"ఆకుపచ్చ సంపెంగలా ఉన్నావ్!" అన్నాడు శంకర్రావు, శారద భోజనం వడ్డిస్తుంటే శారద మాట్లాడలేదు.
భోజనాలయేసరికి ఎనిమిదయింది.
అతను ఏదేదో మాట్లాడుతున్నాడు. అతని నోట్లోనుంచి వచ్చే ఏ ఒక్కమాట అయినా తను వినకుండా మిస్సయిపోతానేమో అన్నట్లు, వెయ్యి చెవులతో చాలా శ్రద్దగా వింటోంది శారద. కానీ, తను మాత్రం ఏమీ మాట్లాడటం లేదు.
వాళ్ళ ఇంట్లో మంచాల్లేవు. జంబుఖానా పరిచి, దాని మీద శుభ్రంగా వుతికిన దుప్పటి పరిచి, దిండ్లు వేసింది శారద.
వంటింట్లోంచి, అంటే పక్క గదిలోంచి సన్నగా అగరొత్తుల వాసన వస్తోంది. శారద జడలోని సంపెంగల వాసన గదంతా వ్యాపించింది.
ఆయన మాట్లాడుతున్నారు. ఇవే తను వినే చివరి మాటలు! ఆయన నిద్ర పోగానే తనకింక శాశ్వతనిద్రే!- అదే శారద మనసులో ఆలోచన!
విషం బాటిలు కళ్ళముందు మెదిలింది.
రాత్రి తొమ్మిదయింది.
* * *
తొమ్మిదవగానే ఒకసారి పేషెంట్సందరినీ చూసి తరవాత స్నానం చేసి భోజనం చెయ్యడం శశికి అలవాటు.
స్టెత్ మెడలో వేసుకుని, నవ్వుతూ పేషెంట్లని పలకరిస్తూ పరీక్ష చేస్తూంది శశివదన.
"ఏం రాములూ! ఎలా ఉంది కాలు?" అంది నవ్వుతూ.
రిక్షా రాములు లేచి కూర్చోవడానికి ప్రయత్నించాడు.
వారించింది శశి.
"నాకేం మర్యాదలు చెయ్యక్కర్లేదులే! లేవకుండా పడుకో!"
నొప్పి బాగా తగ్గిపోయిందమ్మా! రేపో, ఎల్లుండో నన్ను పంపించెయ్యుండ్రి! రిక్షా కొట్టకపోతే ఇల్లు గడవదు.
"ఇందాక నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ భార్య వస్తే అమ్మగారు ఏభై రూపాయలిచ్చి పంపారు." అంది నర్సు.
"నిజంగానా! డాక్టరమ్మకి రేపు పిల్లలు పుడితే వాళ్ళని రోజూ భద్రంగా నా రిక్షాలో కూకోబెట్టుకుని స్కూలుకు తోల్కబోయి ఋణం దీర్చుకుంటా!" అన్నాడు రాములు కృతజ్ఞతగా.
"తీరుద్దువుగానిలే, ముందు కాలు నయం కానీ!" అంది శశి.
"నన్ను రేపు పంపించెయ్యుండ్రి, అమ్మా! మందు ఇంటికాడనే తాగుతా!" అన్నాడు రాములు మళ్ళీ.
నర్సు నవ్వింది.
"రాములు ఇంటి దగ్గర తాగే మందు వేరే ఉందమ్మా!" అంది శశితో.
శశి కొద్దిగా కనుబొమలు ముడేసి చూసింది.
"ఈసారి తాగినట్లు తెలియనీ? ఏం చేస్తానో" అంది.
"అహె! గీ నర్సమ్మ బాగానే వుంది! నేను తాగడం మానేసి ఎనన్నాళ్ళాయ!" అన్నాడు రాములు.
శశి నవ్వుతూ అక్కడనుంచి కదిలింది. కింద వున్న పేషెంట్లందర్నీ చూసి తరవాత మేడ ఎక్కింది. శారద వుండి వెళ్ళిన గది ఇంకా ఖాళీగానే వుంది. దుప్పట్లు కూడా ఇంకా మార్చలేదు. గది ఖాళీకాగానే మొత్తం డెట్టాల్ తో కడిగి, దుప్పట్లూ, గలీబులతో సహా మార్చడం తప్పనిసరి ఆ నర్సింగ్ హోమ్ లో ఇవాళ అది జరగలేదు. శశి భావాలు గ్రహించి "రూం శుభ్రం చెయ్యడం మర్చిపోయినట్లుంది, డాక్టర్! యాదమ్మను పిలవనా?" అంది కొద్దిగా భయపడుతూ.
"ఇక ఇప్పుడెందుకూ? పొద్దునే క్లీన్ చేయించ వచ్చులే!" అంది శశి.
కేస్ ఛార్ట్ మంచానికి ఇంకా తగిలించే వుంది. యధాలాపంగా దాన్ని చూసింది. డయాగ్నసిస్ రాసి వుంది. టెంపరేచర్ నోట్ చేసి వుంది. వాడిన మందులు రాసి వున్నాయి.
రౌండ్స్ పూర్తి అయ్యాయి.
"ఓ.కే! ప్రమీలా! పన్నెండు తర్వాత సుందరరావుగారికి ఇంజక్షనివ్వు! గుడ్ నైట్!" అంది శశి.
"గుడ్ నైట్, డాక్టర్!" అంటూ కిందకెళ్ళిపోయింది నర్సు.
మేడమీదనుంచి వెనకవైపుకి మెట్లు వున్నాయి. మెయిన్ బిల్డింగ్ ని ఆనుకుని వెనకగా వున్న చిన్న అందమైన ఇంట్లో వుంటారు శశివదనా, సుధీర్.
కేస్ ఛార్టు చాలా సేపు పరీక్షగా చూసింది శశివదన. అసహజంగా ఏమీ కనబడలేదు.
అప్రయత్నంగా ఆమె చూపులు మంచంమీద పడ్డాయి. నయాపైసంత మేర కాలిపోయి ఉంది దుప్పటి.
తీక్షణంగా అటే చూస్తూ వుండిపోయింది.
దిండు పక్కగా, సగం కాలి ఆరిపోయిన సిగరెట్టు.
ఆ గదిలోకి సిగరెట్లు కాల్చే వాళ్ళెవరు వచ్చివుంటారు? వచ్చినా, అంత నిర్లక్ష్యంగా కాలుతున్న సిగరెట్టు పరుపుమీద పడేసి ఎందుకెళ్తారు?