ఒక నిశ్చయానికి వచ్చారు అయన. వసారాలోకి నడిచి, సాధ్యమైనంత నెమ్మదిగా శశికాంత్ తో అన్నారు. "శశికాంత్! అయిందేదో అయిపొయింది! కానీ ఇలా ఉరికే తాళి కట్టి ఊరుకోవడం మన సంప్రదాయం కాదు. నలుగురూ నవ్విపోతారు. మాములుగానే అందరిని పిలిచి పీటల మీద కూర్చుని పెళ్ళి చేయించకపోతే మాకు తృప్తి ఉండదు. త్వరలోనే ముహూర్తం పెట్టిస్తాను. కాదనకు"
నవ్వాడు శశికాంత్. "నేనెందుకు కాదంటాను మాస్టారూ! మీకంత ముచ్చటగా ఉంటె అలాగే కానివ్వండి."
దానితో కొంచెం స్థిమితపడింది సుబ్రహ్మణ్యం గారి మనసు. నుదుటికి పట్టిన స్వేదాన్ని కండువాతో తుడుచుకుంటూ ఉంటే, అప్పుడు అనిపించింది ఆయనకి.
తను కొన్న లాటరీ టిక్కెట్టు గనక పోకుండా తన దగ్గరే ఉండి, ఆ పది లక్షలు ప్రైజు తనకే గనుక వచ్చి ఉంటే, ఆ డబ్బుతో సౌమ్యకి లక్షణమైన సంబంధాలు చూసి, అందులో ఉత్తమోత్తమమైన సంబంధం కుదుర్చి ఉండేవాడు నిశ్చయంగా!
దమ్మిడి వెనకేసుకోలేని దారిద్ర్యంలో ఉన్నాడు కాబట్టి , వచ్చిన ఒకే ఒక సంబంధాన్ని, పై పై మెరుగులు చూసి మురిసిపోయి, ముందూ వెనుకా చూసుకోకుండా మూర్ఖంగా ఒప్పేసుకున్నాడు.
రౌరవాది నరకాలకు పోవలసింది తను - తనే!
"వెళ్లొస్తాను మేస్టారూ! మళ్ళీ రేపు కలుస్తాను" అన్నాడు శశికాంత్.
పెదిమలు కదిపితే పెను దుఃఖం బయటపడిపోతుందేమో అన్నట్లు మాట్లాడకుండా తల పంకించారు సుబ్రహ్మణ్యంగారు.
తల్లి ఒడిలోనే తల పెట్టి పడుకుని ఉండిపోయింది సౌమ్య. తల్లి తన వెన్నుని మృదువుగా రాస్తూ వుంటే, మెల్లగా కలత నిద్రలోకి జారిపోయింది.
ఆ కలత నిద్రలోనే ఒక కల. అది ఆమెకు తరచుగా వచ్చే కలే! ఆ కలలో ఒక అనాధాశ్రమం! అందులో ఆకలి గొని ఉన్న పిల్లల కలకలం వినబడుతోంది.
వెలసిపోయిన బోర్డుతో, సున్నం వెయ్యని గోడలతో, దిగులుగా కనబడుతోంది ఆ అనాధాశ్రమం. అది తలుచుకుంటేనే గుండెల్లో గుబులుగా ఉంటుంది తనకి.
కలలోనే నడుస్తూ దానిముందు ఆగింది తను.
లోపల చిన్నీ ఉంటాడు. చిన్నీ.
ఏం చేస్తుంటాడో?
ఏం చేస్తుంటాడు?
"అమ్మా!" అని పెద్దగా కేకపెట్టి ఒక్క ఉదుటున లేచి కూర్చుంది సౌమ్య. చెమట పట్టేసింది ఆమె మొహనికంతా.
6
వైట్ టేరిస్ హాఫ్ షర్టుని స్టీల్ గ్రే కలర్ టేరి ఊల్ ప్యాంటులోకి టక్ చేసి, నల్లటి చారలు ఉన్న గ్రే కలర్ టై కట్టుకున్నాడు తేజస్వి. బిరుసుగా వంకీలు తిరిగి ఉన్న నల్లటి జుట్టుని నిర్లక్ష్యంగా పైకి దువ్వేసి, మందుల శాంపిల్స్ ఉన్న లెదర్ బాగ్ ని చేతిలోకి తీసుకున్నాడు. సన్నగా విజిలేస్తూ స్కూటర్ ని ఒక్క కిక్ తో స్టార్ట్ చేసి సత్యా ఫార్మాన్యుటికల్స్ వైపు సాగిపోయాడు.
ఆఫీసు పోర్టికోలోనే అయిదారు మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ గుంపుగా నిలబడి మాట్లాడుకుంటూ ఉండడం కనబడింది అతనికి. వాళ్ళ మధ్య సిసిల్ నిలబడి ఏదో చెబుతున్నాడు. అందరి మొహాల్లోనూ ఆందోళన కనబడుతోంది.
"వాట్ మాన్? వాట్ న్యూస్?" అన్నాడు తేజస్వి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అతను వాళ్ళ అసోసియేషన్ కి జనరల్ సెక్రటరి.
అతన్ని చూడగానే తెరిపిన పడ్డట్లు ఫీలయ్యారు అందరూ.
"నీ దగ్గరికే వద్దామనుకుంటూన్నాం " అన్నాడు సిసిల్ కర్చీఫ్ తో మొహం తుడుచుకుంటూ.
"ఎందుకు? ఏమయింది?"
మెడికల్ రిప్రేజేంటేటివ్స్ లో సగం మందిని ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నారట. రిట్రెంచ్ మెంట్."
"ఎవరన్నారు?"
"పాండే చెప్పాడు?"
"పాండే చెప్పాడా!" అన్నాడు తేజస్వి సాలోచనగా , పాండే మేనేజింగ్ డైరెక్టర్ పరమహంస కి పి.ఏ. ఉత్తమాటలు చెప్పే రకం కాదు అతను.
"ఏం చేద్దాం బాస్?" అన్నాడు సిసిల్ కంగారుగా.
స్థిరంగా అన్నాడు తేజస్వి. "నధింగ్ టు వర్రీ , నేను వెళ్ళి ఏమ్ .డీ. తో మాట్లాడి వస్తాను."
"ప్లీజ్ అలా చెయ్ బాస్!"
పరమహంస చాంబర్స్ ముందు నిలబడి , తలుపు తట్టాడు తేజస్వి. డోర్ కి వున్న గ్లాస్ పానెల్ లో నుంచి లోపల కూర్చుని ఉన్న పరమహంస కనబడుతున్నాడు. పెద్ద టేబుల్. దాని వెనుక రివాల్వింగ్ చెయిర్. టేబుల్ మీద ఉన్న గ్లాసు టాప్ లాగా పరమహంస బట్టతల కూడా నున్నగా మెరుస్తుంది. పెద్ద పెద్ద కళ్ళు అతనివి. ఆ కళ్ళలో విజ్ఞానం ఉట్టిపడుతోంది.
తలెత్తి చూసి "కమిన్!" అన్నాడు పరమహంస.
తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు తేజస్వి. ఒక చెయిర్ వెనక్కి లాగి కూర్చున్నాడు.
"మిస్టర్ పరమహంసా! వాటిజ్ దిస్ ఫన్నిటాక్ అబోట్ రిట్రెంచ్ మెంట్? నేను విన్నది నిజమేనా?"