన్నో సౌకర్యాలు కలిగిస్తోంది. ఫీజులు లేకుండా చదువు చెబుతున్నారు. తిండి పెడుతున్నారు. దుస్తులు కుట్టిస్తున్నారు. చదువుకున్నాక రిజర్వేషన్స్ కల్పించి ఉపాది కల్పన కూడా చేస్తున్నారు. ఇంతకంటే ఏ తల్లి తండ్రి ఏ కొడుకు కోసం చేస్తారు.