"పోనిలే- నీకు ఎంత చెప్పినా అర్ధం కాదు. మరి ఆ క్లబ్బులో ఎందుకు చేరనన్నావ్? పైగా ఎంతో పని వున్నట్టుగా కనీసం పని మనిషి సహాయం కూడా లేనట్టుగా ఎందుకలా మాట్లాడావ్?"
తేలిగ్గా నవ్వేస్తూ అంది "ఇదేమిటండి, నా కిష్టం లేని విషయం నేను మానేయ్యటం కూడా తప్పేనా? భార్యకి భర్తని పిల్లలని చూచుకోవటం కాక వేరే పనేముంటుంది? పని పాటలు వదిలేసి ఆ క్లబ్బుల వెంట తిరిగి యింట విధులు నిర్లక్ష్యం చేసే వాళ్లంటేనాకసహ్యం. అందుకే రానన్నాను."
నిట్టుర్చటం తప్ప యింకేమి అనలేకపోయాడతను. ఎనాడయితే ఆవిడని వాదించి మార్చగలిగాననుకున్నాడు.
అంతలో బాబు లేవటంతో లేచి వెళ్ళింది శ్రీదేవి.
"ఛ! ఛ! ఏమిటలా బాదేస్తున్నావ్?"
శ్రీదేవి చేతిలోంచి బాబుని లాక్కుని భుజం మీద వేసుకుని వీపు నిమరసాగాడు.
వాడికింకా వెక్కిళ్ళు పడుతూనే వున్నాడు.
బుగ్గలు ఎఱ్ఱగా కందిపోయాయి. బాగా ఏడుస్తున్నాడు, ఎంత జిజ్జుకొట్టినా ఏడుపు పూర్తిగా మానలేదు.
అల్మారా దగ్గరికి వెళ్ళి బిస్కెట్ తీసి చేతికి యిచ్చాడు. అందుకున్నాడే కాని వాడు ఏడుపుని వదల్లేదు. మరో బిస్కెట్ మరో చేతికి అందించాడు, అయినా ఏడుపు తగ్గలేదు. భార్యపై కోపంతో మరో డబ్బా తీసి ఓ చాక్లెట్ అందుకుని బాబుకి యిస్తూ "తిను బాబూ! బంగారు కొండవి కదూ, అమ్మ మంచిది కాదులే, అమ్మని కొడదాంలే" అంటూ నోట్లో పెట్టేడు. వాడు యింకా వెక్కుతూనే చాక్లెట్ ని నమిలేశాడు. మరో చాక్లెట్ ని అందించేడు మాధవ్.
ఇంతసేపూ యిదంతా గమనిస్తూనే అలాగే నిల్చున్న శ్రీదేవి అంది తాపిగా, కావలసినంత చురుకుని మాటల్లో ప్రవేశపెడుతూ "అయిందా ఇహ మీ సముదాయింపు?"
నివ్వెరపోయాడు ఆ నిష్టురానికి ఏడుస్తున్న బాబుని ఏడ్పు మాన్పటం కూడా దోషమా అనుకున్నాడు.
నేనేదో వాడిని చంపేస్తున్నట్టు - మీరు రక్షించవచ్చినట్టుగా ఏమిటా గారాబం? పిల్లల్ని చిన్నవయస్సులోనే భయంగా జాగ్రత్తగా పెంచకపోతే పెద్దయితే యిహెం బాగుపడతారు? అసలు మీ కేమయినా మతి వుందా? నేను దండిస్తూ వుంటే మీరు అడ్డం వచ్చి తీసుకుని అలా మచ్చిక చేస్తే ఇహ వాడికి నేనంటే ఏం భయం వుంటుంది? పైగా అమ్మ మంచిది కాదు, అమ్మని కొడదాంలే బాబూ అని ఓదార్పు కూడానా? ఇలా చేస్తే వాడికి నేనంటే చులకనవదూ?"
నిర్ఘాంతపోయాడా మాటలకి.
"ఇహ ముందు ఇలా ఎప్పుడూ చెయ్యకండి"
బాబుని అందుకోబోతున్న శ్రీదేవిని ఆపుతూ అన్నాడు.
"కొంచెం అగు శ్రీదూ.......నేనిపుడెం చేశానని? గుక్కపట్టి ఏడుస్తున్న బాబుని సముదాయించాను అది తప్పా? చిన్నా పెద్దా అంటూ ఏమేమో అన్నావ్. వాడి వయసెంతో గుర్తుందా నీకు? ఇంకా మూడేళ్ళు కూడా నిండలేదు, అసలు వాడికి ఏది తప్పో, ఏది ఒప్పో తెలుసుకునే జ్ఞానం వుందంటావా? వాడికి యింకా ఏది కోపమో ఏది కాదో తెలీదే! ఆ వయసులో ఎవరయినా అంతే, ఊరికే పిల్లల్ని బాదితే సరా? అయిదు సంవత్సరాలవరకూ పిల్లల్ని దేవుడిలా చూసుకోవాలి తెలుసా? పిల్లలంటే దైవస్వరుపులు. వాళ్ళు అల్లరి చేయక, నీవూ నేనూ చేస్తామా?"
అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అంది. "ఇహ అయిందా మీ ఉపన్యాసం, ముందు వాడిని యిలా యివండి, మీ చంక నెక్కి బిస్కెట్లు మెక్కేసి హాయిగా ఎలా చూస్తున్నాడో చూడండి. పిల్లలని యిలా మురిపిస్తే తర్వాత చిక్కులు మీకే"
ఒక్క క్షణం ఆగి అంది మళ్ళీ.
"అసలు బాబు ఏం చేశాడో తెలుసా? నేను కుంపటిపై పాలగిన్నె వుంచి అలా వెళ్ళి వచ్చేసరికి గరిట తీసుకుని ఆ గిన్నెలో కలియబెడుతున్నాడు, నన్ను చూసి బెదిరి గరిటిని వదిలేయ్యటంతో గిన్నె తిరగబడిపాలన్నీ ఒలికిపోయాయ్. నే రావటం కాస్త ఆలస్యం అయి వుంటే ఏమై వుండేదో ఆలోచించండి. ఆ వేడి వేడి కుంపటి ముట్టుకుని ఒళ్ళు కాల్చుకునేవాడు కాదూ? భయం లేకపోతే మరోసారి అలాగే చెయ్యడు? ప్రమాదం ఎవరికి చెప్పండి? ఆ కష్ట నిష్టూరాలు మనకి కాదా?"
ఆ వ్యాఖ్యానానికి విస్తుబోతూ నిట్టూర్చి అన్నాడు.
"శ్రీదూ! నిజం అంటే నేను చెడ్డవాడిని, పైగా నీకు కోపం వస్తుంది. కానీ తప్పంతా నీదే, పిల్లల్ని వంటింట్లో కుంపటివద్ద వదలి వెళతారా ఎవరైనా? ఏమైనా భాద్యత నీది కాదూ? బాబుని యివతలగా వదిలేసి వెళ్ళాలి. పోనీ ఇక ముందైనా జాగ్రత్తగా వుండు. బాబుకి ప్రమాదాలు రావు దెబ్బలు తగలవు. మనకీ నిష్టూరాలు రావు."
రోషంగా అన్నాడు.
"తప్పంతా నాదే, అన్ని తప్పులూ నావే, ఏమి చేసినా, ఏది జరిగినా ఎటు చూసినా తప్పునాది కాక మీది ఎలా అవుతుంది లెండి."
రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది.
నిట్టూర్చాడు.
శ్రీదేవి చర్యని గురించి రాబోయిన పలు రకాల ఆలోచనల్ని పారదోలి బాబుని ముద్దు పెట్టుకుని అలాగే వాడిని తీసుకుని బయటికి వెళ్ళాడు మాధవ్.
7
"శ్రీదూ! అలా తుంగభద్ర వొడ్డుకి వెళ్ళి కాస్సేపు కూర్చుని వద్దాం పద."
ఆఫీసునుంచి తిరిగివచ్చాక డ్రెస్ మార్చుకుని టిఫిన్ తీసుకున్నాక అన్నాడు.
శ్రీదేవి పలకలేదు.
"బాగా నీట్ గా డ్రెస్ అప్ యై .......బాబుకి కూడా తలదువ్వి వాళ్ల చిన్న మావయ్య యిచ్చిన టెర్లిన్ క్లాత్ వెయ్"
".... ...... ......."
"నీవు నీ పెళ్ళి రోజున తీసుకున్న వైట్ టెర్రి కాటన్ శారీ కట్టుకో, అదే జాకెట్ వేసుకో"
"....... ....... ......"
"త్వరగా తయారు కావాలి శ్రీ"
"....... ....... ........."
"పలకవెం శ్రీ"
"ఏం పలక మంటారు చెప్పండి. ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను."