Previous Page Next Page 
స్వర్గసీమ పేజి 12

    మత్తుగా మూలిగాడు మాధవ్.
    అతన్ని కుదుపుతూ పిలిచింది మళ్ళీ బరువుగా కళ్ళెత్తి చూసేడు.
    "లేచి ముఖం కడుక్కునిరండి, టిఫిన్ చేద్దురు గానీ"
    బరువుగా ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు. "ఇప్పుడు ముఖం గిఖం కడుక్కోలేను.....టిఫిన్ వద్దు. తిసికేళ్ళు శ్రీదూ"
    ముద్దుగా అతని ముంగురులు సరిచేస్తూ అంది "పోనీ ముఖం కడుక్కోనక్కరలేదులెండి. టిఫిన్ తినండి."
    "అబ్బ! ఏమి వద్దు శ్రీ......."
    ఓ పకోడి తీసుకుని అతని నోట్లో తురుముతూ అంది తినండి. మా వారు చాలా మంచివారు కదూ."
    ముఖం చిట్లిస్తూ తిన్నాడు.
    మరొకటి అందించింది.
    తినేశాడు.
    అలాగే అలాగే ప్లేటు ఖాళి చేశాడు.
    చివరి పకోడి అందించి అంది. "ఒక్క నిమిషం ఆగండి బోర్నవిటా తీసుకుని వస్తాను"
    మూలిగాడు.
    వంటింట్లోకి వెళ్ళి ప్లాస్కులోంచి వేడి వేడి పాలు గ్లాసులో వంపి బోర్నవిటా కలిపి తీసుకుని వచ్చింది. అతనికి ఆమెకి అన్ని కళలు తిన్నగా వున్న రోజున బోర్నవిటానో, రాగిమాల్టు,ఓ వల్టినో ఏదో ఒకటి లభిస్తుంటుంది. లేని రోజున చల్లని మంచినీళ్ళే గతి అనుకోవాల్సిందే.
    ఆవిడ వచ్చేసరికి అపకోడి నమిలేసి మంచినీళ్ళు త్రాగి కూర్చున్నాడు. కాస్త తెరుకున్నట్లాయ్. కప్పుని టీపాయ్ మీద పెడుతూ అంది "గుడ్ తీసుకోండి జగ్రతవస్థలోనే వున్నారుగా"
    మౌనంగా అందుకుని ఒక్కో గుటకే త్రాగుతూ సగానికి కాస్త అటూ యిటుగా మిగిల్చియిచ్చాడావిడకి.
    ఆ కాస్త తాగేసి అంది ఆమె "ఎందుకు అలా వున్నారు?"
    జవాబు యివకుండా మళ్ళీ కుర్చికి అంటుకుపోయాడు అతను.
    దగ్గర్లోనున్న చెయిర్ అందుకుని అతనికి దగ్గరగా లాక్కుని కూర్చుంటు అంది.
    "మీకు కోపం వచ్చిందికదూ"
    అతను పలకలేదు.
    "నిజం చెప్పండి. ఈరోజు ఉదయం నుంచి కోపంగా అదోలా వున్నారెందుకని?"
    జవాబివ్వలేదతను.
    "ఉదయం నేను అలా చేశానని మీకు కోపంగా వుంది కదూ నిజం చెప్పండి."
    అయినా అతను నిజం చెప్పలేదు.
    "పలక రెందుకు?" కాస్త కోపంగా అంది.
    "ఏం పలకాలి?"
    "అదే- ఎందుకు కోపమని"
    "నా కోపంతో నీకు లేక్కేమిటి శ్రీదూ" కాస్త పెడసరంగా జవాబిచ్చాడతను.
    "నిజమా?" సీరియస్ గా అడిగింది.
    "కాకపోతే వేళాకొళానికి అంటున్నాననుకున్నావా ఏమిటి?"
    "ఇదిగో యిటు చూడండి. ఊరికే అనేస్తే లాభం లేదు, ఆ మాట నిలుపుకోవాలి"
    "అలాగే"
    "మీ మాట ఏమి వినలేదనియింత కోపం"
    "అసలు ఏమి విన్నవని కోపగించుకోకుండా సంతోషిద్డును?"
    "మీ మాటే వినలేదా? ఎందుకింత అన్యాయంగా మాట్లాడుతారు? భార్యని కదా అని అనేస్తే సహించి వూరుకునేది లేదు సుమండీ"
    "ఏం విన్నావో నీవే చెప్పు చూద్దాం. అయినా భర్తగా నేనేం అధికారం చెలాయించాన్లె నీమీద?"
    "కాదులెండి. మీరే చెప్పండి. పాపం భర్తగారి హక్కులు అధికారాలు పోగొట్టుకున్నవారుకదా?"
    'కొంత నిరాశద్వనించే గొంతుకతో అన్నాడు "ఎందుకంటె అనవసరంగా పోట్లాట తప్ప ఫలితం ఏమి వుండదు."
    నిగ్గదిస్తూ అంది "కాదులెండి, మీ మనసేమిటో తెలుసుకోవటం భారతనారిగా నా ధర్మం కదూ?"
    నిట్టూర్చి అన్నాడు "నాకా ఆదర్శాలు ఏం వద్దులే శ్రీ. భార్య భర్తలు పరస్పరం అర్ధం చేసుకుని గౌరవించుకుని సుఖంగా బ్రతికితే చాలు."
    "కానీవండి" అంది.
    ఒక్క క్షణం ఆగి అన్నాడు "చెప్పలంటే ఎన్నో వున్నాయ్. ఉదయం మట్టుకి ఉదయం.....వాళ్ళంతా ఎంత నిట్ గా వచ్చారు. ఒకరికి ఒకరు డ్రస్ లో పోటీ పెట్టుకున్నట్టుగా నీట్ గా తయారయ్యారు. మరి నీవో తలయినా దువుకోకుండా ముఖమయినా సరిగా కడుక్కోకుండా అలాగే వెళ్ళావు వాళ్ళదగ్గరికి......రాత్రి చీరతో అలాగే వెళ్ళవు. నలిగిన చీరతో రేగిన ముంగుర్లతో అంటి అంటని కుంకుమ రేఖతో అలా వాళ్ళ ఎదుటికి ఎలా వెళ్ళగలగావో కానీ......నాకు మట్టుకి చాలా సిగ్గేసింది."
    "కాస్త ఆగుతారా మీరు?"
    అతనికి అడ్దోస్తూ అంది. అలా మిరన్నట్టుగా నలిగిన చీరతో రేగిన ముంగుర్లతో అంటి అంటని కుంకుమతో వెళ్ళినా వాళ్ల ముఖాల్లో ఎంతో సంతృప్తికనిపించిందే గాని నేను అలా వెళ్ళానని ఒకరి ముఖంలో నయినా అసహ్యం కనిపించలేదు. ఆ విషయం మీరు గమనించారామరి?"
    చిరునవ్వు నవ్వి అన్నాడు "ఆవిషయమే నేననేదిను" అంత అందగత్తెవు కాస్త మేకప్ చేసుకుని వుండుంటే యింకా ఎంత మెరుగ్గాకనిపించి వుందువో, నీవు ఉహించుకున్నవా? జిడ్డుకారేముఖాల వాళ్లు కూడా క్రిములూ పౌడర్లు మెత్తుకుని నీట్గా తయారవుతూ వుంటే అందగత్తెవి నిన్ను కాస్త టచ్ చేసుకోమంటేనీకది అసహ్యం- ఎంత చిత్రం! అందం లేదని ఏడ్చేవాళ్ళు కోకొల్లలు, అయినా, అన్ని అమరినా నీలా నిర్లక్ష్యం చేసేవాళ్ళుఅరుదేనేమో."
    "కావచ్చేమో- రత్నంమసి పాత్రలో దాగినా వెలగటం మానదు"
    నిర్లక్ష్యంగా ఆవిడ యిచ్చిన సమాధానానికి బాధగా ఇహ ఆవిడతో వాదించలేనట్టుగా అన్నాడో క్షణం ఆగి......

 Previous Page Next Page