నీరు కారిపోతూ అన్నాడు "అది కాదు శ్రీ.......ఈ వేసవి కాలంలో హాయిగా తుంగ భద్ర వొడ్డున కూర్చుని, బాగా చీకటి పడే వరకూ వుండి, చంద్రోదయాన్ని చూస్తూ ఎంత హాయిగా వుండొచ్చుని.......రమాదేవి శ్రీ.....ప్లీజ్"
"నాకేం బావులేదు. ఇపుడునే నెక్కడికి రాలేను. అంత యిష్టంగా వుంటే మీరు వెళ్ళి రండి."
దగ్గరగా వెళ్ళి భుజం మీద చేతులు వేసి తన వేపు త్రిప్పుకుంటూ అన్నాడు.
"నేను ఒక్కడిని వెళ్ళటానికేనా యిదంతా? ఇదేం బావులేదు. అలా అనొద్దు.......కనీసం నేను వెళదామని అన్నందుకైనా నా వెంట రావచ్చు. నా ఆశని నిరాశ చెయ్యకూడదనే దయతోనయినా నా వెంట రావచ్చు. అయ్యో పతి దేవుడే.....ప్రార్దిస్తున్నడే అని అనుకుని అన్నా వెంట రావచ్చు."
అతనన్న మాటలకి రాబోతున్న చిరునవ్వుని ఆపుకుని "ఉహు" అంది.
"నిజంగా రావా!"
ముఖం చిట్లిస్తూ అంది "ఇందులో నిజం ఒహటి అబద్దం ఒకటీనా రానంటే రాను. మిమ్మల్ని వెళ్ళమన్నానుగా."
"నేను వెళ్ళటానికిని బోడి ఆజ్ఞే కావాలా?" అని ఒక్క క్షణం ఆగి "అయినా యిలా ఎందుకు చేస్తావ్ శ్రీ?" అన్నాడు.
"ఎలా చేశాను? మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికల్లా వచ్చేయ్యాలన్న మాట నా యిష్టానిస్టాలతో నిమిత్తం లేదా? నా అభిరుచులతో ప్రమేయంలేదా? అంతా కేవలం మీ యిష్టం, మీ అజ్ఞ మాత్రమేనా?"
"అంతంత మాటలెందుకు శ్రీ? నేను వెళ్ళాలనుకుంటున్నాను. నా కోరిక తిర్చెందుకయినా రారాదా అంటున్నాను."
"ఏం అజ్ఞాపిస్తున్నారా? మీరు ఎన్నయినా చెప్పండి. నేనిప్పుడు రాను, రాలేను."
"పోనీ యిది చెప్పు, భర్తని నేనా నీవా?"
అంత సీరియస్ నెస్ లోనూ ఫక్కుమని నవ్వింది "మీరే చెప్పండి నేను మీ భార్యనేనా?"
"సీరియస్ గా అడుగుతోంటే నవుతావా? నీకేమయినా భయముందా అని."
మళ్ళీ పకపక నవ్వి "ఓ భర్త గారూ! మీరే భర్త! నేను మీ భార్యని నాతి చరామి అని ప్రమాణం చేసి మరీ పెళ్ళి చేసుకున్న భార్యని. అయినా ఓ నా ప్రియమైన భర్తగారు! ఇష్టం లేని పనిని భార్య చేత చేయించమని ఏ ఫినల్ కోడ్ లోను లేదండి....."
జాలిగా అలా తిరిగివద్దాంరమ్మంటే రాకుండా పైగా ఎగతాళిగా అలా నవుతున్నందుకు ఎఱ్ఱగా చూసి అన్నాడు.
"అయితే నిజంగా రావా?"
"ఎన్నిసార్లు చెప్పలేమిటి?" గోముగా అంది.
"సరే నే వెళుతున్నాను" ముఖం యింతగా చేసుకుని పోబోయాడు.
"ఒంటరిగా వెడుతున్నారా?"
"ఎందుకు?" ఎలాగూ నీవు రాలేన్నావుగా"
"బాబుని తిసుకేళతారా?"
"ఇహ ఒక్కదానివి ఏం చెయ్యాలి?"
"ఏం చేస్తాను....? ఏమి చెయ్యను. మరిచాను. పాపం! పక్కింటి బామ్మగారు లక్షవత్తుల వ్రతం చేస్తారట, వత్తులు చేసివ్వమంది."
ఛి! చీ! ఎవరో పక్కింటి బామ్మగారి కోసం.....ఆవిడ బోడి మెప్పుదల కోసం.....భర్తని యింతగా నొప్పించిన నీకు ఎన్ని లక్షల వత్తులు చేసి యిచ్చినా పుణ్యం రాదు."
గలగల మని నవ్వి "పుణ్యం మాట దేవుడెరుగు ఆవిడ బాబుకి బంగారు వత్తులు చేయిస్తుందట" అని బాబు ముంజేతులు నిమిరి ముద్దు పెట్టుకుంది ప్రేమగా.
మళ్ళీ తనే "ఏం అలా చూస్తారు?......నిజమే, ఆవిడది ఎలాగూ బోడి మెప్పుదలేలెండి. పోనిమ్మని మీ వెంట వచ్చినా, మీ మెప్పుదల క్రాపు మెప్పుదలే కాని- జుత్తు మెప్పుదల కాదుగా."
చిర్రేత్తు కొచ్చింది అతనికి.
"పోనిలే- నీ యిష్టం వచ్చినట్టే కానీ, నేను వెడుతున్నాను."
పోబోతున్న అతన్ని చూస్తూ ప్రశ్నించింది మళ్ళీ "బాబుని తీసికెళ్ళరా?"
"ఉహూ"
"మరి ఊరికే ఒక్కరు అంత సేపు ఎలా కూచుంటారు."
"ఎలాగో- ఎలాగయితే నీకేం లెద్దూ."
"అబ్బో! కోపమా? మరి ఎలా తోస్తుందేమిటి?"
మళ్ళీ ఆమె దగ్గరిగా వచ్చి ముఖం చేతుల్లో తీసుకుని కళ్ళలోకి చూస్తూ అన్నాడు మృదువుగా "అందుకే ఏమి తోచదనే కదా నిన్నిలా ప్రాధేయపడుతున్నాను."
తనూ అలాగే అతని కళ్ళలోకి చూసి గుండెలపై వాలిపోతూ అంది "ఏమి తోచకపోతేనేనన్న మాట భార్య అవసరం. అంతేనా? ఎంత స్వార్ధపరులండి మీ మగవారు?"
"ప్రతి మాటకీ అలా విపరితార్ధం ఎందుకు తిస్తావ్? నేనలా అన్నానా?"
నిట్టూర్చి అంది. "మీరలా అనలేదు లెండి"
ఉద్దేశం మాత్రం అదేకదా "అన్నాను".
"ఇహ పోనిలే. ఎండుకిక తర్కం? అన్నిటిని మించి ఆ బామ్మగారికి లక్ష వత్తులు చేసి యివాలంటే నీ బంగారు చేతులు కందిపోతాయ్. ఆ బామ్మగారిని హంద్రిలో దూకమను, ఎలాగూ ఆవిడ మనమడి యిల్లు ఆ ప్రాంతాల్లోనేగా. పదపద, మనం వెడదాం."
"మీరెంత బులిపించినా నాకు తెలుసులెండి" అని అతని చేతులు విడిపించుకుని నిష్టూరంగా "నావేం బంగారు చేతులు కావులెండి. ఒట్టి మట్టి గాజుచేతులు మాత్రమే. అనవసరంగా బామ్మగారు ఎందుకు హంద్రీలో దూకాలి......మీరు ఒక్కరే వెళ్ళిరండి."
నిట్టూర్చి ఇహ లాభం లేదనుకుని గడప దాటాబోయాడు.
మళ్ళీ పిలిచింది "ఏమండీ---బాబు......"
"నన్ను వెళ్ళనివవా శ్రీదూ! ఇదేదో సామెతలా వుంది. అమ్మ పెట్టదూ.....అడుక్కు తిననివదని......"
"లక్షణంగా వెళ్లిరండి, నేనెందుకు అనాలి? అయినా మీకెలా ప్రొద్దు పోతుందనే నా బాధ"
"నాకేం......మా ఆఫీసు టైపిస్ట్ వస్తుందిగా."