Previous Page Next Page 
హృదయాంజలి పేజి 12

    ఒకరి రెంటు నెలలు గడిచే సరికి ఆచారికి రెండు మూడు ట్యూషన్లు పెరిగాయి. తండ్రికి సాయంగా అపురూప కూడా పిల్లలకి పాఠాలు చెబుతూ ఉంటుంది.

    ఇంటాయనకి టైలరింగ్ షాపుంది. అక్కడ అన్నీ లేడీస్ బట్టలే కుడతారు.
 
    కాజాలు, హెమింగ్ చేసి హుక్స్ పెడితే జాకెట్ కింతని డబ్బులిస్తారు! సాయంత్రం స్కూల్ నుండి వచ్చాక ఓ గంట ఆ పని చేస్తుంది అపురూప. సెలవుంటే ఇంకా ఎక్కువ టైం చేస్తుంది. పాలు, కూరగాయలకయ్యే ఖర్చు అంతా ఈ కుట్టు పనిమీద వచ్చే డబ్బులతో గడిచిపోతుంది.

    అర్చితకి పని ఓపిక తక్కువ. కుట్టుపని అంటే మరీ విసుగు ఇంటిపనిలో మాత్రం అక్కకి సాయం చేస్తూ ఉంటుంది. ఆ పిల్లలో మెచ్చుకోవాల్సిన సుగుణం ఏమిటంటే చదువులో ఫస్ట్! స్కూల్ ఫస్ట్! స్కూల్ పుస్తకాలే కాదు! పత్రికలు కూడా బాగా చదువుతుంది. సినిమా లన్నా, సినిమాపాటలన్నా చాలా ఇష్టం. అందరికన్నా చిన్నది. అమ్మ లేనిది! అందుకని తండ్రీ, అక్కా ఏమి అనరు! ముద్దుమురిపాలు తీర్చడానికి సంపదలేదేమోగాని గుండెల్లో ప్రేమకి ఇంకా కొరతలేదు.

    ఉదయభాను ఒక్క పేపరివ్వడమేకాదు! పాలపాకెట్లుకూడా వేసేవాడు. లాటరీటిక్కెట్లు అమ్మేవాడు. ఇరుగుపొరుగు వాళ్ళు ఏ పని చెప్పినా అభిమానపడకుండా చేసేవాడు, వాడికీ తెలుసు, అభిమానపడితే ఈ సిటీలో బ్రతకలేమని! ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చేవాళ్ళు!

                                 *    *    *

    అపురూపకు ఇప్పుడు పదహారేళ్ళు!

    ఉదయకాంతిలో విచ్చుకొన్న కమలంలా ఆమె లో అందాలు విచ్చుకొంటున్నాయి. మబ్బుల క్రింద నెమలిలా ఆమెలో యవ్వనం పురులు విప్పుతోంది. అప్పుడప్పుడూ తప్పని సరిగా చేయాల్సి వచ్చే ఉపవాసాలు ఆమె శరీరానికి మంచి ఆరోగ్యాన్నీ, చక్కని ఆతృతనీ సమకూర్చుతున్నాయి.
 
    ఆమె చూస్తుండగానే మగపిల్లల గుండెలకి ఎక్కుపెట్టిన మన్మధ బాణం అయిపోయింది.

    యవ్వనానికి బీద గొప్ప తెలీదు! సమయం రాగానే అందరినీ సమంగా వరిస్తుంది!

    మగపిల్లల చూపులు అయస్కాంతంలా తనను అతుక్కుపోతుంటే కంపరంగా తోచేది అపురూపకు. చాలా వరకు తలవంచుకుపోవడమే నేర్చుకుంది. ఎప్పుడైనా తలెత్తవలసి వస్తే ఆమె కళ్ళలో కనిపించే ఎరుపుజీరలు చూసి అదిరిపాటుతో ప్రక్కకు తప్పుకుపోతుంటారు మగపిల్లలు.

    మగపిల్లలంటే ఆమెకున్న కంపరం పదిరెట్లు, వందరెట్లు పెరిగిపోయే, సంఘటన ఒకటి జరిగింది.

    శ్వేత అపురూప క్లాస్ మేట్. చదువులో ఆ పిల్ల కొంచెం డల్. లెక్చరర్ నోట్సు చెబితే సరిగా రాసుకోలేదు.
 రాసుకొన్నది లక్ష తప్పులతో ఉంటుంది. అందుకని అపురూప నోట్సు తీసుకుని రాసుకుని తిరిగి ఇచ్చేస్తూ ఉంటుంది. ఏదైనా డౌటొచ్చినా అపురూపనే అడుగుతూ ఉంటుంది.

    ఫైనల్ పరిక్షలముందు, "ఒక్కదానికి చదువబుద్దికాదు! నువ్వూరా అపూ! మనం కంబైండ్ స్టడీ చేద్దాం." అంటూ బలవంతంగా అపురూపని ఇంటికి తీసికెళ్ళింది.

    శ్వేత వాళ్ళది పెద్దమేడ! ఇంట్లో అడుగడుగునా ధనవంతుల కుండే హంగులన్నీ ఉన్నాయి. మండిపోయే ఎండల్లో, ఎ.సి. అమర్చిన గదిలో కూర్చొని చదువుకోవడం హాయిగానే ఉండేది అపురూపకు. పోతే ఆ ఇల్లు తను కాలేజీకి వెళ్ళొచ్చే దారిలోనే ఉంది.

    ఇంకొక కారణం కూడా ఉంది! ధనవంతుల అమ్మాయినన్న అహంభావం ఎక్కడా కనబర్చేది కాదు శ్వేత. అపురూప అంటేప్రాణం ఇచ్చేంత స్నేహంగా ఉండేది.

    వాళ్ళింటికి అలా వస్తూపోతూ ఉన్నప్పుడు శ్వేత అన్న ప్రదీప్ కళ్ళలోపడింది. పచ్చని తోటలో విచ్చిన గులాబీలా అతడి కళ్ళు ఆమె మీదపడ్డాయి. ఆమె కనిపించిన ప్రతిసారీ ఒక విసనకర్రతో విసిరినట్టుగా అతడిలో మోహవీచికలు వీచేవి! ఎలాగైనా ఆమెతో మాట్లాడాలనీ తాపత్రయపడేవాడు. అవకాశం వెదికేవాడు. అతడు మాట్లాడించాలని ప్రయత్నించినప్పుడల్లా ముక్తసరిగా జవాబిచ్చి తప్పించుకు పోయేది అపురూప.
 
    ఒకరోజు మేడమీద గదిలో, ఒక లెక్కతో గంటసేపు కుస్తీపట్టు పట్టారు శ్వేత, అపురూప. ఎన్ని విధాలుగా చేసినా ఆన్సర్ సరిగా రావడంలేదు. చివరికి పుస్తకంలో ఇచ్చిన ఆన్సరే తప్పేమో, లేక లెక్కే తప్పేమో అన్న అభిప్రాయానికి వచ్చింది అపురూప.
 
    "మా అన్నయ్య నడిగివస్తానుండు!" అంటూ లెక్కలపుస్తకం, నోట్సు తీసుకుని తుర్రున పరిగెత్తింది శ్వేత - "ఈ లెక్క ఎంత బద్దలు కొట్టుకున్నా రావడంలేదు" అంటూ లెక్క అన్నగారి ముందు పెట్టింది.

    ఇంజనీరింగ్ చేస్తున్ నప్రదీప్ కి లెక్కలు కొట్టిన పిండే లెక్క ఒక్కసారి చదవగానే,  "ఓస్! ఇంత ఈజీ లెక్క రాలేదంటే, నీదేకాదు నీ ఫ్రెండుది కూడా మట్టి బుర్రేననాలి" అన్నాడు.

 Previous Page Next Page