రౌడీలు ముఖముఖాలు చూచుకున్నారు. తర్వాత వారిలో ఒకడు "నీ జేబులో చెయ్యి తియ్యి. చేతికి ఉంగరాలుంటే..." అని ఏదో అనబోగా.
సుబ్బారావు నవ్వి, "చిన్నప్పుడు నా అన్నప్రాసనకి మా బామ్మ నాకో ఉంగరం చేయించింది. అది మా అమ్మ ఇంకా దాచి ఉంచింది. నాకు పెళ్ళయితే అత్తారుంగరం చేయిస్తారట. అప్పుడదీ యిదీ కలిపి రెండు కొత్త ఉంగరాలు చేయించుకో వచ్చంది. అమ్మ ఒకదాని మీద వెంకటేశ్వర స్వామి బొమ్మా, ఇంకోదాని మీద లక్ష్మీదేవి బొమ్మ వేయించి చేయించుకుందా మనుకుంటున్నాను. మోడల్ కావాలంటే మా వీధిలో నాగాంజనేయులిగారికున్నాయి" అని సుబ్బారావు స్వరం తగ్గించి "చేతికి వాచీ ఉంటే అత్తారు వాచీ పెట్టరుట పెళ్లయ్యేదాకా మగాళ్ళు వాచీ పెట్టుకోకూడదట. మీ అందరికీ వాచీలున్నాయి. మీకు పెళ్ళిళ్ళు అయిపోయాయా?" అనడిగాడు.
మళ్ళీ రౌడీలు ముఖముఖాలు చూసుకున్నారు- "పోనీ నీ దగ్గర పర్సుంటే తీయి. వాటం చూస్తుంటే నీ దగ్గర అది కూడా ఉన్నట్లు లేదు" అన్నాడో రౌడీ.
"ఎలా ఊహించారు?" అన్నాడు సుబ్బారావు. ఆశ్చర్యంగా- "బయట ఏమీ కొనుక్కోను నేను. ఊరంతా కాలి నడకనే తిరుగుతాను. ఎప్పుడైనా రిక్షా ఎక్కినా డబ్బులు ఇంటి దగ్గరే ఇవ్వచ్చుగా. అందువల్ల డబ్బులెప్పుడూ ఇంటి దగ్గరే ఉంటాయి. నా జేబులో పర్సూ లేదు. డబ్బులూ లేవు."
రౌడీలు ముఖముఖాలు చూసుకున్నారు, "వీణ్ణి ఏ వంక పెట్టుకుని కొట్టాలి!" అన్నాడో రౌడీ.
"ఉద్యోగం చేసుకుంటున్న మగాడు. ఓ వాచీలేదు. ఉంగరం లేదు. జేబులో పైసా లేదు. ఈ కారణంగానైనా కొట్టొచ్చుగదా" అన్నాడింకో రౌడీ.
అప్పుడో రౌడీ ముందుకి వెళ్ళి "ఏరా, జేబులో ఏమీ లేకుండా ఎందుకొచ్చావు?" అంటూ సుబ్బారావు కలరు పట్టుకున్నాడు.
"నా జేబులో ఏమీ లేకపోతే మీకేం నష్టం?" ఆనాడు సుబ్బారావు. అతను తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. కానీ రౌడీ వంక భయం భయంగా చూశాడు.
"నష్టమంటే కాస్తా కూస్తా నష్టంకాదు. నువ్వెప్పుడూ జేబులో డబ్బులు పెట్టుకుని తిరుగుతూండాలి" అన్నాడు రౌడీ అతడి కాలరు వదలకుండా.
"సరే, ఈ సంగతి మా అమ్మకు చెబుతాను" అన్నాడు సుబ్బారావు.
రౌడీ చటుక్కున అతడి కాలరు వదిలిపెట్టి ఓ అడుగు వెనక్కువేసి" చాలా అమాయకుడురా, వీణ్ణి కొట్టడం కష్టం" అన్నాడు నెమ్మదిగా.
సుబ్బారావు నెమ్మదిగా "ఇంతకీ మీ రెవరో చెప్పలేదు" అన్నాడు.
"దొంగలం!" అన్నాడు రౌడీ.
"నేను నమ్మను మీరు దొంగలు కారు. దొంగలైతే గళ్ళలుంగీ కట్టుకోవాలి. చారల బనియన్ వేసుకోవాలి. పెద్ద పెద్ద మీసాలుండాలి. నాకు బాగా తెలుసు."
"దొంగలకు ప్రత్యేకమైన డ్రస్సంటూ ఉంటే జనాలకు వాళ్ళెవరో తెలిసిపోదూ? అందుకని ఇలా డ్రస్సు వేసుకుంటాం" అన్నాడు రౌడీ.
"అదేం కాదు. నేను సినిమాల్లో చూశాను. నేను చాలా ఎక్కువగా సినిమాలు చూస్తాను. ఈ మధ్య మరీ ఎక్కువగా చూస్తున్నాను. ఏకంగా రెండేసి నెల్లకి ఒకటి. అందులో దొంగలిలాంటి వేషాలతోనె తిరుగుతూ ఉంటారు. ప్రజలు పట్టించుకోరు. దొంగలు దోమ్గాతనం చేస్తేనే ప్రజలు పట్టించుకుంటారు" అన్నాడు సుబ్బారావు.
"కాదు. మేము దొంగలమే!" అన్నాడు రౌడీ.
"అయితే మీరు దొంగతనాలెందుకు చేస్తున్నారు?" అన్నాడు సుబ్బారావు.
"బ్రతకడం కోసం" అన్నాడో రౌడీ.
"అయ్యో, అది మహాపాపం" అన్నాడు సుబ్బారావు. "దొంగతనం చేసిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు...."
"మాకు నరకమంటే భయం లేదు" అన్నాడో రౌడీ.
సుబ్బారావు వాళ్ళకు స్వర్గపరకాల గురించీ, పాప పుణ్యాల గురించీ ఉపన్యాసం ఇచ్చాడు. వాళ్ళ బుద్దిని మంచి దారికి మళ్ళించుకోమన్నాడు.
"ఈ కబుర్లన్నీ కడుపు నిండిన వాళ్ళు చెబుతారు. మా దగ్గరే కనుక ఓ వంద రూపాయలుంటే ఏదో వ్యాపారం చేసుకుని బ్రతికే వాళ్ళం" అన్నాడో రౌడీ.
సుబ్బారావు ఏదో ఆలోచించి "మీకో వంద రూపాయలిస్తే దొంగతనం మానేస్తారా? మానేస్తామని మాటిస్తే అమ్మనడిగి ఓ వంద రూపాయలు తెచ్చి రేపు మీకిస్తాను. మనం మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం" అన్నాడు.
రౌడీలకేం మాట్లాడాలో తెలియలేదు. "సరే, అలాగే" అని వాళ్ళు వెళ్ళిపోయారు. సుబ్బారావు అక్కడ మరో అరగంట సేపుండి- "నా కోసం ఎవ్వరూ రాలేదే!" అనుకున్నాడు. మళ్ళీ ఓసారి చుట్టూ చూశాడు.
అతడికి కాస్త దూరంలో ఉండి ప్రభాకరం కోసం ఎదురు చూస్తున్న సుహాసిని కనిపించింది. వెంటనే సుబ్బారావు తల దించుకుని అక్కణ్ణించి కదిలాడు.
సుహాసిని కూడా అక్కడే కాసేపు ప్రభాకరం కోసం ఎదురు చూసి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి ప్రభాకరం పార్కుకు రావడం లేదని రాసిపెట్టిన చీటీ ఉంది.
8
"ఇతగాన్ని నమ్ముకుంటే మన కథ ముందుకు నడిచేలా లేదు."
రాయుడి మాటలు విని రచయిత వెంటనే ఏమీ అనలేదు. అతడికీ మనసులో కాస్త అనుమానం బయల్దేరింది. ఇద్దరూ బయల్దేరి ఒక నిర్ణీత స్థలంలో ఆ రౌడీలను కలుసుకున్నాడు.
"మీరు చెప్పిన పని చేయలేకపోయాం! మీ రిచ్చిన అడ్వాన్సు వెనక్కిచ్చేస్తాం. మేము వెధవపనులు చేసి బ్రతుకుతున్నా మరీ అంత అమాయకుల జోలికెప్పుడూ వెళ్ళలేదు. అతగాడి కళ్ళలోకి చూస్తూంటే మా చెయ్యి లేవడం లేదు" అన్నాడో రౌడీ.
"రౌడీలకు హృదయముంటుందా?" రాయుడు చిరాగ్గా అన్నాడు.
రచయిత వెంటనే రియాక్టయ్యాడు "రౌడీలంటే ఏదో లోకం నుంచి ఊడి పడ్డవాళ్ళు కాదు. వాళ్ళూ మనుషులే! సమాజం తన స్వప్రయోజనాల కోసం వాళ్ళను సృష్టించింది. మనం సినిమాల్లో రౌడీలోని కరుకుతనాన్నే గానీ మంచితనాన్ని చూపించం. ఏదో బలవత్తరమైన సంఘటన ఉంటే తప్ప సినిమాల్లోని రౌడీల్లో మార్పురాదు. కానీ నిజ జీవితంలో అలాగాదు. కోపం వస్తే మనం పిల్లల్ని కొడతాం. ఆ తర్వాత లాలిస్తాం. అలాగే రౌడీ కూడా అవసరం కోసం దౌర్జన్యం చేస్తాడు. మిగతా సమయాల్లో మామూలు మనిషిలాగే ప్రవర్తిస్తాడు. మనమంతా రౌడీలను అర్ధం చేసుకునే రోజెప్పటి కొస్తుందో!"