Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 14

    "అబ్బ- నువ్వెక్కడ దొరికావయ్యా, మనకిప్పుడు రౌడీల సమస్యలతో నిమిత్తంలేదు. మన సమస్యలు మనకుండగా అడ్డమైన సమస్యలూ చెప్పుకొస్తావేం నువ్వు?" అని రాయుడు రచయితమీద విసుక్కుని "పోనీ, ఈ రోజుకిలా అయిపోయింది. రేపైనా కొడతారా అతన్ని! కొట్టడమంటే మరీ చావ బాదేయడం కాదు కదా-ఏదో నాలుగు తన్నడం, ఇంకా నాలుగు తన్నబోతున్నట్లు కనపడటం" అన్నాడు.   
    ఓ రౌడీ ముందుకొచ్చి "ఓ పసిపాప ఖరీదైన వస్తువు పాడుచేశాడనుకోండి. మనం వాణ్ణి కొట్టాలనే చెయ్యెత్తుతాం. కానీ వాడు మనకేసి చూసి అమాయకంగా నవ్వుతాడు. ఎత్తిన చెయ్యి ఎత్తినట్లే ఉండి పోతుంది. తప్పు చేసిన పసిపాపనే కొట్టలేని వాళ్ళం. ఏ తప్పూ చేయని పసిపాప లాంటి ఆ బాబు నెలా కొట్టగలం చెప్పండి" అన్నాడు.   
    "లాభంలేదు. వీళ్ళు సామ్యాలు చెప్పడం కూడా ప్రారంభించారు. వీళ్ళవల్ల మన పనికాదు. మనం వీళ్ళకంటే మెరుగైన మనుష్యుల్ని ఎన్నుకోవాలి" అన్నాడు రాయుడు.   
    రౌడీలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. "మేమతగాణ్ణి కొట్టాలనుకున్నా అతగాడక్కడికి రావద్దూ?" అనడిగాడొకడు రాయున్ని.   
    "ఎందుకు రాడు? నేను పంపిస్తాను" అన్నాడు రాయుడు.   
    "పంపిస్తే-ఈసారి తప్పక మీ పని చేస్తాం" అన్నాడు ఓ రౌడీ.   
    రాయుడు ఆశ్చర్యంగా "హఠాత్తుగా మీలో యింత మార్పేలా గొచ్చిందీ" అన్నాడు.   
    "మాకంటే మెరుగైన వాళ్ళంటే ఈ ఊళ్ళో చంద్రుడి ముఠా వుంది. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. వాల్లోసారి చెయ్యెత్తారంటే ఇంకేమీ ఆలోచించరు. మమ్మల్ని కాదంటే మీరు వాళ్ళకే ఈ పని అప్పజెబుతారు. అమాయకుడైన ఆ బాబు వాళ్ళ చేతుల్లో పడడం మాకిష్టంలేదు." అన్నాడా రౌడీ.   
    అప్రయత్నంగా రాయుడి కళ్ళు చెమ్మగిల్లాయి. రౌడీలు వెళ్ళిపోగానే రచయితవంక చూసి "ఈ రోజుల్లో కూడామంచితనానికింత విలువుంటుందనినేననుకోలేదు. సుబ్బారావు మీద ఒక్క చూపులో వాళ్ళకెంత అభిమాన మేర్పడిందో చూడు" అన్నాడు.   
    "అదే నా ఆశ! ఒక్క చూపులో సుబ్బారావు మీద మనకు అభిమానం ఏర్పడింది. ఒక్క చూపుతో అతడి మీద రౌడీలక్కూడా అభిమానం పుట్టుకొచ్చింది. అదే విధంగా సుహాసినిక్కూడా అతడిమీద అభిమానం కలిగితే..." అన్నాడు రచయిత.   
    "బాగా చెప్పావు. ఇంటికి పద!" అన్నాడు రాయుడు.   
    ఇంటికి వెళ్ళేక రాయుడు సుబ్బారావుకు కబురుపెట్టి రప్పించాడు. సుబ్బారావు వస్తూనే "పార్కులో నన్ను రౌడీలు చుట్టుముట్టారు. నన్ను కలుసుకుందుకు ఎవ్వరూ రాలేదు" అన్నాడు.   
    సమయానికేదో పనుండి ఆయన రాలేకపోయాట్ట. రేపు తప్పకుండా వస్తాడు. రేపు కూడా నువ్వు పార్కుకు వెళ్ళాలి" అన్నాడు రాయుడు.   
    "నేనింక పార్కుకు వెళ్లనండి!" అన్నాడు సుబ్బారావు.   
    "అదేం?" అన్నాడు రాయుడు.
    "మా అమ్మ వెళ్ళొద్దంది" అన్నాడు సుబ్బారావు.   
    "అయితే మంచి ఉద్యోగం పోగొట్టుకుంటావా?" రాయుడు అడిగాడు.   
    "ఏం చేయనండీ. వంద రూపాయలు తెచ్చిస్తానని ఆ రౌడీలకు మాటిచ్చాను. అమ్మేమో ససేమిరా వాళ్ళకు వందరూపాయలు ఇవ్వడానికి వీల్లేదంది. పార్కుకు వెళ్ళి వాళ్ళకు న అమోహం ఎలా చూపించగలను?" అన్నాడు సుబ్బారావు.   
    రచయిత ఆశ్చర్యంగా. "ఇందుకా నువ్వు వెళ్లనంటున్నది! ఇంకా ఆ రౌడీలకు భయపడ్డావేమో ననుకున్నాను" అన్నాడు.   
    "భయమెందుకండీ - వాళ్ళు చాలా మంచివాళ్ళు" అన్నాడు సుబ్బారావు.   
    "ఆ వందా నేనిస్తాను" అన్నాడు రాయుడు.   
    "వద్దండి  నా గురించి మీకెందుకు శ్రమ!" అన్నాడు సుబ్బారావు.   
    "నా గురించి వెళ్ళడం వల్లనేకదా, నీకా రౌడీలు తగిలారు. అందువల్ల ఆ వందా యివ్వడం నా బాధ్యత" అన్నాడు.   
    ఆఖరికి సుబ్బారావు ఒప్పుకున్నాడు.   
    మర్నాడు నాటకం యథాప్రకారం కొనసాగింది. సుహాసిని మంచి ప్రభాకరానికి ఇంకో ఉత్తరం వెళ్ళింది. ప్రభాకరం నుంచి సుహాసినికి రెండు ఉత్తరాలు వెళ్ళాయి. సూర్యముఖి ప్రభాకరాన్ని ఆహ్వానించింది.
     ఈ రోజు సూర్యముఖి ఆహ్వానం రాగానే ప్రభాకరం కాసేపు ఆలోచించాడు. తను సుహాసినిని కలుసుకోవాలా, సూర్యముఖిని కలుసుకోవాలా అని! అతడు ఊహలకు పదును పెట్టాడు. ఊహల్లో సూర్యముఖి అతడి కౌగిట్లో నృత్యం చేస్తోంది. సుహాసిని ఆమడ దూరాన నిలబడి మాట్లాడుతోంది. ప్రభాకరం మనసు సూర్యముఖి వైపే మొగ్గింది.   
    సరిగ్గా అయిదయింది. పార్కులో ఉన్నాడు సుబ్బారావు. మరికొద్ది నిముషాల్లో రౌడీలతన్ని చుట్టుముట్టారు. పొదల చాటున మోనికా పెన్ను సరిగ్గా పట్టుకుంది. రామగోపాల్ గొంతు సవరించుకున్నాడు.   
    "హలో-వచ్చేశారే! మీ కోసం వంద రూపాయలూ తెచ్చాను" అన్నాడు సుబ్బారావు వాళ్ళను చూసి ఆప్యాయంగా నవ్వుతూ పలకరిస్తూ.   
    రౌడీలు ముఖముఖాలు చూసుకున్నారు - "వీడెక్కడ దొరికాడురా, వీణ్ణి కొట్టడం ఎలా?" అన్నట్లున్నాయి. వాళ్ళ చూపులు. ఓ రౌడీ అయితే కళ్ళు తుడుచుకున్నాడు.   
    రామగోపాల్ వర్ణించి చెబుతూంటే మోనికా రాసుకుంటోంది.   
    సుబ్బారావు జేబులో చెయ్యి పెట్టి వంద రూపాయల నోటు తీసి నేను నిజంగా తెచ్చాను. అబద్దమనుకున్నారా?" అన్నాడు.   
    మరో రౌడీ కళ్ళు తుడుచుకున్నాడు. ఈ సుబ్బారావును చూస్తూంటే వాళ్ళ గుండె ద్రవీభవించి పోతోంది. కానీ అతన్ని కొట్టాలి. కొట్టకపోతే సుబ్బారావుని చంద్రుడి ముఠాకు అప్పజెబుతారు. చంద్రుడి ముఠా ఈ అమాయకున్ని చంపినా చంపేస్తారు. అందుకని తామే గుండె రాయి చేసుకోక తప్పదు.   
    ఓ రౌడీ ముందుకొచ్చి, వంద రూపాయల నోటు అందుకుని "ఇది నాది! మరి మిగతా వాళ్ళకేదీ!" అనడిగాడు.   
    సుబ్బారావు తెల్లబోయి "నేను ఒక్క వందే తెస్తానన్నాడు!" అన్నాడు.   
    "బాగానే ఉంది. నువ్వు తెస్తానన్నది మనిషికొక్క వంద వ్యాపారం చేయాలంటే మనిషికొక్క వందేనా చాలదు. అలాంటిది నలుగురికీ కలిపి ఒక్క వందిస్తానంటే ఎలా? ఒరేయ్- నా వంద నా కొచ్చింది. మీరు ముగ్గురూ మీ సంగతులు చూసుకోండి" అని ఆ రౌడీ కాస్త వెనక అడుగు వేశాడు.   
    "నీ ఎత్తు చాలా బాగుంది! ఆ వందా నాకిచ్చి మీరు ముగ్గురూ ఆ వ్యవహారం చూసుకోండి" అంటూ ఇంకో రౌడీ మొదటి రౌడీ మీద పడ్డాడు.

 Previous Page Next Page