Previous Page Next Page 
రాధ-కుంతి పేజి 13


    కానీ ఆమె మాత్రం అలానే అన్నది.
    పార్థసారధికి ఒక్కక్షణం ఏమీ అర్ధంకాలేదు. అతడికి వెంటనే వచ్చిన ఆలోచన ఆమెకి మతిభ్రమించిందేమోనని. అసలే ఆ రోజు అతడు మానసికంగా బాగా కృంగిపోయి వున్నాడు. దాంతో అతడు ఆమె ఏం చెప్తూందో అర్ధం కాక ఒక అడుగు వెనక్కి వేశాడు.
    అతడు అడుగు వెనక్కి వేయడానికి ఆమె ఇంకోలా అర్ధం చేసుకుంది. అతడిని నెమ్మదిగా పెనవేసుకుని - ఏదో అనబోతున్న అతడి పెదవుల్ని ముద్దు పెట్టుకుంది. అతడి జీవితంలో ఒకమ్మాయి ఆర్తితో ముద్దు పెట్టుకోవడం అదే మొదటిసారి.
                                          *    *    *
    "నేను నిన్ను ఇప్పుడు ముద్దు పెట్టుకోబోతున్నాను. నీ జీవితంలో మొదటి ముద్దు! మే పదిహేనో తారీఖు సాయంత్రం ఆరున్నరకి రాక్స్ పాలెస్ హోటల్ లో- శోభనం గదిలా ఏర్పాటు చేయబడ్డ రూములో- రాధ అనబడే అమ్మాయి తన జీవితపు మొదటి ముద్దును రుచి చూడబోతూందందులో చూడకండహో...." అరిచేడు కృష్ణ.
    ఏమిటి అల్లరి- అన్నట్టు చూసింది రాధ.
    "ఇప్పుడు నీ హెచ్చరింపులూ- అర్ధం చేసుకోవటాలూ యిక చెల్లవమ్మాయ్, నీ మీద అన్ని హక్కులూ సంపాదించుకొన్నాను."
    అతడి హక్కును వప్పుకొన్నట్టు ఆమె కళ్ళు మూసుకుంది. ఒకటి.... రెండు.... మూడు సెకన్లు ఆమె పెదవుల మీద ఊపిరి వెచ్చగా తగిలింది. కొద్దికొద్దిగా దగ్గిరవుతూన్న వూపిరి.... అతడు ఆమె మొహాన్ని చూస్తున్నాడు. ముగ్ధంగా, అమాయకంగా వున్న మొహం- అరవిచ్చిన మందారంలా- నిర్మలంగా- కోమలంగా-
    తన పెదవుల దగ్గిరగా అతడి ఊపిరి స్పర్శని ఆమె కళ్ళు మూసుకొనే గమనించింది. తను అనాలోచితంగా ఊపిరి బిగపట్టింది అన్న విషయం ఆమెకి తెలియదు. కళ్ళు తెరుద్దామా అనుకుంది కానీ భయం. అతడి చేతుల మధ్య నుంచి విడిపించుకుందామా అనుకుంది. కానీ యిష్టం. ఆమెకి చాలా చిత్రంగా వుంది ఈ అనుభూతి. అతడు పూర్తిగా వచ్చేసినా బావుణ్ణు. అసలు రాకపోయినా బావుణ్ణు. ఈ ఎక్స్ పెక్టేషన్స్ ఆమెని పూర్తిగా వివశురాల్ని చేస్తోంది. మరీ మూడంగుళాల దూరంనుంచి తగిలే వేడి ఊపిరి ఆమె రక్తాన్ని వడివడిగా ప్రవహింపచేస్తూంది. ఆమె మెదడులో చేపల కదలికమల్లే ఆలోచనలు. జీవితంలో ఒకే ఒకసారి వచ్చే ఈ అనుభవాన్ని ఇంత అపురూపంగా అనుభవించవచ్చుననే విషయం ఎంతమందికి తెలుసు? భయంతో, బిడియంతో తప్పు పట్ల ఘర్షణతో ఎంతమంది తెలిసీ తెలియని వయసులో యింత మంచి అనుభూతిని పోగొట్టుకుంటున్నారు! ఇతడు తన భర్త- తన చుట్టూ కోటలా అతడి చేతులు- అతడి కౌగిలిలో ఒక విధమైన రక్షణ- అన్నిటికన్నా మించి ఒక పరిపూర్ణత - పెర్ ఫెక్షన్! తన ఇరవై రెండేళ్ళ జీవితాన్ని దోసిలిలో పెట్టి అర్పిస్తున్నాననే సంతృప్తి.
    వీపుమీద అతడి చెయ్యి కదలటంతో ఆమె తాదాత్మ్యత నుంచి తేరుకుని, కళ్ళు విప్పబోతూంటే, అప్పుడు వచ్చి అతడి పెదవి ఆమె మొహాన్ని స్పృశించింది.... చాలాచోట్ల వరుసగా.... ఆర్తిగా ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తనలోని సత్తువంతా ఎవరో తోడేస్తున్నారన్న భావన. అతడి పెదవులు అలా వెళ్ళీ వెళ్ళీ ఆమె కళ్ళనీ, ముక్కునీ, చెవుల్నీ పలకరించి, చెక్కిళ్ళతో స్నేహం చేసుకుని, క్రిందికొచ్చి ఆమె పెదవుల్ని వత్తేసరికి- పూర్తిగా మైకం కమ్మేసినట్టు ఆమె దాదాపు స్పృహ కోల్పోయింది.
    "రాధా... రాధా" అన్నాడతను కంగారుగా.
    ఆమె నెమ్మదిగా కళ్ళు విప్పింది. వెంటనే తేరుకొని, "చాలా కంగారు పెట్టేనా?" అంది చిరునవ్వుతో.
    "ఇప్పుడే ఇంత కంగారుపడితే రాత్రంతా ఎలా?" అన్నాడు అల్లరిని కళ్ళ వెనుక దాచుకుని. అయితే ఆమెకది అర్ధంకాలేదు. "ఇంకా ఏమిటి?" అన్నది తెల్లమొహం వేసి.
    ఈసారి తెల్లబోవటం అతని వంతయింది. కానీ అంతలోనే అల్లరి చోటు చేసుకుంది. "నువ్వు బియ్యస్సీనా?" అనడిగాడు.
    "బి.య్యే."
    "వయసు....."
    "ఇరవైరెండు."
    "ఇంకా ముందు ముందు సంగతి తెలీదా?"
    "ఊహూఁ"
    "హతోస్మి...." అనుకోలేదతను. అమాయకమైన ఆమె కళ్ళలోకి ఒక క్షణం చూసి, ఏదో అనబోయి, మళ్ళీ ఇటువంటప్పుడు అనవసరమనుకున్నాడు.
                                         *    *    *
    వాళ్ళమధ్య మాటలు లేవు. సారధికి ఆలోచించటానికి సమయం ఇవ్వటంలేదామె. తన అశక్తత గురించిన అనుమానం అతని మెదడులో ఎక్కడో నిక్షిప్తమై ఉండొచ్చుగాక! కానీ జయ చేతివేళ్ళు అతడి శరీరంమీద- సముద్రం మధ్యలో ఉక్కిరిబిక్కిరి అయిపోతూంటే ఏదో ఆధారం దొరికిన అనుభూతి- దాంతో వచ్చిన కాన్ఫిడెన్సు- అతడు కళ్ళు విప్పి చూసేడు. స్త్రీలో గొప్పసంతృప్తిని పొందుతూన్న అనుభూతి- తనలో పెంచుతూన్న నమ్మకం. వేల వేల సంవత్సరాల ఒంటరితనం కట్టలు తెంచుకుని వెల్లువలా ప్రవహిస్తూంది.
    అతడు సారధిలా లేడు. రోమన్ సామ్రాజ్యాన్ని గెలిచిన చక్రవర్తిలా వున్నాడు.
    స్త్రీ ప్రేమిస్తే ఇంత గొప్ప సంతృప్తి నిస్తూందని అతడికి తెలీదు. ఆమె అతడిని ప్రేమిస్తూందన్న విషయం కూడా అతడికి నమ్మకంగా తెలీదు.
    ప్రేమ ఎక్కడ మొదలవుతూంది? స్నేహంతోనా- పెళ్ళితోనా- శరీర సంబంధంతోనా- అతడి విషయంలో చివరిదే నిజమయ్యేటట్టు వుంది.
    సంతృప్తితో అతడికి నిద్రపట్టలేదు. పక్కనే అలసిపోయి నిద్రపోతున్న జయనే చూస్తూ కూర్చున్నాడు. ఎవరీమె? ఈమె అభిరుచులేమిటి? ఇష్టాఇష్టాలేమిటి? తనని ప్రేమిస్తూందా? ఇవన్నీ అతడు ప్రశ్నించుకోలేదు. అతడు ఆలోచిస్తున్నది దగ్గిర తనం పెళ్ళివల్ల కాదు. స్నేహంవల్ల కాదు.
    'ఎంతమంది భార్యాభర్తలు పెళ్ళయి కూడా- కొన్ని సంవత్సరాలకి మానసికంగా దూరమైపోతున్నారు. ఇది కేవలం ఎడ్జెస్ట్ మెంట్. శారీరకంగా ఎడ్జెస్ట్ కాకపోవటం వల్లనే, పోనీ స్నేహం అనుకుంటే, అన్నాచెల్లెళ్ళ స్నేహం ఆత్మవంచననీ పక్కనపెడితే, నిర్మలమైన స్నేహం- ఆత్మీయంగా మారాలంటే సెక్స్ అవసరమేనేమో. చాలా ఘోరమైన థియరీగా కనబడ్తుంది. కానీ ఇది నిజం, అని అతననుకున్నాడు.
    నిజానికి ఆమెకీ తనకీ మధ్య ఒక్కరాత్రి స్నేహం తప్ప ఇంకేమీ లేదు. కానీ గడిపిన ప్రతి అనుభూతీ ఎంతో సజీవంగా అతడి కళ్ళముందు కనబడుతూంది. అలా కదలాడీ కదలాడీ- ఆమెమీద ఇష్టాన్ని పెంచుతూంది. రేపు ఆఫీసుకి వెళ్ళినా కూడా ఆమే, ఆమే.... ఆమె...! రాత్రి ఎప్పుడవుతూందన్న ఆలోచన. ఇంతకన్నా ఏముంది ప్రేమంటే- చాలామంది ఇది కామం అనుకోవచ్చు. కానీ ఒకరి గురించి (శారీరకంగా అయితేనేం) ఎప్పుడూ తల్చుకుంటూ వుండటం కన్నా కావల్సింది ఏముంది? ఉట్టి స్నేహంలో ఇది సాధ్యమా? ఈ వాంఛ తగ్గిపోవచ్చు కానీ ఈ లోపులో ఇష్టం పెరుగుతుందిగా.
    ఆమె కళ్ళు తెరిచి, తనవైపే చూస్తున్న సారధిని చూసి, కిటికీలోంచి వెలుతురు పడటం గమనించి, విస్మయంతో "మీరు రాత్రంతా నిద్రపోనేలేదా?" అంది.
    జవాబుగా చాలాసేపు మౌనంగా వుండి అతనన్నాడు "జయా! ఐ లవ్ యూ" అని.
                   *    *    *
    కిటికీలోంచి పక్కమీదకు పడిన లేతకిరణం బద్ధకంగా వళ్ళు విరుచుకుని నాజూగ్గా తెల్లటి గోడవైపు విశ్లేషించినవేళ. రాత్రంతా నిద్ర లేకపోవటంవల్ల వచ్చిన ఎరుపో- అర్దరాత్రి కంగారు పెట్టిన ఎరుపో- సూర్యుడు ఇంకా పైకిరాక ఆకాశం ఎరుపో- నలిగిపోవటంలో సంతృప్తి చెందిన మల్లెచెండు....
    కృష్ణకీ రాధాకీ వారంరోజులుగా పగలూ రాత్రీ తేడా తెలియటం లేదు. రాధకయితే ఒక విధమైన కలలా వుంది. జీవితం ఇంత బావుంటుందనీ- ప్రేమించడంకన్నా ప్రేమించబడటం ఇంత అపూర్వమైన అనుభూతిని ఇస్తుందనీ ఆమెకి తెలీదు. చిన్నతనంనుంచీ బామ్మ ఒక్కతే ఆమెకు తెలుసు. అదీగాక చుట్టూ బీదరికం. ఇప్పుడది లేదు. పైగా ఈ స్నేహితుడు వయసులోవున్నవాడు. హుషారైనవాడు. మూడు ముళ్ళతో దగ్గిరైనవాడు. ఎన్నో కొత్త కొత్త పాఠాలు చెప్పినవాడు. నేర్పుతున్నవాడు.
    మంచుకొండల్లోంచి పైకి వస్తున్న సూర్యుణ్ణి చూసి ఆహ్లాదంగా రెక్కలుసాచి ఎగిరిన విహంగంలా వుంది ఆమె మనసు. జలపాతం ఒడ్డునే గెంతులేస్తూ పరిగెత్తే లేడిపిల్లలా - నది లోతుల్లో నిర్మలంగా ఈదే చేపపిల్లలా-
    ఎంతమందికి తెలుసు పవిత్రతలో వుండే ఆనందం....
    ఎంతమందికి తెలుసు- ఏమీ తెలియక పోవటంలో వుండే ఆనందం.
    పదహారేళ్ళకే నలభై ఏళ్ళ అనుభవం పొంది - ఇరవయ్యవ ఏట ఇంకేమీ అవలేక- ఫెసిమిజం- సినిసిజం- ఫిలాసఫీ....లాటి రకరకాల పేర్లతో అసంతృప్తిని తృప్తిపర్చుకునే సూడో ఇంటలిజెంట్స్ కి ఏం తెలుస్తుంది- ఆ ఏమీ తెలియకపోవటంలో ఉన్న తృప్తి?
    .......
    వారం గడిచేక తిరిగి వూరుకు వచ్చారు. అయినా రాధని ఇంటికి వెళ్ళనివ్వలేదు కృష్ణ. "ఈ హనీమూన్ అయిపోతే మళ్ళీ జీవితంలో రాదు" అని ఇంకోరోజు కోసం హోటల్ లో రూమ్ తీసుకున్నాడు.
    "రేపట్నుంచే ఇద్దరం కలిసి సంసారం మొయ్యటంలో సతమతం కావాలి. ఈ రోజే అన్నీ అనుభవించాలి ఏం అనుభవించినా-" అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు కృష్ణ. అతడి కౌగిలిలో గువ్వలా వొదిగిపోయింది ఆమె. నలిగిన పక్క... నలుగుతూన్న క్రింది పెదవి.... నిముషాలైన క్షణాలు- గంటలైన నిముషాలు.
    తెల్లవారింది....
    అలసిపోయిన వళ్ళు- ఎర్రబడ్డ కళ్ళు.
    ఆమె మీదుగా వంగి అతనడిగాడు. "రాధా! నేనొక విషయం అడుగుతాను. జవాబు చెప్పు. డూ యూ లవ్ మీ?"

 Previous Page Next Page