"ఏమిటండీ ఇంకా ఆలోచిస్తున్నారు?" అడిగింది సుభద్ర.
"మన గురించే ....." నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు శ్రీధర్.
"ఎందుకండీ ఆలోచించటం! ఎలా జరగాలంటే అలా జరుగుతుంది ."
"ఆ మాట నిజమే సుభద్రా! అయినా మనం చేయాల్సిందంతా చేయాలి కదా"
"మీరేం చేద్దామనుకుంటున్నారు?"
"ఏదయినా వేరే ఫార్మానుటికల్స్ లో ఉద్యోగం కోసం ప్రయత్నిద్దామనుకుంటున్నాను."
"మీ ఇష్టమండీ! మీ మనస్సుకు నచ్చినదేదయినా చేయండి! ఎవరేమనుకుంటారో అని ఆలోచించాల్సిన అవసరం లేదు."
"అవును సుభద్రా! పూలమ్మిన చోట కట్టేలమ్మటం తప్పేమీ కాదు"
మర్నాడు అతను తనకు తెలిసిన మరో మందుల కంపెనీ కెళ్ళాడు.
మేనేజింగ్ డైరెక్టర్ కి తన పేరు కాగితం మీద రాసి పంపించాడు. మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ తో బాగా పరిచయముంది తనకు. ఇద్దరూ క్లబ్ లో కలుసుకుంటుంటారు. మీటింగ్సు లో, కాన్ఫరెన్స్ ల్లో......కూడా చాలా తరచుగా మాట్లాడుకునేవాళ్ళు.
ఫ్యూన్ బయటకొచ్చాడు.
"లోపలకు వెళ్ళండి సార్"
శ్రీధర్ లోపలకు నడిచాడు.
"హలో శ్రీధర్! ప్లీజ్ కమిన్ -- హావ్ యువర్ సీట్-"
శ్రీధర్ కుర్చీలో కూర్చున్నాడు.
"మీ కంపెనీ గురించి విన్నాను. ఆయామ్ రియల్లీ సారీ -"
"బాడ్ టైం"
"ఆఫ్ కోర్స్ - మీకేమయినా సహాయం కావాలంటే నన్నడగటానికి సంకోచించకండి శ్రీధర్."
"థాంక్యూ ! మీ సహాయంకోసమే వచ్చాను."
"ప్లీజ్! చెప్పండి ఏమిటది?"
"నాకు......నేను .........నేను.......మీకు ఉపయోగపడతాననుకుంటే ----నన్ను మీ కంపెనీలో చేర్చుకుంటారేమోనని -ఎనీ సూటబుల్ పొజిషన్ ఫలానా అని ఏమీ అడగటం లేదు.'
మోహన్ నవ్వాడు.
"అలాగే శ్రీధర్! మా వాళ్ళతో మాట్లాడి - చెప్తాను -- నేనే ఫోన్ చేస్తాను. మీకు ఫోన్ నెంబర్ అదీ కదా! ఏమయినా మార్పు ఉందా?"
సేమ్ ఓల్డ్ నెంబర్! కాకపోతే ఇప్పుడు ఆఫీస్ నెంబర్ పోయింది. ఓన్లీ రెసిడెన్స్ నెంబర్! అదీ ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు" నవ్వుతూ అన్నాడు.
ఫ్యూన్ కూల్ డ్రింక్స్ తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు.
"థాంక్యూ " అని కూల్ డ్రింక్ తాగాడు శ్రీధర్.
అక్కడి నుంచి పరిచయమున్న మరో ఆఫీస్ చేరుకున్నాడతను. అక్కడ త్వరగానే పనయిపోయింది.
"సారీ! మా దగ్గర ఇప్పటికే ఓవర్ స్టాప్ మిస్టర్ శ్రీధర్"
నెలరోజులు గడిచిపోయాయ్. ఫోన్ లో ఏ సంగతీ చెప్తామన్న వారెవ్వరూ ఫోను చేయలేదు.
రోజురోజుకి బ్యాంక్ బాలెన్స్ తగ్గిపోతుంది.
మహా అయితే ఇంకో నాలుగయిదు నెలలు. ఆ తరువాత ఏమిటి? అప్పటికీ ఉద్యోగం దొరకకపోతే ఏమిటి చేయటం! ముఖ్యంగా సృజన్ చదువు ఏ పరిస్థితిలోనూ ఆగకూడదు. తన వాళ్ళ వాడి భవిష్యత్తు పాడవడము తన కిష్టం లేదు.
రాజ్ భవన్ రోడ్ మీద నడుస్తుంటే శ్రీనివాస్ ఎదురయ్యాడు.
అతను తమ కంపెనీలో రిప్రజెంటేటివ్ గా పనిచేషేవాడు.
"నమస్తే సార్" అంటూ పలకరించాడు వినయంగా.
"నమస్తే శ్రీనివాస్ -- ఎక్కడ చేస్తున్నావిప్పుడు?" అడిగాడు శ్రీధర్.
"బాంబేలో నండీ! మన కంపెనీ వాళ్ళకి ఆరుగురికి బాంబేలో దొరికింది. ఇద్దరూ పూనా లో వున్నారు.
"ఎక్కడో చోటలే! ఉద్యోగం దొరకటం ముఖ్యం!"
"మీరు మళ్ళీ ఏదయినా కంపెనీ పెడుతున్నారా సార్"
శ్రీధర్ నవ్వాడు.
"నేనూ ఉద్యోగం కోసం వెతుకుతున్నాను."
శ్రీనివాస్ ఆశ్చర్యపోయాడు.
"అవునోయ్ బ్రతుకుతెరువు ఉండాలి కదా. ఏదొకటి"
"నాకు చాలా బాధగా ఉందండీ! మీకిలాంటి పరిస్థితి రావటం"
శ్రీనివాస్ నాకో సహాయం చేస్తావా?"
"చెప్పండి సార్ ఏమిటదీ?"
"నాక్కూడా బాంబేలో ఉద్యోగం దొరుకుతుందా?"
అతను ఆశ్చర్యంగా చూశాడు.
"కానీ అంతదూరంలో ....."
"ఏం ఫర్లేదు శ్రీనివాస్! నాకు జాబ్ ముఖ్యం ముందు. దూరం జీతం ఇవన్నీ తరువాత విషయాలు."
"అయితే మీరో పని చేయండి సార్! వారం రోజుల క్రితం ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో మెడికల్ లైన్ లో సేల్స్ మేనేజర్ పోస్ట్ కోసం అభ్యర్ధులు కావాలని ఓ ప్రకటన వచ్చింది బాక్స్ నెంబర్ ఏదో ఇచ్చారు మీరు అప్లయ్ చేయండి. అది ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది."
"థాంక్యూ - పేపర్ యాడ్స్ మీద నాకు నమ్మకం పోయింది."
"అన్నీ అలా కాదు సార్! బహుశా మీ వయస్సు మూలంగా మీకు మన లైన్ లో ఉద్యోగాలు దొరకడం లేదనుకుంటాను. సేల్స్ మేనేజర్ లాంటి పోస్టులు వుంటే తప్పకుండా మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు."