Previous Page Next Page 
లవ్ మర్డర్స్ పేజి 13

    "ఏమిటి ఆలోచిస్తున్నావు? కట్టుకధ చెపుదామన్నా"

    అమల పెదవి కదపలేదు.

    "నువ్వెవరో నాకు తెలియదు. సరోజవు మటుకు కాదు. చావగొట్టి, చెవులు మూసి ఈ క్షణాన నీ నోట్లోంచి నిజం కక్కిద్దును. మామయ్యకోసం ఊరుకున్నాను. సరే ఇప్పటికి వెళుతున్నాను. జాగ్రత్త! ఈ కృష్ణ ముందు నీ ఆటలు, నాటకం సాగవు గుర్తుంచుకో. రెండురోజులు టైము ఇస్తున్నాను. నువ్వెవరివో నిజం చెప్పకపోయావా, ప్రాణం తీస్తాను" అని కృష్ణ తలుపు తీసుకుని బైటకు వెళ్ళిపోయాడు.

    చెంప తడుముకుంటూ చాలాసేపు అమల పిచ్చిదానిలా అలా ఉండిపోయింది.

    'ఉహు, లాభంలేదు. ఇటు చూస్తే సింహం. అటు చూస్తే పులి. బోనులో మేకపిల్లను నేను. తెగించాల్సిందే ఈ దెబ్బతో చావో, బ్రతుకో తేలిపోతుంది. కృష్ణకు అంతా చెప్పేసి భగవాన్ ఉనికిని కనిపెట్టమని కోరాలి' అనుకుంది అమల మొండి ధైర్యంతో.

    ఉన్నట్లుండి అమలకు కరెంట్ షాక్ తగిలినట్లు అనుమానం వచ్చింది.

`    కృష్ణ కూడా భగవాన్ అంత ఎత్తు, లావులో వున్నాడు. భగవాన్, కృష్ణ ఎందుకు కాకూడదు? నామీద అనుమానం కలిగి నిజం చెపుతానా, లేదా అని చిన్న ప్రయోగం నాపై జరిపివుంటాడు. ఈ మధ్యనే ఊరునుంచి వచ్చినట్లు నటించాడేమో? నెలరోజుల క్రితమే ఈ ఊరు వచ్చి భగవాన్ పేరుతో కృష్ణ నన్నెత్తుకొచ్చి వుంటాడు. అంతే, ఈ కృష్ణను కూడా నమ్మకూడదు.

    కృష్ణ - భగవాన్, భగవాన్ - కృష్ణ.

    కసిగా పళ్ళు నూరి సరికొత్త పధకం ఆలోచిస్తూ కూర్చుంది అమల.
   

   
                                    9


        ఏడ్వకు తల్లి! నే చూడలేను" బాధగా అంటూ భుజంగరావు అమల కన్నీళ్ళు తుడిచాడు.

    "నా ప్రభ కావాలి, నా ప్రభను తెచ్చివ్వండి. లేకపోతే నే పోతాను. చచ్చిపోతాను. ఊ......ఊ......" అంటూ అమల పిచ్చిపిచ్చిగా వాగుతున్నది. భుజంగరావు వడిలో తల దూర్చుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నది.

    భుజంగరావు "ఊరుకో తల్లీ, ఊరుకో" అంటున్నకొద్దీ అంతకంతకు పిచ్చిగా వాగటం, ఏడవటం ఎక్కువైంది అమలకు.

    సుందరమూర్తి, శంకరం, నాయర్ ఏం చేయాలో తెలియక అయోమయంగా ఎక్కడివాళ్ళక్కడ నుంచుండిపోయారు.

    "కృష్ణ లాన్ లో పేపరు చదువుతూ కూర్చున్నాడు. పిలుచుకురా శంకరం" అన్నాడు భుజంగరావు.

    శంకరం పరుగున వెళ్ళాడు.

    "కృష్ణ లేదు, గ్రిష్ణ లేదు. ప్రభను పిలుచుకురండి. పొండి. అంతా పొండి. ప్రభను తీసుకురండి లేకపోతే చస్తాను. మీ అందరినీ చంపేస్తాను" అంటూ అమల సుందరమూర్తి మీదకు, నాయర్ మీదకు చేతులు చాచి భద్రకాళిలా వెళ్ళింది.

    నాయర్ భయంతో ఓ అడుగు వెనక్కు వేశాడు.

    సుందరమూర్తి బిగుసుకుపోయినట్లు నుంచుండిపోయాడు.

    అమల చేయి చాచి ఈడ్చి సుందరమూర్తి చెంపమీద కొట్టింది. "ప్రభను తెమ్మంటే పోవేం, ఎద్దు మొద్దు వెధవ" అంది. వెంటనే నాయర్ వద్దకు పరుగు తీసింది.

    నాయర్ పరుగున వెళ్ళిపోయాడు.

    సుందరమూర్తి రెండడుగులు వెనక్కు వేశాడు, అమల పిచ్చిని చూచి.

 Previous Page Next Page