అనిత ముఖం చూడలేనివాడిలా గబగబ వెళ్లిపోయాడు రాజారావు. అనిత, సుశీల ఒకరిముఖం ఒకరు చూసుకున్నారు.
"ఎలా వదినా?" అంది సుశీల దిగాలుగా...అనిత సమాధానం చెప్పలేదు. తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చుంది.
10
కన్నకూ, కమలకూ ఇద్దరికీ ఒకసారే కడుపునొప్పి వచ్చింది. కడుపు చేత్తో పట్టుకుని చెరోమూలా పడుకున్నారు.
"కడుపు నొప్పా? డాక్టర్ని పిలుస్తాను:" అంది అనిత ఇద్దరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.
"వద్దు! వద్దు! వదినా! డాక్టర్ని పిలువకు అదే తగ్గిపోతుంది."
అనిత నిదానించి ఇద్దర్నీ చూసింది. ముఖంలో ఎక్కడా బాధ పడుతున్న లక్షణాలు లేవు...
అంతలో శారదమ్మ అక్కడికి వచ్చి "కన్నా కమలా? ప్రై వేట్ మాస్టారు వచ్చారు. లేచి పుస్తకాలు తీసుకరండీ." అంది.
ఇద్దరూ ఒక్కసారే "అబ్బ! కడుపునొప్పి!" అని మూలగసాగారు.
అనితకు వాళ్ల కడుపునొప్పి ఏమిటో అర్థమయిపోయింది. బయటకు వచ్చి చూచింది. చేతిలో పేము బెత్తంతో కూర్చున్నారు పిలక మాస్టారు.
ఆ పేము బెత్తానికీ పిల్లల కడుపునొప్పికీ గల దగ్గిర సంబందాన్ని చిటికెలో ఊహించుకొంది అనిత.
"పిల్లలకు కడుపు నొప్పిట మాస్టారు! వాళ్ళు రారు. మీరు వెళ్ళిపోండి" అంది అనిత.
"కడుపునొప్పి గిడుపునొప్పీ, అంతా వట్టిది, ఇలా సిలవండి రెండు వడ్డిస్తే అన్నీ చక్కబడతాయి."
అనితకు చిరాకు కలిగింది.
"వాళ్లు రారని చెప్తోంటే మీక్కాదూ వెళ్ళిపోండి."
అని కసిరి లోపలికి వెళ్ళిపోయింది.
మాస్టారి గుండెల్లో రాయిపడింది. ఈ పిల్లలు ఏ రోజు కా రోజు ఇలాగే కడుపునొప్పి అంటుంటారు. ఇలా ప్రతిరోజూ వీళ్లు ట్యూషన్ మానేస్తే తనకు ట్యూషన్ డబ్బులు రావు. ఈ ట్యూషన్ వల్ల ఏదో కాస్త గడుస్తోంది గాని కేవలం బళ్లో ఇచ్చే జీతం ఏ మూలకి?
తిన్నగా రాజారావు దగ్గిరకు వెళ్ళాడు....
"పిల్లలు కడుపునొప్పి అన్నారండి. మీ ఇంట్లో ఆవిడెవరో పిల్లల్ని ట్యూషన్ కి పంపలేదు."
రాజారావుకు వల్లమాలిన కోపమొచ్చింది విసురుగా లోపలికి వచ్చాడు.
"ఏదీ? ఆ దొరసానిగారు?"
కుట్టుకుంటూ కూర్చున్న సుశీల బెదురుగా "ఎవరు వదినా?" అంది.
"ఛ! అలా పిలవకు ఎక్కడుందీ?"
"పిల్లలను తీసుకుని పార్కులోకి వెళ్లింది."
కడుపునొప్పి అన్నారుట!"
"ఏమో. మరి!"
లోలోపల పళ్లు నూరుకుంటూ తక్షణమే పార్కుకి వెళ్ళాడు రాజారావు.
కన్ననూ, కమలనూ, రాణినీ ఉయ్యాలలో కూర్చోబెట్టి ఊపుతోంది అనిత.
తలంటి పోసుకున్న జుట్టు గాలికి ఎగురుతూ ముఖం మీద పడుతోంది. పైటకొంగు నడుంచుట్టూ దోపి తనూ ఒత చిన్నపిల్లలా నవ్వుతోన్న అనిత సుందరమూర్తిని చూస్తూ కొన్నిక్షణాలు నిలబడి పోయాడు రాజారావు.
అంతరంగంలో అపరాధభారం దాచుకున్న వాళ్లకు అంత స్వచ్చంగా నవ్వటం సాధ్యపడుతుందా?
అవివాహితగా మాతృమూర్తి అయ్యే దురదృష్టం పాలయిన వ్యక్తులు ఇంత ఉల్లాసంగా ఉండగలరా?
ఏవిటీ అనిత?
తననే చూస్తున్న రాజారావు చూపులతో కలుసుకున్నాయి అనిత చూపులు.
హుషారుగా రాజారావు దగ్గిరికి వచ్చి "ఏం బావా! నువ్వూ చల్లగాలికి వచ్చావా?" అంది.
"కాదు చెంపదెబ్బ కొట్టాలని వచ్చాను"
"కొట్టు!"
తన చెక్కిలి అందించింది.
పాలమీగడలా నున్నగా మెరిసిపోయే ఆ చెక్కిలి మీదనుంచి ప్రయత్నపూర్వకంగా చూపులు తిప్పుకున్నాడు రాజారావు.
"కన్ననూ, కమలనూ ట్యూషన్ మాన్పించి పార్కుకి తీసుకొచ్చావా? మా ఇంటి వ్యవహారాల్లో కలిగించుకునే అధికారం నీ కెవరిచ్చారు?"
"బొత్తిగా సిగ్గులేదు."
"నీముందు సిగ్గుపడాలనే ఉంటుంది. కానీ పబ్లిక్ పార్కులో చిన్న పిల్లలముందు......"
రాజారావు ముఖం ఎర్రబడింది.
కోపంగా "కన్నా! కమలా!......" అని గర్జించాడు.
ఇద్దరూ వణికిపోతూ వచ్చి నిల్చున్నారు.
వాళ్ళ వెనకాతల రాణికూడా వచ్చింది.
"ముందు ఇంటికి పదండి, తరువాత మీ పని చెపుతాను...."
"ఆ మాస్టారు మంచివాడు కాడు మావయ్యా! కొడతారుట! కన్న,కమల గడగడవణికిపోతోంటే చిరునవ్వుతో అంది రాణి.
"నేను నీకు మావయ్యని కాదు."
కసిరాడు రాజు.
"మరి ఎవరు నువ్వు?"
రాజారావు సమాధానం చెప్పకుండా నవ్వునాపుకొంటూన్న అనితను ఎర్రగా చూసి"పదండి!" అన్నాడు గర్జిస్తున్నట్లు.