Previous Page Next Page 
వెన్నెల మెట్లు పేజి 14

 

    అవునన్నట్లు తల వూపింది ప్రతిమ.
    
    "ఒకసారి మీ నాన్నగారితో స్వయంగా మాట్లాడాలని ఉంది నాకు."
    
    "సరే!" అన్నట్లు తల వూపింది.
    
    "అలా చెయ్! బాగుంటుంది!" అంది శృతి.
    
                                                            * * * * *
    
    ఆ రోజు సాయంత్రం ---
    
    గదిలో కూర్చుని, ఎరిక్ ఆంబ్లర్ రాసిన 'జర్నీ ఇన్ టూ ఫియర్' చదువుతూంది ప్రతిమ. ఆ పుస్తకం పేరులాగే ఉంది తన మనస్థితి కూడా! భయం వైపు ప్రయాణం చేస్తూంది తను. ఇప్పుడు శ్రీరాం రాగానే ఏం జరుగుతుంది! అతను మంచి సేల్స్ మాన్ - మాటకారి. మాటలతో నాన్నగార్ని మంచి చేసుకుని ఒప్పించగలడా, లేడా?
    
    ఏమో!
    
    "కాస్త లేచి వంట సంగతి చూడవమ్మా, తల్లీ! ఎంతసేపూ ఆ బొక్కులు తిరగేస్తూ ఉంటే ఇల్లు జరుగుతుందా? లేలే!" అని సణగటం మొదలెట్టింది సుందరమ్మ.
    
    "కొంచెం జ్వరమొచ్చినట్లు ఉందమ్మా! కాసేపు ఉండి మొదలెడతాను వంట." అంది ప్రతిమ. మధ్యాహ్నం నుంచీ ఒళ్ళు వెచ్చగా ఉంది తనకి. మెడిసిన్స్ కొన్ని ఇంట్లో వున్నా వెంటనే వేసుకోలేదు ప్రతిమ. ప్రతి చిన్నదానికీ యాంటీబయాటిక్స్ వాడటం మంచిది కాదని తెలుసు తనకి.
    
    సాయంత్రం అయ్యాక ప్రతి అరగంటకీ జ్వరం పెరగడం మొదలెట్టింది. కళ్ళు మండుతున్నాయి.
    
    "డాక్టర్లకి కూడా జ్వరమేమిటే! మరీ కలికాలం" అంది సుందరమ్మ.
    
    "డాక్టర్లు మాత్రం మనుషులు కారేమిటి?" అనుకుంది ప్రతిమ.
    
    కూతురు పడకేస్తే తను పూసుకుని ఉడకెయ్యాలేమో అన్న ఆలోచనే సుందరమ్మకి హడలెత్తించింది. ఆమె తనంతట తాను వంటచేసి పదేళ్ళు దాటుతూంది. దాదాపు పదమూడో ఏటనుంచీ ఇంటి పనీ, వంటపనీ ప్రతిమ నెత్తిన పడిపోయింది పూర్తిగా! కూతుర్ని కష్టపెడుతున్నానేమో అన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు సుందరమ్మకి. అది పని నేర్పించడం అనుకుంటుందామె. అంతే! ఒకవేళ పొరపాటున ఆమె దేనిలోనన్నా వేలు పెడితే, అది అధ్యాన్నమై వూరుకుంటుంది. పని మెలుకువలు తెలియవు సుందరమ్మకి.
        
    చివరికి ఇంట్లో సత్యనారాయణ వ్రతంలాంటి శుభకార్యాలు జరిగినప్పుడు కూడా వేరే వంటమనిషిని పెట్టుకోకుండా పెద్ద వంటలతో సహా తనే చేసేసేది ప్రతిమ.
    
    "మేము నీతో సరదాగా టైం స్పెండ్ చెయ్యాలని వస్తే, నువ్వు వంటలక్కలాగా వంటింట్లోనే మగ్గిపోతూ మా మొహం చూడవేం? అయినా మెడిసిన్ చదువుతూ నువ్వు వంట చెయ్యడమేమిటే - మతోయిందా?" అని కామెంట్ చేసేవాళ్ళు, ఫంక్షనుకి వచ్చిన బంధువుల అమ్మయిలు.
    
    "ఏం? మెడిసిన్ చదివితే వంట చెయ్యకూడదేమిటి?" అనేది తను డిఫెన్సివ్ గా. వాళ్ళ ఆలోచనల పద్దతి చూస్తే తనకు చిరాకు.
    
    "డాక్టర్లు వంటి సంగతే చూడాలి. వంట సంగతి కాదు!" అని జోక్ చేస్తుంది ఒక అమ్మాయి.
    
    ఆ అర్ధంలేని సరసాలూ, హాస్యంలేని జోక్సూ, అక్కడలేని బంధువుల మీద అక్కడున్న బంధువులు ఆరోపణగా చెప్పుకునే విషయాలూ, వీటన్నిటినీ భరించడం కంటే వంటలో మునిగిపోవడమే సులభం అనిపిస్తుంది ప్రతిమకి.
    
    ఆ బంధువులు మిగతా బంధువులని గురించి చేసే వ్యాఖ్యానాలు ఎలా ఉంటాయో తనకు తెలుసు.
    
    "రంగారావు బాపట్లలో ఇల్లు అమ్మేశాడుగా?"
    
    "ఇల్లేం ఖర్మ! వల్లూరి పొలాలు కూడా అమ్మేశాడు."
    
    "అయితే అన్నీ వదుల్చుకుని నున్నగా అయ్యాడన్నమాట!"
    
    "అవడు మరీ! సీతమ్మ ఇంటిముందు స్థలం కట్టెల అడితీకి అమ్మేసిందట తెలుసా?"
    
    "ఆ! వెచ్చాల కొట్లో బాకీ తీర్చడానికి ఇంటిముందు స్థలమూనూ, వడ్డాణమూ అమ్మేసిందట! మీ బాబాయి కూడా ఆస్తి అమ్మాడని విన్నానే!"
    
    "అవును! అందరూ అదే చెవులు కొరుక్కుంటున్నారు గానీ, ఎందుకమ్మేడో, ఏవో వైనం బయటపడ్లేదు. గుంభనంగా ఉంటున్నారు."
    
    "ఇవాళ కాకపోతే రేపు బయట పడదేమిటీ? అది సరే! మేము వనస్థలిపురం దగ్గర స్థలం కొన్నాం చెప్పానా?"    
    
    వింటున్న ఎదుటావిడమొహం ముడుచుకుపోయింది.
    
    "అటువైపు దొంగల భయం ఎక్కువటగా! పోయి పోయి అక్కడ కొన్నారేం? సుబ్బరంగా మా మల్కాజుగిరీ వైపు కొనలేకపోయారూ?"
    
    అసూయ! కార్పణ్యం! భేషజం!
    
    భాషలో వున్న పదాలన్నింటినీ, రోజులో వున్న సమయమంతటినీ, తన గొప్పనీ, ఎదుటివాడి లోకువనీ బయట పెట్టడానికే ఖర్చు చేయాలా?
    
    మనసు అదోలా అయిపోయేది ప్రతిమకి.
    
    ఎవర్ని గురించీ కామెంట్సు చెయ్యకుండా, ఎవరి వూసూ పట్టించుకోకుండా తన చదువూ, తన పనీ మాత్రమే చూసుకునే ప్రతిమకి ఫ్రెండ్సు మురిపెంగా 'మవుని' అని నిక్ నేమ్ పెడితే, కజిన్స్ మాత్రం మంటగా 'ముంగి' అని నామకరణం చేశారు.
    
    అలా నిర్విరామంగా, క్షణం విశ్రాంతి లేకుండా పనిచేసే ప్రతిమ ఇవాళ ముడుచుకు పడుకుండిపోతే ఎలాగా అన్న భయంతోనే సుందరమ్మకి చలిజ్వరం వచ్చినట్లయింది.
    
    అప్పుడామెకి ఇంకో ఆలోచన వచ్చింది.
    
    ఒక్క పూట ప్రతిమ వంట చెయ్యలేకపోతేనే తనకి ఇంత దడగా ఉందే, రేపు ప్రతిమకి పెళ్ళయి అది వెళ్ళిపోతే....?
    
    అమ్మో!
    
    సుందరమ్మకి దిక్కుతోచనట్లయింది.
    
    "కాస్త మిరియాల కషాయం కాచుకుని తాగూ! లేకపోతే ఏవో మాత్రలుంటాయి కదా నీ దగ్గర, అవి మింగూ! జొరం జొరం అనుకుంటూ కూర్చుంటే జొరం తగ్గుతుందా?" అంది పెద్ద గొంతుతో.
    
    "కాసేపు చూసి వేసుకుంటాలే" అంది ప్రతిమ విసుగ్గా.
    
    గేటు దగ్గర కారు హారను వినబడింది.
    
    వెంటనే కిటికీ దగ్గరికి వెళ్ళి చూసింది.

 Previous Page Next Page