"నిజంగానే వాళ్ళ తాతగారు యాయవారాలు చేసుకునేవారా?" అంది ప్రతిమ మెల్లిగా.
"అవును! ఏం ఎప్పుడో తాతల తరాలనాటి గొప్పలూ, లొసుగులూ ఇప్పుడెందుకు, ప్రతిమా? శ్రీరాం తాతగారు వేదం బాగా చదువుకున్నారు. కొంచెం వైరాగ్యంగా ఉండేవారుట. బాగా తెలిసినవారి ఇళ్ళకు మాత్రం వెళ్ళి, ఆశీర్వచనం చదివి తిథి వార నక్షత్రాలు చెప్పేవారు. అందరూ తలో కాస్త బియ్యం, ఉప్పు, పప్పు, మిరపకాయా ఇస్తే ఇల్లు జరిగిపోయేది."
"మరి ఇంత డబ్బు...?"
"అదే చెబుతోంది. శ్రీరాం తండ్రి - అంటే మా బాబాయ్ - చాలా తెలివైనవాడు. స్నేహితులు కొద్దిగా పెట్టుబడి పెడితే, దానితో వూరి బయట బంజరు భూములు చవగ్గా కొని, వూరు అక్కడదాకా పెరిగిన తర్వాత వందరెట్లు లాభానికి అమ్మేశాడు. శ్రీరాం కూడా అలాంటివాడే! మంచి బిజినెస్ మాన్!"
"అలాగా!" అని, "ఇంకేమన్నారు నాన్నగారు?" అంది ప్రతిమ అన్యమనస్కంగా.
"నిన్ను చేసుకుంటానని గంజాం నుంచీ బంధువులెవరో రాశారుట!"
"నాకు తెలీదే!"
"ఎలా తెలుస్తుంది? అసలు నీదాకా విషయం రానిస్తేనా? అమ్మాయి చదువు ఇప్పుడే కదా పూర్తయింది, ఇంకో ఏడాది పోయాక ఆలోచిస్తాం అని రాశారుట. దాదాపు అలాంటి సమాధానమే వీళ్ళకీ చెప్పారు. మా అమ్మాయిని చేసుకోవడం కోసం జనం క్యూలో నిలబడి ఉన్నారూ, దాని పెళ్ళి గురించి నాకేం బెంగ లేదూ, తీరిగ్గా ఆలోచించి చెబుతానూ అని! నిజంగానే అంతమంది అడిగారుటే"
"ఏమో! నాకెప్పుడూ చెప్పలేదు. నేను ఆ విషయం అంతగా ఆలోచించలేదు కూడా."
"అబ్బ!" అంది శృతి అపనమ్మకంగా.
"నిజంగానే పెళ్ళి విషయం నేనెప్పుడూ ఆలోచించలేదు. అయినా ఒకటి రెండు సంబంధాలు వచ్చి ఉండొచ్చు కానీ, మరీ క్యూలో నిలబడ్డారన్నట్లు ఈయన చెప్పడం", అని చిన్నగా నవ్వింది ప్రతిమ, "ఎవరికైనా అంత అవసరం ఏముంటుంది?"
"ఏమిటా? నీ అందం!" అంది శృతి. "అసలు ఎలా వచ్చిందే నీకింత అందం?"
"మా అటక మీద దొరికింది. "అంది ప్రతిమ తేలిగ్గా తీసి పడేస్తూ.
శృతి నవ్వి ప్రతిమ భుజాన్ని గిచ్చింది.
"నేను ఆడపిల్లని కాకపోతే డెఫినెట్ గా నీతో గాఢమైన ప్రేమలో పడిపోయి ఉండేదాన్ని! అంత బాగుంటావ్ నువ్వు!"
"భగవంతుడు దయామయుడు! అందుకే నిన్ను నాకు తగిలించకుండా ఆడపిల్లగా పుట్టింటి మీ రాజా మీదికి తోలాడు."
రాజా పేరు చెప్పగానే శృతి మొహంలో కాంతి తగ్గింది.
"ఆ! అసలు రాజాతో నా పెళ్ళి అయినప్పుడు గదా!" అంది నిరాశగా.
"అదేం?" అంది ప్రతిమ ఆశ్చర్యంగా.
"ఏముంది! మామూలు కథే! ఇందాక చెప్పిన ఆర్ధిక న్యాయమే నాకు అన్యాయం చేస్తున్నట్లుంది. రాజా ఇన్ డైరెక్టుగా చాలాసార్లు పెళ్ళి ప్రస్తావన తెచ్చాడు మా అన్నయ్యతో. అన్నయ్య ఏదీ తేల్చి చెప్పడు. చూసి చూసి రాజా నిన్న నాకు వార్నింగ్ ఇచ్చాడు.
'నేనసలే రాక్షసుడి లాంటి వాణ్ణి! నిన్నెత్తుకెళ్ళిపోయి బొంబేలో రాక్షస వివాహం చేసుకుంటా జాగ్రత్త!' అని."
"మీ అన్నయ్యకేమిటి అభ్యంతరం?"
"నాతో సూటిగా చెప్పలేదుగానీ, అమ్మతో అంటుంటే విన్నాను. 'నాన్నగారు పోయాక ఇంటికోసం చాలా అప్పులు చేశాం. ఒక రెండేళ్ళ పాటు కష్టపడి సంపాదిస్తే తప్ప అప్పులు తీరవు!' అని. అంటే అన్నయ్య రెండేళ్ళపాటు నన్ను చదివించిన దానికి బదులుగా రెండేళ్ళు నేను ఉద్యోగం చేసి శాలరీ తనకి ఇవ్వాలని అర్ధం. పైగా ఇప్పుడు నా పెళ్ళి చెయ్యాలంటే తనకి కొంత ఖర్చవుతుంది. నాన్నగారు తన స్వార్జితమైన ఆస్తిలో కొంత నాకు రాశారు. దానిమీద వచ్చే ఆదాయం నా పెళ్ళయ్యాక అన్నయ్యకు దక్కదు. అందుకని మై డియర్! శృతికి ఇప్పట్లో పెళ్ళి కావడం పురజనులు చాలామందికి ఇష్టం లేదు, కష్టమే కాక నష్టం కూడా!" అంది శృతి.
"మరేం చెయ్యదలచుకొన్నావ్ నువ్వు?"
"నేనేదో చేసుకుంటాలే! తండ్రి లేనిదాన్ని, అన్నయ్య మీద ఆధారపడ్డదాన్ని! నా సంగతి అలా ఉంచు నీ విషయంలో మీ నాన్నగారు కూడా అదే సిద్దాంతం మీద పోతూ పెళ్ళంటే ఇంత రాద్దాంతం చేస్తున్నారేమోనని నా డౌటు!" అంది శృతి హాస్యంలోకి వచ్చేస్తూ ఎక్కువసేపు సీరియస్ గా ఉండటం ఆ అమ్మాయికి చేతకాదు.
"నిన్న అసలు నాన్నగారు ఏం మాట్లాడారు?" అంది ప్రతిమ మళ్ళీ.
"ప్రతిమా! నిర్మొహమాటంగా చెప్పాలంటే మా సరస్వతి పిన్ని మీ నాన్నగారికి ఉపకారం చేస్తున్నాననుకుని, ఆయన చాలా సంతోషిస్తారని ఆశిస్తూ పెళ్ళి సంగతి మాట్లాడితే, ఆయన ఎంత తలతిక్కగా జవాబిచ్చారో తెలుసా? ఏం చూసుకుని అంత గొప్ప? ఒకవేళ తనకి అంత గొప్పే ఉన్నా కూతురి మంచిచెడ్డలు ఆలోచించి తను కాస్త తగ్గనక్కర్లేదా?"
ప్రతిమ వేళ్ళతో కనుబొమల మధ్య నొక్కుకుంది. "అప్పుడేమయింది?"
"అప్పుడు మా నాన్నగారి పేరడిగారు. "అంది శృతి మళ్ళీ సీరియస్ గా అయిపోతూ. "మిస్ ప్రతిమా! వర్ణ సంకరమై పోయిన మా కుటుంబంతో మీరు సంబంధం కలుపుకుంటారో లేదో నాకనవసరం కానీ మీ నాన్నగారు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే మొగాడన్న వాడెవడూ వచ్చి నిన్ను చేసుకోడు. గ్రహించు!"
"నేను చేసుకుంటాను." అన్నాడు, అప్పుడే లోపలికి వస్తున్న శ్రీరాం.
వెంటనే అతని మొహంలోకి పరీక్షగా చూసింది ప్రతిమ.
అతని మొహంలో మోహమే తప్ప కోపచ్చాయలు అంతగా కనబడటం లేదు.
"మీ నాన్నగారు నిన్న మా ఇంటికి వచ్చారుట" అన్నాడు ఉపోద్ఘాతంగా.
మాట్లాడకుండా వింటూంది ప్రతిమ.
"శృతి వాళ్ళ మదర్ ది ఇంటర్ కాస్ట్ మారేజు కాబట్టి అభ్యంతరం చెప్పారుట."
"..........."
"మీకూ అభ్యంతరమేనా మిస్ ప్రతిమా?"
"నో! నో! నాటెటాల్!" అంది ప్రతిమ వెంటనే.
శ్రీరాం తేలిగ్గా నిట్టూర్చాడు.
"శృతి నాకు మానసికంగా చాలా దగ్గరి బంధువూ, అంతకు మించిన ఫ్రెండూ అయినా, నిజానికి మాది చాలా దూరపు బంధుత్వం! ఏడు తరాల తర్వాత కుండ పగలేసి పరాయి వాళ్ళయిపోతారు చూడండి! అంత దూరం! మీ నాన్నగారు చెప్పిన దానిలో పాయింటు లేదు."