ఆమె కనురెప్ప తడబాటు- కదిలిన పెదవి- పెగలని మాట. అంతకన్నా ఏ మాట బాగా జవాబు చెప్పగలదు.
"సరే ఐతే- ఇంకో ప్రశ్న. నన్నెప్పట్నుంచి ప్రేమిస్తున్నావు? ఒకప్పుడు నా స్నేహాన్ని కూడా ఒప్పుకోలేదు నువ్వు. అటువంటిది కేవలం ఒక రిజిస్టర్ లో రెండు సంతకాలు పెట్టినందువల్లే ప్రేమ ఉద్భవిస్తుందా- లేకపోతే ఈ దగ్గిరతనంతోనా?"
"అవన్నీ కాదండీ- ఆ సాయంత్రం రిజిస్ట్రార్ దగ్గిర్నుంచి ఇంటికొచ్చాక బామ్మ యిచ్చిన సూత్రం మీరు కట్టేరు చూడండి.... మూడు ముళ్ళు! దాంతోనే ఆ పరిపూర్ణత్వం వస్తుందట. రెండో ముడితో ప్రేమ ఆశిస్తుందట. మూడో ముడితో అర్పితమవుతుందట."
"ఒకవేళ నేను మూడో ముడివెయ్యకుండా రెండు ముళ్ళే వేసేననుకో, నీకెలా తెలుస్తుంది?" నవ్వేడు కృష్ణ.
రాధ చేతిని అతడి నోటిమీద వుంచి "ప్లీజ్, అలా మాట్లాడకండి" అంది.
"అయితే మాట్లాడనులే. ఆఖరుగా ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు. అసలు ప్రేమంటే ఏమిటి?"
ఆమె నవ్వి, కొద్దిగా పక్కకి వంగి, బాల్ పాయింట్ పెన్ తో ఒక కాగితంమీద రెండు వాక్యాలు వ్రాసి, బాత్ రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. అతడు కాగితంవైపు చూసేడు. అందులో ఇలా వుంది-
"మనసు దోసిలిపట్టి మనుగడే హారతి
ఈపాటి దానికి భాష్యాలు దేనికి?
మనసు ముంగిలిలోన రంగవల్లులు తీర్చి
ఇప్పుడా అడిగేది ప్రేమంటే ఏమని?"
ఆ కాగితం పట్టుకొని అతడు లేచి, తనలో తనే నవ్వుకొని, అదే కాగితం వెనుకవైపు పెన్ తో వ్రాసేడు.
"నా స్నేహాన్ని తిరస్కరించావు నువ్వు. ప్రేమ ముందే స్నేహంతో ప్రారంభం కావాలని నా అభిప్రాయం. తరువాత ఆ స్నేహంలో దేహాలు దగ్గరవ్వాలి. అదీ థ్రిల్లు. ఆ థ్రిల్ ఇంకా ఏమైనా మిగులుంటే అప్పుడు పెళ్ళవ్వాలి. నా థియరీకి పెద్ద దెబ్బ కొట్టేసేవ్ రాధా నువ్వు. నీ దృష్టిలో ప్రేమనేది స్నేహంవల్లా, స్పర్శవల్లా ఉద్భవించదన్నావ్. కాబట్టి- హాయిగా ఇంకెవర్నైనా ప్రేమించటం మొదలుపెట్టు. నీ మెళ్ళో మూడుముళ్ళు వేయలేదు ఫ్రెండ్- విప్పిచూసుకో. రెండే ముళ్ళు వేసేను. బైదిబై రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్లి సంతకాల కోసం వెతక్కు, అది పాత పుస్తకాల షాపులో కొన్న లెడ్జరు - చివరగా-
"థాంక్స్ ఫర్ ది ఎక్స్ పీరియన్స్ -కృష్ణ"
రాధ బాత్ రూమ్ నుంచి వచ్చేసరికి ఈ కాగితం రెపరెపలాడుతోంది. కృష్ణ లేడు.
* * *
చుట్టూ సముద్రపు హోరు. మధ్యలో ఎలిఫెంటా గుహల్లో నిశ్శబ్దం. ఈ ప్రళయకాల ఝంఝూమారుతంలో స్మశాన స్థబ్దత. ఆమెకేం చెయ్యాలో తోచలేదు. దుఃఖం కూడా రాలేదు. అంతకన్నా భయంకరమైన షాక్ ఇది. చేతిలో కాగితంవేపు ఆలోచనారహితంగా చూస్తూ కూర్చుంది.
నిజంగా ప్రేమ స్నేహంతోనే ప్రారంభం అవుతుందా? మనసు దోసిలిపట్టి అర్పించటం అనేది కేవలం పుస్తకాల్లోనేనా? ఏమీ తెలియని తను ఒక్క రాత్రిలో ఏమీలేని దానిలాగా అయిపోయింది. ఇప్పుడేం చేయాలి? ఆమె ఆలోచన మొట్టమొదటి బామ్మమీదకు వెళ్ళింది. బామ్మకీ విషయం తెలిస్తే గుండాగి చచ్చిపోదూ. జయ వింటే? తేలిగ్గా తీసిపారేస్తుందా? 'ఆ ఏముంది- తలారా స్నానం చేసెయ్యి' అంటుందా? నిజంగా దానికి అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వనవసరం లేదా?
ఇంత వ్యధలో కూడా ఆమెకి కృష్ణమీద కోపం రాలేదు. తన అజాగ్రత్తని తనే నిందించుకొంటూంది.
రేడియోలోంచి వాల్యూమ్ తక్కువగా సంగీతం వినబడుతూనే వుంది.
బాత్ రూమ్ లోంచి ఒక్కో నీటిచుక్కా శబ్దం చేసుకుంటూ పడుతూంది. దిండు పక్కన వాడిన మల్లెచెండు అచేతనంగా పడి వుంది. పైన ఫ్యాన్ మెల్లగా తిరుగుతూంది.
కింద కార్పెట్ మీద విసిరేసినట్టు అక్కడో జోడు, ఇక్కడో జోడు పడివున్నాయి. పక్కకూడా నలిగిపోయి ఉంది.
దిండు కింద ఏదో కనబడితే తీసి చూసింది. సిగరెట ప్యాకెట్ కృష్ణది.
అప్పుడొచ్చింది ఆమెకి ఏడుపు.
అలాగే పక్కమీద మోకాళ్ళమధ్య తలవంచుకుని చాలా సేపు వెక్కి వెక్కి ఏడ్చింది. దాదాపు పదవుతూండగా తలుపు చప్పుడయింది.
వెయిటరు వచ్చి "కాఫీ కావాలమ్మా?" అనడిగాడు.
అతడికి మొహం కనబడకుండా జాగ్రత్తపడి "వద్దు" అంది.
అతడు వెళ్ళిపోయిన అరగంటకి లేచింది. సూట్ కేస్ సర్దుకొని, కౌంటర్ కి ఫోన్ చేసింది. ఆ నిర్ణయం తీసుకున్నాక ఆమె మామూలుగా అయిపోయింది. దుఃఖం కూడా రాలేదు. పెళ్ళికాక ముందు రాధలాగే వుంది. కౌంటర్ లో రిసెప్షనిస్ట్ బిల్ ఏమీ పే చెయ్యక్కర్లేదని చెప్పాడు.
పదకొండింటికి ఆమె హోటల్ నుంచి ఇంటికొచ్చేసింది. తాళం తీసి లోపలికి వెళ్ళింది. బామ్మ లేని ఇల్లు బోసిగా వుంది.
ఆమె వంట ఏమీ చెయ్యలేదు.
ఎప్పుడు చీకటి పడుతుందా అని చూస్తూంది.
చీకటి పడితేగాని చెరువు నిర్మానుష్యంగా అవదు.
ఆ రోజు ఆదివారం. జయగానీ వస్తుందేమో అని భయపడింది. కానీ అదృష్టవశాత్తూ రాలేదు.
ఆరవుతూండగా ఆమె లేచి యిల్లు తాళం వేసింది. తాళం చెవి పక్కింట్లో యిచ్చి, ఇంటిగలాయనకి యిమ్మంది.
"ఇల్లు ఖాళీ చేస్తున్నారా?" అడిగింది పక్కింటావిడ.
"ఔను"
"సామానులేవి?"
"తీసుకెళ్ళటం లేదు" అని మరి ప్రశ్నించ వీల్లేకుండా సాగిపోయింది రాధ.
చీకట్లు ముసురుకుంటున్నాయి. చెరువు దగ్గిర ఎవరూ లేరు.
ఆమె మనసు నిర్మలంగా వుంది. ఒక్క విచారం బామ్మ గురించే. బ్రతికుండి ఈ విషయం ఆమెకి చెప్పటం కన్నా, చచ్చిపోయి చెప్పకుండా ఉండటం మేలు.
ఇట్నుంచి కాకుండా అటువైపు నుంచి లోతు ఎక్కువ అని భావించింది. పెద్ద పెద్ద రాళ్ళమధ్య నిర్మలంగా వుంది నీరు.
దూరంగా ఊరి తాలూకు దీపాలు మినుక్కు మినుక్కుమని వెలుగుతున్నాయి. ఎక్కడో కుక్క బిగ్గరగా ఏడుస్తూంది.
ఆమె రాయిమీదకు ఎక్కింది.
తనకు ఇంత అన్యాయం చేసిన దేవుణ్ణి ఆఖరి క్షణాల్లో ప్రార్ధించదల్చుకోలేదు.
కళ్ళు గట్టిగా మూసుకొంది.
మరుజన్మ అంటూవుంటే మళ్ళీ మనిషిగా మాత్రం పుట్టకూడదు- అని కోరుకుంది. స్నేహం .... ప్రేమ.... ఆప్యాయత.... పెళ్లి.... ఇవేమీ లేని ఏ జంతువుగానో పుట్టటం మేలని భావించింది!
కాళ్ళకింద మట్టి కొద్దికొద్దిగా జారుతుండగా, గుండెల్నిండా ఊపిరి తీసుకొని ఆమె రాయిమీదనుంచి దూకబోతుంటే వినిపించింది ఓ గొంతు. "గుడ్ ఈవినింగ్ రాధమ్మతల్లీ- మళ్ళీ ఎవర్ని రక్షించబోతున్నావ్?"
ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది.
అక్కడ టి.యస్. వృద్ధుడు.
8
నాలుగు రోజులు గడిచినయ్.
రాధ ఆఫీసుకి రావటంలేదు. పైకి మామూలుగానే కనిపిస్తున్నాడే గానీ కృష్ణకి కంగారుగానే వుంది. ఆమెని హోటల్ లో వదిలేసిన ఓ గంటో రెండు గంటలో ఏడ్చి మామూలుగా ఇంటికొచ్చేస్తుంది.... ఒకటి రెండు రోజుల్లో సర్దుకుని ఆఫీసుకు వస్తుందనుకున్నాడు. అలా కాకపోతే తను చేసిన పనిని గురించి నలుగుర్లోనూ నిలదీస్తుంది అనుకున్నాడు. అలాగేగానీ అయితే తనకేం తెలీదని ఎలా తప్పించుకోవాలో ఆలోచించి పెట్టుకున్నాడు.
ఇంకో పదిరోజులు గడిచినయ్.
అతడికి కంగారు మరింత ఎక్కువైంది. తన గురించి పోలీసులకి చీటీ ఏదైనా పెట్టి ఆత్మహత్య చేసుకుందేమో అన్న అనుమానం మనసులో పుట్టి క్షణాలమీద మహావృక్షమైంది. ఆ సాయంత్రం క్యాజువల్ గా అటువెళ్తూ తొంగి చూసేడు. రాధ ఇల్లు తాళం వేసివుంది. అతడికేమీ అర్ధం కాలేదు. ఆఫీసు పని మీద వచ్చినట్టు పక్క వాళ్ళింట్లో వాకబు చేసేడు.
పక్కింటావిడ అన్నది, "రాధ బామ్మ కాశీ వెళ్ళింది బాబూ! రాధ పెళ్ళయి హనీమూన్ కీ వెళ్లింది - పదిరోజుల క్రితమే, భార్యా భర్తలిద్దరూ పదిరోజుల క్రితమే టాక్సీ ఎక్కుతుంటే చూసేను."
"ఆ భర్తని నేనే' అని మనసులో నవ్వుకున్నాడు కృష్ణ. ఆమె తనను గుర్తుపట్టకపోవటం ఆనందంగా వుంది.
ఆమె ఇంకా అన్నది, "మళ్ళీ నిన్న వచ్చారు బాబూ భార్యాభర్తలు. ఈ రోజు ప్రొద్దున్నే వెళ్ళారు. ఎక్కడికబ్బా?... ఆ.... కాష్.... కాష్...."
రక్తం ఇంకిపోయిన మొహంతో "కాశ్మీర్....." అన్నాడు.
"ఆ... అదే కాష్మీర్-"
మెదడులో స్క్రూడ్రైవర్ పెట్టి తిప్పుతున్నట్లు వుంది కృష్ణకి. "ఆ అబ్బాయి ఎలా వున్నాడండీ?" అనడిగేడు హీనమైన కంఠంతో.
అప్పటివరకూ బాగానే మాట్లాడుతున్నావిడల్లా ఒక్కసారిగా "గఁయ్" మంది. "ఇరుగు పొరుగు అబ్బాయిల్ని చూస్తూ వుండటమేనా నా పని" అని.
కృష్ణమొహం వేలాడేసుకుని అక్కణ్ణుంచి వచ్చేశాడు.
రాధ మళ్ళీ పెళ్ళి చేసుకొందా- ఇంత తొందరగా యింకో అబ్బాయి ఎక్కడ దొరికేడు? అతడికెందుకో రాధ ఇంకెవర్నో చేసుకుంది అంటే ఆనందం అనిపించలేదు. అసలది ఊహ కందని విషయం. ఆమె గోలుగోలున ఏడుస్తుంది అనుకున్నాడు. తన కాళ్ళావేళ్లా పడుతుందనుకొన్నాడు. ఇవన్నీ కాకపోతే నలుగురిలో నిలదీస్తుందనుకొన్నాడు. అంతేకానీ తను కట్టిన మంగళసూత్రం విప్పేసి (తను రెండే ముళ్ళు వేసి వుండొచ్చుగాక) పదిరోజులు తిరిగేసరికల్లా ఇంకొకర్ని చేసుకుంటుందనుకోలేదు. అసలు రాధ చెయ్యవలసిన పనేనా అది....