Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 13

 

    "ఇది లక్కి లాటరి టిక్కెట్టు. దీన్ని పారేసుకున్నాడంటనే , వాడెవడో గానీ వాడు ఎంత అష్ట దరిద్రుడో అర్ధం అవుతుంది. అంటే వాడికి డబ్బు నిలుపుకునే యోగం లేదన్నమాట. అలాంటివాడికి మనం కట్టలు కట్టలు డబ్బు ఇచ్చినా అదంతా కట్టగట్టి ఏ మురుక్కాలవలోనో పడేసుకుంటాడు తప్ప ఖర్చు పెట్టుకోలేడు. డబ్బు ఎవరి దగ్గర నిలుస్తుందో వాళ్ళ దగ్గరికే చేరుతుంది సౌమ్యా! అందరి దగ్గరా వుండదు. వుండకూడదు.

 

    స్తంభించిపోయి అతని మాటలు వింటోంది సౌమ్య.

 

    ఇతనూ తన భర్త! ఇతనితో కాపురం చెయ్యాలి తను.

 

    నిశ్చయంగా అన్నాడు శశికాంత్. "సౌమ్యా! ఈ టిక్కెట్టు మనం ఎవరికి తిరిగి ఇచ్చే ప్రసక్తి లేదు. ఇది మనది. మనమే ఉంచుకుంటాం. కాలి దగ్గరకు వచ్చిన లక్ష్మిని మోకాలితో నెట్టేసే రకాన్ని కాను నేను. పది లక్షలంటే మాటలు కాదు సౌమ్యా.

 

    కానీ ఈ టిక్కెట్టు నేను క్లెయిమ్ చేస్తే అప్పులవాళ్ళు తగులుకుంటారు కాబట్టి దీన్ని నీ పేరుతోనే క్లెయిమ్ చేద్దాం.

 

    నేను కొత్త ఇండస్ట్రి ఒకటి పెడుతున్నాను సౌమ్యా! ఫార్మాన్యుటికల్స్ అంటే తెలుసుగా! మందుల తయారి. ఆ ఇండస్ట్రి నీ పేరుతో పెడదాం. ఆ తరువాత మెల్లిగా నేను వచ్చి దాంట్లో చేరతాను. దానికి ఇది మొదటి పెట్టుబడి. అర్ధమయిందా?"

 

    నిశ్చేష్టురాలయి నిలబడిపోయింది సౌమ్య.

 

    "పద సౌమ్యా! మనం ఒకసారి గుడికి వెళ్దాం. ఆ తరువాత నిన్ను మీ ఇంటిదగ్గర దింపేస్తాను." అన్నాడు శశికాంత్.

 

    నిస్తేజంగా అంది సౌమ్య. "నేను ఇంటికెళ్ళిపోతాను."

 

    "భయపడుతున్నావా సౌమ్యా! ఎందుకు భయం! నేను నీ భర్తని. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తని. ఫర్వాలేదు పద పోదాం."

 

     ఇంకేం మాట్లాడలేక , కలలో నడుస్తున్నట్లు అతని వెంట నడిచింది సౌమ్య. కార్లో కూర్చుంది. తనంతట తానుగా ఏ పని చేసే స్థితిలో లేదు సౌమ్య. ట్రాన్స్ లో ఉన్న దానిలాగా ఉంది.

 

    కొద్ది నిమిషాల తరవాత గుడి ముందు ఆగింది కారు. దైవ దర్శనం చేసుకున్నారు ఇద్దరూ.

 

    అక్కడినుంచి సౌమ్య ఇంటికి వెళ్ళారు.

 

    ఇంట్లోకి వచ్చి రాగానే కన్నీళ్ళు ఆపుకుంటూ లోపలికి పరిగెత్తింది సౌమ్య. తల్లిని కావలించుకుని ఏడవటం మొదలెట్టింది.

 

    "ఏమిటమ్మా? ఏమయింది? చెప్పు తల్లీ" అంది శారదమ్మ ఆదుర్దాగా.

 

    సుబ్రహ్మణ్యం గారు కూడా కంగారుపడ్డారు. "ఏమిటి నాయనా? ఏం జరిగింది ?" అన్నారు భయంగా.

 

    తేలిగ్గా అన్నాడు శశికాంత్.

 

    "ఏం లేదు మాస్టారు! సౌమ్య అకారణంగా బెదిరిపోయింది. అంతే!"

 

    "ఏం జరిగింది అసలు?"

 

    జరిగినదంతా మాములుగా చెప్పాడు శశికాంత్. తరువాత అన్నాడు "ఆర్భాటాలు అవీ నాకు పెద్ద పట్టింపు లేదు మాస్టారూ! సింపుల్ గా పెళ్ళి చేసుకోదలుచుకున్నాను, చేసుకున్నాను. అంతే!"

 

    ఒకసారి అతని వైపు పరిశీలనగా చూశారు సుబ్రహ్మణ్యంగారు. తరువాత "కూర్చో శశికాంత్" అని చెప్పి లోపలికి వెళ్ళారు.

 

    వంటింటి గుమ్మం దగ్గర తల్లి ఒళ్లో తల పెట్టుకొని , దుఃఖంతో పూడుకుపోతున్న గొంతుతో జరిగినదంతా చెబుతోంది సౌమ్య.

 

    మధ్య మధ్యలో కళ్ళు ఒత్తుకుంటూ వింటోంది శారదమ్మ.

 

    ఆ హడావుడి చూసి అక్కడికి వచ్చేసింది ఇంటి ఓనరు భ్రమరాంబిక. గుమ్మానికి అనుకుని నిలబడి ఆసక్తిగా వింటోంది ఆమె. ఆపుకోలేని అనందం తొంగిచుస్తుంది ఆమె మొహంలో. ఆ ఇంట్లో గోడలు పలచన. అక్కడ రహస్యాలేవి దాగవు.

 

    అంతా విని "అదేమిటి? అతనికి బొత్తిగా ఇంగితజ్ఞానం లేనట్లుందే?" అంది భ్రమరాంబిక వెటకారంగా.

 

    ఆమె మాటలు పట్టించుకోకుండా తగ్గు స్వరంతో సౌమ్యతో అన్నాడు సుబ్రహ్మణ్యంగారు.

 

    "అలా అధాట్టుగా ఎవరూ లేనప్పుడు మెళ్ళో తాళి కట్టేస్తే అది పెళ్ళేలా అవుతుందమ్మా? చూడబోతే చాలా చిత్రమైన మనిషిలా ఉన్నాడు ఇతడు. ఇలాంటి వాడితో బతుకు వెళ్ళదీయడం కంటే పెళ్ళి కాకుండా బతకడమే నయం!"

 

    "ఆ - అదెట్లా కుడురుతుందండి?" అంది భ్రమరాంబిక. "ఎవరూ లేకపోవడమేమిటి?" అగ్నిహోత్రులవారు అక్కడే ఉన్నారని చేబుతుందిగా అమ్మాయి! ఇప్పుడు తాళి తెంచి తైతక్కలాడినా , రేపు రౌరావాది నరకాలు ఎదురు చూడవు?"

 

    బేజారుగా ఆమె వైపు చూశారు సుబ్రహ్మణ్యం గారు. ఈమె అసలే నోటిదురద మనిషి. కర్మకాలి ఈ విషయం ఈమెకి కూడా తెలిసిపోయింది. రేపు తెల్లారేసరికి ఊరంతా గుప్పుమంటుంది.

 

    అంటే......ఇంక ఈ ఉచ్చులో నుంచి తన కూతురు ఇంక బయటకు రాలేదా?

 

    తలుచుకుంటేనే గుండె నీరాయిపోయింది ఆయనకి.

 

    ఈ శశికాంత్ మాయలు చెయ్యడం తెలిసినవాడు. మాట నిలకడ లేనివాడు. మోసాలు చెయ్యడానికి వెరవనివాడు.

 

    ఇతనా తన కూతురి భర్త!

 

    అప్పుడు ఆయనకు మరొక విషయం స్పురించింది.

 

    ఇతను రేపెప్పుడన్నా మనసు మారి ఏదో లిటిగేషను లేవదీసి తనకు సౌమ్యతో అసలు పెళ్ళే కాలేదని బుకాయిస్తే! చెప్పలేం. ఏం చేసినా చెయ్యగలడు ఇతను!

 Previous Page Next Page