Previous Page Next Page 
అరుణ పేజి 14

 

    "ఎందుకండీ ఇవన్నీ? ఇవన్నీ చేశారు అనవసరంగా శ్రమపడి." అరుణ మొహమాటపడుతూ నొచ్చుకుంటూ అడిగింది.
    "అవసరం ఏమిటమ్మాయి? మీరు మళ్ళీ మళ్ళీ మా ఇంటికి వస్తారా. ఏదో ఈ రోజు వచ్చారుగానీ:" సాగదీస్తూ గిన్నెతోనేయి వంపేసింది అరుణ విస్తర్లో అరుణ చెయ్యిఅడ్డుపెట్టినా లక్ష్యపెట్టకుండా లక్ష్మమ్మ. ఆవిడవడ్డన చూస్తూంటే అరుణకి భయం పట్టుకుంది ఇంతంత అన్నం కూరలు అవి విస్తర్లో పడేస్తుంది. పారేస్తే నొచ్చుకుంటారేమో? ఎలా ఇంతింత తినడం అని బెంగపెట్టుకుంది. సుబ్బారావు అరుణ అవస్థ గుర్తించాడు ఆపద్భాంధవుడిలా అడ్డుకున్నాడు.
    "అమ్మావాళ్ళు పట్నంవాళ్ళు, మనలా ఇంతింత తింటారా కాస్త నాజూగ్గా వడ్డించు. అరుణా దేవిగారు నీ వడ్డనకి భయపడుతున్నారు." నవ్వుతూ తల్లిని హెచ్చరించాడు.
    "నీదంతమరీ సోద్యంరా: పట్నంవాళ్ళయితే అన్నంతినరా ఏమిటి? నీవే ముందు అడ్డుపుల్లలు వేస్తున్నావు. అసలే ఆ అమ్మాయి మొహమాటపడుతూంటే, అడిగివేయద్దూ?"
    "నాకేం మొహమాటంలేదండీ కావలసినవి అడిగి వేయించుకుంటాను.
    అనవసరంగా పారేస్తే ఏమొస్తుంది?" అంది అరుణ.
    "నాకేమికొత్త లేదండోయ్ మీరెంత పెడితే అంతాతింటాను. వంటబ్రహ్మాండంగా ఉంది. ఇంత సన్నబియ్యం, పాత బియ్యం, ఈ నెయ్యి ఈ చిక్కని పాయసం...... అన్నీ తింటూంటే....." కృష్ణమూర్తి నిర్మొహమాటంగా వేసినవన్నీ శుభ్రంగా తినేస్తున్నాడు.
    "నీవు నచ్చావు నాయనా నాకు నీ చెల్లెలు చూడు సుకుమారం తిండి తింటూంది. ఇలాతింటే రేపొద్దున్న డాక్టరమ్మ పనేంచేస్తావమ్మా:" అరుణ ఆవిడ చాదస్తానికి నవ్వి ఊరుకుంది. పక్కన రుక్కు శుభ్రంగా తనుతినేదానికి రెండు రెట్లు చడీచప్పుడు కాకుండా తినేస్తుంటే ఆశ్చర్యపోయింది అరుణ. మరి వాళ్ళ భోజనంముందు తన భోజనంనాజూకుగా కనపడ్డంలో ఆశ్చర్యం ఏముంది మరిసాధారణంగా వీళ్ళు టిఫిన్లు అవీ చేసుకోరు. అందుచేత రెండుపూటలా సుష్టుగా తింటారు గాబోలు:
    "ఇంతగడ్డలాంటి పెరుగుతిని ఎన్నాళ్ళయిందోమా విశాఖపట్నంలో పాలు రోజురోజుకి దొరకడం గగనమవుతోంది. ఇంటికి గేదెని తీసుకొచ్చి పిండినా ఇంత చిక్కగా ఉండదు పెరుగు. ఎలాగైనాపాలు, పెరుగు వెన్న అన్నిపల్లెలో ఉన్నట్టుండవు."కృష్ణమూర్తి త్రేనుస్తూ అన్నాడు.
    "ఏదో దేముడి దయవల్ల పాడిపంట్లకు లోతులేదు మాకు. ఇంకా తినేవాళ్ళు లేక వీళ్ళకి వాళ్ళకి మజ్జిగ పోస్తుంటాను. కొంతమంది పట్టణాలకి పంపి అమిస్తారు గాని మాకలాంటివిచేతకాదు బాబూ. లేదా పోదా ఎందుకొచ్చినకక్కుర్తి?" అంది లక్ష్మమ్మ. ఆవిడని చూస్తుంటే కాస్త అమాయకురాలాగా అగుపిస్తుంది కచ్చాపోసినకట్టు, వెనకాల వేలుముడి, పెద్దకాసంత బొట్టు, పెద్ద పెద్ద మెట్టెలు, గల్లుగల్లుమని చప్పుడయ్యే మంగళసూత్రాలు చూస్తే ఆమె పట్లపూజ్యభావం కలుగుతుంది. శాస్త్రిగారు ఈ మాటలతో సంబంధం లేనట్లు గాతనకి కావలసినవి అడిగి వేయించుకుని మాట్లాడకుండా భోజనం చేసిఔపోసనపట్టేశారు.
    తనకు వినపడదు అందరితో మాట్లాడి, అందరిని విసిగించడం ఎందుకని ఆయన అవసరం ఉన్నంతవరకే  మాట్లాడి. ఓమూల ఏ భారతమో భగవద్గీతో పట్టుకుని కూర్చుంటారు లేకపోతే రాట్నం వడుకుతు కూర్చుంటారు మరీ కోతలు, ఊడ్పులరోజులలో కొడుక్కిపనెక్కువగా ఉంటె అప్పుడప్పుడు పొలం వెళ్ళి వస్తారు. కోతల సమయంలో కొడుకు చిన్నవాడని ఇంట్లో పడుకోమని ఆయనవెళ్ళి పొలంలో పడుకుంటారు ఆయనతో ఇంట్లో అందరు సంజ్ఞలతోనే మాట్లాడుతారు 'లేద్దామా' అన్నట్టు కృష్ణమూర్తి వంక చూశారాయన భోజనం కాగానే.    

    రుక్కు అందరికి తమలపాకులు తెచ్చి ఇచ్చింది. "ఏమిటమ్మా పెళ్ళివారికి జరిపిన ఈమర్యాదలు:" అరుణ వారిస్తూ అంది. ఒకవక్క పలుకు మాత్రం వేసుకుని తమలపాకులు అలవాటు లేదండి.
    "బాగుంది మా పని చక్కగా పెళ్ళివారిలా మీ ఇంట్లో మీ చేతచేయించుకుంటున్నాం."
    రాత్రితొమ్మిది గంటలవరకు సుబ్బారావు ఊరి విశేషాలు చెప్పాడు లక్ష్మమ్మ పని ముగించుకుని అరుణని ఇంటి విషయాలన్నీ అడిగింది.
    రుక్కు కృష్ణ కుతూహలంగా కూర్చుని కబురులు వింటున్నారు పగలంతా ప్రయాణంలో అలసిన అరుణకి కమ్మని భోజనం వేడినీళ్ళస్నానంతో నిద్రముంచుకుని వచ్చింది. ఆవలించడం చూసి, "పడుకోండి రేపు మాట్లాడుదాం" అంటూ లేచాడు సుబ్బారావు.
    తెల్లవారి అయిదు గంటలు కాకుండానే ఇంట్లో అలికిడి ఆరంభమయింది. అరుణ కూడా తొందరగా లేచింది. ఎంత తొందరగా అన్నీ చూసుకుని అన్నీ ఏర్పాట్లు చేసుకుందామా అని ఆరాటంగా ఉంది అరుణ సాయంత్రం మూడుగంటలలోపల తమ పనులు పూర్తిచేసుకుని మూడున్నరకి బస్సెక్కాలి అని ముందే నిర్ణయించుకున్నారు అన్నాచెల్లెళ్ళు. అందుచేత ఉదయమే అందరిని కలుసుకోవడం అదీ చెయ్యాలి. తను లేవడమేకాక అన్నగారిని కూడా లేపింది. "లే లే అన్నయ్యా మనం స్నానం అదిచేసి అందరి దగ్గరికి వెళ్ళాలి" అంటూ తొందర పెట్టేసింది.
    'అబ్బబ్బనీ కన్నీ హడావిడేకాసేపు పడుకోనీయవు." విసుక్కుంటూ లేచాడు కృష్ణమూర్తి.
    స్నానాలు పూర్తిచేసుకుని ప్రత్యేకంగా తమకోసం తయారుచేసిన ఉప్పుడు పిండిలా ఉన్న ఉప్మా తిని ముగ్గురూ బయలుదేరారు పనిమీద.
    సాయంత్రం అంత బాగా గుర్తించలేదుకాని, ఊరిలో ఇళ్ళన్నీ కాస్త ఎత్తు దిబ్బలమీదే ఉన్నాయి. ఏరులన్నీ పొంగుతాయట వర్షాకాలానికి. అందుకని కాస్త మెట్టుజాగలలోనే ఇళ్ళన్నీ కట్టుకున్నారు. శివాలయం పక్క సందు తిరిగేసరికి బజారురోడ్డు వచ్చింది బజారంటే పెద్ద ఏం లేదు. చిన్న చిన్న పచారి దుకాణాలు మూడు నాలుగు, ఓ మాదిరిబట్టలకొట్లు రెండు, రెండు మూడు టీ హోటళ్ళు ఇంకో పక్క వడ్రంగి దుకాణం ఓ రెండు అరుగుల మీద రెండుకుట్టు మిషనులు ఇంకోపక్క వీధిలో రోడ్డుమీద కే కూరల దుకాణాలు. నడివీధిలో పొయ్యిపెట్టి అట్లు పెసరట్లుపోసే దుకాణాలు.....
    అన్నీవరుసగా చూపిస్తూ సుబ్బారావుకుడివైపు తిరిగాడు వీధుల్లో సందడేలేదు కొంతమంది ఇంకా పందుంపుల్లలు పెట్టి సావకాశంగా పళ్ళుతోముతున్నారు. వీధికిమధ్యగా వున్న పెద్ద నూతి చుట్టూ ఆడవాళ్ళు బిందెలుతోమే వాళ్ళు తోముతున్నారు. నీళ్ళు పట్టుకెళ్ళేవారు పట్టుకెడుతున్నారు. అక్కడే స్నానాలు, అక్కడేబట్టలుతుక్కోవడం, అక్కడే కొందరు బియ్యంకడిగేస్తున్నారు. చూస్తూంటే అరుణకి వింత అనిపించింది ఈ ఆడవాళ్ళు నలుగురూ తిరిగే నడిరోడ్డుమీద ఎంత నిస్సంకోచంగా స్నానాలు చేస్తున్నారు గమ్మత్తు ఏమిటంటే వాళ్ళలా ఒంటిని బట్టలుండీలేనట్లు తిరుగుతున్నా ఏ మగవాడూ చూడడంలేదు. అదే ఏ నాట్లాన్లు టెరిలీన్ల చాటునదాచే అందాన్నో అయితేకుతూహలంగా చూస్తారు. దాపరికం లేనిదేఅందం గుర్తించబడదుకాబోలు ప్రత్యక్షంగా కనిపించేదానికి విలువలేదులా ఉంది.
    సందుతిరగ్గానే గ్రామ పంచాయతీ అన్న ఆఫీసుబోర్డు కనిపించింది. దానికి నాలుగిళ్ళ అవతల గ్రంథాలయం అన్న బోర్డుతో చిన్నకర్రకటకటాల ఇల్లుంది. ఈ వీధిలో కూడా రెండుమూడు దుకాణాలేవో ఉన్నాయి ఓ అరఫర్లాంగు నడిచాక ఎత్తరుగుల డాబాఇల్లు చూపించి "ఇదేప్రెసిడెంటుగారిల్లు రండి" అన్నాడు సుబ్బారావు ఆ ఊరిలో చాలా వరకూ పాకఇళ్ళు ఒకవంతు పెంకుటిళ్ళు డాబాఇళ్ళు మేడలువేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.
    వీధిఅరుగుమీద పడక కుర్చీలోపడుకొని ఇంతలావుచుట్టకాలుస్తున్నాడు ప్రెసిడెంటు బలరామిరెడ్డివీళ్ళని చూడగానే కుర్చీలో నిటారుగా లేచికూర్చున్నాడు. సుబ్బారావు ముందుకి రెండడుగులు వేసి వచ్చిన వాళ్ళెవరో చెప్పాడు.
    "రండి, రండి పంతులు సెప్పాడు లెండి మీరొస్తున్నట్లు అరేయ్ వెంకయ్ నాలుగుకుర్చీలట్రారా" అంటూ కేకవేశాడు కుర్చీలో కూర్చునే అరుణకి, కృష్ణమూర్తికి కాస్త ఒళ్ళు మండింది' ఇంటికి కొత్తవాళ్ళొస్తే కుర్చీలోంచి లేవడేం? లేస్తే ప్రెసిడెంటుగారికి భంగం కాబోలు పల్లెటూరివాడు చదువు సంధ్యలు లేని వాడు కల్చర్ ఎక్కడినించి వస్తుంది? ఏదో ప్రెసిడెంటుగిరీ వెలగబెడుతున్నాడుగానీ అసలు ఈ పంచాయతీ ప్రెసిడెంట్లు కరణాలు మునసబులు అంతా మూడువంతులు వేలిముద్రల వాళ్ళేగా అనుకుంది అరుణ.
    లోపలినించి కుర్చీలు వచ్చాయి అందరూకూర్చున్నారు వచ్చిన దగ్గరినించి రెడ్డిఅరుణని ఆపాదమస్తకంశల్య పరీక్ష మొదలెట్టాడు. ఎర్రటి కళ్ళు గుబురు మీసాలు భారీమనిషి, మనిషితో పాటు ఆ చూపులు ఆ వాలకంమొదటి చూపులోనే అరుణకి నచ్చలేదు. కృష్ణమూర్తికీ రెడ్డి మర్యాద. ఆ చూపు నచ్చలేదు ఎలా మొదలెట్టాలా అని ఆలోచిస్తున్నారు. ఆఖరికి సుబ్బారావే అన్నాడు:"నిన్ననే అరుణాదేవిగారు వారి అన్నయ్యగారు వచ్చారు, ఈ ఊరది చూసుకోవడానికి, వారికి నచ్చితే ఇక్కడ ప్రాక్టీసు పెట్టాలని ఆలోచిస్తున్నారు. మీకుముందే చెప్పాను."
    "అవునవును చెప్పావుగా అయితేడాక్టరమ్మ గారికి మన ఊరు నచ్చినట్టేనా? ఈ పట్టణపోళ్ళకి ఈ ఊరేం నచ్చుతాదిలెండి" ఏదో పెద్దవిట్టు వేసినట్టుగానవ్వాడు ప్రెసిడెంటు.
    "అవుతేడాక్టరమ్మగారు ఎప్పుడొస్తున్నారు మాఊరు?"

 Previous Page Next Page