Previous Page Next Page 
మంత్రముగ్ధ పేజి 13

    "ఎదురుగా మేడమీద టైలరింగ్ షాపు ఒకటుంది. అక్కడ నిలబడి చూస్తే యిక్కడి దృశ్యాలు బాగా కనిపిస్తాయి. అప్పుడప్పుడూ అక్కడ నిలబడే ఈ షాపులో ఎవరెవరు ఏమేం తింటున్నారో చూస్తుంటాను."

    "అఘోరించావులే పద! ఎవరో తింటే చూచినంత మాత్రాన మన నోటి తీట వదులుతుందంటావా? అక్కడికే వెడదాం పదండి" అంది.

    ముగ్గురూ మేడమీది టైలరింగ్ షాపుకి వెళ్ళారు.

    అక్కడ నిలబడి చూస్తుంటే ఐస్ పార్లర్ లో జరుగుతున్న తతంగం చుట్టూ నిలబడి ఉన్న జనం తలలమీదుగా కన్పిస్తోంది.

    యోగి తాము వెళ్ళినప్పుడు ఎలా పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే కూర్చుని ఉన్నాడు.

    షాపు యజమాని వ్యాపారం సంగతి మర్చిపోయాడు. అతని కుటుంబ సభ్యులు అందరూ అతని చుట్టూ చేరిపోయారు. షాపు యజమాని అర్ధాంగి కాబోలు ముందుగా పిల్లల్ని యోగి పాదాల దగ్గర మోకరింపచేసింది.

    తాను కూడా బోర్లా పడుకుని అతని పవిత్ర పాదాలు తాకి కళ్ళకు అద్దుకుంది. జనం కూడా ఆయనకు మ్రొక్కులు చెల్లించేందుకు త్రోసుకొస్తున్నారు. కాని షాపుసిబ్బంది అతి శ్రమమీద వారిని అదుపు చేస్తున్నారు.

    షాపు యజమాని అర్ధాంగి రిక్షాలో తెచ్చిన ఆవుపాలు రమ్ములోంచి అందంగా లతలు తీర్చిన ఓ వెండి బిందెలోకి దిమ్మరించింది.

    "పాద పూజ చేస్తున్నారు కాబోలు! ఇవాల్టితో వీడి పంట పండింది. కోటీశ్వరుడయిపోతాడు కాబోలు!" అన్న మాటలు వినిపించాయి.

    తలత్రిప్పి చూచింది ఉమ. వారికి వెనుక ముగ్గురు యువకులు నిలబడి ఉన్నారు. గెడ కొంగలా ముందు నిలిచి ఉన్న ఆడపిల్లల తలలమీద నుంచి షాపులోని దృశ్యాల్ని తిలకిస్తున్నారు.

    వారిలో ఒక యువకుడు మరింతగా పులకించుతున్నాడు.

    కారుల్లో, విమానాల్లో త్రిప్పుతామన్నా రానన్నాడట! ఊరి వెలుపల ఒక తోట, బంగ్లా యిస్తానని అర్ధించినా ఒప్పుకోలేదట! వీడి అదృష్టం ఎందుకిలా పుచ్చిందో పిలవకుండా వచ్చేశాడు అన్నాడు!"

    "ఆయన వచ్చినంత మాత్రాన ఏమవుతుందట?" వెటకారంగా అంది ఉమ.

    "యోగి ఎక్కడ కాలుపెడితే అక్కడ కనకవర్షాలు కురుస్తాయట ఏ ప్రాంతాల నుంచి వచ్చాడో, ఎందుకొచ్చాడో నగరంలో ప్రత్యక్షమయి నెల రోజులు కూడా కాలేదు.

    జనంలో గగ్గోలు సృష్టించాడు!" అని బదులిచ్చాడాయువకుడు రెప్పలు అరమొడిచి మరీ చెప్పాడు భక్తి భావంతో!

    "త్రాష్టుడా! ఈ వయసులో ఇంత చాదస్తంగా ఆలోచిస్తున్నావు అని గొణుక్కుంటూ తల త్రిప్పి ముందు దృశ్యాలు చూడడంలో మనసు లగ్నం చేసింది ఉమ.

    షాపు యజమాని అర్ధాంగి వెండి బిందెలోకి ఒంపిన పాలతో అరవిచ్చిన మల్లెపూలు, గంధం కలిపి పన్నీరు చిలికించింది.

    పెద్ద వెండి పళ్ళెంలో యోగి పాదాలను ఉంచారు.

    పూలు గంధం పన్నీరు కలిపిన పాలను పోసి కాళ్ళు కడిగారు. యోగి రెప్పలు విప్పి అయినా చూడలేదు. పాలు అతికిన పాదాలను షాపు యజమాని షర్టు అంచులతో అద్దటం ప్రారంభించాడు. అతనితో పాటు అతని అర్ధాంగి పైట కొంగుతో అద్ది శుభ్రంగా తుడిచారు.

    ఆ తరువాత వారు పాలతో యోగికి అభిషేకం ప్రారంభించాడు. అంతసేపు గొణుగుతున్నట్టు మంత్రాలు చదువుతున్న బ్రాహ్మడు అరకిలో మీటరు దూరం వినిపించే రాగ స్పూర్తితో అమృతాభిషేకం మంత్రాలు చదవటం ప్రారంభించారు.

    వేరు వేరు వెండిపాత్రలలో పాలు పెరుగు నెయ్యి తేనె గంధజలం తీసుకువచ్చి అతనికి అందించారు. అవన్నీ కలిపి అతడు పెద్ద వెండి బిందెలో కలియబోసి పంచామ్రుతాలను తయారు చేశాడు.

    "ఆప్యాయ స్వసమేతుతే..." అంటూ మరింత పెంచిన కంఠ స్వరంతో మంత్రాన్ని అందుకున్నాడు. "మధువాతారుతాయతే మధుక్షురన్తి సింధవః" అంటూ మంత్రాన్ని శృతి మధురంగా చదువుతున్నాడు.

    నిర్లిప్తంగా వృత్తిపరంగా కాక ఏదో స్పూర్తి అతని కంఠస్వరాన్ని ఆవరించింది.

    మంత్రం పూర్తి అయ్యేసరికి షాపుయజమాని దంపతులు అత్యంత భక్తి భావంతో అభిషేకం పూర్తి చేశారు. కాని ఒక్క చుక్క అయినా జటలు దాటి వెలుపలకు రాలేదు. జనం నివ్వెరపోయి చూస్తున్నారు.

    తలచుకుంటేనే ఒళ్ళు జలదరించే అద్బుతమది!

    కనుల ఎదురుగా జరుగుతోంది. కారణాలను ఊహించేందుకు వీలుకాని సంఘటన! మిరాక్యులన్ గా అనిపించింది అందరికీ!

    ఎవరికీ వారే షాక్ అయి చూపులు నిలిపేశారు.

    పుట్ట కలుగులో పోసిన పాలలా ఒక్క చుక్క బయటికి రాకపోవటం ఏమిటి? ఇంచుమించుగా పదిలీటర్ల పాలుంటాయి. పూలు మాత్రం శిగలో తురుముకున్నట్లు చెండులా నిలబడి వున్నాయి. అవిశ్వాసాన్ని చూచి ఫక్కున నవ్వుతున్నాయి. ఒకవేళ అతని జటాజూటంలో ఉన్న జంట సర్పాలు వాటిని స్వాహాచేసినా అన్నిపాలు త్రాగటం పాములకు సాధ్యమేనా?

    ఇటువంటి అద్భుతాలను ఎన్నింటినో చూచామంటున్న వాళ్ళు ప్రక్క వాళ్ళకి చెబుతున్నారు. అప్రయత్నంగా చేతులు జోడిస్తున్నారు. విశ్వాసం లేని వాళ్ళు కూడా విస్మయంగా చూస్తున్నారు.

    "ఇప్పుడేమంటావు?" అంది తులసి సీరియస్ గా!

    "ఇదంతా గారడీ అంటానే! జటల లోపల అన్ని పాలు ఇమిడిపోవటానికి అదేమన్నా చెరువా? సముద్రమా? ఇదంతా ఇంద్రజాలం. లేకపోతే కనికట్టు! పి.సి. సర్కార్ ఇంత కన్నా అధ్బుతాలను చేసి చూపించగలడు. మీలాంటివాళ్ళున్నంత కాలం ఈ ప్రపంచం ఇలాగే తగలడుతుంది!" అంటూ భక్తిభావంతో వాలిపోతున్నవారి కనురెప్పల వంక చూడకుండా ముఖం త్రిప్పుకుంది ఉమ.

 Previous Page Next Page